పాఠకుల ప్రశ్న
క్రైస్తవులు సాటి మనుషుల నుండి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తుపాకీని లేదా గన్‌ను తమ దగ్గర ఉంచుకోవచ్చా?
తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తీసుకునే చర్యల విషయంలో క్రైస్తవులు బైబిలు సూత్రాల్ని పాటిస్తారు. అయితే ఆ సూత్రాల ప్రకారం, సాటి మనుషుల నుండి తమ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం క్రైస్తవులు తమ దగ్గర తుపాకీలను, పిస్తోలును లేదా ఇతర రకాల గన్‌లను ఉంచుకోవడం తప్పు. దీన్ని అర్థంచేసుకోవడానికి ఈ కింది విషయాలను పరిశీలించండి:
మనుషుల జీవాన్ని యెహోవా పవిత్రంగా ఎంచుతాడు. కీర్తనకర్త అయిన దావీదు యెహోవా గురించి ఇలా రాశాడు, “నీయొద్ద జీవపు ఊట కలదు.” (కీర్త. 36:9) కాబట్టి ఒక క్రైస్తవుడు తన ప్రాణాన్ని లేదా ఆస్తిని కాపాడుకునే క్రమంలో తన మీద రక్తాపరాధం లేకుండా చూసుకుంటాడు. అంటే ఇతరులకు ప్రాణహాని కలిగించకుండా అన్నివిధాలా జాగ్రత్తపడతాడు.—ద్వితీ. 22:8; కీర్త. 51:14.
ఒక వ్యక్తిపై దాడి జరిగినప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఉపయోగించే ఎలాంటి వస్తువైనా అవతలి వ్యక్తి ప్రాణాన్ని తీయగలదు. అయితే గన్‌తో ఇతరుల ప్రాణాలు తీయడం తేలిక, అది అనుకోకుండానైనా కావచ్చు లేదా ఉద్దేశపూర్వకంగానైనా కావచ్చు. a అంతేకాదు, అసలే దాడి చేస్తున్న వ్యక్తి ఉద్రేకంలో ఉంటాడు కాబట్టి ఆ పరిస్థితుల్లో అతను అవతలి వ్యక్తి చేతిలో గన్ చూస్తే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారవచ్చు, ఎవరోఒకరి ప్రాణం కూడా పోవచ్చు.
యేసు చనిపోవడానికి ముందురోజు రాత్రి, తమతోపాటు కత్తులను తెచ్చుకోమని శిష్యులకు చెప్పాడు. అయితే వాటిని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించాలన్నిది యేసు ఉద్దేశం కాదు. (లూకా 22:36, 38) ఆయన వాళ్లకు ఒక పాఠం నేర్పించాలని అనుకున్నాడు. అదేంటంటే, ఎవరైనా గుంపుగా వచ్చి ఆయుధాలతో దాడిచేసినా తిరిగి వాళ్లపై దౌర్జన్యానికి పాల్పడకూడదని ఆయన వాళ్లకు చెప్పాలనుకున్నాడు. (లూకా 22:52) పేతురు తన కత్తితో ప్రధాన యాజకుని దాసునిపై దాడి చేశాడు. అప్పుడు యేసు పేతురుతో, “నీ కత్తిని తిరిగి ఒరలో పెట్టు” అని అన్నాడు. ఆ తర్వాత, “కత్తి పట్టుకున్న వాళ్లందరూ కత్తితోనే నాశనమౌతారు” అని కూడా చెప్పాడు. ఈ సూత్రాన్ని క్రైస్తవులు ఇప్పటికీ పాటిస్తారు.—మత్త. 26:51, 52.
మీకా 4:3 వ వచనంలో ముందే చెప్పినట్లు, దేవుని ప్రజలు ‘తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడుతారు.’ నిజక్రైస్తవులకు, సమాధానంగా ఉంటారనే మంచి పేరు ఉంది. “ఎవరైనా మీకు చెడు చేస్తే, తిరిగి వాళ్లకు చెడు చేయకండి,” “మనుషులందరితో శాంతిగా మెలగండి” అని దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆజ్ఞను వాళ్లు పాటిస్తారు. (రోమా. 12:17, 18) ప్రమాదాలు ఎదురైనప్పటికీ పౌలు ఈ ఆజ్ఞను పాటించాడు, ఆఖరికి “దొంగల” బారిన పడినప్పుడు కూడా దాన్ని పాటించాడు. తనను తాను కాపాడుకోవడానికి పౌలు ఎన్నడూ బైబిలు సూత్రాల్ని మీరలేదు. (2 కొరిం. 11:26) బదులుగా అతను దేవునిపై నమ్మకముంచాడు. అంతేకాదు “యుద్ధాయుధములకంటె” బైబిలు ఇచ్చే జ్ఞానయుక్తమైన సలహా మేలని పౌలుకు తెలుసు.—ప్రసం. 9:18.
