మియన్మార్ “బంగారు దేశం”
మియన్మార్ “బంగారు దేశం”
మియన్మార్‌లోని తేజరిల్లు! రచయిత
ఆసియాలోని పొరుగు దేశాలనుండి వేరు చేస్తూ సహజ సరిహద్దులా ఉన్న పర్వతాల మధ్య “బంగారు దేశం” ఒదిగి ఉంది. నైరృతీ దిశలో 2,000 కిలోమీటర్లకంటే పొడవుగావున్న తీరాన్ని తాకుతూ బంగాళా ఖాతము, అండమాను సముద్రాలు ఉన్నాయి. దాని పడమటివైపు బంగ్లాదేశ్ ఇండియాలు, ఉత్తరంవైపు చైనా, తూర్పువైపు లావోస్, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. ఈ దేశం మడగాస్కర్ కంటె కొంచెం పెద్దగా, ఉత్తర అమెరికా రాష్ట్రం టెక్సాస్ కంటె చిన్నగా ఉంటుంది. ఇంతకీ ఈ దేశం పేరేమిటి? మియన్మార్, అది పూర్వం బర్మా అని పిలువబడింది.
తొలి వలసదారులచే బంగారు దేశం అని పిలువబడ్డ మియన్మార్, పెట్రోలు, సహజ వాయువు, రాగి, తగరం, వెండి, టంగ్‌స్టన్ మరితర ఖనిజాలతో పాటు నీలమణులు, పచ్చలు, కెంపులు, మరకతములు వంటి ఎన్నో విలువైన వనరులకు పెన్నిధి లాంటిది. అంతేకాకుండా అక్కడి వర్షపాత అడవుల్లో టేకు, రోజ్‌వుడ్, పడావు వంటి కలప లభిస్తుంది. ఈ అడవుల్లో కోతులు, పులులు, ఎలుగు బంట్లు, అడవి దున్నలు, ఏనుగులు వంటి అనేక జంతువులు నివాసముంటాయి. కాని ఈ బంగారు దేశపు నిజమైన నిధి దాని ప్రజలే.
మియన్మార్ ప్రజలు
సహజంగా మృదువైన స్వభావం కలిగి ప్రశాంతంగా ఉండే మియన్మార్ ప్రజలు మర్యాదస్థులు, అతిథి ప్రియులు. వారు అతిథులను గౌరవమర్యాదలతో చూసుకుంటారు. పిల్లలు సాధారణంగా వయస్సులో పెద్దవారిని అంకుల్ అనీ ఆంటీ అనీ సంబోధిస్తారు.
మియన్మార్‌ను సందర్శించే వారు తరచూ అక్కడి వృద్ధ మహిళల మృదువైన చర్మాన్ని ప్రశంసిస్తారు. తమ చర్మ సౌందర్యానికి కారణం ప్రసిద్ధిగాంచిన బంగారువన్నెగల తనాఖా అనబడే లేపనం అని స్త్రీలు చెప్తారు. దాన్ని తనాఖా అనే చెట్టునుంచి సేకరిస్తారు. స్త్రీలు, తనాఖా చెక్క ముక్కను గరుకు రాయి మీద అరగదీసి, దానికి కొన్ని నీళ్ళు కలపడం ద్వారా మెత్తని లేపనాన్ని తయారుచేసి, దాన్ని వివిధ డిజైన్లలో మొహానికి పూసుకుంటారు. తనాఖా జిడ్డుని తీసివేసి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఆ దేశంలోని ఎండ తీవ్రత నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
మియన్మార్‌లోని స్త్రీలకు పురుషులకు సామాన్య వస్త్రధారణ లుంగీ. రెండు మీటర్ల పొడవున్న బట్టను తీసుకుని రెండు అంచులను కలిపి కుడితే చాలు అది సిద్ధం. దానిలో కాళ్ళు పెట్టాక స్త్రీ దాన్ని పైకి లాక్కుని తన నడుముకి చుట్టుకుని మిగిలిన చెంగుని లోపలికి దోపుకుంటుంది. అదే పురుషుడైతే రెండు చెంగులని కలిపి నడుము ముందుభాగంలో వదులుగా ముడి వేస్తాడు. లుంగీ చూడడానికి మర్యాదకరంగానూ సౌకర్యంగానూ ఉండడంవల్ల ఉష్ణమండల దేశాలకి అది అనువైనది.
