కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆలిస

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠టర్కీలో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠టర్కీలో

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ‘రాజ్యం గురించిన మంచివార్తను’ వీలైనంత ఎక్కువమందికి తెలియజేయడానికి చాలా కృషిచేశారు. (మత్త. 24:14) దానికోసం కొంతమంది క్రైస్తవులు వేరే దేశాలకు కూడా వెళ్లారు. ఉదాహరణకు అపొస్తలుడైన పౌలు మిషనరీ యాత్రలు చేస్తున్న సమయంలో, ఇప్పుడు టర్కీ ఉన్న ప్రాంతానికి వెళ్లి విస్తృతంగా సువార్త ప్రకటించాడు. a దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత, అంటే 2014లో మళ్లీ అక్కడ మంచివార్తను విస్తృతంగా ప్రకటించడం కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు? ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాలుపంచుకున్నారు?

“ఏమి జరుగుతోంది?”

టర్కీలో 2,800 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. కానీ ఆ దేశ జనాభా 7 కోట్ల 90 లక్షలు. అంటే సగటున ఒక్కో ప్రచారకుడు దాదాపు 28,000 మందికి మంచివార్త ప్రకటించాలన్నమాట. అయితే ప్రచారకులు కేవలం కొద్దిమందికే ప్రకటించగలిగారు. దాంతో ఆ దేశంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమ లక్ష్యం ఏమిటంటే, తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువమందికి మంచివార్త ప్రకటించడం. టర్కిష్‌ భాష మాట్లాడే దాదాపు 550 మంది సహోదరసహోదరీలు వేరే దేశాల నుండి టర్కీకి వచ్చి, అక్కడి స్థానిక ప్రచారకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

ఎక్కువమందికి మంచివార్త చేరింది. ఇస్తాంబుల్‌లోని ఒక సంఘంవాళ్లు ఇలా రాశారు, “ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు, ‘ఎక్కడ చూసినా యెహోవాసాక్షులే కనిపిస్తున్నారు. ఇక్కడ ఏదైనా ప్రత్యేక సమావేశం జరుగుతోందా?’ అని అడిగారు.” ఇజ్మీర్‌ నగరంలో ఉన్న ఒక సంఘంవాళ్లు ఇలా రాశారు, “టాక్సీ స్టాండులో పనిచేసే ఒకాయన స్థానిక సంఘపెద్ద దగ్గరికి వచ్చి, ‘ఏమి జరుగుతోంది? మీ సేవను ఇంకా విస్తృతం చేస్తున్నారా?’ అని అడిగాడు.” వాళ్ల మాటల్నిబట్టి ప్రచార కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలిసిందని అర్థమౌతోంది.

స్టెఫన్‌

వేరే దేశం నుండి వచ్చిన సహోదరసహోదరీలు ప్రీచింగ్‌ని చాలా ఆనందించారు. డెన్మార్క్‌ నుండి వచ్చిన స్టెఫన్‌ ఇలా అన్నాడు, “యెహోవా గురించి ఎప్పుడూ వినని ప్రజలకు నేను ప్రతీరోజు ప్రకటించగలిగాను. యెహోవా పేరును నిజంగా అందరికీ చాటుతున్నట్లు నాకనిపించింది.” ఫ్రాన్స్‌ నుండి వచ్చిన జాన్‌ డేవిడ్‌ ఇలా రాశాడు, “మేం కేవలం ఒక్క వీధిలోనే కొన్ని గంటలపాటు ప్రీచింగ్‌ చేశాం. ప్రీచింగ్‌ చాలా బాగా జరిగింది! చాలామందికి యెహోవాసాక్షుల గురించి తెలీదు. దాదాపు ప్రతీ ఇంట్లో చక్కగా మాట్లాడగలిగాం, వీడియోలు చూపించగలిగాం, పత్రికలు ఇవ్వగలిగాం.”

