కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను నా రూమ్‌మేట్‌తో స్నేహపూర్వకంగా ఎలా ఉండగలను?

నేను నా రూమ్‌మేట్‌తో స్నేహపూర్వకంగా ఎలా ఉండగలను?

యువత ఇలా అడుగుతోంది . . .

నేను నా రూమ్‌మేట్‌తో స్నేహపూర్వకంగా ఎలా ఉండగలను?

“నాకు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలంటే ఇష్టం. కానీ నా రూమ్‌మేట్‌లు గిన్నెలు కడిగిలేకపోయినా లేదా అవి స్టవ్‌ మీద అలానే ఉన్నా పట్టించుకోనే పట్టించుకోరు. వాళ్ళకు అసలు అది ప్రాముఖ్యమే కాదు.”​—లిన్‌. *

రూమ్‌మేట్‌లు. “వారు ఉత్తమ స్నేహితులుగా ఉండగలరు లేదా ఘోరమైన శత్రువులుగా ఉండగలరు” అని కెవిన్‌ స్కోలరీ అనే రచయిత అంటున్నాడు. ఈ విషయంలో మీకు అలాంటి బలమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు, అయితే మరో వ్యక్తితో కలిసి జీవించడం నిజంగా ఒక సవాలుగా ఉండగలదన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. * విశ్వవిద్యాలయ విద్యార్థులలో రూమ్‌మేట్‌ల మధ్య గొడవలు ఎంత సర్వసాధారణమైపోయాయంటే యు.ఎస్‌.న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం, అనేక స్కూళ్ళు రూమ్‌మేట్‌లు స్నేహపూర్వకంగా ఉండేందుకు సహాయపడడానికి “విస్తృతమైన ప్రయత్నాలు” చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలలో “వివాదాలను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వ కార్యక్రమాలు,” సదస్సులు కూడా చేరివున్నాయి.

పూర్తికాల పరిచర్యను చేపట్టడానికి ఇల్లు వదిలి వచ్చిన యౌవనస్థులైన క్రైస్తవులకు కూడా మరో వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో జీవించడం కష్టంగా ఉండవచ్చు. అయితే, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా, “ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని” కనపర్చడం ద్వారా తరచూ వివాదాలు పరిష్కరించుకోవచ్చు అనే విషయాన్ని మనస్సులో ఉంచుకోవడం ప్రోత్సాహకరంగా ఉంటుంది.​—సామెతలు 2:7, NW.

ఒకరినొకరు తెలుసుకోండి

మీరు మీ ఇంటిని వదిలి వచ్చి వేరుగా ఉంటున్నారు అన్న ఉత్సాహం తగ్గిపోయిన తర్వాత, ఇక్కడ కూడా అన్నీ మీ ఇంట్లో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటుండవచ్చు. (సంఖ్యాకాండము 11:4, 5) అయితే, మునుపటి విషయాల గురించి ఆలోచించడం, మీరు ఇక్కడ సర్దుకుపోవడం మరింత కష్టమయ్యేలా చేస్తుంది. ప్రసంగి 7:10 వ వచనం ఈ సలహా ఇస్తుంది: “ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు.” అవును, ఇప్పుడు మీరున్న పరిస్థితిని సాధ్యమైనంత ఆహ్లాదకరంగా చేసుకోవడానికి ప్రయత్నించడమే యుక్తం.

మీ రూమ్‌మేట్‌తో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ప్రారంభించండి. నిజమే రూమ్‌మేట్‌లు తప్పనిసరిగా సన్నిహిత స్నేహితులుగా ఉండవలసిన అవసరం లేదు. వాస్తవానికి, అతను లేక ఆమె మీరు ప్రత్యేకించి ఇష్టపడే వ్యక్తి కాకపోవచ్చు. అయినప్పటికీ, మీరు ఆ వ్యక్తితో జీవించాలంటే, అతనితో లేక ఆమెతో సాధ్యమైనంత స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగివుండడం సహేతుకం కాదా?

“తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని ఫిలిప్పీయులు 2:4 మనకు చెబుతోంది. ఏదో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అన్న అభిప్రాయాన్ని కలిగించకుండా, మీరు మీ రూమ్‌మేట్‌ కుటుంబ నేపథ్యం గురించి, అతని లేక ఆమె ఆసక్తులు, లక్ష్యాలు, అభిరుచుల గురించి అడిగి తెలుసుకోగలరా? మీ గురించి కూడా వివరాలు చెప్పండి. మీరు ఒకరి గురించి ఒకరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు.

