కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక పడవ సరైన దారిలో వెళ్లడానికి చుక్కాని సహాయం చేస్తుంది. అలానే పిల్లలు సరైన మార్గంలో వెళ్లడానికి క్రమశిక్షణ సహాయం చేస్తుంది

తల్లిదండ్రులకు

6: క్రమశిక్షణ

6: క్రమశిక్షణ

అంటే ఏంటి?

క్రమశిక్షణ అంటే సరైన దారిలో నడిపించడం లేదా నేర్పించడం అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు అది పిల్లల అమర్యాద ప్రవర్తనని సరిచేయడం కూడా అవుతుంది. కానీ ముఖ్యంగా క్రమశిక్షణ అంటే మంచి, చెడు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణ పిల్లలు తప్పు చేయకముందే మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు సహాయం చేస్తుంది.

ఎందుకు ముఖ్యం?

ఇటీవల దశాబ్దాల్లో చాలా ఇళ్లలో క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే పిల్లల్ని సరిదిద్దితే వాళ్ల ఆత్మ గౌరవం తగ్గిపోతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ తెలివైన తల్లిదండ్రులు పిల్లలు పాటించగలిగిన రూల్స్‌ పెట్టి పిల్లలు వాటికి లోబడేలా శిక్షణ ఇస్తారు.

“పిల్లలకు హద్దులు అవసరం. అది బాధ్యతగల పెద్దలుగా ఎదగడానికి వాళ్లకు సహాయం చేస్తుంది. క్రమశిక్షణ లేకపోతే పిల్లలు చుక్కాని లేదా స్టీరింగ్‌ లేని షిప్‌లా అయిపోతారు. అలాంటి షిప్‌ చివరికి కొట్టుకుపోతుంది లేదా బోల్తాపడుతుంది.”—పమేలా.

మీరు ఏమి చేయవచ్చు

అనుకున్నదానికి కట్టుబడి ఉండండి. మీ పిల్లలు మీరు పెట్టిన రూల్స్‌కి కట్టుబడి లేకపోతే వాళ్లను పర్యవసానాలు ఎదుర్కోనివ్వండి. అలానే మీ బాబు లేదా పాప మీరు చెప్పినట్లు వింటే వాళ్లను వెంటనే మెచ్చుకోండి.

“లోబడి ఉండడం కష్టం అయిపోయిన ఈ రోజుల్లో నా పిల్లలు లోబడి ఉంటున్నందుకు నేను వాళ్లను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటాను. అలా మెచ్చుకోవడం ద్వారా సరిదిద్దాల్సిన అవసరం వచ్చినా వాళ్లు త్వరగా వింటారు.”—క్రిస్టీన్‌.

మంచి సూత్రాలు: “మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడు.”—గలతీయులు 6:7.

సమంజసంగా ఉండండి. క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల వయసు ఎంత, వాళ్ల సామర్థ్యం ఎంత, వాళ్లు చేసిన తప్పు ఎంత పెద్దది అనే విషయాలను చూసుకోవాలి. ఫలానా తప్పు చేసినందుకే ఈ శిక్ష వేయబడింది అనే విషయం పిల్లలకు అర్థం కావాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ విషయంలో పెట్టిన రూల్స్‌ని పాటించలేదు కాబట్టే కొన్ని రోజుల వరకు వాళ్లకు సెల్‌ఫోన్‌ ఇవ్వడం లేదని లేదా తక్కువ వాడుకోనిస్తున్నామని వాళ్లకు తెలియాలి. అదే సమయంలో కేవలం మీకు విసుగు తెప్పించారనే కారణంతో చిన్న విషయాల్లో కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి.

“నా పిల్లలు కావాలనే మాట వినకుండా ఉన్నారా లేదా అనుకోకుండా ఆ తప్పు చేశారా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా తీసివేయాల్సిన చెడు లక్షణాలు ఉంటాయి, సరిదిద్దితే పోయే చిన్న తప్పులు కూడా ఉంటాయి. ఈ రెండిటికీ తేడా ఉంది.”—వెండల్‌.

మంచి సూత్రాలు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి. అలా చేస్తే వాళ్లు కృంగిపోతారు.”—కొలొస్సయులు 3:21; ఫుట్‌నోట్‌.

ప్రేమతో ఉండండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా ప్రేమతోనే చెప్తారు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే వాళ్లకు క్రమశిక్షణను అంగీకరించడం సులువు అవుతుంది.

“మా బాబు తప్పులు చేసినప్పుడు, వాడు ఇదివరకు చేసిన మంచి నిర్ణయాలన్నిటి విషయంలో మేము గర్విస్తున్నామనే భరోసాను వాడికి ఇచ్చాము. తప్పు చేసినంత మాత్రాన చెడ్డవాడు అయిపోడు అనే విషయాన్ని మేము వాడికి వివరించాము. తప్పులు సరిచేసుకున్నంత కాలం వాడు చెడ్డవాడు అవ్వడని, అంతేకాదు సరిచేసుకోవడానికి మేము ఎప్పుడూ సహాయం చేస్తామనే విషయాన్ని వాడికి చెప్పాం.”—డాన్యల్‌.

మంచి సూత్రాలు: “ప్రేమ ఓర్పు కనబరుస్తుంది, దయ చూపిస్తుంది.”—1 కొరింథీయులు 13:4.