మియన్మార్ ప్రజలు చాలా ప్రతిభ కలవారనీ, వారు పట్టు వస్త్రాలు నేయడంలో, నగలు తయారు చేయడంలో, కలపను చెక్కడంలో సిద్ధాహస్థులనీ అక్కడి మార్కెట్‌ని సందర్శిస్తే తెలుస్తుంది. టేకు, పడావు మరితర కలపతో మనుషులు, పులులు, గుర్రాలు, అడవి దున్నలు, ఏనుగులు వంటి ఆకర్షణీయమైన ప్రతిమలను చెక్కుతారు. రోజూ ఇంట్లో వాడే వస్తువులైన బల్ల పైభాగాలు, గదిని రెండు భాగాలుగా చేయడానికి ఉపయోగించే డివైడర్లు, కుర్చీలు వంటివాటిని కూడా అద్భుతంగా చెక్కి అందంగా అలంకరిస్తారు. కానీ, మీరేమైనా కొనదల్చుకుంటే బేరమాడాల్సిందే!
అందంగా అలంకరించబడ్డ వార్నిషు వస్తువులు—చెక్క గిన్నెలు, ప్లేట్లు, మూతలున్న పెట్టెలు వంటివి తయారుచేయడంలో కూడా మియన్మార్ ప్రజలు ప్రావీణ్యులు. కాని వారి పనితనాన్ని ప్రత్యేకపరిచేది ఏమిటంటే వారు ఫలాని రూపమని కాకుండా అన్ని ఆకృతుల్లో వస్తువులను చెక్కి అలంకరిస్తారు. వెదురు పుల్లలను దగ్గరగా అల్లడం ద్వారా ప్రాథమిక రూపం తయారవుతుంది. (ఎక్కువ నాణ్యతగల వస్తువుల కొరకు వెదురు పుల్లలను గుర్రం వెంట్రుకలతో కలిపి అల్లడం ద్వారా మొదలుపెడతారు.) అలా తయారుచేసిన దాని మీద కళాకారుడు దాదాపు ఏడు మార్లు వార్నిషు పూస్తాడు. కాల్చి పొడిచేసిన జంతువుల ఎముకలను, తిట్సే అనే వార్నిషు చెట్టు నూనెతో కలిపి ఈ వార్నిషును తయారుచేస్తారు.
వార్నిషు ఎండిన తర్వాత, కళాకారుడు స్టీలు చువ్వతో దాని మీద బొమ్మను చెక్కుతాడు. తర్వాత, కొద్దిగా రంగువేసి పాలిష్ చేస్తే తయారైన వస్తువు కళాత్మకంగా ఉండటమే కాకుండా ఇంట్లో వాడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మత ప్రభావం విస్తృతంగా ఉంది
మియన్మార్ ప్రజలలో దాదాపు 85 శాతం మంది బౌద్ధమతస్థులు; మిగిలినవారు మహమ్మదీయులమని, క్రైస్తవులమని చెప్పుకుంటారు. ఆగ్నేయ ఆసియాలోని చాలా దేశాల ప్రజల్లోలానే మియన్మార్ ప్రజల్లోని చాలామంది జీవితాల్లో మతం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అయినప్పటికీ, కొన్ని మత సంబంధ ఆచారాలు సందర్శకులకు క్రొత్తగా అనిపించవచ్చు.
ఉదాహరణకు, బౌద్ధ సన్యాసులు స్త్రీని తాకకూడదని ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి, సన్యాసుల మీది గౌరవంతో స్త్రీలు వారికి మరీ దగ్గరగా వెళ్ళకుండా జాగ్రత్త పడతారు. మతాచారాలు బస్సు ప్రయాణం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. “దయచేసి మనము ఏ సమయానికి చేరుకుంటామని డ్రైవరును అడగవద్దు.” అని బస్సులో వ్రాసివుండడం చూసి పాశ్చాత్య దేశపు వ్యక్తి ఆశ్చర్యపోతుండవచ్చు. సహనంలేని ప్రయాణికులతో డ్రైవర్లు విసిగి పోయారా? కాదు. అలాంటి ప్రశ్న అడగడం ద్వారా నాట్‌లు (ఆత్మలు) కోపం తెచ్చుకుని బస్సును ఆలస్యం చేయగలవు అని అక్కడి బౌద్ధమతస్థుల నమ్మకం!