జాన్‌ డేవిడ్‌ (మధ్యలో)

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న 550 మంది కేవలం రెండు వారాల్లో దాదాపు 60,000 పత్రికల్ని పంచిపెట్టారు! ఆ కార్యక్రమం వల్ల ఎక్కువమందికి మంచివార్త చేరింది.

ప్రీచింగ్‌ చేయాలనే ఉత్సాహం పెరిగింది. ఆ ప్రచార కార్యక్రమం వల్ల స్థానిక సహోదరుల్లో ప్రీచింగ్‌ చేయాలనే ఉత్సాహం పెరిగింది. చాలామందిలో పూర్తికాల సేవ చేయాలనే ఆలోచన మొదలైంది. కార్యక్రమం జరిగిన తర్వాతి 12 నెలల్లో క్రమపయినీర్ల సంఖ్య 24 శాతం పెరిగింది.

షీరన్‌

ప్రచార కార్యక్రమం కోసం టర్కీకి వచ్చి తమ దేశానికి తిరిగివెళ్లిన తర్వాత ప్రీచింగ్‌ విషయంలో తమ అభిప్రాయం ఎలా మారిందో సహోదరసహోదరీలు వివరించారు. జర్మనీ నుండి వచ్చిన షీరన్‌ ఇలా రాసింది, “టర్కీలోని సహోదరులు అనియత సాక్ష్యాన్ని ఎలాంటి జంకు లేకుండా చక్కగా చేస్తారు. నాకు మాత్రం అనియత సాక్ష్యం చేయాలంటే చాలా బిడియంగా అనిపించేది. కానీ ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు థాంక్యూ. ఎందుకంటే స్థానిక సహోదరుల ఆదర్శం వల్ల, ప్రార్థనల వల్ల ఇంతకుముందు చేయలేని అనియత సాక్ష్యాన్ని చేయగలిగాను. సబ్‌వేలో (భూగర్భ రైలు మార్గం) కూడా ప్రీచింగ్‌ చేసి కరపత్రాలు ఇచ్చాను. ఇప్పుడు నేను ఎలాంటి బిడియం లేకుండా మాట్లాడగలుగుతున్నాను.”

యోహానస్‌

జర్మనీకి చెందిన యోహానస్‌ ఇలా అంటున్నాడు, “ప్రీచింగ్‌ విషయంలో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. వీలైనంత ఎక్కువమందికి సత్యం నేర్పించాలనే కోరిక టర్కీలోని సహోదరుల మనసులో ఉంది. అందుకే వాళ్లు అవకాశం ఉన్న ప్రతీచోట మంచివార్త ప్రకటించేవాళ్లు. జర్మనీకి తిరిగెళ్లాక నేను కూడా అలాగే చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను మంచివార్తను ఒకప్పటికన్నా ఎక్కువమందికి ప్రకటిస్తున్నాను.”

జేనెప్‌

“ఈ ప్రచార కార్యక్రమం వల్ల ప్రీచింగ్‌ విషయంలో నేను చాలా మెరుగయ్యాను. మరింత ధైర్యంగా ఉండడానికి, యెహోవాపై ఇంకా ఎక్కువ నమ్మకం ఉంచడానికి నాకు అది సహాయం చేసింది” అని ఫ్రాన్స్‌కు చెందిన జేనెప్‌ అనింది.

ప్రచారకులు ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. వేర్వేరు దేశాల నుండి వచ్చిన సహోదరుల మధ్య ఉన్న ప్రేమ, ఐక్యత సాక్షుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇంతకుముందు ప్రస్తావించబడిన జాన్‌ డేవిడ్‌ ఇలా అన్నాడు, “సహోదరులు చూపించిన ఆతిథ్యాన్ని ‘రుచిచూశాం,’ వాళ్లు మమ్మల్ని తమ స్నేహితుల్లా, కుటుంబంలో ఒకరిగా చూసుకున్నారు. మేము వాళ్ల ఇళ్లలో ఉండడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మనది అంతర్జాతీయ సహోదరత్వం అని నాకు తెలుసు, దానిగురించి చాలాసార్లు మన పత్రికల్లో కూడా చదివాను. కానీ ఈసారి దాన్ని స్వయంగా రుచిచూశాను. యెహోవా ప్రజల్లో ఒకడిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన యెహోవాకు థాంక్యూ.”

