‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు’
‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు. దానివల్ల వాళ్లు కూడా ఇతరులకు బోధించడానికి తగినవిధంగా అర్హులౌతారు.’—2 తిమో. 2:2.
1, 2. చాలామంది తమ ఉద్యోగం గురించి ఎలా భావిస్తారు?
తాము చేసే ఉద్యోగాన్ని బట్టే ఇతరులు తమకు విలువిస్తారని చాలామంది అనుకుంటారు. కొన్ని సంస్కృతుల్లో అయితే ఓ వ్యక్తిని పరిచయం చేసుకునేటప్పుడు, “మీరు ఏం చేస్తారు?” అని అడగడం సహజం.
2 బైబిలు కొంతమంది వ్యక్తుల పేర్లను వాళ్లు చేసే పనితో కలిపి ప్రస్తావించింది. ఉదాహరణకు బైబిల్లో, “పన్ను వసూలుచేసే మత్తయి,” ‘సీమోను అనే చర్మకారుడు,’ “ప్రియమైన వైద్యుడు లూకా” అని ఉంది. (మత్త. 10:3; అపొ. 10:6; కొలొ. 4:14) ఇంకొన్నిసార్లు, యెహోవా సేవలో ఆయా వ్యక్తులకున్న నియామకాలతో కలిపి వాళ్ల పేర్లను ప్రస్తావించింది. రాజైన దావీదు, ఏలీయా ప్రవక్త, అపొస్తలుడైన పౌలు వంటివాళ్ల గురించి ఆలోచించండి. వీళ్లు యెహోవా తమకిచ్చిన బాధ్యతల్ని విలువైనవిగా ఎంచారు. వాళ్లలాగే మనం కూడా యెహోవా సేవలో మనకున్న నియామకాలను విలువైనవిగా చూడాలి.
3. వయసు పైబడినవాళ్లు యౌవనులకు శిక్షణనివ్వడం ఎందుకు ప్రాముఖ్యం? (ప్రారంభ చిత్రం చూడండి.)
3 అవును, మనం యెహోవా సేవను ప్రేమిస్తాం అలాగే మన నియామకాలను విలువైనవిగా చూస్తాం. మనలో చాలామందిమి మనం చేసే పనిని ఎంతగా ఇష్టపడతామంటే ఆ పనిని వీలైనంత ఎక్కువకాలం చేస్తూ ఉండాలని కోరుకుంటాం. కానీ విచారకరమైన విషయమేమిటంటే, ప్రజలు యౌవనంలో చేసినంత పనిని వయసుపైబడిన తర్వాత చేయలేరు. (ప్రసం. 1:4) దీనివల్ల యెహోవా సేవకులకు కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఎదురౌతాయి. నేడు, ప్రకటనాపని అంతకంతకూ విస్తరిస్తోంది, మంచివార్త వీలైనంత ఎక్కువమందికి చేరాలనే ఉద్దేశంతో యెహోవా సంస్థ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. అయితే కొన్నిసార్లు ఆ కొత్త పద్ధతుల్ని నేర్చుకోవడం వయసు పైబడినవాళ్లకు కష్టంకావచ్చు. (లూకా 5:39) అంతేకాదు, వయసు పైబడుతున్నప్పుడు మనలో ఉన్న బలం, శక్తి తగ్గిపోవడం మామూలే. (సామె. 20:29) అందుకే వయసుపైబడిన వాళ్లు యౌవనులకు ప్రేమతో శిక్షణనిచ్చి, సంస్థలో మరిన్ని బాధ్యతలు చేపట్టేందుకు వాళ్లను సిద్ధం చేయాలి, అది చాలా అవసరం కూడా.—కీర్తన 71:18 చదవండి.
4. తమ అధికారాన్ని ఇతరులకు అప్పగించడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉంటుంది? (“బాధ్యతల్ని ఇతరులకు అప్పగించడం కొంతమందికి ఎందుకు కష్టంగా ఉంటుంది” అనే బాక్సు చూడండి.)