క్రైస్తవులు వస్తుసంపదల కన్నా జీవాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు. “ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు” అని మనకు తెలుసు. (లూకా 12:15) ఆయుధాలు ఉన్న దొంగ మనపై దాడి చేసినప్పుడు అతనితో సౌమ్యంగా మాట్లాడినా ఫలితం లేకపోతే, యేసు ఇచ్చిన ఈ సలహాను మనం పాటిస్తాం: “దుష్టుడైన వ్యక్తిని ఎదిరించకండి.” అంటే అతను ఏమి అడిగితే దాన్ని మనం ఇవ్వాల్సి రావచ్చు. (మత్త. 5:39, 40; లూకా 6:29) b అయితే నేరస్థుల చేతుల్లో పడకుండా జాగ్రత్తపడడం అన్నిటికన్నా మేలు. ఒకవేళ మనం బైబిలు సలహాను పాటిస్తూ ‘వస్తుసంపదల్ని గొప్పగా చూపించుకోవడానికి’ దూరంగా ఉంటే మనపై దాడి జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. (1 యోహా. 2:16) మనం శాంతిని ప్రేమించే యెహోవాసాక్షులమని మన ఇరుగు పొరుగువాళ్ల దగ్గర పేరు తెచ్చుకుంటే అది మనకు రక్షణగా కూడా ఉంటుంది.—సామె. 18:10.
క్రైస్తవులు ఇతరుల మనస్సాక్షిని గౌరవిస్తారు. (రోమా. 14:21) సాటి మనుషుల నుండి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తోటి విశ్వాసి తుపాకీ ఉంచుకున్నాడని తెలిస్తే కొంతమంది సహోదరసహోదరీలు అవాక్కవ్వవచ్చు లేదా అభ్యంతరపడవచ్చు. తుపాకీని కలిగివుండడానికి చట్టరీత్యా మనకు అనుమతి ఉన్నప్పటికీ, మనం మన తోటి సహోదరుల్ని ప్రేమిస్తాం కాబట్టి వాళ్లను అభ్యంతరపెట్టే పనిని ఎన్నడూ చేయం.—1 కొరిం. 10:32, 33; 13:4, 5.
క్రైస్తవులు ఇతరులకు మంచి ఆదర్శం ఉంచడానికి కృషిచేస్తారు. (2 కొరిం. 4:2; 1 పేతు. 5:2, 3) సాటి మనుషుల నుండి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా క్రైస్తవుడు తుపాకీని ఉంచుకుంటే, సంఘపెద్దలు లేఖనాల్ని ఉపయోగించి అతనికి సలహా ఇస్తారు. అయినాసరే అతను తుపాకీని తన దగ్గరే ఉంచుకుంటే ఆ వ్యక్తి ఇతరులకు మంచి ఆదర్శంగా ఉన్నట్లు కాదు. అలాంటి వ్యక్తికి సంఘంలో బాధ్యతలు గానీ, ప్రత్యేక సేవావకాశాలు గానీ ఇవ్వరు. ఉద్యోగంలో భాగంగా తమ దగ్గర తుపాకీని ఉంచుకునేవాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. అలాంటివాళ్లు మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించడం చాలా మంచిది. c
తమను తాము ఎలా కాపాడుకోవాలి, కుటుంబాన్ని-ఆస్తిని ఎలా రక్షించుకోవాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి వంటి వాటిని క్రైస్తవులు ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవాలి. కానీ ఆ నిర్ణయాల్ని తీసుకునేటప్పుడు బైబిలు సూత్రాల్ని మనసులో ఉంచుకోవాలి. జ్ఞానవంతుడైన మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ సూత్రాల్ని మనకిచ్చాడు. అందుకే యెహోవాతో బలమైన స్నేహం ఉన్న క్రైస్తవులు సాటి మనుషుల నుండి ప్రాణాల్ని కాపాడుకోవడానికి తమ దగ్గర తుపాకీని ఉంచుకోకూడదని నిర్ణయించుకుంటారు. దేవునిపై నమ్మకం ఉంచి, బైబిలు సూత్రాల్ని పాటిస్తే నిజమైన భద్రత శాశ్వతంగా పొందుతారని వాళ్లకు తెలుసు.—కీర్త. 97:10; సామె. 1:33; 2:6, 7.
a ఆహారం కోసం జంతువుల్ని వేటాడడానికి లేదా క్రూరమృగాల బారి నుండి తప్పించుకోవడానికి తన దగ్గర గన్‌ను (తుపాకీ, పిస్తోలు వంటివి) ఉంచుకోవడం మేలని క్రైస్తవుడైన ఒక వ్యక్తి అనుకోవచ్చు. అయితే ఆ గన్‌ను ఉపయోగించని సమయంలో అందులోని బుల్లెట్లను బయటకు తీసేయాలి. వీలైతే ఆ గన్‌కి సంబంధించిన భాగాల్ని వేరుచేసి వాటిని ఒకచోట భద్రంగా తాళం వేసి ఉంచాలి. కొన్ని ప్రాంతాల్లో గన్‌ను ఉంచుకోవడం చట్టరీత్యా నేరం కావచ్చు. లేదా గన్‌ను కలిగివుండే విషయంలో ప్రభుత్వాలు కొన్ని షరతుల్ని, నియమాల్ని పెట్టవచ్చు. అలాంటి ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు ఆ చట్టాలకు లోబడాలి.—రోమా. 13:1.
b అత్యాచారం జరగకుండా ఎలా జాగ్రత్తపడవచ్చో తెలుసుకోవడానికి 1993, జూన్ 8 తేజరిల్లు! సంచికలో “అత్యాచారాన్ని ఏవిధంగా నిరోధించవచ్చును” అనే ఆర్టికల్ చూడండి.
c పనిలో భాగంగా తుపాకీని కలిగివుండాల్సిన ఉద్యోగాల గురించిన మరింత సమాచారం కోసం 2005, నవంబరు 1 కావలికోట సంచికలోని 31వ పేజీ; అలాగే 1983, జూలై 15 కావలికోట (ఇంగ్లీషు) సంచికలోని 25-26 పేజీలు చూడండి.