పాఠకుల ప్రశ్న
2020, జూన్ కావలికోటలో వచ్చిన “నీ పేరు పవిత్రపర్చబడాలి” అనే ఆర్టికల్ యెహోవా పేరు, ఆయన సర్వాధిపత్యం గురించి మన అవగాహనలో ఎలాంటి మార్పు తెచ్చింది?
ఆ ఆర్టికల్లో మనుషులు, దేవదూతలు ప్రాముఖ్యంగా ఎంచే ఒక విషయం గురించి మనం నేర్చుకున్నాం. అదే, యెహోవా గొప్ప పేరు పవిత్రపర్చబడడం. అందులో భాగంగా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన సర్వాధిపత్యం అంటే ఆయన పరిపాలనా విధానమే సరైనదని, దానికి ఏదీ సాటిరాదని నిరూపించబడడం. రెండు, మనుషులు తమ యథార్థతను నిరూపించుకోవడం.
యెహోవా పేరు పవిత్రపర్చబడడం ఇప్పుడు మనకు ఎందుకంత ప్రాముఖ్యం? దానికి మూడు కారణాల్ని చూద్దాం.
మొదటిది, ఏదెను తోటలో సాతాను యెహోవా పేరు మీద బురద చల్లాడు. యెహోవాకు పెద్ద మనసు లేదని, ఆయన ఆదాముహవ్వలకు స్వేచ్ఛ లేకుండా కట్టిపడేస్తున్నాడని అర్థం వచ్చేలా సాతాను హవ్వను ఒక ప్రశ్న అడిగాడు. ఆ తర్వాత, యెహోవా చెప్పినదాన్ని సాతాను మార్చి చెప్తూ ఆయన్ని అబద్ధాలకోరుగా చిత్రీకరించాడు. అలా యెహోవా పేరు మీద సాతాను నింద వేశాడు. దాంతో సాతాను “అపవాదిగా” అంటే “లేనిపోనివి కల్పించి చెప్పేవాడిగా” మారాడు. (యోహా. 8:44) సాతాను చెప్పిన పచ్చి అబద్ధాలకు హవ్వ పడిపోయి, యెహోవాకు అవిధేయత చూపించి, ఆయన సర్వాధిపత్యానికి ఎదురుతిరిగింది. (ఆది. 3:1-6) ఈరోజు వరకు కూడా సాతాను దేవుని పేరు మీద నిందలు వేస్తూ, ఆయన వ్యక్తిత్వం గురించి అబద్ధాలు వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. వాటిని నమ్మేవాళ్లు యెహోవా మాట వినకపోవచ్చు. యెహోవా పవిత్ర పేరు మీద ఆ నింద పడడం ఎంత అన్యాయమో కదా! అది దేవుని ప్రజలకు ఎంతో బాధను కలిగిస్తుంది. ఈ లోకంలో ఉన్న చెడంతటికీ ఆ నిందే కారణం.
రెండోది, ఈ సృష్టి ప్రాణుల మంచి కోసం యెహోవా తన పేరుకు అంటుకున్న మరకల్ని పూర్తిగా తీసేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అది యెహోవాకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఆయన ఇలా అంటున్నాడు: “నా గొప్ప పేరును నేను ఖచ్చితంగా పవిత్రపర్చుకుంటాను.” (యెహె. 36:23) యేసు కూడా “నీ పేరు పవిత్రపర్చబడాలి” అని అన్నప్పుడు, మన ప్రార్థనల్లో చేర్చాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో స్పష్టం చేశాడు. (మత్త. 6:9) యెహోవా పేరు మహిమపర్చబడడం ఎంత ప్రాముఖ్యమో బైబిలు పదేపదే నొక్కిచెప్తుంది. కొన్ని లేఖనాల్ని చూడండి: “యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి.” (1 దిన. 16:29; కీర్త. 96:8) “ఆయన మహిమగల పేరును స్తుతిస్తూ పాటలు పాడండి.” (కీర్త. 66:2) “నీ పేరును నిరంతరం మహిమపరుస్తాను.” (కీర్త. 86:12) యేసు యెరూషలేము ఆలయంలో ఉన్నప్పుడు ఇలా అన్నాడు: “తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” దానికి యెహోవా స్వయంగా పరలోకం నుండి జవాబిస్తూ ఇలా అన్నాడు: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”—యోహా. 12:28. a