4 అధికారంలో ఉన్నవాళ్లు తమ పనిని యౌవనులకు అప్పగించడానికి అన్నిసార్లు ఇష్టపడరు. తాము ఎంతో ప్రేమించే నియామకాన్ని కోల్పోతున్నామని సహోదరులు దిగులుపడవచ్చు. వాళ్లు ఎంతో ఇష్టంగా చేసే ప్రత్యేకమైన పనిని ఆపేయడమనే ఆలోచనను వాళ్లు జీర్ణించుకోలేకపోవచ్చు. లేదా ఫలానా పనిని తాము తప్ప ఇంకెవరూ సరిగ్గా చేయలేరని ఆందోళనపడవచ్చు. బహుశా ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి తమకు సమయం లేదని కొంతమంది అనుకోవచ్చు. అదే సమయంలో, తమకు మరిన్ని బాధ్యతలు ఇచ్చేంతవరకు యౌవనులు ఓపిగ్గా ఉండడం కూడా అవసరం.
5. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?
5 అయితే, యౌవనులు మరిన్ని బాధ్యతలు చేపట్టేలా వయసు పైబడినవాళ్లు సహాయం చేయడం ఎందుకు ప్రాముఖ్యం? వాళ్లు దీన్ని ఎలా చేయవచ్చు? (2 తిమో. 2:2) వయసు పైబడినవాళ్లతో, అనుభవం ఉన్నవాళ్లతో పనిచేస్తున్నప్పుడు యౌవనులు సరైన మనోవైఖరి కలిగివుంటూ వాళ్లనుండి నేర్చుకోవడం ఎందుకు అవసరం? ముందుగా, ఎంతో ప్రాముఖ్యమైన పనిని మొదలుపెట్టడానికి రాజైన దావీదు తన కొడుకును ఎలా సిద్ధం చేశాడో పరిశీలిద్దాం.
దావీదు సొలొమోనును సిద్ధం చేశాడు
6. రాజైన దావీదు ఏమి చేయాలని కోరుకున్నాడు? కానీ యెహోవా అతనికి ఏమి చెప్పాడు?
6 దావీదు ఎన్నో ఏళ్లపాటు హింసలు అనుభవించాడు, శత్రువుల చేతిలోనుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేర్వేరు ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నాడు. కానీ అతను రాజైన తర్వాత సౌకర్యవంతమైన ఇంట్లో నివసించాడు. అప్పుడు అతను నాతాను ప్రవక్తతో, “నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నది” అని అన్నాడు. యెహోవా కోసం ఓ అందమైన ఆలయాన్ని కట్టాలని దావీదు ఎంతగానో కోరుకున్నాడు. అందుకు నాతాను ప్రవక్త, “దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో” చెప్పాడు. కానీ యెహోవా ఆలోచన వేరేలా ఉంది. ఆయన నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు ఈ సందేశం పంపించాడు, “నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు.” తన కొడుకుల్లో ఒకరు ఆలయాన్ని కడతారని దావీదు అర్థంచేసుకున్నాడు. అంతేకాదు తనకు తోడుగా ఉంటానని యెహోవా దావీదుకు మాటిచ్చాడు. మరి దానికి దావీదు ఎలా ప్రతిస్పందించాడు?—1 దిన. 17:1-4 పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్, 8, 11-12; 29:1.
7. యెహోవా ఇచ్చిన నిర్దేశానికి దావీదు ఎలా ప్రతిస్పందించాడు?