క్లార్‌ (మధ్యలో)

ఫ్రాన్స్‌కు చెందిన క్లార్‌ ఇలా చెప్పింది, “మేము డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ ఇలా ఏ దేశం నుండి వచ్చిన వాళ్లమైనా అందరం ఒకే కుటుంబంలా ఉన్నాం. అది చూసినప్పుడు, దేవుడు దేశ సరిహద్దులన్నిటినీ పెద్ద రబ్బరుతో తుడిచేసినట్లు అనిపించింది.”

స్టేఫానీ (మధ్యలో)

ఫ్రాన్స్‌ నుండి వచ్చిన స్టేఫానీ ఇలా అనింది, “మనల్ని దగ్గర చేసేది మన సంస్కృతో లేదా భాషో కాదుగానీ మనందరికీ యెహోవా మీద ఉన్న ప్రేమే అని ఆ ప్రత్యేక ప్రచార కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాను.”

దీర్ఘకాల ప్రయోజనాలు

వేరే దేశం నుండి వచ్చిన సహోదరసహోదరీల్లో చాలామంది టర్కీలో ప్రచారకుల అవసరం ఎక్కువుందని గ్రహించి, అక్కడికి వెళ్లిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్లలో కొందరు ఇప్పటికే టర్కీకి వెళ్లిపోయారు. అవసరం ఎక్కువున్న చోటుకు వెళ్లిన ఆ సహోదరసహోదరీలను ఎంతో మెచ్చుకోవాల్సిందే.

ఉదాహరణకు ఒక మారుమూల ప్రాంతంలో, 25 మంది ప్రచారకులు ఉన్న గుంపునే తీసుకుందాం. ఎన్నో సంవత్సరాలపాటు ఆ గుంపులో కేవలం ఒక్క సంఘపెద్దే ఉండేవాడు. అయితే అవసరం ఎక్కువున్న ఆ ప్రాంతంలో సహాయం చేయడానికి 2015లో జర్మనీ, నెదర్లాండ్స్‌ నుండి ఆరుగురు ప్రచారకులు వచ్చినప్పుడు అక్కడి సహోదరసహోదరీలకు ఎంత ఆనందం కలిగివుంటుందో ఊహించగలరా?

అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయడం

కొంతకాలంపాటు టర్కీలో ఉండి సేవచేసినవాళ్లు అక్కడ ఎదురైన అనుభవాల గురించి ఏమి చెప్తున్నారు? నిజమే, కొన్నిసార్లు సవాళ్లు ఎదురౌతాయి, కానీ అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవచేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమంది ఏమన్నారో చూడండి.

ఫేడేరీకో

“వస్తువులు ఎక్కువ లేకపోవడంవల్ల అనవసరమైన చింత ఉండదు. దానివల్ల మరింత ప్రాముఖ్యమైన విషయాలపై నేను మనసు పెట్టగలుగుతున్నాను” అని స్పెయిన్‌ నుండి టర్కీకి వెళ్లిపోయిన 40వ పడిలో ఉన్న ఫేడేరీకో అనే పెళ్లయిన సహోదరుడు అంటున్నాడు. ఇతరుల్ని కూడా అవసరం ఎక్కువున్న ప్రాంతానికి వెళ్లమని అతను ప్రోత్సహిస్తాడా? అతను ఏమంటున్నాడంటే, “ఖచ్చితంగా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఇతరులకు యెహోవా గురించి చెప్పడానికి వేరే దేశానికి వెళ్తే, మిమ్మల్ని మీరు యెహోవా చేతికి అప్పగించుకుంటున్నట్లే. అలాచేస్తే, ఇంతకుముందుకన్నా యెహోవా శ్రద్ధను మరింత ఎక్కువగా రుచిచూస్తారు.”

