మనవాళ్లు చనిపోతే కలిగే బాధ ఎలా ఉంటుంది?
బాధని తట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు?
బాధను తట్టుకోవడానికి కావాల్సిన సలహాలను తెలుసుకోవాలనుకుంటే, మీకు కొన్ని వేల సలహాలు దొరుకుతాయి. వాటిలో కొన్ని మిగతా వాటికన్నా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే, మనం ముందే చూసినట్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా బాధపడతారు. ఒకరికి ఉపయోగపడిన విషయాలు మరొకరికి ఉపయోగపడకపోవచ్చు.
అయినప్పటికీ, కొన్ని ప్రాథమిక విషయాలు మాత్రం చాలామందికి ఉపయోగపడ్డాయి. బాధను తట్టుకోవడానికి సహాయం చేసే నిపుణులు వాటిని తరచుగా చెప్తుంటారు. అవి ఒక ప్రాచీన పుస్తకమైన బైబిల్లో ఉన్న సలహాలను గుర్తు చేస్తాయి. ఆ సలహాలకు కాల పరిమితి లేదు.
1 కుటుంబం నుండి స్నేహితుల నుండి సహాయం తీసుకోండి
-
బాధ తట్టుకోవడానికి ఇది చాలా ముఖ్యం అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అయినా కొన్నిసార్లు, మీకు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్లను చూస్తే మీకు చిరాకుగా ఉండవచ్చు. ఇది సహజమే.
-
మీరు ఎప్పుడూ అందరితో కలిసి ఉండాలి అని అనుకోకండి, అలాగని పూర్తిగా అందరికీ దూరంగా ఉండకండి. ఎందుకంటే, మీకు భవిష్యత్తులో వాళ్ల సహాయం అవసరం కావచ్చు. మీకు ఆ క్షణంలో ఏమి అవసరం ఏమి అవసరం లేదు అనే విషయాలను ఇతరులకు దయగా తెలియచేయండి.
-
మీ అవసరాలకు తగ్గట్లుగా మీరు ఇతరులతో గడిపే సమయానికి ఒంటరిగా గడిపే సమయానికి సమతుల్యం చూపించండి.
సలహా: “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును.”— ప్రసంగి 4:9, 10.
2 తినే ఆహారం, ఎక్సర్‌సైజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి
-
మంచి ఆహారం బాధలో ఉన్నప్పుడు కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. రకరకాల పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉన్న మాంసకృత్తులు (lean proteins) తీసుకోవడం మంచిది.
-
మంచినీళ్లను, ఇతర ఆరోగ్యకరమైన పానీయాలను ఎక్కువగా తీసుకోండి.
-
మీకు ఆకలి తక్కువగా ఉంటే, తక్కువతక్కువ తినండి, ఎక్కువసార్లు తినండి. మీరు అదనంగా తీసుకోవాల్సిన పోషకాల గురించి మీ డాక్టర్‌ని అడగండి. a
-
వేగంగా నడవడం లేదా వేరే రకాల ఎక్సర్‌సైజులు చేయడం వల్ల నష్టాన్ని కలిగించే భావాలు తగ్గుతాయి. ఎక్సర్‌సైజ్ వల్ల మీకు జరిగిన నష్టం గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది, లేదా దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి సహాయం చేస్తుంది.
సలహా: “ఏ మనిషీ తన శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి, సంరక్షించుకుంటాడు.”—ఎఫెసీయులు 5:29.
3 సరిపడా నిద్రపోండి
-
నిద్ర ఎప్పుడూ చాలా ముఖ్యం, కానీ ప్రత్యేకంగా బాధలో ఉన్న వాళ్లకు చాలా అవసరం, ఎందుకంటే బాధపడడం వల్ల బాగా అలసటగా ఉంటుంది.
-
మీరు కెఫీన్, మద్యం ఎంత తాగుతున్నారనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే, ఈ రెండిటి వల్ల మీ నిద్రకు ఇబ్బంది కలగవచ్చు.
సలహా: రెండు చేతుల నిండా శ్రమ, గాలికోసం చేసే ప్రయత్నాలకన్నా ఒక చేతినిండా విశ్రాంతి ఉండడం మేలు.—ప్రసంగి 4:6.
