కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచండి

“ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. . . . దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.”2 పేతురు 1:19.

1, 2. అబద్ధ మెస్సీయాకు సంబంధించి ఏ ఉదాహరణను మీరు చెప్తారు?

శతాబ్దాలుగా, అబద్ధ మెస్సీయాలు భవిష్యత్తును గూర్చి చెప్పడానికి ప్రయత్నించారు. సా.శ. 5వ శతాబ్దంలో, మోషేనని చెప్పుకున్న ఒక వ్యక్తి తానే మెస్సీయాననీ, క్రేతు ద్వీపంలో ఉన్న యూదులను అణచివేత నుంచి విడుదల చేస్తాననీ వారిని ఒప్పించాడు. వారి స్వేచ్ఛకోసం నిర్ణయింపబడిన రోజు వచ్చినప్పుడు వారు అతని వెంట ఒక ఉన్నత శిఖరంపైకి వెళ్లారు, అక్కడి నుండి క్రిందనున్న మధ్యధరా సముద్రం కనిపిస్తుంది. వాళ్లు సముద్రంలోకి దూకడమే ఆలస్యం అది వాళ్లెదుట విడిపోతుందని ఆయన చెప్పాడు. దూకిన అనేకమంది నీళ్లలో మునిగిపోయారు, ఆ అబద్ధ మెస్సీయా అక్కడి నుండి మాయమైపోయాడు.

2 పన్నెండవ శతాబ్దంలో, యెమెన్‌లో మరో “మెస్సీయా” పుట్టుకొచ్చాడు. ఖలీఫా, అంటే అక్కడి పాలకుడు, అతడే మెస్సీయా అని రుజువుపర్చే ఒక సూచనను అడిగాడు. ఈ “మెస్సీయా” తన తలను ఖండించమని ఖలీఫాకు చెప్పాడు. తక్షణం జరిగే తన పునరుత్థానమే సూచన అవుతుందని అతడు ప్రవచించాడు. అందుకు ఖలీఫా అంగీకరించాడు—అంతటితో ఆ “మెస్సీయా” అంతమైపోయాడు.

3. నిజమైన మెస్సీయా ఎవరు, ఆయన పరిచర్య ఏమని రుజువు చేస్తోంది?

3 అబద్ధ మెస్సీయాలూ వారి ప్రవచనాలూ పూర్తిగా నిష్ఫలమైపోయాయి, కానీ దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యం ఉంచడం ఎన్నటికీ నిరాశకు నడిపించదు. నిజమైన మెస్సీయా అయిన యేసుక్రీస్తు, అనేక బైబిలు ప్రవచనాలకు సజీవ నెరవేర్పై ఉన్నాడు. ఉదాహరణకు సువార్త రచయిత అయిన మత్తయి యెషయా ప్రవచనాన్ని ఉల్లేఖిస్తూ ఇలా వ్రాశాడు: “జెబూలూను దేశమును, నఫ్తాలిదేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్రతీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయంచెను . . . అప్పటినుండి యేసు—పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను.” (మత్తయి 4:15-17; యెషయా 9:1, 2) యేసుక్రీస్తే ఆ “గొప్ప వెలుగు,” ఆయన చేసిన పరిచర్య, మోషే ప్రవచించిన ప్రవక్త ఆయనేనని రుజువు చేసింది. యేసు మాట వినటానికి నిరాకరించే వాళ్లు నాశనం చేయబడతారు.—ద్వితీయోపదేశకాండము 18:18, 19; అపొస్తలుల కార్యములు 3:22, 23.

4. యెషయా 53:12ను యేసు ఎలా నెరవేర్చాడు?

4యెషయా 53:12 లోని ఈ ప్రవచనార్థక మాటల్ని కూడా యేసు నెరవేర్చాడు: “మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.” త్వరలో తన మానవ జీవితాన్ని బలిగా అర్పిస్తానని ఎరిగిన యేసు తన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చాడు. (మార్కు 10:45) ఆ బలపర్చటాన్ని ఆయన రూపాంతరం పొందటం ద్వారా ప్రశస్తమైన పంథాలో చేశాడు.

రూపాంతరం విశ్వాసాన్ని ప్రోది చేసింది

5. మీ సొంత మాటల్లో మీరు రూపాంతరాన్ని ఎలా వర్ణిస్తారు?