అప్పుడప్పుడూ, కలిసి పనులు చేయడానికి ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకోండి. “కొన్నిసార్లు నేనూ నా రూమ్‌మేట్‌లు కలిసి భోజనం చేయడానికి బయటకు వెళ్తాము లేదా కలిసి కళా ప్రదర్శనలకు వెళ్తాము” అని లీ చెబుతోంది. క్రైస్తవ రూమ్‌మేట్‌లు, సంఘ కూటాలకు కలిసి సిద్ధపడడం లేదా పరిచర్యలో కలిసి పనిచేయడం వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భాగం వహించడం అనేది స్నేహ బంధాలను బలపర్చుకోవడానికి మరింత ప్రభావవంతమైన మార్గం.

“నా రూమ్‌మేట్‌ బహిరంగ బైబిలు ప్రసంగం ఇచ్చినప్పుడు, అతన్ని ప్రోత్సహించడానికి నేను అతని సంఘ కూటానికి హాజరయ్యాను” అని డేవిడ్‌ చెబుతున్నాడు. క్రీడలు, సంగీతం వంటి విషయాల్లో అతనికి అతని రూమ్‌మేట్‌కు వేర్వేరు అభిరుచులు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక విషయాలపట్ల వారికున్న ప్రేమ వారి మధ్య బంధాన్ని ఏర్పర్చింది. “మా మధ్య అనేక ఆధ్యాత్మిక సంభాషణలు జరుగుతుంటాయి. నిజానికి ఆధ్యాత్మిక విషయాల గురించి మేము గంటల తరబడి మాట్లాడుకోగలము” అని డేవిడ్‌ చెబుతున్నాడు.

అయితే మీరు అప్రమత్తంగా ఉండవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, మీరు ఇతర మంచి సంబంధాలను పెంపొందించుకోలేనంతగా ఒక రూమ్‌మేట్‌కు సన్నిహితమవ్వకండి. మీ రూమ్‌మేట్‌ ఎక్కడికైనా వెళ్ళే ప్రతిసారీ మిమ్మల్ని తనతోపాటు ఆహ్వానించవలసిన అవసరం ఉందని అనుకుంటే, అతను లేక ఆమె ఊపిరాడని పరిస్థితి ఏర్పడినట్లు భావించవచ్చు. మీరు మీ స్నేహబంధాలలో “హృదయములను విశాలపరచుకొనుడి” అని బైబిలు ఉపదేశిస్తుంది.​—2 కొరింథీయులు 6:13.

బంగారు సూత్రానికి అనుగుణంగా జీవించడం

మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటుండగా, మీ అలవాట్లలో, అభిరుచులలో, దృక్కోణాలలో ఉన్న తేడాలను మీరు గ్రహిస్తారు. యౌవనస్థుడైన మార్క్‌ హెచ్చరిస్తున్నట్లు, “అపరిపూర్ణతలు ఉంటాయని మీరు ముందుగానే ఊహించాలి.” సర్దుబాట్లు చేసుకోవడానికి సుముఖంగా ఉండకపోవడం లేదా తమపైనే ఎక్కువ అవధానాన్ని కేంద్రీకరించుకోవడం, మీకు ఇష్టమైన విధంగా మీ రూమ్‌మేట్‌ పెద్ద పెద్ద మార్పులను చేసుకోవాలని ఆశించడం వంటివి ఉద్రిక్తతను కలుగజేస్తాయి.

రూమ్‌మేట్‌గా ఉండడం గురించి ఫర్నెండో నేర్చుకున్నదేమిటంటే: “మీరు మీ పైనే అవధానాన్ని కేంద్రీకరించుకునేవారిగా కాక నిస్వార్థంగా ఉండాలి.” ఆయన వ్యాఖ్యానం ప్రఖ్యాతిగాంచిన బంగారు సూత్రానికి పొందికగా ఉంది. బంగారు సూత్రం ఇలా తెలియజేస్తుంది: “కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ఉదాహరణకు, తనకు తన రూమ్‌మేట్‌కు రూమ్‌ టెంపరేచర్‌ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయని ఫర్నెండో గ్రహించాడు; అతనికి రూమ్‌ వెచ్చగా ఉంటే ఇష్టం, కానీ అతని రూమ్‌మేట్‌ తక్కువ టెంపరేచర్‌తో నిద్రపోవడానికి ఇష్టపడేవాడు. దానికి పరిష్కారం? “నేను నా కోసం ఒక బ్లేంకెట్‌ తెచ్చుకున్నాను” అని ఫర్నెండో చెబుతున్నాడు. అవును, మార్క్‌ చెప్పినట్లుగా “సర్దుబాట్లు చేసుకోవడానికి సుముఖంగా ఉండండి. అలాగని మీరు మీ విధానాలు అన్నీ మార్చుకోనవసరం లేదు, కానీ ఒకటి రెండు మార్పులు చేసుకోవలసి ఉంటుంది.”

