కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మనసు చేసే పోరాటంలో గెలవండి

మీ మనసు చేసే పోరాటంలో గెలవండి

శత్రువు మీపై దాడి చేస్తున్నాడు. ఆ శత్రువు మరెవరో కాదు సాతానే. అతను చాలా శక్తివంతమైన ఆయుధాన్ని మీ మీద ప్రయోగిస్తున్నాడు. ఆ ఆయుధాన్ని మీ మనసుపై ప్రయోగించడానికే ప్రత్యేకంగా తయారుచేశాడు. ఇంతకీ ఆ ఆయుధం ఏమిటి? ఆ ఆయుధం పేరు తప్పుడు ప్రచారం!

సాతాను చేసే తప్పుడు ప్రచారం చాలా ప్రమాదకరమని అపొస్తలుడైన పౌలుకు తెలుసు. అయితే ఆ ప్రమాదం గురించి అతని తోటి క్రైస్తవులందరికీ తెలీదు. ఉదాహరణకు, కొరింథులోని కొంతమంది క్రైస్తవులు సత్యంలో ఎంత బలంగా నాటుకుపోయామని అనుకున్నారంటే, సాతాను ఎన్నడూ తమను తప్పుదారి పట్టించలేడని అనుకున్నారు. (2 కొరిం. 10:12) అందుకే పౌలు వాళ్లను ఇలా హెచ్చరించాడు, “పాము కుయుక్తిగా హవ్వను మోసం చేసినట్టే, ఎవరైనా మీ మనసుల్ని కూడా ఏదోవిధంగా కలుషితం చేసి క్రీస్తుపట్ల మీరు చూపించాల్సిన నిజాయితీని, పవిత్రతను పాడుచేస్తారేమోనని నాకు భయంగా ఉంది.”—2 కొరిం. 11:3.

మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో పౌలు మాటలు చూపిస్తున్నాయి. సాతాను చేసే తప్పుడు ప్రచారాన్ని మీరు తిప్పికొట్టాలంటే, ఆ ప్రచారం ఎంత ప్రమాదకరమైనదో గుర్తించాలి, దాన్నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.

తప్పుడు ప్రచారం ఎంత ప్రమాదకరమైనది?

ఇంతకీ తప్పుడు ప్రచారం అంటే ఏమిటి? ఈ సందర్భంలో, తప్పుడు ప్రచారమంటే ప్రజల్ని మోసం చేయడానికి లేదా వాళ్ల ఆలోచనల్ని, పనుల్ని నియంత్రించడానికి ఉపయోగించే అబద్ధాలు లేదా తప్పుడు సమాచారం. ప్రాపగాండా అండ్‌ పర్సువేషన్‌ అనే పుస్తకం ప్రకారం, తప్పుడు ప్రచారం ‘అవినీతికరమైనది, హానికరమైనది, అన్యాయమైనది.’ ప్రజలు దాన్ని వర్ణించడానికి, “అబద్ధాలు, పక్కదారి పట్టించడం, మోసం, ఉసిగొల్పడం, వశపర్చుకోవడం” వంటి పదాల్ని ఉపయోగిస్తారు.

తప్పుడు ప్రచారం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది చాప కింద నీరులా మన ఆలోచనల్ని మెల్లమెల్లగా మార్చేస్తుంది. తప్పుడు ప్రచారాన్ని రంగు, వాసన లేని విషపూరితమైన వాయువుతో పోల్చవచ్చు. మనుషుల ప్రవర్తనను చదవగలిగే నైపుణ్యం ఉన్న వాన్స్‌ పక్కాడ్‌ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, తప్పుడు ప్రచారం మన ప్రవర్తనపై “మనం గుర్తించే దానికన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.” తప్పుడు ప్రచారం వల్లే ప్రజలు అత్యంత ప్రమాదకరంగా, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారని; జాతి లేదా మతం పేరుతో జాతినిర్మూలనకు, యుద్ధాలకు, హింసలకు పాల్పడుతున్నారని మరో నిపుణుడు చెప్తున్నాడు.—ఈజీలీ లెడ్‌—ఎ హిస్టరీ ఆఫ్‌ ప్రాపగాండా.