5 రూపాంతరం ఒక ప్రవచనార్థక సంఘటన. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. . . . ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా[ను].” (మత్తయి 16:27, 28) యేసు తన రాజ్యంతో రావడాన్ని ఆయన అపొస్తలులలో కొందరు నిజంగా చూశారా? మత్తయి 17:1-7 ఇలా చెప్తుంది: “ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.” ఎంత నాటకీయ సంఘటనో కదా ! “ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.” అంతేకాక “ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను;” తర్వాత ఇలా చెప్తున్న దేవుని స్వరాన్ని వాళ్లు విన్నారు: “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట విను[డి].” “శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి—లెండి, భయపడకుడని చెప్పెను.”

6. (ఎ) రూపాంతరాన్ని యేసు దర్శనం అని ఎందుకు పిలిచాడు? (బి) రూపాంతరం దేనికి పూర్వదర్శనంగా ఉంది?

6 సంభ్రమాశ్చర్యాలను కల్గించే ఈ సంఘటన యేసూ, ముగ్గురు అపొస్తలులూ ఆ రాత్రి గడిపిన హెర్మోను పర్వత శిఖరాల్లోని ఒక దానిపై జరిగి ఉండవచ్చు. అది మరింత స్పష్టంగా కనిపించేలా ఆ రూపాంతరం రాత్రివేళలోనే జరిగి ఉంటుంది. యేసు దాన్ని దర్శనం అని పిలవడానికి ఒక కారణం ఏమిటంటే, ఎంతోకాలం క్రిందటే చనిపోయిన మోషే ఏలీయాలు అక్షరార్థంగా అక్కడ హాజరుకాలేదు. నిజానికి క్రీస్తు మాత్రమే అక్కడ ఉన్నాడు. (మత్తయి 17:8, 9) దిగ్భ్రమ కలిగించే అలాంటి ప్రదర్శన పేతురు యాకోబు యోహానులకు యేసు రాజ్యాధికారాన్ని పొందిన మహిమాయుక్తమైన ప్రత్యక్షతను గూర్చిన అద్భుతమైన పూర్వదర్శనాన్ని ఇచ్చింది. మోషే, ఏలీయాలు, యేసుక్రీస్తు యొక్క అభిషిక్త తోటి వారసులకు చిత్రీకరణగా ఉన్నారు. అంతేగాక, యేసు రాజ్యాన్ని గూర్చీ, తన భావి రాచరికాన్ని గూర్చీ ఇచ్చిన సాక్ష్యాన్ని ఆ దర్శనం శక్తివంతంగా బలపర్చింది.

7. రూపాంతరాన్ని గూర్చి పేతురుకు స్పష్టంగా జ్ఞాపకముందని మనకెలా తెలుసు?

7 క్రైస్తవ సంఘంలో కీలకపాత్రను వహించనైయున్న ముగ్గురు అపొస్తలుల విశ్వాసాన్ని ఈ రూపాంతరం బలపర్చింది. ప్రకాశిస్తున్న క్రీస్తు ముఖం, తెల్లగా ధగధగ మెరుస్తున్న ఆయన వస్త్రాలు, తామెవరి మాట వినాలో ఆ యేసే తన ప్రియ కుమారుడని చెప్పిన దేవుని స్వరం—ఇదంతా ఎంతో ప్రభావవంతంగా దాని ఉద్దేశ్యాన్ని నెరవేర్చింది. కానీ యేసు పునరుత్థానం అయ్యేంతవరకు అపొస్తలులు దాని గురించి ఎవరికీ చెప్పకూడదు. దాదాపు 32 ఏళ్ల తర్వాత, ఆ రూపాంతరం పేతురు మనస్సులో ఇంకా సజీవ చిత్రంగానే ఉంది. దాన్ని, దాని ప్రాధాన్యాన్ని సూచిస్తూ ఆయనిలా వ్రాశాడు: “చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క శక్తిని ఆయన రాకడను [“ప్రత్యక్షతను,” NW] మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచినవారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్యమహిమనుండి ఆయనయొద్దకు వచ్చినప్పుడు, తండ్రియైన దేవునివలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతోకూడ ఉండినవారమై, ఆ శబ్దము ఆకాశమునుండి రాగా వింటిమి.”—2 పేతురు 1:16-18.

8. (ఎ) తన కుమారునికి సంబంధించి దేవుడు పలికిన మాటలు దేనిపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తున్నాయి? (బి) రూపాంతరంలో కనిపించిన మేఘము ఏమని సూచిస్తుంది?