7 యెహోవా కోసం ఓ ఆలయాన్ని కట్టాలని దావీదు చాలా ఆశపడ్డాడు. కాబట్టి అతను చాలా నిరుత్సాహపడి ఉంటాడు. అయితే ఆ నిర్మాణ పని తన కొడుకైన సొలొమోను చేతులమీదుగా జరుగుతున్నప్పుడు, ఆలయాన్ని నిర్మించాడనే పేరు-ప్రతిష్ఠలు తనకు దక్కవని దావీదు బాధపడలేదు. బదులుగా సొలొమోనుకు తన పూర్తి మద్దతునిచ్చాడు. పనివాళ్లను, ఇనుమును, ఇత్తడిని, వెండిని, బంగారాన్ని, కర్రల్ని సమకూర్చడంలో సొలొమోనుకు సహాయం చేశాడు. అంతేకాదు సొలొమోనును ఇలా ప్రోత్సహించాడు, “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.” నిజానికి ఆ ఆలయం సొలొమోను కట్టించిన ఆలయంగానే ప్రసిద్ధి చెందింది.—1 దిన. 22:11, 14-16.
8. ఆలయం కట్టగల సామర్థ్యం సొలొమోనుకు లేదని దావీదు ఎందుకు అనుకొనివుంటాడు? కానీ దావీదు ఏమి చేశాడు?
8 మొదటి దినవృత్తాంతములు 22:5 చదవండి. ఎంతో ప్రాముఖ్యమైన ఆలయ నిర్మాణ పనిని నిర్దేశించగల సామర్థ్యం సొలొమోనుకు లేదని దావీదు అనుకొనివుంటాడు. ఆ ఆలయం “చాలా ఘనమైనదై” ఉండాలి. కానీ సొలొమోను యౌవనస్థుడు, అనుభవం కూడా లేదు. అయితే ఈ ప్రత్యేకమైన పని చేసేంత సామర్థ్యం యెహోవా సొలొమోనుకు ఇస్తాడని దావీదుకు తెలుసు. కాబట్టి సొలొమోను ఈ అతి పెద్ద నిర్మాణ పని కోసం సిద్ధపడేందుకు దావీదు అన్నివిధాల సహాయపడ్డాడు.
శిక్షణనివ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచిచూడండి
9. యౌవనులకు బాధ్యతలు అప్పగించే విషయంలో వయసుపైబడిన సహోదరులు ఎలా భావించాలి? ఓ ఉదాహరణ చెప్పండి.
9 తమ బాధ్యతల్లో కొన్నింటిని యౌవనులకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వయసు పైబడినవాళ్లు నిరుత్సాహపడకూడదు. యెహోవా పనే ఇప్పుడు అన్నింటికన్నా ప్రాముఖ్యమని మనందరికీ తెలుసు. ఆ పని జరగాలంటే, మరిన్ని బాధ్యతలు చేపట్టేలా యౌవనులకు శిక్షణనివ్వాలి. ఉదాహరణకు, కారు ఎలా నడపాలో తన కొడుకుకు నేర్పిస్తున్న ఒక తండ్రిని ఊహించుకోండి. ఆ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే కేవలం చూస్తుంటాడు. కొంచెం ఎదిగాక, డ్రైవింగ్ ఎలా చేయాలో తండ్రి అతనికి వివరిస్తాడు. లైసెన్స్ వచ్చాక, తన తండ్రి ఇచ్చే సూచనలు పాటిస్తూ ఆ అబ్బాయే కారు నడుపుతాడు. కొన్నిసార్లు వాళ్లిద్దరూ వంతులవారీగా కూడా నడుపుతారు. కానీ తండ్రి వయసుపైబడ్డాక, ఎక్కువ శాతం ఆ అబ్బాయే కారు నడుపుతాడు. అది చూసి తండ్రి సంతోషడతాడే గానీ, తన స్థానాన్ని కొడుకు తీసేసుకున్నాడని బాధపడడు. అదేవిధంగా, తాము శిక్షణ ఇచ్చిన యౌవనులు యెహోవా సంస్థలో బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండడాన్ని చూసి వయసుపైబడిన సహోదరులు సంతోషిస్తారు.
10. సొంత ఘనత, అధికారం గురించి మోషే ఎలా భావించాడు?