తప్పుడు ప్రచారంతో మనుషులే మనల్ని మోసం చేయగలుగుతున్నారంటే, సాతాను ఇంకెంత ఎక్కువగా మోసం చేయగలడో కదా! దేవుడు మనుషుల్ని సృష్టించినప్పటి నుండి సాతాను వాళ్ల ప్రవర్తనను గమనిస్తూనే ఉన్నాడు. అంతేకాదు, ప్రస్తుతం “లోకమంతా” సాతాను గుప్పిట్లో ఉంది. కాబట్టి అతను ప్రపంచంలో ఏ మూల నుండైనా అబద్ధాలను వ్యాప్తి చేయగలడు. (1 యోహా. 5:19; యోహా. 8:44) సాతాను తన తప్పుడు ప్రచారంతో చాలామంది “మనసులకు గుడ్డితనం కలుగజేశాడు.” ఇప్పుడు, “అతడు లోకమంతటినీ మోసం చేస్తున్నాడు.” (2 కొరిం. 4:4; ప్రక. 12:9) అయితే, అతని తప్పుడు ప్రచారాన్ని మీరెలా తిప్పికొట్టవచ్చు?

మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి

తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సులభమైన పద్ధతి ఉందని యేసు చెప్పాడు. అదేంటంటే, ‘మీరు సత్యాన్ని తెలుసుకోండి, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది.’ (యోహా. 8:31, 32) సాధారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు, సైనికుల్ని మోసం చేయడానికి శత్రువులు అబద్ధాలు వ్యాప్తి చేస్తారు. కాబట్టి నమ్మదగిన సమాచారం ఎక్కడ దొరుకుతుందో సైనికులకు తెలుసుండాలి. అయితే మీకు నమ్మదగిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? ఆ సమాచారాన్ని యెహోవా తన వాక్యమైన బైబిల్లో ఉంచాడు. సాతాను చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కావాల్సిన సమాచారమంతా అందులో ఉంటుంది.—2 తిమో. 3:16, 17.

నిజానికి సాతానుకు కూడా ఆ విషయం తెలుసు. అందుకే తన గుప్పిట్లో ఉన్న లోకాన్ని ఉపయోగించి మనల్ని బైబిలు చదవనివ్వకుండా, అధ్యయనం చేయనివ్వకుండా నిరుత్సాహపరుస్తాడు. బైబిలు ఇలా చెప్తోంది, ‘అపవాది వ్యూహాలకు పడిపోకండి.’ (ఎఫె. 6:11, అధస్సూచి) కాబట్టి మనకు కేవలం ప్రాథమిక సత్యాలు తెలిసుంటే సరిపోదు. సత్యం గురించి లోతైన అవగాహనను సంపాదించుకోవడానికి కృషిచేయాలి. (ఎఫె. 3:18) నోవమ్‌ ఛాంస్కీ అనే రచయిత ఇలా చెప్తున్నాడు, “సత్యాన్ని ఎవ్వరూ మీ మెదడులో నింపరు. దాన్ని మీరే స్వయంగా తెలుసుకోవాలి.” కాబట్టి, “ప్రతీరోజు లేఖనాల్ని జాగ్రత్తగా పరిశోధిస్తూ” ‘మీరే స్వయంగా తెలుసుకోండి.’—అపొ. 17:11.

మీ మనసు చేసే పోరాటంలో గెలవాలంటే తప్పుడు ప్రచారం ఎంత ప్రమాదకరమైనదో గుర్తించాలి, దాన్నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి

మీరు విన్న విషయాల గురించి సరిగ్గా ఆలోచించకూడదని, వాస్తవాలను అర్థంచేసుకోకూడదని సాతాను కోరుకుంటున్నాడు. అలాగైతేనే తప్పుడు ప్రచారం “చాలా శక్తివంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది.” (మీడియా అండ్‌ సొసైటీ ఇన్‌ ద ట్వంటియత్‌ సెంచరీ) విన్న ప్రతీ విషయం గుడ్డిగా నమ్మకండి, దానిగురించి జాగ్రత్తగా ఆలోచించండి. (సామె. 14:15) దేవుడు మీకు “బుద్ధి,” “ఆలోచనా సామర్థ్యాల్ని” ఇచ్చాడు. వాటిని ఉపయోగించి మీ విశ్వాసాన్ని బలపర్చుకోండి.—సామె. 2:10-15; రోమా. 12:1, 2.