మియన్మార్ చరిత్ర
మియన్మార్ ప్రారంభ చరిత్ర అస్పష్టంగా ఉంది, కాని పొరుగు దేశాలనుంచి అనేక జాతుల గుంపులు అక్కడికి వలసవచ్చాయనిపిస్తుంది. మోన్ జాతివారు ఈ దేశానికి “బంగారు దేశం” అని అర్థాన్నిచ్చే సువర్ణభూమి అనే పేరు పెట్టారని తెలుస్తోంది. టిబెటో-బర్మన్‌లు తూర్పు హిమాలయాలనుంచి, తాయి ప్రజలు ప్రస్తుతం నైరృతీ చైనాగా ఉన్న ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. మియన్మార్ ఎత్తుపల్లాలుగా ఉండడంవల్ల జాతులు వేరుగా ఉంచబడ్డాయి కాబట్టి అనేక జాతి, భాషా గుంపులు తయారయ్యాయి.
ఇండియాలో క్రొత్తగా వలస స్థాపించిన బ్రిటీషువారు 19వ శతాబ్దం తొలి భాగంలో అక్కడ నుండి రావడం మొదలుపెట్టారు. వారు మొదట దక్షిణ ప్రాంతంలో స్థిరపడి క్రమంగా మొత్తం దేశాన్ని ఆక్రమించుకున్నారు. 1886వ సంవత్సరంకల్లా, అప్పట్లో బర్మా అని పిలువబడే మియన్మార్‌ని బ్రిటీష్ వారు ఇండియాలో కలిపేసుకున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, ఈ దేశం ఘోరమైన యుద్ధానికి కేంద్రబిందువైంది. 1942వ సంవత్సరంలో కొద్ది నెలల్లోనే జపాను సైన్యాలు బ్రిటీషువారిని బైటికి తరిమేశారు. ఆ తర్వాత ఎన్నో దురాగతాలకు పేరుగాంచిన “మృత్యు రైలుమార్గం” నిర్మించబడింది. 400 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలుమార్గం వాసయోగ్యం కాని అడవులు కొండల మధ్యనుంచి బర్మాలోని తాన్‌ఫ్యూజెయను థాయ్‌లాండ్‌లోని నాంగ్ ప్లాడుక్‌ను కలపడానికి నిర్మించబడింది. లోహకొరత వలన రైలుమార్గంలోని చాలా భాగాన్ని కేంద్ర మలయాలోని (ఇప్పుడు మలేసియా) రైలుపట్టాలను తీసుకువచ్చి ఇక్కడ పెట్టి నిర్మించారు. ఈ ప్రాజెక్టులోని చిన్న భాగం—క్వాయ్ నది మీద వంతెన కట్టడం—తర్వాత ప్రఖ్యాతి గాంచిన చలనచిత్రానికి కథావస్తువయ్యింది.
400 ఏనుగుల సహాయంతో 3,00,000 కంటే ఎక్కువ మంది—యుద్ధ ఖైదీలు, ఇండియా, బర్మా దేశ ప్రజలు ఈ రైలుమార్గాన్ని నిర్మించారు. పని చేస్తున్నప్పుడు వేలాది మంది ప్రజలు చనిపోయారు. మిత్రపక్షాలు తరచుగా బాంబుదాడులు చేయడంవల్ల ఈ రైలుమార్గాన్ని చాలా తక్కువగా ఉపయోగించేవారు, క్రమంగా దాన్ని ఉపయోగించడం మానేశారు. తర్వాత రైలుపట్టాలలోని అధిక భాగాన్ని తీసి వేరే చోట ఉపయోగించారు.
బ్రిటీషు మళ్ళీ యుద్ధం చేసి జపాను దగ్గరనుంచి ఈ దేశాన్ని 1945లో విజయవంతంగా తిరిగి దక్కించుకుంది. కాని బ్రిటీషు పరిపాలన ఎంతో కాలం సాగలేదు ఎందుకంటే బర్మా 1948వ సంవత్సరం జనవరి 4న బ్రిటన్‌నుంచి స్వాతంత్ర్యాన్ని పొందింది. 1989 జూన్ 22న, ఐక్యరాజ్య సమితి ఈ దేశానికి మియన్మార్ అనే క్రొత్త పేరును అంగీకరించింది.