4 అవసరాలకు అనుగుణంగా మారండి
-
ప్రతి ఒక్కరు వేర్వేరుగా బాధపడతారు అనే విషయాన్ని గుర్తించండి. చివరికి మీకు ఉపయోగపడే విషయాలు ఏంటో మీరే తెలుసుకోవాలి.
-
మన బాధ గురించి వేరేవాళ్లకు చెప్పడం ద్వారా దాన్ని తట్టుకోవచ్చని చాలామంది తెలుసుకున్నారు, కానీ కొంతమంది వాళ్ల బాధను వేరేవాళ్లకు చెప్పడానికి ఇష్టపడరు. బాధను తట్టుకోవడానికి వేరేవాళ్లకు చెప్పడం ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయంలో నిపుణులు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నారు. మీరు మీ బాధ గురించి ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు కానీ వెనకాడుతూ ఉంటే, మీరు మీకున్న భావాలను కొద్దికొద్దిగా ఒక దగ్గరి స్నేహితునికి చెప్పడం ద్వారా మొదలుపెట్టవచ్చు.
-
ఏడ్వడం ద్వారా తమ బాధను తట్టుకోగలిగామని కొంతమంది తెలుసుకున్నారు, కానీ ఇంకొంతమంది తక్కువగా ఏడ్చినా కూడా బాధను తట్టుకోగలిగారు.
సలహా: “ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును.”—సామెతలు 14:10.
5 మీకు మీరు హాని చేసుకునే అలవాట్లు మానుకోండి
-
బాధలో ఉన్న కొంతమంది వాళ్ల బాధను తగ్గించుకోవడానికి మద్యాన్ని లేదా డ్రగ్స్‌ను దుర్వినియోగం చేస్తుంటారు. ఆ విధంగా బాధను తప్పించుకోవాలని చూడడం చాలా నష్టాన్ని తెస్తుంది. అలా వచ్చే ఉపశమనం చాలా తక్కువ కాలం ఉంటుంది, పైగా తర్వాత్తర్వాత చాలా చెడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆందోళనను తగ్గించుకోవడానికి హానిలేని మార్గాలను ప్రయత్నించండి.
సలహా: “మన శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.”—2 కొరింథీయులు 7:1.
6 మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించండి
-
చాలామంది బాధ నుండి (బాధపడుతున్నప్పుడు, బాధను తట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు) కొంతసేపైనా బయటపడడానికి (బాధను కొంతసేపైనా మర్చిపోయేలా చేసే కొన్ని పనులు) ప్రయత్నిస్తే మంచిదని తెలుసుకున్నారు.
-
కొత్త స్నేహాలను ఏర్పర్చుకోవడం లేదా పాత స్నేహాలను బలపర్చుకోవడం ద్వారా, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం లేదా చేయడం ద్వారా, వినోదానికి సమయం ఇవ్వడం ద్వారా మీరు బాధ నుండి తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందవచ్చు.
-
సమయం గడుస్తుండగా కొంత మార్పు రావచ్చు. మీరు మీ బాధ నుండి ఎక్కువసేపు, ఎక్కువసార్లు బయటపడుతున్నారని మీరు గమనించవచ్చు మీరు మీ బాధనుండి బయటపడే ప్రక్రియలో ఇది ఒక సహజమైన మార్పు.
సలహా: “ప్రతిదానికి సమయము కలదు. . . ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు”—ప్రసంగి 3:1, 4.
7 ఒక పట్టిక పాటించండి
-
సాధ్యమైనంత త్వరగా మీ మామూలు జీవితంలోకి వచ్చేయండి.
-
నిద్ర పోవడానికి, ఉద్యోగానికి, మిగతా పనులకు మీరు ఒక సమయాన్ని పాటిస్తే, మీరు మళ్లీ మామూలుగా అయ్యే అవకాశం ఉంటుంది.
-
కొన్ని మంచి పనులు చేస్తూ మీ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మీలో ఉన్న నొప్పిని తట్టుకోవచ్చు.
సలహా: “అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు.”—ప్రసంగి 5:20.
8 కొంతకాలం వరకు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోకండి
-
ప్రేమించేవాళ్లను పోగొట్టుకున్న వెంటనే పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకున్న చాలామంది తర్వాత ఆ నిర్ణయాలను బట్టి బాధపడతారు.
-
వేరే చోటుకి వెళ్లిపోవడం, ఉద్యోగం మారడం, లేదా చనిపోయినవాళ్ల వస్తువుల్ని తీసేయడం వంటివి చేసేముందు వీలైతే కొంతకాలం ఆగడం మంచిది.
