మనం యెహోవా సొత్తు
“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.”—కీర్త. 33:12.
1. విశ్వంలో ఉన్న ప్రతీది యెహోవా సొత్తని ఎందుకు చెప్పవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
విశ్వంలో ఉన్న ప్రతీది యెహోవా సొత్తు. “ఆకాశము, మహాకాశము, భూమియు, అందున్నదంతా” ఆయనదే. (ద్వితీ. 10:14; ప్రక. 4:11) యెహోవా మనల్ని సృష్టించాడు కాబట్టి మనందరం ఆయన సొత్తు. (కీర్త. 100:3) అయితే, మనుషులందరిలో కొంతమందిని ఆయన ప్రత్యేక సొత్తుగా ఎంచుకున్నాడు.
2. బైబిలు ప్రకారం యెహోవాకు ప్రత్యేక సొత్తుగా ఎవరు ఉన్నారు?
2 ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలులోని తన నమ్మకమైన ఆరాధకుల్ని యెహోవా ‘ప్రత్యేక సొత్తుగా’ ఎంచుకున్నాడని 135వ కీర్తన చెప్తుంది. (కీర్త. 135:4, NW) అంతేకాదు, ఇశ్రాయేలీయులు కానివాళ్లలో కొంతమంది కూడా యెహోవా సొత్తయిన ప్రజలౌతారని హోషేయ ప్రవచించాడు. (హోషే. 2:23) పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించడానికి ఇశ్రాయేలీయులు కానివాళ్లను యెహోవా ఎంచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రవచనం నెరవేరింది. (అపొ. 10:45; రోమా. 9:23-26) పవిత్రశక్తితో అభిషేకించబడిన ఆ ప్రజలు “పవిత్ర జనం” అని పిలువబడ్డారు. వాళ్లు ‘దేవుని సొత్తుగా’ ఉన్నారు. (1 పేతు. 2:9, 10) మరి భూమ్మీద శాశ్వతకాలం జీవించే నిరీక్షణ ఉన్న మనకాలంలోని నమ్మకమైన క్రైస్తవుల సంగతేంటి? యెహోవా వాళ్లను కూడా “నా జనులు,” “నేను ఏర్పరచుకొనినవారు” అని పిలుస్తున్నాడు.—యెష. 65:22.
3. (ఎ) నేడు ఎవరికి యెహోవాతో ప్రత్యేక సంబంధం ఉంది? (బి) ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?
3 నేడు, పరలోక నిరీక్షణ ఉన్న “చిన్నమంద” అలాగే భూనిరీక్షణ ఉన్న “వేరే గొర్రెలు” కలిసి “ఒకే మందగా” యెహోవాను ఆరాధిస్తున్నారు. (లూకా 12:32; యోహా. 10:16) తనతో ప్రత్యేక సంబంధం కలిగివుండే అవకాశాన్ని ఇచ్చినందుకు యెహోవాకు మనమెంత కృతజ్ఞులమో కదా! ఆ కృతజ్ఞతను మనం ఏయే విధాలుగా చూపించవచ్చో ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం.
మన జీవితాన్ని యెహోవాకు సమర్పిస్తాం
4. యెహోవాకు మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు? యేసు ఎలా చూపించాడు?
4 మన కృతజ్ఞతను చూపించే ఒక మార్గం ఏమిటంటే, మన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం. అలా చేయడం ద్వారా మనం యెహోవా సొత్తని, ఆయనకు ఇష్టంగా లోబడుతున్నామని అందరికీ తెలియజేస్తాం. (హెబ్రీ. 12:9) యేసు కూడా బాప్తిస్మం తీసుకోవడం ద్వారా “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” అని యెహోవాకు చెప్పాడు. (కీర్త. 40:7, 8) ఆయన దేవుని సమర్పిత జనాంగానికి చెందినవాడైనప్పటికీ తనను తాను యెహోవాకు సమర్పించుకున్నాడు.
