సృష్టిలో అద్భుతాలు
పిల్లికి మీసాలు ఎందుకు ఉన్నాయి?
పిల్లులు ఎక్కువగా రాత్రి పూట తిరుగుతాయి. చీకట్లో చుట్టూ ఉన్న వస్తువుల్ని తెలుసుకోడానికి, ఆహారాన్ని పట్టుకోడానికి పిల్లులకు మీసాలు ఉపయోగపడతాయి.
ఎలానో చూద్దాం: పిల్లికి మీసాలు చర్మం లోపల ఉన్న కణజాలాల (tissues) వరకు ఉంటాయి. ఆ కణజాలాల్లో ఎన్నో నాడులు (nerves) చిన్నచిన్నగా విడిపోయి ఉంటాయి. ఆ నాడులు గాలిలో వచ్చే చిన్న కదలికలను కూడా తెలుసుకుంటాయి. వాటివల్ల పిల్లులు రాత్రి పూట సరిగ్గా కనబడకపోయినా దగ్గర్లో ఉన్న వాటిని తెలుసుకుంటాయి. చీకట్లో ఇవి చాలా ఉపయోగపడతాయి.
ఈ మీసాలను ఉపయోగించి పిల్లి వస్తువులు లేదా ఎలుకల కదలికలను కనిపెడుతుంది. అలా అవి ఎక్కడున్నాయో, ఎటు వెళ్తున్నాయో పిల్లి తెలుసుకుంటుంది. అంతేకాదు పిల్లులు ఏదైనా ఒక చిన్న సందు నుండి వెళ్లాలనుకున్నప్పుడు దాని వెడల్పు ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ మీసాలు సహాయం చేస్తాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా అంటుంది: “పిల్లి మీసాలు ఏమేం చేస్తాయి అన్నది పూర్తిగా తెలీదు కానీ వాటిని కత్తిరిస్తే మాత్రం కొంతకాలం వరకు పిల్లులు వాటి శక్తిని కోల్పోతాయి.”
చుట్టూ ఉన్న వాటిని తెలుసుకోవడానికి సాయం చేసే పిల్లి మీసాల్లాంటి సెన్సార్లతో శాస్త్రవేత్తలు రోబోల్ని తయారుచేస్తున్నారు. ఈ సెన్సార్లను ఇ-విస్కర్స్ అంటారు. “రోబోలు తయారు చేయడంలో, సెన్సార్లతో పనిచేసే పరికరాల్లో, కృత్రిమ అవయవాల్లో ఇ-విస్కర్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి” అని బెర్క్లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పనిచేస్తున్న సైంటిస్ట్ అలీ జావె అంటున్నాడు.
మీరేమంటారు? ఇంత బాగా పనిచేసే మీసాలు పిల్లికి ఎలా వచ్చాయి? సృష్టికర్త వల్ల కాదా? ◼ (g15-E 04)