ప్రపంచ పరిశీలన
ప్రపంచ పరిశీలన
“టెలిఫోన్ తల్లులు” సరఫరా చేసే మేలైన ఆహారం
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో, రుచికరమైన భోజనమంటే ఇష్టం ఉన్నప్పటికీ వంటచేసుకునే సమయము లేదా అభిరుచి లేని పనిరద్దీగల ఒంటరివారు ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇంటర్నెట్ ద్వారా వారు ఒక “టెలిఫోన్ తల్లి”ని అద్దెకు తీసుకుంటారని స్పెయిన్ వార్తాపత్రిక ఎల్ పాయీస్ చెబుతోంది. వాళ్ళు దత్తు చేసుకొన్న తల్లి కొన్ని రోజులకు సరిపడే ఆరోగ్యకరమైన భోజనాన్ని, ఇంట్లో వండి వారానికి రెండుసార్లు టాక్సీలో వారికి పంపిస్తుంది. ఆమె పంపేవాటిలో చేపలు, పాస్త, కూరగాయలు, కాయధాన్యములు, మాంసం, పండ్లు, పాల ఉత్పత్తులు ఉంటాయి. “టెలిఫోన్ తల్లి” ప్రతి కొత్త దత్త “పుత్రుడి” ఫ్రిజ్ స్థితి, ఆయన ఇష్టపడే వంటకాలు, ఆయన అవసరాల గురించి తెలుసుకోవడానికి ఫోను ద్వారా ఆయనను సంప్రదిస్తూ ఉంటుంది. నలుగురికి లేదా అంతకంటే ఎక్కువమందికి ప్రతిరోజు ఆఫీసుకు భోజనం పంపే ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి, వారాంతపు వంటకాల పట్టిక కూడా ఉంటుంది. (g03 1/22)
“అబద్ధాలు చెప్పడం మెదడుకు చాలా కష్టం”
నిజం చెప్పడానికంటే అబద్ధం చెప్పడానికే మెదడు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుందని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. డా. డానియల్ లాంగ్లేబన్, ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు మెదడులోని ఏ భాగాలు చైతన్యవంతమవుతాయో గుర్తించడానికి ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనాన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్ఆర్ఐ) మెషీన్‌ను ఉపయోగించి ఈ విషయాన్ని అధ్యయనం చేస్తున్నాడు. ఒక ప్రశ్న ఎదురైనప్పుడు, మన మెదడు మొదట దాన్ని ప్రక్రియకు లోనుచేయవలసి ఉంటుంది. అప్పుడు, “ఒక అబద్ధికుడు దాదాపు సహజసిద్ధంగా, తప్పుడు సమాధానాన్ని రూపొందించుకునే ముందు లేదా మాట్లాడే ముందు మొదట సరైన సమాధానం గురించి ఆలోచిస్తాడు” అని మెక్సికో నగరానికి చెందిన ద న్యూస్ నివేదిస్తోంది. “మెదడులో, కృషి లేకుండా ఏ సమాధానం లభించదు, నిజం చెప్పడానికి అవసరమైన దానికంటే అబద్ధం చెప్పడానికి అవసరమైన ప్రక్రియ మరింత సంక్లిష్టమైనది, తత్ఫలితంగా ఎక్కువ నరాలు ఆ ప్రక్రియలో పాల్గొనవలసి ఉంటుంది” అని లాంగ్లేబన్ చెబుతున్నాడు. నరాలు ఎక్కువగా పాల్గొనే ఈ ప్రక్రియ ఎఫ్ఎమ్ఆర్ఐ మెషీన్ మీద వెలుగుతున్న ఒక బల్బులా కనిపిస్తుంది. “ఎంతో చాకచక్యంగా మాట్లాడే వ్యక్తి మెదడుకు సహితం, అబద్ధాలు చెప్పడం చాలా కష్టమే” అని ఆ పత్రిక చెబుతోంది. (g03 2/22)