5, 6. (ఎ) యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా ఏమి చెప్పాడు? (బి) మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఆయనెలా భావిస్తాడో అర్థంచేసుకోవడానికి ఏ ఉదాహరణ సహాయం చేస్తుంది?
5 యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవాకు ఎలా అనిపించింది? బైబిలు ఇలా చెప్తుంది, “యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీళ్లలో నుండి బయటికి వచ్చాడు; అప్పుడు ఇదిగో! ఆకాశం తెరుచుకుంది. దేవుని పవిత్రశక్తి పావురం రూపంలో ఆయన మీదకు దిగిరావడం యోహాను చూశాడు. అంతేకాదు, ఇదిగో! ఆకాశం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: ‘ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.’” (మత్త. 3:16, 17) యేసు అప్పటికే యెహోవా సొత్తు. అయినప్పటికీ, ఆయన తన జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకోవడం చూసి యెహోవా చాలా సంతోషించాడు. మనం కూడా మన జీవితాల్ని సమర్పించుకున్నప్పుడు యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు, మనల్ని దీవిస్తాడు.—కీర్త. 149:4.
6 ఈ విశ్వంలో ఉన్న ప్రతీది యెహోవాదే. ఆయనకు మనమేమి ఇవ్వగలం? ఒక ఉదాహరణ పరిశీలించండి: ఒకవ్యక్తికి అందమైన పూల తోట ఉంది. ఒకరోజు అతని కూతురు ఆ తోటలో నుండి ఒక పువ్వు కోసి, దాన్ని అతనికి బహుమతిగా ఇచ్చింది. నిజానికి ఆ తోటలో ఉన్న పువ్వులన్నీ అతనివే అయినప్పటికీ కూతురు ఇచ్చిన పువ్వును చూసి ఆ ప్రేమగల తండ్రి ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే, తండ్రిమీద ఆ పాపకు ఎంత ప్రేమ ఉందో అది చూపిస్తుంది. తోటలో ఉన్న పువ్వులన్నిటిలో తన కూతురు ఇచ్చిన పువ్వునే ఆ తండ్రి చాలా విలువైనదిగా చూస్తాడు. అదేవిధంగా, మన జీవితాన్ని ఇష్టపూర్వకంగా తనకు సమర్పించినప్పుడు యెహోవా తప్పకుండా సంతోషిస్తాడు.—నిర్గ. 34:14.
7. తన సొత్తయిన వాళ్లను యెహోవా ఎలా చూస్తాడని మలాకీ ప్రవక్త చెప్పాడు?
7 మలాకీ 3:16 చదవండి. మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? నిజానికి, మీరు తల్లి గర్భంలో పడిన క్షణం నుండే మీ సృష్టికర్తయైన యెహోవా సొత్తు అయ్యారు. కానీ ఆయన్ని మీ పరిపాలకునిగా అంగీకరించి, ఆయనకు సమర్పించుకున్నప్పుడు యెహోవా ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. (సామె. 23:15) తనను ఇష్టపూర్వకంగా సేవించేవాళ్లెవరో యెహోవాకు తెలుసు, వాళ్ల పేర్లను ఆయన “జ్ఞాపకార్థముగా ఒక గ్రంథములో” రాసుకుంటాడు.
8, 9. ‘జ్ఞాపకార్థ గ్రంథములో’ పేర్లు రాయబడిన వాళ్లు ఏమి చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?
8 యెహోవా ‘జ్ఞాపకార్థ గ్రంథములో’ మన పేర్లు ఉండాలని కోరుకుంటే, మనం చేయాల్సిన పని ఒకటుంది. అదేంటంటే మలాకీ ప్రవక్త చెప్పినట్లు మనం యెహోవాకు భయపడి, ఆయన పేరు గురించి ధ్యానించాలి. ఒకవేళ మనం వేరేవాళ్లను లేదా వేరేవాటిని ఆరాధిస్తే మన పేర్లు జ్ఞాపకార్థ గ్రంథములో నుండి తీసివేయబడతాయి.—నిర్గ. 32:33; కీర్త. 69:28.