10 ఇతరుల నియామకాల్ని చూసి మనం అసూయపడకుండా జాగ్రత్తపడాలి. కొంతమంది ఇశ్రాయేలీయులు, ప్రవక్తల్లా మారడం చూసినప్పుడు మోషే ఎలా ప్రతిస్పందించాడో గమనించండి. (సంఖ్యాకాండము 11:24-29 చదవండి.) మోషేకు సహాయకునిగా ఉన్న యెహోషువ వాళ్లను ఆపడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వాళ్లు మోషే స్థానాన్ని, అధికారాన్ని ఆక్రమించుకుంటున్నారని బహుశా అతను అనుకొనివుంటాడు. అప్పుడు మోషే యెహోషువతో, “నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక” అని అన్నాడు. అక్కడ జరుగుతున్న పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడని మోషేకు తెలుసు. తన సొంత ఘనత కోసం చూడకుండా యెహోవా సేవకులందరూ నియామకాలు పొందాలని మోషే కోరుకున్నాడు. మరి మన విషయమేమిటి? యెహోవా సేవలో ఇతరులు నియామకాలు పొందడం చూసి మనం సంతోషిస్తున్నామా?
11. ఇతరులకు బాధ్యతల్ని అప్పగించడం గురించి ఓ సహోదరుడు ఏమి చెప్పాడు?
11 కొన్ని దశాబ్దాలపాటు యెహోవా సేవలో కష్టపడి పనిచేసిన సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లు యౌవనులకు శిక్షణనిచ్చి మరిన్ని బాధ్యతలు చేపట్టేలా సహాయం చేశారు. ఉదాహరణకు, పీటర్ అనే సహోదరుని అనుభవాన్ని చూద్దాం. ఈ సహోదరుడు 74 కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సేవచేశాడు. అందులో 35 సంవత్సరాలు యూరప్ బ్రాంచి కార్యాలయంలో సేవచేశాడు. అక్కడ చాలా సంవత్సరాలు సేవా విభాగానికి పర్యవేక్షకునిగా సేవచేశాడు. అతనితో పాల్ అనే సహోదరుడు చాలా ఏళ్లు కలిసి పనిచేశాడు. అయితే ఇప్పుడు పీటర్ స్థానంలో పాల్ సేవా విభాగానికి పర్యవేక్షకునిగా సేవచేస్తున్నాడు. ఈ మార్పుకు పీటర్ బాధపడ్డాడా? లేదు. అతను ఇలా చెప్పాడు, “పెద్దపెద్ద బాధ్యతల్ని స్వీకరించడానికి శిక్షణ పొందిన సహోదరులు ఉండడం, వాళ్లు దాన్ని చాలా చక్కగా చేయడం చూసినప్పుడు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది.”
వయసుపైబడిన వాళ్లను గౌరవించండి
12. రెహబాము ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
12 సొలొమోను కొడుకు రెహబాము రాజైనప్పుడు, కొత్త నియామకాన్ని ఎలా నిర్వహించాలోనని వయసుపైబడిన వాళ్లను అడిగాడు. కానీ వాళ్లు ఇచ్చిన సలహాను అతను పెడచెవినబెట్టాడు. బదులుగా, తనతోపాటు పెరిగిన తోటి యువకుల సలహాను పాటించాడు. ఫలితంగా అతను కష్టాల్ని ఎదుర్కొన్నాడు. (2 దిన. 10:6-11, 19) దీన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు? వయసుపైబడిన వాళ్లను, మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లను సలహా అడగడం చాలా తెలివైన పని. అయితే, ఫలానా పనిని గతంలో ఏ పద్ధతిలో చేశారో అదే పద్ధతిని పాటించాలనే నియమమేమీ లేదు. కానీ యౌవనులు వయసుపైబడిన వాళ్ల సలహాల్ని మనస్ఫూర్తిగా గౌరవించాలి, వాళ్లు పాటించిన పద్ధతులు ఇప్పుడు పనికిరావనే ముగింపుకు వెంటనే రాకూడదు.
13. యౌవనులు వయసుపైబడిన వాళ్లతో ఎలా కలిసి పనిచేయాలి?