సలహా: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.”—సామెతలు 21:5.
9 మీ ప్రియమైన వాళ్లను గుర్తుపెట్టుకోండి
-
చనిపోయినవాళ్ల జ్ఞాపకాలను మనసులో భద్రంగా ఉంచుకోవడానికి సహాయపడే పనులు చేయడం మంచిదని చాలామంది భావిస్తారు.
-
ఫోటోలను, కొన్ని గుర్తులను దాచిపెట్టుకోవడం, లేదా మీరు గుర్తు చేసుకోవాలనుకుంటున్న సంఘటనలు, సందర్భాల గురించి ఒక డైరీ పెట్టుకోవడం మీకు ఉపశమనంగా ఉండవచ్చు.
-
మంచి జ్ఞాపకాలను మనసుకు తెచ్చే వస్తువులను దాచిపెట్టుకోండి, తర్వాత వాటిని చూడగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు.
సలహా: “పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము.”—ద్వితీయోపదేశకాండము 32:7.
10 బాధ నుండి బయటపడడానికి ప్రయత్నించండి
-
మీరు టూర్‌కు వెళ్లగలరేమో చూడండి.
-
ఎక్కువ రోజులు వీలుకాకపోయినా, బహుశా మీరు ఒకటి రెండు రోజులు మీ స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లిరావడం, మ్యూజియంకి, బీచ్‌కి లేదా పార్కుకి వెళ్లడం లాంటివి చేయవచ్చు.
-
మీరు రోజూ చేసే పనులకన్నా కొంచెం వేరుగా ఉండేది ఏదైనా చేయడం వల్ల కూడా మీ బాధను తట్టుకోవచ్చు.
సలహా: “మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం పదండి, కాస్త విశ్రాంతి తీసుకుందాం.”—మార్కు 6:31.
11 ఇతరులకు సహాయం చేయండి
-
మీరు వేరేవాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగించే ఏ సమయమైనా మీకు మంచినే చేస్తుంది.
-
చనిపోయిన మీవాళ్ల గురించి బాధ పడుతున్న మిగతావాళ్లు తమ బాధను పంచుకునేవాళ్ల కోసం చూస్తుండవచ్చు. అలాంటి స్నేహితులకు, బంధువులకు సహాయం చేయడంతో మీరు మొదలుపెట్టవచ్చు.
-
ఇతరులకు తోడుగా, ఓదార్పుగా ఉండడం మీకున్న ఆనందాన్ని పెంచుతుంది, ఇంకా మీలో ఉన్న నిరాశను, నిరుత్సాహాన్ని పోగొడుతుంది.
సలహా: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.
12 ముఖ్యమైన విషయాలు ఏంటో మరొకసారి ఆలోచించుకోండి
-
చనిపోయినవాళ్ల గురించి బాధ పడుతున్న సమయంలో ఒక్కోసారి నిజంగా ముఖ్యమైన విషయాల గురించి కొత్తగా ఆలోచించే అవకాశం వస్తుంది.
-
మీరు మీ జీవితంలో ఏమి చేస్తున్నారని ఆలోచించుకోవడానికి ఈ పరిస్థితిని ఉపయోగించుకోండి.
-
అవసరాన్నిబట్టి, మీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చే విషయాల్లో మార్పులు చేసుకోండి.
సలహా: “విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు, ఏలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.”—ప్రసంగి 7:2.
నిజానికి ఏదీ కూడా మీరు అనుభవించే బాధను పూర్తిగా తీసివేయలేదు. కానీ తాము ప్రేమించేవాళ్లను పోగొట్టుకున్న చాలామంది ఒప్పుకునేదేంటంటే కొన్ని ఉపయోగకరమైన చర్యలు తీసుకోవడం వల్ల, అంటే ఈ ఆర్టికల్‌లో ఉన్నలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్లు ఓదార్పును పొందగలిగారు. అయితే బాధను తగ్గించుకోవడానికి చేయగలిగినవన్నీ ఇక్కడ లేవు. కానీ వీటిలో ఉన్న కొన్ని సలహాలను పాటించినా, మీరు కొంతవరకైనా ఉపశమనాన్ని పొందుతారని మీకు తెలుస్తుంది.
a తేజరిల్లు! ఏ ప్రత్యేకమైన చికిత్సను ప్రతిపాదించదు.