మీరు బంగారు సూత్రాన్ని అన్వయించుకోదగిన మరో విషయం: మీ రూమ్‌మేట్‌ అభిరుచులను సహించడం నేర్చుకోండి. మీకు అతను వినే సంగీతం ఇష్టం లేదంటారా? అతను కూడా మీరు వినే సంగీతం గురించి అలాంటి అభిప్రాయాన్నే కలిగివుండే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి, మీ రూమ్‌మేట్‌ వినే సంగీతం నైతికంగా దిగజారిపోయినది కానప్పుడు, మీరు సహనాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించండి. “నా రూమ్‌మేట్‌ ఇప్పుడు ఇష్టపడుతున్న సంగీతం కాక వేరే సంగీతాన్ని ఇష్టపడితే బాగుండేది. కానీ ఇప్పుడు నేను దానికి అలవాటు పడుతున్నాను” అని ఫర్నెండో అంటున్నాడు. మరోవైపు, బహుశా చదువుకుంటున్న తన రూమ్‌మేట్‌ను డిస్టర్బ్‌ చేయకుండా ఒక వ్యక్తి హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం ద్వారా సంగీతాన్ని వినవచ్చు.

బంగారు సూత్రాన్ని అన్వయించుకోవడం, వస్తుసంపదల విషయంలో అనవసరమైన వివాదాలను కూడా నివారించగలదు. ఉదాహరణకు, సాధారణంగా అనుమతి లేకుండా ఫ్రిడ్జ్‌లోంచి మీకు అవసరమైనవి తీసుకొనే​—చాలా అరుదుగా దాన్ని తిరిగి పెట్టే​—అలవాటు మీకుంటే అది ఆగ్రహాన్ని పెంచవచ్చు. అదే సమయంలో, మీరు కొనుక్కొని తెచ్చుకున్నవాటిని మీ రూమ్‌మేట్‌ తీసుకున్నప్పుడు కోపం తెచ్చుకోవడం లేదా అమిత్రభావంతో చూడడం కూడా మంచి సంబంధాలను ప్రోత్సహించదు. బైబిలు మనల్ని ‘ఔదార్యముగలవారిగా, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారిగా’ ఉండమని ప్రోత్సహిస్తుంది. (1 తిమోతి 6:18, 19) ఇతరులు మిమ్మల్ని తమ అవసరానికి వాడుకుంటున్నారని మీరు భావిస్తున్నట్లైతే, నిశ్శబ్దంగా ఉండిపోకండి. మీరు చేస్తున్న అభియోగాన్ని నెమ్మదిగా, దయాపూర్వకంగా తెలియజేయండి.

అయితే, ఇతరుల స్వంత వస్తువుల విషయంలో గౌరవం కలిగివుండండి. అనుమతి లేకుండా మరొకరి వస్తువులు తీసుకోవడం అహంకారంతో కూడిన పని. (సామెతలు 11:2) మీ రూమ్‌మేట్‌కు కొంత ఏకాంతం కావాలన్న సంగతి కూడా గుర్తుంచుకోండి. అతని లేక ఆమె రూమ్‌లోకి వెళ్ళేముందు తలుపు తట్టడం వంటి ప్రాథమికమైన మర్యాదలను పాటించండి. మీరు గౌరవం చూపినప్పుడు మీ రూమ్‌మేట్‌ అదే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. “మేము ఇంటి దగ్గర చదువుకోవడానికి మా ఇద్దరికీ ఏ సమస్యా లేదు. మేమిద్దరం దాన్ని పూర్తిగా గౌరవిస్తాము, ఒకరి కోసం ఒకరం మౌనంగా ఉంటాము. కానీ, కొన్నిసార్లు నా రూమ్‌మేట్‌ ఇంకేదైనా చేయాలనుకుంటే నేను లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాను” అని డేవిడ్‌ చెబుతున్నాడు.

బంగారు సూత్రాన్ని అన్వయించుకోవడంలో, మీ వంతు రెంట్‌ కట్టవలసి వచ్చినప్పుడు లేదా మీ వంతు ఇంటిపనులు చేయవలసి వచ్చినప్పుడు బాధ్యతాయుతంగా ఉండడం కూడా చేరివుంది.