13 కొన్నిసార్లు, వయసుపైబడిన సహోదరులు లేదా అనుభవం ఎక్కువున్న సహోదరులు చేసే పనిని యౌవనులు పర్యవేక్షిస్తుంటారు. అలాంటప్పుడు, ఏవైనా నిర్ణయాలు తీసుకునేముందు ఎంతో అనుభవం, జ్ఞానం ఉన్న ఆ సహోదరుల సలహాలు తీసుకోవడం తెలివైన పని. ఇంతకుముందు మనం పరిశీలించిన అనుభవంలో, బెతెల్‌లో ఓ డిపార్ట్‌మెంట్‌కి పర్యవేక్షకునిగా ఉన్న పీటర్ స్థానంలోకి వచ్చిన పాల్ ఇలా చెప్పాడు, “నేను పీటర్ దగ్గరకు వెళ్లి సలహాలు అడుగుతుండేవాణ్ణి. అంతేకాదు ఏదైనా సలహా అవసరమైతే పీటర్ దగ్గరకు వెళ్లమని డిపార్ట్‌మెంట్‌లోని మిగతావాళ్లకు కూడా చెప్పాను.”
14. అపొస్తలుడైన పౌలు, తిమోతి కలిసి పనిచేయడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
14 అపొస్తలుడైన పౌలు కన్నా తిమోతి వయసులో చాలా చిన్నవాడు, వాళ్లు ఎన్నో సంవత్సరాలు కలిసి పనిచేశారు. (ఫిలిప్పీయులు 2:20-22 చదవండి.) కొరింథు సంఘానికి పౌలు ఇలా చెప్పాడు, “నేను మీ దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను. అతను ప్రభువు సేవలో నా ప్రియమైన, నమ్మకమైన కొడుకు. క్రీస్తుయేసు సేవలో నేను పాటించే పద్ధతుల్ని అతను మీకు గుర్తుచేస్తాడు. నేను అవే పద్ధతుల్ని పాటిస్తూ ప్రతీచోట, ప్రతీ సంఘంలో బోధిస్తున్నాను.” (1 కొరిం. 4:17) దీన్నిబట్టి పౌలు, తిమోతి కలిసి చాలా చక్కగా పని చేశారనీ, ఒకరికొకరు సహకరించుకున్నారనీ తెలుస్తోంది. తాను ‘క్రీస్తు సేవలో పాటించే పద్ధతుల్ని’ తిమోతికి నేర్పించే విషయంలో పౌలు శ్రద్ధ తీసుకున్నాడు, తిమోతి కూడా చక్కగా నేర్చుకున్నాడు. అందుకే తిమోతి అంటే పౌలుకు చాలా ఇష్టం. అంతేకాదు అతను కొరింథు సంఘంలోని సహోదరసహోదరీల బాగోగులు చూసుకుంటాడనే నమ్మకం పౌలుకు కలిగింది. సంఘంలో నాయకత్వం వహించేలా ఇతరులకు శిక్షణ ఇచ్చే విషయంలో సంఘపెద్దలు అపొస్తలుడైన పౌలును ఆదర్శంగా తీసుకోవచ్చు.
మనలో ప్రతీ ఒక్కరికీ ఓ ప్రాముఖ్యమైన పాత్ర ఉంది
15. సంస్థ చేసే మార్పులతో మనం సర్దుకుపోవడానికి రోమీయులు 12:3-5 వచనాలు ఎలా సహాయం చేస్తాయి?