బంగారు రాజధానుల దేశము
కాలక్రమేణా మియన్మార్ ఎన్నో రాజధానులను మార్చింది. ఉదాహరణకు, మియన్మార్ మధ్యలో బంగారు పట్టణంగా ఖ్యాతిగాంచిన మాండలే ఉంది. వందలాది పురాతన పగోడాలను కలిగి 5,00,000 మంది ప్రజలున్న ఈ పట్టణం బ్రిటీషు ఆక్రమణకి ముందు చివరి రాజధాని. 1857లో మిన్‌డోన్ రాజు అక్కడ తనకొరకు తన రాణుల కొరకు అంతఃపురాన్ని నిర్మించడం ద్వారా మాండలేకు రాచమర్యాదలను సంక్రమింపజేశాడు. పాత పట్టణంలోని 4 చదరపు కిలోమీటర్ల ప్రాంతం చుట్టూ, అడుగున 3 మీటర్ల మందంగల 8 మీటర్ల ఎత్తున్న గోడ ఉంది. గోడ బయట 70-మీటర్ల-వెడల్పైన కందకం ఉంది.
1885లో బ్రిటీషువారు, మిన్‌డోన్ తర్వాత వచ్చిన టీబావ్ రాజును దేశాంతరవాసిగా ఇండియాకు పంపించారు, కానీ రాజభవనానికి ఏ హానీ కలిగించలేదు. కానీ రెండవ ప్రపంచయుద్ధంలో ఆ భవనం అగ్నిచేత పూర్తిగా నేలమట్టం చేయబడింది. మియన్మార్ ప్రజలు నిరుత్సాహపడకుండా ఆ భవనం మరియు దాని ఎరుపు, బంగారు వర్ణాల్లో వున్న చెక్క భవనాల అద్భుతమైన ప్రతిరూపాన్ని అక్కడే మళ్ళీ కట్టారు. దాన్ని సందర్శకులు చూడవచ్చు.
మాండలేకి ప్రవాహదిశలో 200 కిలోమీటర్ల దూరంలో పగాన్ ఉంది. సామాన్య శకంలోని మొదటి సహస్రాబ్దిలో స్థాపించబడి, 11వ శతాబ్దంలో అత్యున్నత వైభవానికి చేరుకుని, కేవలం 200 సంవత్సరాల తర్వాత విడిచిపెట్టబడ్డ ఈ పట్టణం కూడా ఒకప్పటి రాజధానే. అయినప్పటికీ, కొన్ని చిన్న చిన్న గ్రామాల మధ్య ఉన్న శిథిలమైన ఆలయాలు పగోడాలు ఈ పట్టణపు పూర్వ వైభవాన్ని తెలియజేస్తాయి.
నేటి రాజధాని యాంగోన్, (1989 వరకు అధికారికంగా రంగూన్ అని పిలువబడింది) 30 లక్షల కంటె ఎక్కువమంది ప్రజలతో, కోలాహలంగా తిరుగుతున్న కార్లు, బస్సులు, తలుపులు లేని టాక్సీలతో ఉన్న ఉత్సాహవంతమైన పట్టణం. వెడల్పాటి రహదారుల ఇరువైపులా చెట్లతోపాటు, బ్రిటీషు పాలనకు దర్పణంగా ఎన్నో పురాతన భవనాలు ఉన్నాయి. కాని నేడు ఈ నగరంలో ఎత్తైన ఆధునిక హోటళ్ళు కార్యాలయాలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా 2,500 సంవత్సరాల పూర్వపు ష్వేడగోన్ పగోడా యొక్క 98 మీటర్ల పొడవున్న బంగారు పూత పూసిన శృంగం, పూర్వ కాలపు ఐశ్వర్యాన్ని గూర్చి నిర్మాణ సృజనాత్మకతను గూర్చి చాటి చెబుతోంది. దాదాపు 7,000 వజ్రాలు ఇతర విలువైన రాళ్ళు ఈ శృంగాన్ని అలంకరించడానికి ఉపయోగించబడ్డాయి. దాని శిఖరం మీద 76 క్యారెట్ల వజ్రముంది. మియన్మార్‌లోని ఇతర పురాతన కట్టడాల వలే ష్వేడగోన్ కూడా భూకంపాలు, యుద్ధాల కారణంగా బాగా దెబ్బతినడంవల్ల దానిలోని చాలా భాగాన్ని మళ్ళీ కట్టవలసి వచ్చింది.