రూడీ

“యెహోవా సేవలో ముందుండడం, యెహోవా గురించి ఎప్పుడూ వినని ఎంతోమందికి మంచివార్త చెప్పడం ఎంతో సంతృప్తినిస్తుంది. సత్యం అంగీకరించినప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం మనకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది” అని నెదర్లాండ్స్‌కు చెందిన 50వ పడిలో ఉన్న రూడీ అనే పెళ్లయిన సహోదరుడు చెప్తున్నాడు.

సాష

జర్మనీ నుండి టర్కీకి వెళ్లిపోయిన సాష అనే పెళ్లయిన సహోదరుడు ప్రస్తుతం 40వ పడిలో ఉన్నాడు. అతనిలా చెప్తున్నాడు, “పరిచర్యకు వెళ్లినప్పుడల్లా సత్యాన్ని మొదటిసారి వింటున్న ప్రజలు నాకు కలుస్తారు. అలాంటివాళ్లకు యెహోవా గురించి చెప్పడం నాకు గొప్ప సంతృప్తినిస్తుంది.”

ఆట్‌సూకో

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న జపాన్‌కు చెందిన ఆట్‌సూకో అనే పెళ్లయిన సహోదరి ఏం చెప్తోందంటే, “ఒకప్పుడు నేను హార్‌మెగిద్దోను వెంటనే రావాలని కోరుకునేదాన్ని. కానీ టర్కీకి వచ్చిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. యెహోవా ఇంకా సహనం చూపిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. యెహోవా పరిస్థితుల్ని మలుస్తున్న విధానాన్ని చూసే కొద్దీ ఆయనకు దగ్గరవ్వాలనే కోరిక నాలో మరింత బలపడుతోంది.”

ప్రస్తుతం 30వ పడిలో ఉన్న రష్యాకు చెందిన ఆలిస అనే సహోదరి ఇలా అంటోంది, “ఇలాంటి పద్ధతిలో పరిచర్య చేయడంవల్ల ఆయన మంచితనాన్ని అంతటినీ రుచిచూడగలిగాను.” (కీర్త. 34:8) ఆమె ఇంకా ఇలా అంటోంది, “యెహోవా నా తండ్రి మాత్రమే కాదు, నా దగ్గరి స్నేహితుడు కూడా. వేర్వేరు పరిస్థితుల్లో నేను ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నాను. నా జీవితమంతా సంతోషకరమైన జ్ఞాపకాలతో, ఆనందకరమైన అనుభవాలతో, లెక్కలేనన్ని దీవెనలతో నిండిపోయింది.”

“పొలాల్ని చూడండి”

ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం వల్ల టర్కీలో ఎంతోమంది మంచివార్త తెలుసుకోగలిగారు. కానీ ఇప్పటివరకు మంచివార్త చేరని ప్రాంతాలు ఇంకా అక్కడ ఎన్నో ఉన్నాయి. టర్కీలో సేవచేయడానికి వేరే ప్రాంతాల నుండి వచ్చిన ప్రచారకులకు, యెహోవా గురించి ముందెప్పుడూ వినని ప్రజలు ప్రతీరోజు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో మీరు సేవ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ చేయాలనుకుంటే, “మీ తలలెత్తి పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి” అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. (యోహా. 4:35) ‘కోతకు సిద్ధంగా ఉన్న’ ఏదోక ప్రాంతంలో మీరు మంచివార్త ప్రకటించగలరా? అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టండి. ఒక్కటి మాత్రం నిజం, “భూమంతటా” మంచివార్త ప్రకటించడానికి మీరు ఎక్కువ కృషిచేస్తే, ఊహకందనన్ని దీవెనలు పొందుతారు.—అపొ. 1:8.

a ‘మంచి దేశమును చూడండి’ అనే బ్రోషురులో 32-33 పేజీలు చూడండి.