వివాదాలతో వ్యవహరించడం

పూర్వం బైబిలు కాలాల్లో, ఎంతో గౌరవనీయులైన ఇద్దరు క్రైస్తవ పురుషులు, పౌలు బర్నబాలకు ‘తీవ్రమైన వాదము కలిగింది.’ (అపొస్తలుల కార్యములు 15:39) మీ ఇద్దరి మధ్య కూడా అలాంటి సంఘటనే జరిగితే అప్పుడేమిటి? బహుశా మీ వ్యక్తిత్వాలలో విభేదాలు ఉండవచ్చు లేదా విసుగుపుట్టించే వ్యక్తిగత అలవాటు ఏదైనా మీ సహనం యొక్క పరిమితిని పరీక్షించవచ్చు. ఒక అభిప్రాయభేదం లేదా కోపంతో కూడిన చర్చ మీరు ఒక రూమ్‌లో ఉండడం మానుకోవాలని సూచిస్తుందా? అదేం కాదు. పౌలు బర్నబాలు తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోగలిగారని స్పష్టమవుతుంది. రూమ్‌ మార్చుకోవడమన్నంత గంభీరమైన చర్య తీసుకోక ముందు మీరు కూడా బహుశా అలాగే చేయవచ్చు. మీకు సహాయపడగల కొన్ని బైబిలు సూత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి.

• ‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై ఒకరినొకరు తమకంటె యోగ్యులని యెంచండి.’​—ఫిలిప్పీయులు 2:3.

• “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”​—ఎఫెసీయులు 4:31, 32.

• “కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము.”​—మత్తయి 5:23, 24; ఎఫెసీయులు 4:26.

ప్రయోజనాలు

రూమ్‌మేట్‌లతో కలిసి జీవించే చాలామంది క్రైస్తవ యౌవనస్థులు (మరీ అంత యౌవనస్థులు కానివారు కూడా) జ్ఞానియైన సొలొమోను రాజు వ్రాసిన మాటల సత్యాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు: “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు.” (ప్రసంగి 4:9) నిజమే, వేరొకరితో ఒకే రూమ్‌లో జీవించడమనే అనుభవం ప్రయోజనకరమని చాలామంది గ్రహించారు. “ప్రజలతో మరింత మంచిగా ఎలా వ్యవహరించాలో పరిస్థితులకు అనుగుణంగా ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో నేను నేర్చుకున్నాను” అని మార్క్‌ అంటున్నాడు. “మీరు మీ గురించి కూడా చాలా తెలుసుకుంటారు. అదే సమయంలో రూమ్‌మేట్లు మంచి ప్రవర్తనను ప్రోత్సహించేటటువంటి ఒత్తిడిని తీసుకురావచ్చు” అని రినీ చెబుతోంది. “నేను నా రూమ్‌మేట్‌లతో కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు చాలా స్వార్థపూరితంగా ఉండేదాన్ని. కానీ నేను అంత కఠినంగా ఉండకూడదని నేర్చుకున్నాను. ఎవరైనా నేను చేసినట్లు కాకుండా వేరే విధంగా పనులు చేసుకున్నంత మాత్రాన ఆమె తప్పు చేస్తుందన్నట్లు కాదని నేను గ్రహించాను” అని లిన్‌ ఒప్పుకుంటుంది.

నిజమే, రూమ్‌మేట్‌తో కలిసి జీవించడానికి కృషి, త్యాగం అవసరం. కానీ మీరు బైబిలు సూత్రాలను అన్వయించుకోవడానికి కృషి చేస్తే, మీరు ప్రశాంతంగా కలిసి జీవించడం కంటే ఎక్కువే చేయగలరు; ఒక రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఆనందకరంగా ఉంటుందని కూడా మీరు కనుగొనవచ్చు. (g02 6/22)

[అధస్సూచీలు]

^ కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

^ జూలై-సెప్టెంబరు, 2002 సంచికలోని “నా రూమ్‌మేట్‌తో కలిసి ఉండడం ఎందుకంత కష్టం?” అనే ఆర్టికల్‌ను చూడండి.

[26వ పేజీలోని చిత్రం]

మీవి కాని వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం ఉద్రిక్తతను కలుగజేయవచ్చు

[27వ పేజీలోని చిత్రం]

ఒకరి భావాలను మరొకరు గౌరవించి, శ్రద్ధ చూపండి