8 దేవుడు చేసిన ప్రకటనే అందులో అత్యంత ప్రాముఖ్యమైన భాగం: “ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట విను[డి].” ఈ ప్రకటన, సింహాసనాసీనుడైన దేవుని రాజుగా యేసుపై లక్ష్యాన్ని కేంద్రీకరిస్తోంది, ఆయనకు సర్వ సృష్టీ సంపూర్ణ విధేయతను సమర్పించాలి. కమ్ముకున్న మేఘం, ఈ దర్శన నెరవేర్పు అదృశ్యంగా ఉంటుందని సూచించింది. రాజ్యమహిమతో కూడిన యేసు అదృశ్య ప్రత్యక్షతను గూర్చిన ‘సూచనను’ గుర్తించే వాళ్లు వివేచనా నేత్రాలతో మాత్రమే గ్రహించగలరనీ అది సూచించింది. (మత్తయి 24:3) నిజానికి, తాను మృతులలో నుంచి లేచేంత వరకూ ఆ దర్శనాన్ని గురించి ఎవరితోను చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించడం, ఆయన పునరుత్థానమైన తర్వాతనే ఉన్నతపర్చబడటం, మహిమపర్చబడటం జరుగుతుందన్న విషయాన్ని చూపిస్తోంది.

9. రూపాంతరం మన విశ్వాసాన్ని ఎందుకు బలపర్చాలి?

9 రూపాంతరాన్ని గూర్చి ప్రస్తావించిన తర్వాత పేతురు ఇలా చెప్పాడు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు. ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:19-21) ఈ రూపాంతరం దేవుని ప్రవచన వాక్య విశ్వసనీయతను నొక్కిచెబుతోంది. దైవిక మద్దతు లేదా అంగీకారం లేని ‘చమత్కారంగా కల్పించబడిన కథలపై’ కాక దేవుని వాక్యంపై మన లక్ష్యాన్ని నిలపాలి. ప్రవచన వాక్యంపై మన విశ్వాసం రూపాంతరం చేత బలపర్చబడాలి, ఎందుకంటే యేసు మహిమను, రాజ్యాధికారాన్ని ముందుగా చూపిన ఆ దర్శనం ఒక వాస్తవమైంది. అవును, క్రీస్తు నేడు శక్తిమంతమైన పరలోక రాజుగా ఉన్నాడనేందుకు మనకు తిరుగులేని నిదర్శనముంది.

వేకువచుక్క ఎలా పొడుస్తుంది

10. పేతురు ప్రస్తావించిన “వేకువచుక్క” ఎవరు లేక ఏమిటి, మీరలా అనటానికి కారణమేమిటి?

10 పేతురు ఇలా వ్రాశాడు: “తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయంచువరకు ఆ [ప్రవచన] వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” “వేకువచుక్క” ఎవరు లేక ఏమిటి? “వేకువచుక్క” అన్న పదం తెలుగు బైబిలులో మూడుసార్లు కనబడుతుంది. ప్రకటన 22:16వ వచనం, యేసుక్రీస్తుని “ప్రకాశమానమైన వేకువచుక్క” అని పిలుస్తుంది. సంవత్సరంలోని ఫలానా ఋతువుల్లో అలాంటి నక్షత్రాలు, తూర్పున ఉదయించే ఆఖరి నక్షత్రాలై ఉంటాయి. అవి సూర్యుడు కనిపించబోయే ముందు ఉదయించి, అలా అవి, క్రొత్త దినారంభాన్ని ప్రకటిస్తాయి. పేతురు, “వేకువచుక్క” అన్న పదాన్ని రాజ్యాధికారాన్ని పొందిన యేసును సూచించడానికి ఉపయోగించాడు. అప్పుడు, యేసు మన భూమితోపాటు విశ్వమంతటిపైనా ఉదయించాడు ! ఆయన మెస్సీయా వేకువచుక్కగా, విధేయులైన మానవజాతి అంతటిపైనా ఉదయించే ఒక క్రొత్త దినాన్ని లేక యుగాన్ని గురించి ప్రకటిస్తున్నాడు.

11. (ఎ) ఎందుకని “వేకువచుక్క” మానవ భౌతిక హృదయాల్లో ఉదయిస్తుందని 2 పేతురు 1:19 భావం కాదు? (బి) 2 పేతురు 1:19ని మీరెలా వివరిస్తారు?

