దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు
బైబిల్లో ఉన్నలాంటి సలహాలు ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. ఎందుకంటే వాటిని దేవుడు రాయించాడు. బైబిలు ఆరోగ్య సలహాలు ఉన్న పుస్తకం కాదు, కాకపోతే అందులో ఉన్న విషయాలు కృంగుదలను, కలవరపెట్టే ఆలోచనల్ని, చేదు జ్ఞాపకాల్ని, ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి.
అన్నిటికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనల్ని తయారు చేసింది యెహోవా దేవుడని; a మన ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని ఆయనకన్నా బాగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరని బైబిలు చెప్తుంది. మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన గురించి బైబిలు ఏం చెప్తుందో ఒకసారి చూడండి:
“విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు.”—కీర్తన 34:18.
“నీ దేవుడైన యెహోవా అనే నేను నీ కుడిచేతిని పట్టుకుంటున్నాను, ‘భయపడకు. నేను నీకు సహాయం చేస్తాను’ అని నేనే నీతో చెప్తున్నాను.”—యెషయా 41:13.
ఇంతకీ మానసిక సమస్యల్ని తట్టుకోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు? ఆయన మనల్ని పట్టించుకుని, ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడో మీరు తర్వాత పేజీల్లో చూస్తారు.
a దేవుని పేరు యెహోవా.—కీర్తన 83:18.