9 కాబట్టి మనం యెహోవా చిత్తం చేస్తామని మాటిచ్చి, బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం కేవలం ఒక్కసారి చేసే పనులు, కానీ యెహోవాను ఆరాధించడం జీవితాంతం చేయాల్సిన పని. మనం జీవించినంత కాలం, ప్రతీరోజు యెహోవాకు లోబడుతున్నామని మన పనుల ద్వారా చూపించాలి.—1 పేతు. 4:1, 2.
లోక కోరికలకు దూరంగా ఉంటాం
10. యెహోవాను సేవించేవాళ్లకు, సేవించనివాళ్లకు ఏ స్పష్టమైన తేడా ఉంటుంది?
10 కయీను, సొలొమోను, ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకున్నారు కానీ చివరివరకు ఆయనకు నమ్మకంగా ఉండలేకపోయారని ముందటి ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. కాబట్టి యెహోవాను ఆరాధిస్తున్నామని నోటితో చెప్తే సరిపోదని ఆ ఉదాహరణలు చూపిస్తున్నాయి. బదులుగా చెడును అసహ్యించుకుని, మంచిని ప్రేమించాలి. (రోమా. 12:9) “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” స్పష్టంగా తెలుస్తుందని యెహోవా చెప్పాడు.—మలా. 3:18.
11. మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామని ఇతరులకు స్పష్టంగా తెలిసేలా ఎందుకు ప్రవర్తించాలి?
11 యెహోవాకు మన కృతజ్ఞతను చూపించే మరో మార్గం ఏమిటంటే, మనం ఆయన పక్షాన ఉన్నామని అందరికీ స్పష్టంగా తెలిసేలా ప్రవర్తించడం. (మత్త. 5:16; 1 తిమో. 4:15) మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను అన్ని సందర్భాల్లో యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నానని ఇతరులు చూడగలుగుతున్నారా? నేను ఒక యెహోవాసాక్షినని ఇతరులకు చెప్పడానికి గర్వపడుతున్నానా?’ మనం ఆయన సొత్తని చెప్పుకోవడానికి సిగ్గుపడితే యెహోవా ఎంత బాధపడతాడో ఆలోచించండి.—కీర్త. 119:46; మార్కు 8:38 చదవండి.
12, 13. కొంతమంది సాక్షులు ఎలా “ఈ లోక స్పూర్తిని” చూపిస్తున్నారు?
12 విచారకరంగా, కొంతమంది సాక్షులు కూడా “ఈ లోక స్పూర్తిని” అనుకరిస్తున్నారు. ఫలితంగా, వాళ్లకూ యెహోవాను ఆరాధించనివాళ్లకూ మధ్య పెద్ద తేడా కనిపించట్లేదు. (1 కొరిం. 2:12) ప్రజలు తమ సొంత కోరికల గురించే ఆలోచించేలా “ఈ లోక స్పూర్తి” నడిపిస్తుంది. (ఎఫె. 2:3) ఉదాహరణకు, బట్టల గురించి సంస్థ మనకు ఎన్ని సలహాలు ఇస్తున్నప్పటికీ, కొంతమంది లోకస్థుల్లా బట్టలు వేసుకుంటున్నారు. బిగుతుగా, ఒళ్లు కనిపించేలాంటి బట్టల్ని వేసుకుంటున్నారు, ఆఖరికి మీటింగ్స్‌కు కూడా అలాంటి బట్టలతోనే వస్తున్నారు. ఇంకొంతమంది, వింత హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నారు. (1 తిమో. 2:9, 10) దానివల్ల, మనం యెహోవాసాక్షులమా కాదా అని ఇతరులు గుర్తుపట్టడం కష్టంగా తయారవ్వచ్చు.—యాకో. 4:4.