ఐక్యంగా ఉండండి

తప్పుడు ప్రచారాన్ని నమ్మిన సైనికులు భయపడతారు, యుద్ధం చేయడానికి వెనకాడతారు. అంతేకాదు తప్పుడు ప్రచారాన్ని నమ్మిన సైనికులు తోటి సైనికులతో గొడవలు పడే లేదా సైన్యానికి దూరంగా వెళ్లే అవకాశం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడానికి ఒక కారణం తప్పుడు ప్రచారమేనని జర్మన్‌ సైనికాధికారి చెప్పాడు. ఆ సమయంలో ప్రజలందరూ తప్పుడు ప్రచారాన్ని ఎంతగా నమ్మారంటే అది వాళ్లను హిప్నోటైజ్‌ చేసినట్లు అనిపించిందని అతను అన్నాడు. నేడు క్రైస్తవుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి సాతాను అలాంటి పద్ధతుల్నే ఉపయోగిస్తాడు. ఉదాహరణకు, అతను సహోదరుల మధ్య విభేదాలు తీసుకొస్తాడు లేదా యెహోవా సంస్థ తమకు అన్యాయం చేసిందని లేదా బాధపెట్టిందనే ఆలోచనతో సంస్థను వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు.

కానీ మీరు మోసపోకండి! బైబిలు ఇస్తున్న సలహా పాటించి సహోదరులతో ఐక్యంగా ఉండండి. ఉదాహరణకు, “మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ,” అభిప్రాయభేదాల్ని వెంటనే పరిష్కరించుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (కొలొ. 3:13, 14; మత్త. 5:23, 24) అంతేకాదు సంఘాన్ని వదిలి వెళ్లొద్దని హెచ్చరిస్తోంది. (సామె. 18:1) సాతాను తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మీరు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. ఈ ప్రశ్న గురించి ఆలోచించండి, ‘ఈ మధ్యకాలంలో తోటి సహోదరులు ఎవరైనా నన్ను నొప్పించినప్పుడు, నేను యెహోవాను సంతోషపెట్టేలా ప్రవర్తించానా లేదా సాతానును సంతోషపెట్టేలా ప్రవర్తించానా?’—గల. 5:16-26; ఎఫె. 2:2, 3.

మీ నమ్మకాన్ని కోల్పోకండి

తన నాయకునికి నమ్మకంగాలేని సైనికుడు యుద్ధం సరిగ్గా చేయలేడు. అందుకే సైనికులకు వాళ్ల నాయకుల మీదున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టడానికి శత్రువులు తప్పుడు ప్రచారాన్ని ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ నాయకులు ఏదైనా తప్పు చేస్తే శత్రువులు దాన్ని ఉపయోగించి, ‘మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తారు. వాళ్లను నమ్ముకుని ప్రాణాల్ని పోగొట్టుకోకండి’ అని చెప్తారు. సాతాను కూడా అలాగే చేస్తాడు. యెహోవా తన ప్రజల్ని నడిపించేందుకు ఉపయోగించుకుంటున్న సహోదరులపట్ల మీకున్న నమ్మకాన్ని పాడుచేయడానికి సాతాను ప్రయత్నిస్తాడు.

మరి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు? యెహోవా సంస్థలోనే ఉండాలని తీర్మానించుకోండి. దేవుని ప్రజల్ని నడిపించే సహోదరులు అపరిపూర్ణులైనా వాళ్లకు నమ్మకంగా ఉంటూ, మద్దతివ్వండి. (1 థెస్స. 5:12, 13) మతభ్రష్టులు, ఇతర మోసగాళ్లు సంస్థపై దాడిచేయడానికి ప్రయత్నించవచ్చు. (తీతు 1:10) ఒకవేళ వాళ్లు చెప్పేవి నిజమేనని మీకు అనిపించినా, “వెంటనే అయోమయంలో పడిపోకండి.” (2 థెస్స. 2:2) పౌలు తిమోతికి ఇచ్చిన సలహాను పాటించండి. మీరు నేర్చుకున్న సత్యానికి అంటిపెట్టుకుని ఉండండి, దాన్ని ఎక్కడ నేర్చుకున్నారో మర్చిపోకండి. (2 తిమో. 3:14, 15) యెహోవా మనకు సత్యాన్ని నేర్పించడానికి దాదాపు వంద సంవత్సరాలుగా ఉపయోగించుకుంటున్న నమ్మకమైన బుద్ధిగల దాసుణ్ణి నమ్మడానికి ఉన్న రుజువులన్నిటినీ ధ్యానించండి.—మత్త. 24:45-47; హెబ్రీ. 13:7, 17.