11 అనేక బైబిలు అనువాదాలు, 2 పేతురు 1:19 లో నమోదు చేయబడిన పేతురు మాటలు భౌతిక హృదయాన్ని సూచిస్తున్నాయన్న తలంపునిస్తున్నాయి. ఒక ప్రౌఢవ్యక్తి హృదయం 250-300 గ్రాముల బరువు ఉంటుంది. ఇప్పుడు పరలోకంలో మహిమాన్వితుడైన అమర్త్యాత్మ ప్రాణియైన యేసుక్రీస్తు, చిన్నవైన ఆ మానవ అవయవాల్లో ఎలా ఉదయించగలడు? (1 తిమోతి 6:16) నిజమే, ఆ విషయంలో మన అలంకారిక హృదయాలు చేరి ఉన్నాయి, వాటితోనే మనం దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచుతాము. కానీ 2 పేతురు 1:19 జాగ్రత్తగా గమనిస్తే “మీ హృదయములలో” అన్న పదాల నుంచి “తెల్లవారి వేకువచుక్క” అన్న పదాలను వేరుచేసేందుకు వాటి మధ్య ఒక కామాను న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ బైబిలు ఉపయోగిస్తుంది. ఆ వచనాన్ని ఈ విధంగా వ్యక్తం చేయవచ్చు: ‘ఇంతకంటే స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క ఉదయించువరకు, మీ హృదయములనే చీకటిగల చోటున ఆ [ప్రవచన] వాక్యము వెలుగిచ్చు దీపంలా ఉన్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.’

12. లోకంలోని మానవ హృదయాల పరిస్థితి ఏమిటి, కానీ యథార్థ క్రైస్తవుల స్థితి ఏమిటి?

12 లోకంలోని పాపులైన మానవజాతి అలంకారిక హృదయ పరిస్థితి ఏమిటి? వారి హృదయాలు ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉన్నాయి ! అయితే మనం నిజ క్రైస్తవులమైనట్లైతే, మరో విధంగానైతే అంధకారంలో ఉండి ఉండే మన హృదయాల్లో అది వెలుగిచ్చు దీపంలా ఉంది. పేతురు మాటలు సూచిస్తున్నట్లుగా, నిజ క్రైస్తవులు ప్రకాశవంతమైన దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యం ఉంచటం ద్వారా అప్రమత్తంగా ఉంటారు, అలాగే, కొత్త దినారంభాన్ని గురించి తెలుసుకుని ఉంటారు. ఆ వేకువచుక్క మానవుల భౌతిక హృదయాల్లో కాదు గానీ సమస్త సృష్టి పైన ఉదయించిందన్న వాస్తవాన్ని ఎరిగిన వారై ఉంటారు.

13. (ఎ) వేకువచుక్క ఇప్పటికే ఉదయించిందని మనమెందుకు నమ్మకంగా ఉండగలము? (బి) మన కాలాన్ని గూర్చి యేసు ముందే చెప్పిన కష్టాల్ని క్రైస్తవులు ఎందుకు సహించగలరు?

13 వేకువచుక్క ఇప్పటికే ఉదయించింది ! తన ప్రత్యక్షతను గూర్చి యేసు చెప్పిన గొప్ప ప్రవచనంపై లక్ష్యం ఉంచటం ద్వారా మనం దాని గురించి నమ్మకంతో ఉండవచ్చు. ఈనాడు, ఆ ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్న అకాల యుద్ధాలు, కరవులు, భూకంపాలు, ప్రపంచ వ్యాప్త సువార్త ప్రకటన వంటి సంఘటనలను మనం అనుభవిస్తున్నాం. (మత్తయి 24:3-14) క్రీస్తు ముందే చెప్పినట్లుగా క్రైస్తవులముగా మనం క్లిష్టకాలాల్ని ఎదుర్కుంటున్నప్పటికీ, మనం శాంతి సంతోష హృదయాలతో వాటిని సహిస్తున్నాము. ఎందుకు? ఎందుకంటే మనం దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యం ఉంచుతాము, భవిష్యత్తు కోసం ఆయన చేసిన వాగ్దానాలపై విశ్వాసం ఉంచుతాము. “అంత్యకాలము”లోని చివరి దశకు వచ్చినందువల్ల మనం మంచి కాలాల ముంగిటిలో ఉన్నామని మనకు తెలుసు ! (దానియేలు 12:4) యెషయా 60:2వ వచనంలో ప్రవచించబడిన ప్రమాదభరితమైన పరిస్థితుల్లో లోకం ఉంది: “చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటికచీకటి జనములను కమ్ముచున్నది.” ఎవరైనా ఈ చీకటిలో ఎలా తన మార్గాన్ని కనుగొనగలరు? ఎవరైనా ఆలస్యంకాక ముందే దేవుని ప్రవచన వాక్యంపై వినయంతో లక్ష్యముంచాలి. యథార్థహృదయులు, జీవానికీ వెలుగుకీ మూలమైన యెహోవా దేవునివైపుకు తిరగాలి. (కీర్తన 36:9; అపొస్తలుల కార్యములు 17:28) ఇలా చేయటం వల్ల మాత్రమే ఎవరైనా నిజమైన జ్ఞానోదయాన్నీ విధేయులైన మానవజాతి కోసం దేవుడు సంకల్పించిన మహత్తరమైన భవిష్యత్తును పొందగలనన్న నిరీక్షణనూ కల్గివుండగలరు.—ప్రకటన 21:1-5.