13 మరికొన్ని విధాలుగా కూడా కొంతమంది సాక్షులు లోకస్థుల్లా ప్రవర్తించారు. ఉదాహరణకు పార్టీల్లో, క్రైస్తవులకు తగని విధంగా డాన్సులు వేశారు, ప్రవర్తించారు. మరికొంతమంది లోకస్థుల ఆలోచనల్ని ప్రతిబింబించే ఫోటోలను, కామెంట్లను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాంటివాళ్లు ఏదో గంభీరమైన పాపం చేసి, సంఘంలో క్రమశిక్షణ పొందినవాళ్లు కాకపోవచ్చు. కానీ లోకానికి వేరుగా ఉండడానికి కృషిచేసే సహోదరసహోదరీలపై వాళ్లు చెడు ప్రభావం చూపిస్తారు.—1 పేతురు 2:11, 12 చదవండి.
14. యెహోవాతో మనకున్న ప్రత్యేక స్నేహాన్ని కాపాడుకోవాలంటే మనమెలా ఉండాలి?
14 ఈ లోకంలో ఉన్న ప్రతీది “శరీరాశకు, నేత్రాశకు, వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడానికి” నడిపిస్తుంది. (1 యోహా. 2:16) కానీ మనం యెహోవా సొత్తు కాబట్టి లోకానికి వేరుగా ఉంటాం. “మనం ప్రస్తుత వ్యవస్థలో భక్తిలేని ప్రవర్తనకు దూరంగా ఉండేలా, లోకంలోని చెడు కోరికలను తిరస్కరించేలా, మంచి వివేచనతో, నీతితో, దేవుని మీద భక్తితో” ఉండడానికి ప్రయత్నిస్తాం. (తీతు 2:12) మన జీవన విధానమంతా అంటే మన మాటలు, తినే-తాగే అలవాట్లు, బట్టలు, కనబడేతీరు, ఉద్యోగం ఇవన్నీ మనం యెహోవా సొత్తని ప్రతీఒక్కరు తేలిగ్గా గుర్తించేలా ఉండాలి.—1 కొరింథీయులు 10:31, 32 చదవండి.
‘ఒకరి మీద ఒకరం ప్రగాఢమైన ప్రేమ’ చూపించుకుంటాం
15. తోటి క్రైస్తవులతో దయగా, ప్రేమగా ఎందుకు వ్యవహరించాలి?
15 యెహోవాకు మన కృతజ్ఞతను చూపించే ఇంకో మార్గం ఏమిటంటే, తోటి సహోదరసహోదరీలతో వ్యవహరించే విధానం. మనలాగే తోటి సహోదరసహోదరీలు కూడా యెహోవా సొత్తు. ఈ వాస్తవాన్ని మనసులో ఉంచుకుంటే, వాళ్లతో ఎల్లప్పుడూ దయగా, ప్రేమగా ప్రవర్తిస్తాం. (1 థెస్స. 5:15) ఇది ఎందుకు చాలా ప్రాముఖ్యం? ఎందుకంటే, “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది” అని యేసు తన అనుచరులకు చెప్పాడు.—యోహా. 13:35.
16. యెహోవాకు తన ప్రజల మీదున్న ప్రేమను అర్థంచేసుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలోని ఏ నిర్దేశం సహాయం చేస్తుంది?
16 సంఘంలో తోటి సహోదరసహోదరీలతో ఎలా వ్యవహరించాలో అర్థంచేసుకోవడానికి మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఒక నిర్దేశాన్ని పరిశీలిద్దాం. యెహోవా ఆలయంలో, ఆరాధనకు మాత్రమే ఉపయోగించే కొన్ని పాత్రలు ఉండేవి. లేవీయులు వాటిని ఎలా చూసుకోవాలనే స్పష్టమైన నిర్దేశాలు ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఆ నిర్దేశాల్ని పాటించనివాళ్లకు మరణశిక్ష విధించబడేది. (సంఖ్యా. 1:50, 51) తన ఆరాధనకు ఉపయోగించే పాత్రల మీదే యెహోవాకు అంత శ్రద్ధ ఉంటే, తనకు సమర్పించుకుని, నమ్మకంగా ఆరాధిస్తున్న వాళ్లపట్ల ఇంకెంత శ్రద్ధ ఉంటుందో కదా. ‘ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే, వాళ్లు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే’ అని చెప్పడం ద్వారా యెహోవా మనకు ఎంత విలువిస్తున్నాడో అర్థమౌతుంది.—జెక. 2:8, NW.