భయపడకండి

సాతాను తప్పుడు ప్రచారాన్ని మీపై నేరుగా కూడా ప్రయోగిస్తాడు. కొన్నిసార్లు అతను మీరు భయపడేలా చేస్తాడు. భయం అనేది “తప్పుడు ప్రచారానికి ఉపయోగించే పద్ధతులన్నిట్లో పాతది.” (ఈజీలీ లెడ్‌—ఎ హిస్టరీ ఆఫ్‌ ప్రాపగాండా) ఉదాహరణకు, బ్రిటీష్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ యమ్‌. టేలర్‌ ఏమి రాశాడంటే, అష్షూరీయులు తమ శత్రువుల్ని ఓడించడానికి తప్పుడు ప్రచారంతోపాటు భయాన్ని కూడా ఉపయోగించారు. సాతాను, భయాన్ని అంటే మనుషుల భయాన్ని, వ్యతిరేకత వస్తుందేమో అనే భయాన్ని, మరణ భయాన్ని ఉపయోగించి మీరు యెహోవా సేవను ఆపేసేలా చేస్తాడు.—యెష. 8:12; యిర్మీ. 42:11; హెబ్రీ. 2:15.

సాతానుకు ఆ అవకాశం ఇవ్వకండి. యేసు ఇలా చెప్పాడు, “శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏమీ చేయలేనివాళ్లకు భయపడకండి.” (లూకా 12:4) మిమ్మల్ని చూసుకుంటానని ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉండండి, ఆయన మీకు ‘అసాధారణ శక్తిని’ ఇస్తాడు, సాతాను దాడుల్ని తిప్పికొట్టడానికి సహాయం చేస్తాడు.—2 కొరిం. 4:7-9; 1 పేతు. 3:14.

నిజమే మీరు బలహీనపడే లేదా భయపడే సందర్భాలు ఎదురౌతాయి. కానీ యెహోషువను ప్రోత్సహిస్తూ యెహోవా చెప్పిన ఈ మాటల్ని గుర్తుంచుకోండి, ‘ధైర్యంగా, నిబ్బరంగా ఉండు. నువ్వు వెళ్లే ప్రతీ చోట నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు కాబట్టి బెదరొద్దు, భయపడొద్దు.’ (యెహో. 1:9, NW) మీకు ఆందోళనగా అనిపిస్తే, వెంటనే యెహోవాకు ప్రార్థించండి. అప్పుడు, ‘మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుందనే’ పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఆ విధంగా సాతాను తప్పుడు ప్రచారాన్ని అంతటినీ తిప్పికొట్టడానికి కావాల్సిన బలం మీకు వస్తుంది.—ఫిలి. 4:6, 7, 13.

దేవుని ప్రజల్ని భయపెట్టడానికి అష్షూరీయుల రాయబారి రబ్షాకే చేసిన తప్పుడు ప్రచారం మీకు గుర్తుందా? అష్షూరీయుల నుండి తమను ఎవ్వరూ ఆఖరికి యెహోవా కూడా కాపాడలేడని దేవుని ప్రజలు అనుకునేలా చేయడానికి రబ్షాకే ప్రయత్నించాడు. అంతేకాదు యెరూషలేమును నాశనం చేయమని యెహోవాయే తనకు చెప్పాడని అతను అన్నాడు. కానీ దానికి జవాబుగా యెహోవా ఏమి చెప్పాడు? ‘నువ్వు విన్న మాటలనుబట్టి, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ అన్న మాటలనుబట్టి నువ్వు భయపడొద్దు.’ (2 రాజు. 18:22-25; 19:6, NW) ఆ తర్వాత యెహోవా తన దూతను పంపించి ఒక్క రాత్రిలోనే 1,85,000 మంది అష్షూరీయులను చంపించాడు.—2 రాజు. 19:35.

జ్ఞానయుక్తంగా ఉంటూ ఎల్లప్పుడూ యెహోవా మాట వినండి

ఏదైనా సినిమాలో, ఇతరులు తనను మోసం చేస్తున్నారని గుర్తించని అమాయకున్ని చూశారా? బహుశా ఆ సినిమా చూస్తున్నప్పుడు, ‘వాళ్ల మాట వినకు! వాళ్లు నిన్ను మోసం చేస్తున్నారు!’ అని మీకు అరవాలనిపించి ఉంటుంది. అదేవిధంగా దూతలు మీతో “మోసపోకండి సాతాను మీకు అబద్ధాలు చెప్తున్నాడు” అని చెప్తున్నట్లు ఊహించుకోండి.

కాబట్టి సాతాను తప్పుడు ప్రచారాన్ని వినకండి. (సామె. 26:24, 25) యెహోవా మాట వింటూ ప్రతీ పనిలో ఆయన మీద నమ్మకాన్ని చూపించండి. (సామె. 3:5-7) ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము” అని చెప్తున్నాడు. (సామె. 27:11) మీరలా చేస్తే, మీ మనసు చేసే పోరాటంలో విజయం సాధిస్తారు.