ప్రపంచంలోని 25 శాతం అంధులు భారతదేశంలోనే ఉన్నారు
“భారతదేశం 1.2 కోట్లమంది అంధులతో, అంటే ప్రపంచంలోని 25 శాతం అంధులతో నిండివుందని పేరుగాంచడం శోచనీయం” అని భారతదేశానికి చెందిన డెక్కన్ హెరాల్డ్ చెబుతోంది. భారతదేశంలోని 40 కంటే ఎక్కువ నగరాల్లోని కాలేజీల నుండి, స్కూళ్ళ నుండి సేకరించిన సమాచారం ఆధారంగా యూత్ విజన్ ఇండియా, 2002 ఇచ్చిన ఒక నివేదిక కూడా, “దృష్టి లోపాలున్న 50 శాతం కంటే ఎక్కువమంది యౌవనస్థులకు తమకలాంటి దృష్టి లోపం ఉందన్న విషయం కూడా తెలియదు” అని పేర్కొన్నది. తెలుసుకున్న వివరాల ప్రకారం దేశంలోని నేత్ర సంబంధ రుగ్మతలకు ఎక్కువమేరకు రిఫ్రాక్టరీ లోపాలు, కేటరాక్ట్లు కారణం, వీటిని సరిచేయడం సాధ్యమే. “తమకు దృష్టిలోపం ఉందని తెలియకపోవడము, నేత్ర నిపుణుల కొరత” వంటివి భారతదేశంలో ఈ సమస్యకు ముఖ్య కారణాలని ఆ వార్తాపత్రికలోని ఆర్టికల్ పేర్కొన్నది. “ప్రపంచ ఆరోగ్య సంస్థ 40,000 మంది నేత్రవైద్యులు ఉండాలని సిఫారసు చేస్తుండగా భారతదేశంలో కేవలం 5000 మందే ఉన్నారు” అని కూడా అది తెలియజేస్తోంది. (g03 1/08)
ఇన్యూట్ భాషలో బైబిల్ పూర్తయ్యింది
కెనడియన్ బైబిల్ సొసైటి, కెనడాలోని ఇన్యూట్ ప్రజల భాష అయిన ఇనూక్టిటూట్ భాషలోకి పూర్తి బైబిలును అనువదించడమనే 23 సంవత్సరాల కార్యాన్ని ముగించింది. ఆ అనువాదం ఒక సవాలే. “గొఱ్ఱెలు, ఒంటెలు, గాడిదలు, ఈత జాతి చెట్లు ఉన్న సంస్కృతిని సీల్, వల్రస్ వంటి క్షీరదాలు, చాలా తక్కువ మొక్కలు ఉన్న పరిసరాల్లోని సంస్కృతిలోకి అనువదించడం ఎంతో కష్టమయ్యింది. ఉదాహరణకు బైబిల్లో ఈత జాతి చెట్లకు ఎన్నో పదాలున్నాయి. కానీ నూనవూట్ [కెనడా యొక్క ఉత్తర ప్రాంతం]లో ఆ జాతి చెట్టు ఒక్కటి కూడా లేకపోవడంవల్ల, వాటిని వర్ణించడం కష్టం” అని కెనడియన్ బైబిల్ సొసైటికి చెందిన లేఖనానువాద డైరెక్టర్ హార్ట్ వీన్స్ అన్నాడు. ఇనూక్టిటూట్ ఇంచుమించు 28,000 మంది కెనడా దేశస్థులకు మాతృభాష. నేషనల్ పోస్ట్ చెబుతున్నదాని ప్రకారం, “బైబిలు ఇప్పుడు 2,285 కంటే ఎక్కువ భాషల్లో లభ్యమవుతోంది.” (g03 1/08)
చర్చీల మార్పిడి