మూడోది, యెహోవా సంకల్పం ఆయన పేరుతో ఎప్పుడూ పెనవేసుకుని ఉంటుంది. క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో ఒక చివరి పరీక్ష ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఆ చివరి పరీక్ష తర్వాత కూడా మనుషులు, దేవదూతలు యెహోవా పేరు పవిత్రపర్చబడడం గురించి ఆలోచిస్తారా? దానికి జవాబు తెలుసుకోవడం కోసం, మనం ముందు అనుకున్న రెండు విషయాల్ని
మళ్లీ గుర్తుచేసుకుందాం. మనుషుల యథార్థత అలాగే యెహోవా విశ్వసర్వాధిపత్యం. అప్పటివరకు నమ్మకంగా ఉన్నవాళ్లు తమ యథార్థతను ఇంకా నిరూపించుకుంటూనే ఉంటారా? లేదు. ఎందుకంటే వెయ్యేళ్ల పరిపాలన చివరికల్లా, వాళ్లు పూర్తిగా పరీక్షించబడి, పరిపూర్ణులు అవుతారు. శాశ్వత జీవితాన్ని కూడా సొంతం చేసుకొని ఉంటారు. మరి యెహోవా పరిపాలనా విధానమే సరైనదని, దానికి ఏదీ సాటిరాదని ఇంకా నిరూపించబడాలా? అవసరం లేదు. ఎందుకంటే యెహోవా పరిపాలనా విధానం సరైనదని అప్పటికే నిరూపించబడుతుంది. మనుషులు, దేవదూతలందరూ ఐక్యంగా యెహోవాను తమ రాజుగా చేసుకుంటారు. అయితే యెహోవా పేరు మనకు అప్పుడు కూడా ఇంకా అంతే ప్రాముఖ్యమైనదిగా ఉంటుందా?ఆ సమయానికల్లా యెహోవా గురించిన సత్యం అందరికీ తెలుస్తుంది. దాంతో ఆయన పేరు పూర్తిగా పవిత్రపర్చబడుతుంది. అయితే అప్పుడు కూడా ఆయన సేవకులందరికీ యెహోవా పేరు చాలా ప్రాముఖ్యంగా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే, యెహోవా అబ్బురపర్చే ఎన్నో పనులు చేస్తూనే ఉంటాడు. అవి ఏంటంటే: యేసు వినయంగా అధికారన్నంతటినీ యెహోవాకు తిరిగి ఇచ్చేసినప్పుడు, “దేవుడే అందరికీ అన్నీ” అవుతాడు. (1 కొరిం. 15:28) ఆ తర్వాత, మనుషులందరూ “దేవుని పిల్లల మహిమగల స్వాతంత్ర్యాన్ని” ఆనందిస్తారు. (రోమా. 8:21) అలాగే భూమ్మీద, పరలోకంలో తన సేవకులందర్నీ ఒక ఐక్య కుటుంబంగా చేసి యెహోవా తన సంకల్పాన్ని పూర్తిగా నెరవేరుస్తాడు.—ఎఫె. 1:10.
ఇవన్నీ జరిగిన తర్వాత పరలోకంలో, భూమ్మీద ఉన్న యెహోవా కుటుంబానికి ఏమనిపిస్తుంది? యెహోవా పేరును స్తుతిస్తూ ఉండాలనే బలమైన కోరిక మనలో రగులుతూనే ఉంటుంది. కీర్తనకర్త అయిన దావీదు ఇలా రాశాడు: “దేవుడైన యెహోవా స్తుతించబడాలి, . . . మహిమగల ఆయన పేరు ఎప్పటికీ స్తుతించబడాలి.” (కీర్త. 72:18, 19) ఆయన్ని స్తుతించడానికి కొత్తకొత్త, ఆసక్తికరమైన కారణాలు మన కళ్ల ముందుకు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి.
యెహోవా పేరు ఆయన గురించి మనకు పూర్తిగా చెప్తుంది. ముఖ్యంగా ఆయన పేరు, ఆయనకున్న ప్రేమను గుర్తుచేస్తుంది. (1 యోహా. 4:8) ప్రేమతోనే యెహోవా మనల్ని సృష్టించాడని, ప్రేమతోనే మన కోసం ఆయన విమోచన క్రయధన బలిని ఏర్పాటు చేశాడని, ఆ ప్రేమతోనే ఆయన మనల్ని నీతిగా పరిపాలిస్తాడని మనం ఎప్పుడూ గుర్తుచేసుకుంటాం. నిజానికి యెహోవా మన మీద ప్రేమ కురిపిస్తూ ఉండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు ఎప్పటికీ మన తండ్రికి దగ్గరవ్వాలని, ఆయన గొప్ప పేరును స్తుతించాలని మనం కదిలించబడతాం.—కీర్త. 73:28.