17. యెహోవా దేన్ని ‘చెవియొగ్గి ఆలకిస్తున్నాడు?’
17 తన ప్రజలు ఒకరితోఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారో లేదా ఎలా వ్యవహరించుకుంటున్నారో యెహోవా ‘చెవియొగ్గి ఆలకిస్తున్నాడు’ అని మలాకీ చెప్పాడు. (మలా. 3:16) “యెహోవాకు తనవాళ్లు ఎవరో తెలుసు” అని బైబిలు చెప్తుంది. (2 తిమో. 2:19) మనం చేసే ప్రతీ పని, మాట్లాడే ప్రతీ మాట యెహోవాకు స్పష్టంగా తెలుస్తుంది. (హెబ్రీ. 4:13) మనం తోటి సహోదరసహోదరీలతో దురుసుగా వ్యవహరించినప్పుడు యెహోవా చూస్తాడు. అలాగే, తోటి సహోదరసహోదరీల పట్ల ఆతిథ్య స్పూర్తిని, ఉదారతను, క్షమాగుణాన్ని, దయను చూపించినప్పుడు కూడా యెహోవా ఖచ్చితంగా గమనిస్తాడు.—హెబ్రీ. 13:16; 1 పేతు. 4:8, 9.
‘యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడు’
18. మనల్ని తన సొత్తుగా ఎంచుకున్నందుకు యెహోవాకు ఎలా కృతజ్ఞతలు చెప్పవచ్చు?
18 యెహోవా మనల్ని తన సొత్తుగా చేసుకున్నందుకు ఎంత కృతజ్ఞులమో చూపించాలనుకుంటాం. ఆయనకు ఇష్టపూర్వకంగా సమర్పించుకోవడమే అన్నిటికన్నా తెలివైన పనని మనకు తెలుసు. “ఈ చెడ్డ తరం మధ్య” జీవిస్తున్నప్పటికీ, మనం “ఏ నిందా లేకుండా పవిత్రంగా” ఉండవచ్చు, “లోకంలో జ్యోతుల్లా” ప్రకాశించవచ్చు. (ఫిలి. 2:15) కాబట్టి యెహోవా అసహ్యించుకునే దేన్ని చేయకుండా ఉండాలని తీర్మానించుకున్నాం. (యాకో. 4:7) అంతేకాదు, మన తోటి సహోదరసహోదరీలు కూడా యెహోవా సొత్తే కాబట్టి వాళ్లను ప్రేమిస్తాం, గౌరవిస్తాం.—రోమా. 12:10.
19. తన సొత్తయిన ప్రజలకు యెహోవా ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు?
19 ‘యెహోవా తన ప్రజల్ని విడిచిపెట్టడు’ అని బైబిలు హామీ ఇస్తుంది. (కీర్త. 94:14, NW) ఏమి జరిగినా యెహోవా మనతోనే ఉంటాడు. మనం చనిపోయినా ఆయన మనల్ని మర్చిపోడు. (రోమా. 8:38, 39) “ఎందుకంటే మనం బ్రతికితే, యెహోవా కోసం బ్రతుకుతాం; చనిపోతే యెహోవా కోసం చనిపోతాం. కాబట్టి మనం బ్రతికినా, చనిపోయినా యెహోవాకు చెందుతాం.” (రోమా. 14:8) చనిపోయిన తన నమ్మకమైన స్నేహితులందర్నీ యెహోవా బ్రతికించే రోజు కోసం మనం ఎదురుచూస్తున్నాం. (మత్త. 22:32) ఇప్పుడు కూడా ఎన్నో అద్భుతమైన బహుమానాల్ని మన పరలోక తండ్రి ఇస్తున్నాడు. బైబిలు చెప్తున్నట్లు, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.”—కీర్త. 33:12.