“మార్క్ ట్వాయన్ 1881లో మాంట్రీయల్‌కు వచ్చినప్పుడు, ‘చర్చి కిటికీని పగులగొట్టకుండా మీరు ఒక రాయి విసరలేరు’ అన్నాడు. కానీ ఈ రోజుల్లో, పూర్వం ఒక చర్చి ఉన్న బిల్డింగులోని అపార్ట్మెంట్ కిటికీని మీరు పగులగొడుతుండవచ్చు” అని మాంట్రీయల్‌కు చెందిన ద గజెట్ అనే వార్తాపత్రిక చెబుతోంది. ఆ నగరంలో ఇప్పటికీ దాదాపు 600 ఆరాధనా స్థలాలు ఉన్నప్పటికీ వాటిలో కనీసం 100—అనేకం క్యాథలిక్ చర్చీలే—రాబోయే దశాబ్దంలో అమ్మకానికి వస్తాయని ఆ పత్రిక అంటోంది. “మాంట్రీయల్ ఆర్చిడయోసిస్ చెబుతున్న దాని ప్రకారం, 1960 నుండి దాదాపు 25 క్యాథలిక్ పేరిష్లు మూతపడ్డాయి.” కెనడాలో, 1871లో 15 లక్షలమంది ఉన్న క్యాథలిక్కులు 1971 నాటికి దాదాపు ఒక కోటికి చేరుకున్నారు; అయినప్పటికీ “చర్చికి వచ్చేవారి సంఖ్య, ప్రాముఖ్యంగా క్యూబెక్‌లో పూర్తిగా తగ్గిపోయింది” అంటోంది ద గజెట్. ఆ ప్రాంతంలో చర్చికి వచ్చేవారి సంఖ్య 1970లో 75 శాతమైతే ఇప్పుడు 8 శాతానికి తగ్గిపోయిందని మాంట్రీయల్ ఆర్చిడయోసిస్ ప్రీస్టు అయిన బెర్నార్డ్ ఫోర్టాన్ ఆ వార్తాపత్రికకు తెలియజేశాడు. (g03 2/22)
రక్తమార్పిడులు ఊపిరితిత్తులకు హాని చేయగలవు
“రక్త ఉత్పత్తులను, ప్రాముఖ్యంగా ప్లాస్మా ఉన్న ఉత్పత్తులను తీసుకునే ప్రజలు, రక్తమార్పిడి మూలంగా ఊపిరితిత్తులకు తీవ్రమైన గాయం కాగల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది” అని యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన పత్రిక ఎఫ్డిఏ కన్స్యూమర్ పేర్కొన్నది. ఈ పరిస్థితిని గుర్తించి సరిగ్గా చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు. “దాత రక్తంలోని తెల్ల రక్తకణ ప్రతిరక్షకాలు, గ్రహీత తెల్ల రక్తకణాలతో కలిసినప్పుడు ప్రతిచర్యగా ఈ గాయం కావచ్చు, దానితో ఊపిరితిత్తుల్లోని ధాతువులో మార్పు కలిగి ద్రవం లోపలికి ప్రవేశిస్తుంది. ఇలాంటి పరిణామాలకు ఎక్కువగా కారణమయ్యేవారు, ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లలున్న స్త్రీలు లేదా అనేకసార్లు రక్తమార్పిడులు చేయించుకున్న దాతలే.” రోగలక్షణాల్లో “జ్వరం, ఊపిరి అందకపోవడం, రక్తపోటు తగ్గిపోవడం వంటివి ఉంటాయి. తరచూ ఎక్స్‌రేలు, [రక్తాన్ని ఎక్కించుకున్న] రక్తగ్రహీత ఊపిరితిత్తులను పూర్తి తెల్లగా చూపిస్తాయి.” (g03 3/08)
చెట్లు నగర కాలుష్యాన్ని తగ్గిస్తాయి