15 ఎన్నో అద్భుతమైన మార్పులు జరిగే కాలంలో మనం జీవిస్తున్నాం. యెహోవా సంస్థలోని భూభాగం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతోంది. అంటే ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయని అర్థం. అందులో కొన్ని మార్పులు వ్యక్తిగతంగా మనపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనం వినయంగా ఉంటూ మన సొంత అవసరాలపై కాకుండా, ప్రకటనాపనికి ఏది అవసరమో దానిగురించి ఆలోచించాలి. అలా చేసినప్పుడు మనం ఐక్యంగా ఉంటాం. పౌలు రోములోని క్రైస్తవులకు ఇలా రాశాడు, “మీలో ప్రతీ ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా దేవుడు ప్రతీ ఒక్కరికి పంచి ఇచ్చిన విశ్వాసానికి తగిన వివేచన మీకుందని చూపించేలా అంచనా వేసుకోవాలి. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఒకే పని చేయవు. అలాగే మనం కూడా చాలామందిమి ఉన్నా క్రీస్తుతో ఐక్యంగా ఒకే శరీరంలో భాగంగా ఉన్నాం.”—రోమా. 12:3-5.
16. యెహోవా సంస్థలో సమాధానాన్ని, ఐక్యతను కాపాడడానికి వయసుపైబడినవాళ్లు, యౌవనులు, భార్యలు ఏమి చేయవచ్చు?
16 యెహోవా ప్రజలందరూ రాజ్యానికి మద్దతివ్వాలని కోరుకుంటారు, దానికోసం వాళ్లు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కాబట్టి వయసు పైబడిన సహోదరులారా, యౌవనులకు శిక్షణనివ్వండి. యువ సహోదరులారా, బాధ్యతల్ని స్వీకరించండి, అణుకువగా ఉండండి, వయసుపైబడిన వాళ్లను గౌరవించండి. భార్యల్లారా ప్రిస్కిల్లను అనుకరించండి. పరిస్థితులు మారినప్పటికీ ఆమె తన భర్త అకులకు మద్దతిస్తూ అతనితో కలిసి నమ్మకంగా పనిచేసింది.—అపొ. 18:2.
17. భవిష్యత్తులో తన శిష్యులు ఏమి చేస్తారని యేసుకు తెలుసు? ఆయన ఏ పనిలో వాళ్లకు శిక్షణనిచ్చాడు?
17 ఇతరులకు సంతోషంగా శిక్షణనిచ్చే విషయంలో యేసు మంచి ఆదర్శాన్ని ఉంచాడు. కొంతకాలం తర్వాత తాను భూపరిచర్యను ఆపాల్సి వస్తుందని, ఆ పనిని ఇతరులు కొనసాగించాల్సిన అవసరం ఉందని యేసుకు తెలుసు. తన శిష్యులు అపరిపూర్ణులైనప్పటికీ వాళ్లు మంచివార్తను తనకన్నా మరింత విస్తృతంగా వ్యాప్తి చేస్తారనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపర్చాడు. (యోహా. 14:12) అందుకు కావాల్సిన చక్కని శిక్షణను ఆయన వాళ్లకిచ్చాడు, దాంతో వాళ్లు సువార్తను విస్తృతంగా వ్యాప్తి చేయగలిగారు.—కొలొ. 1:23.
18. భవిష్యత్తులో మనకు ఏ పని ఉంటుంది? ప్రస్తుతం మనకు ఏ పని ఉంది?
18 యేసు చనిపోయిన తర్వాత యెహోవా ఆయన్ను తిరిగి బ్రతికించాడు. అంతేకాదు ఆయనకు మరింత పనిని, ‘ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా ఎంతో ఉన్నతమైన’ అధికారాన్ని యెహోవా ఇచ్చాడు. (ఎఫె. 1:19-21) ఒకవేళ మనం యెహోవాకు నమ్మకంగా ఉండి హార్‌మెగిద్దోను రాకముందే చనిపోయినా, కొత్తలోకంలో మళ్లీ బ్రతుకుతాం, అప్పుడు చేయడానికి చేతినిండా పని ఉంటుంది. ప్రస్తుతమైతే మంచివార్తను ప్రకటించి, శిష్యులను చేసే గొప్ప నియామకం మనందరికీ ఉంది. కాబట్టి మనం యౌవనులమైనా లేదా వయసుపైబడిన వాళ్లమైనా అందరం, ‘ప్రభువు సేవలో నిమగ్నమౌతూ’ ఉండవచ్చు.—1 కొరిం. 15:58.