కొంతమంది మాత్రము యాంగోన్‌కి అసలైన ఆకర్షణ బంగారు సూలే పగోడా అని వాదిస్తారు. నలభై ఆరు మీటర్ల ఎత్తున్న 2,000 సంవత్సరాల పురాతన సూలే పగోడా, పట్టణ నాలుగు ముఖ్య వీధులను కలుపుతూ ఉన్న పెద్ద బంగారు కూడలిలా ఉంటుంది. ఈ పగోడా చుట్టూ దుకాణాలున్నాయి.
ఆధ్యాత్మిక బంగారము
1914లో ఇద్దరు అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు, (ఆ కాలంలో యెహోవాసాక్షులు అలా పిలువబడ్డారు) మరింత శ్రేష్ఠమైన బంగారానికి అంటే ఆధ్యాత్మిక బంగారానికి విలువనిచ్చే ప్రజలను వెతుక్కుంటూ ఇండియా నుండి రంగూన్‌కు వచ్చారు. 1928లోను 1930లోను మరింతమంది మిషనరీలు వచ్చారు. 1939 కల్లా 28 మంది ప్రచారకులున్న మూడు సంఘాలు స్థాపించబడ్డాయి. 1938 వరకు బొంబాయిలోని యెహోవాసాక్షుల ఇండియా బ్రాంచి కార్యాలయం అక్కడి పనులను చూసుకునేది. అప్పటి నుండి 1940 వరకు అక్కడి పనిని ఆస్ట్రేలియాలోని బ్రాంచి చూసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1947లో మియన్మార్ మొట్టమొదటి బ్రాంచి కార్యాలయం రంగూన్‌లో తెరవబడింది.
1978 జనవరిలో బ్రాంచి కార్యాలయం ఇన్యా రోడ్‌కు మార్చబడింది. మూడంతస్తుల ముఖ్యకార్యాలయ భవనం మియన్మార్ బేతేలు గృహం అని పిలువబడుతుంది. ప్రస్తుతం 52 మంది సభ్యులున్న బేతేలు కుటుంబం, దేశవ్యాప్తంగా చురుగ్గా పనిచేస్తున్న 3,000 సాక్షుల అవసరాలను చూసుకోవడానికి కష్టపడి పనిచేస్తోంది. మియన్మార్‌లో అనేక తెగల భాషలుండడం వల్ల బ్రాంచిలో అనువాదపు పనే ఎక్కువగా ఉంటుంది. యెహోవాసాక్షుల శ్రమ మూలంగా బంగారు దేశపు ఖజానాకు మరికొంత ‘బంగారం’ తోడవుతుంది. (g01 12/8)
[19వ పేజీలోని మ్యాపు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
బంగ్లాదేశ్
ఇండియా
చైనా
లావోస్
థాయ్‌లాండ్
మియన్మార్
మాండలే
పగాన్
యాంగోన్
బంగాళాఖాతము
[చిత్రసౌజన్యం]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[19వ పేజీలోని చిత్రాలు]
పైనుంచి: లుంగీలు కట్టుకున్న స్త్రీపురుషులు; బౌద్ధ బాల సన్యాసి; “తనాఖా” పూసుకున్న స్త్రీలు
[20వ పేజీలోని చిత్రం]
వేరుశనగ తోటలో ప్రకటనా పని
[20వ పేజీలోని చిత్రం]
చెక్కిన వస్తువులను స్థానిక మార్కెట్లలో అమ్ముతారు
[చిత్రసౌజన్యం]
chaang.com
[20వ పేజీలోని చిత్రం]
వార్నిషు పూసిన బల్లపై చిత్రాన్ని చెక్కడం
[20వ పేజీలోని చిత్రం]
అందంగా అలంకరించబడి వార్నిషు పూసిన గిన్నె
[చిత్రసౌజన్యం]
chaang.com
[22వ పేజీలోని చిత్రం]
మియన్మార్ యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Jean Leo Dugast/Panos