“వివిధ జాతుల చెట్లు కాలుష్యాన్ని ఎలా తగ్గించగలవో నిపుణులు మొదటిసారిగా అంచనావేయగలిగారు” అని లండన్‌కు చెందిన ద సండే టైమ్స్ నివేదిస్తోంది. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలో మూడు సంవత్సరాలపాటు జరిగిన అధ్యయనంలో, ఇంగ్లాండ్‌కు, స్కాట్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు, హానికరమైన రేణువులను ఏ జాతి చెట్లు ఎక్కువగా పీల్చుకున్నాయో తెలుసుకోవడానికి దాదాపు 32,000 చెట్ల దగ్గరి నుండి తీసుకున్న మట్టి నమూనాలను పరిశీలించారు. పరిశోధకులు వాతావరణంలోని రేణువులను, ఓజోన్ స్థాయిలను కూడా పరిశీలించారు. తెల్లని బెరడుండే ప్రభూర్జ వృక్షజాతి, లార్చ్, దేవదారు వృక్షజాతి చెట్లు అగ్రస్థానంలో నిలిచాయి; ఓక్, గుల్మజాతి, తెల్లబూరుగ జాతి చెట్లలో ఆ సామర్థ్యం చాలా తక్కువ ఉంది. “వాతావరణంలో నుండి కాలుష్యాన్ని నిర్మూలించడంలో పచ్చిక బయళ్ళ కన్నా చెట్లు మూడింతలు ఎక్కువ సమర్థంగా ఉండగలవు” అని ఆ అధ్యయనం తెలియజేసింది. వాస్తవానికి, వెస్ట్ మిడ్లాండ్స్లోని ఆరుబయలు ప్రదేశంలో సగభాగం చెట్లు నాటినా, రేణువుల మూలంగా కలిగే వాయు కాలుష్యం 20 శాతం తగ్గివుండేదని ఒక కంప్యూటర్ కార్యక్రమం చూపించింది. (g03 3/22)
మతం, యుద్ధం
“నేడు జరుగుతున్న అత్యంత రక్తసిక్తమైన, ప్రమాదకరమైన కలహాలు . . . మతానికి సంబంధించినవే” అని యుఎస్ఏ టుడే వార్తాపత్రిక పేర్కొంటోంది. వాటిని పరిష్కరించడం కూడా చాలా కష్టమే. “ఇరువర్గాల వారు దేవుడు తమ పక్షాన ఉన్నాడని చెప్పుకుంటున్నప్పుడు, రాజీ పడడానికీ గతంలోని దోషాలను క్షమించడానికీ సంసిద్ధంగా ఉండడం వంటి సయోధ్య కుదిర్చే ప్రమాణాలను అన్వయించడం మరింత కష్టమవుతుంది. మతం వివాదం తలెత్తడానికి కారణమవడం కంటే, ఆధ్యాత్మికతకు అంతగా సంబంధం లేని భూమి లేదా అధికారం కోసం చేసే పోరాటాలకు మద్దతుగా మతాన్ని ఒక పరికరంగా ఉపయోగించుకున్నప్పుడు అలాగే జరుగుతుంది” అని కూడా ఆ వార్తాపత్రిక అంటోంది. మత విభేదాలు తాత్కాలిక యుద్ధవిరమణ కూడా కష్టమయ్యేలా చేస్తాయి. దానికి ఒక ఉదాహరణ, ఇటీవల కొసొవొలో జరిగిన యుద్ధం. ఈస్టర్ పండుగ సమయంలో యుద్ధవిరమణ గురించి ఆలోచించడం జరిగింది కానీ దాన్ని అమలు చేయడం సాధ్యం కాలేదు, ఎందుకంటే ఈస్టర్ పండుగ తేదీలు క్యాథలిక్‌లకు, ఆర్థడాక్స్ వారికి వేర్వేరుగా ఉన్నాయి. “చివరికి, తాత్కాలిక యుద్ధవిరమణ కానే లేదు” అని యుఎస్ఏ టుడే చెబుతోంది. (g03 3/22)