ఎదుగుతున్న పిల్లలకు
10: నమ్మకత్వం
అంటే ఏంటి?
నమ్మకస్థులుగా ఉండేవాళ్లు వాళ్ల అమ్మానాన్నల, స్నేహితుల, ఉద్యోగ యజమానుల విశ్వాసాన్ని పొందుతారు. వాళ్లు రూల్స్ పాటిస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, ఎప్పుడూ నిజమే మాట్లాడతారు.
ఎందుకు ముఖ్యం?
రోజురోజుకూ మీరు ఎంత నమ్మకాన్ని సంపాదించుకుంటే అంత స్వేచ్ఛను పొందుతారు. దాదాపు ప్రతి సందర్భంలో ఇది నిజం.
“మీ తల్లిదండ్రులు మీతో ఉన్నప్పుడే కాదు, వాళ్లు పక్కన లేనప్పుడు కూడా మీరు తెలివిగా, బాధ్యతగా ప్రవర్తిస్తున్నారని చూపించాలి. అది మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం.”—శారాయి.
మంచి సూత్రాలు: “మీరేమిటో రుజువు చేసుకోవడానికి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండండి.”—2 కొరింథీయులు 13:5.
మీరు ఏమి చేయవచ్చు
మీరు ఎక్కువ నమ్మకాన్ని పొందాలన్నా, లేదా పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలన్నా ఈ సలహాలు మీకు సహాయం చేస్తాయి.
నిజాయితీగా ఉండండి. మీరు అబద్ధాలు చెప్తూ ఉంటే, ఇతరులు త్వరగా మిమ్మల్ని నమ్మడం మానేస్తారు. అలా కాకుండా మీరు తప్పులు చేసినప్పుడు కూడా దాపరికం లేకుండా నిజాయితీగా ఉంటే ఇతరుల నమ్మకాన్ని పొందుతారు.
“అన్నీ బాగున్నప్పుడు నిజాయితీగా ఉండడం సులువే. కానీ మిమ్మల్ని చెడ్డవాళ్లుగా చూస్తారని అనిపించే విషయాల్లో కూడా మీరు నిజాయితీగా ఉంటే అందరికీ మీ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది.”—కెమన్.
మంచి సూత్రాలు: “మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం.”—హెబ్రీయులు 13:18.
నమ్మకస్థులుగా ఉండండి. అమెరికాలో చేసిన ఒక సర్వే ప్రకారం, 78 శాతం మంది మానవ వనరుల నిపుణులు ఇలా చెప్పారు: “ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమైన మూడు ముఖ్యమైన లక్షణాల్లో నమ్మకత్వం ఒకటి.” నమ్మకంగా ఉండడం ఇప్పుడే నేర్చుకుంటే పెద్దవాళ్లు అయ్యాక అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
“మా తల్లిదండ్రులు మళ్లీమళ్లీ గుర్తుచేయకుండానే నేను బాధ్యతగా ఉండి నా పనులు నేనే చేసుకున్నప్పుడు వాళ్లు దాన్ని గమనిస్తారు. నేను అలా ఎన్నిసార్లు చేస్తే అంత ఎక్కువగా వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకుంటాను.”—శారా.
మంచి సూత్రాలు: “నువ్వు నా మాట వింటావనే నమ్మకంతో . . . నేను అడిగిన దానికన్నా నువ్వు ఇంకా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు.”—ఫిలేమోను 21.
ఓర్పు చూపించండి. శారీరక ఎదుగుదల వెంటనే కనిపిస్తుంది. కానీ మానసిక, భావోద్వేగ ఎదుగుదలను ఇతరులు గుర్తించడానికి సమయం పడుతుంది.
“ఏదో ఒక్క పని చేసి తల్లిదండ్రుల, ఇతరుల నమ్మకాన్ని సంపాదించుకోలేము. అయితే మీరు ఎప్పుడూ బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ నమ్మకాన్ని పెంచుకోవచ్చు.”—బ్రెన్డన్.
మంచి సూత్రాలు: “ఓర్పును అలవర్చుకోండి.”—కొలొస్సయులు 3:12.