“వెలుగు లోకములోనికి వచ్చెను”

14. బైబిల్లోని అద్భుతమైన ప్రవచనాల నెరవేర్పును చూడాలంటే మనం ఏమి చేయాల్సి ఉంది?

14 యేసుక్రీస్తు ఇప్పుడొక రాజుగా పరిపాలిస్తున్నాడని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన 1914 లో అధికారానికి వచ్చినందువల్ల, అద్భుత ప్రవచనాలు ఇంకా నెరవేరనై ఉన్నాయి. వాటి నెరవేర్పును చూడాలంటే, అజ్ఞానాన్నిబట్టి చేసిన పాపపు పనులకూ, పాపాలకూ పశ్చాత్తాపపడుతూ, యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని ప్రదర్శించే సాత్వికులమై ఉండాలి. నిజమే, చీకటిని ప్రేమించేవారు నిత్యజీవాన్ని పొందరు. యేసు ఇలా అన్నాడు: “ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకురాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.”—యోహాను 3:19-21.

15. దేవుడు తన కుమారుని ద్వారా సాధ్యపర్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది?

15 యేసు ద్వారా ఆధ్యాత్మిక వెలుగు ఈ లోకంలోకి వచ్చింది, కాబట్టి ఆయన చెప్పేది వినటం అగత్యం. పౌలు ఇలా వ్రాశాడు: “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను.” (హెబ్రీయులు 1:1, 2) దేవుడు తన కుమారుని ద్వారా సాధ్యపర్చిన రక్షణను మనం తిరస్కరిస్తే ఏమి జరుగుతుంది? పౌలు ఇలా చెప్పాడు: “ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను.” (హెబ్రీయులు 2:2-4) అవును, ప్రవచన వాక్య ప్రకటనకు యేసే కేంద్రబిందువు.—ప్రకటన 19:10.

16. యెహోవా దేవుని ప్రవచనాలన్నింటిపైనా మనం ఎందుకు పూర్తి నమ్మకాన్ని కలిగివుండగలము?

16 మనం గమనించినట్లుగా పేతురు ఇలా చెప్పాడు: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్ట[దు].” స్వయంగా మానవులు నిజమైన ప్రవచనాన్ని ఎప్పుడూ ప్రవచించలేరు, అయితే దేవుని ప్రవచనాలన్నింటిపైనా మనం పూర్తి నమ్మకాన్ని కల్గివుండొచ్చు. అవి యెహోవా దేవుని దగ్గర నుంచే వచ్చాయి. బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో అర్థం చేసుకోవటానికి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకులకు సహాయం చేశాడు. నిజానికి, 1914 నుంచీ అలాంటి అనేక ప్రవచనాల నెరవేర్పును చూడగల్గినందుకు మనం యెహోవాకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ దుష్ట విధానపు అంతాన్ని గూర్చిన మిగిలిన ప్రవచనాలన్నీ ముమ్మాటికీ నెరవేరతాయని మనం నమ్మకంతో ఉన్నాము. మనం మన వెలుగును ప్రకాశింపజేస్తుండగా దైవిక ప్రవచనాలపై లక్ష్యాన్ని నిలుపుతూ ఉండటం అగత్యం. (మత్తయి 5:16) ఈనాడు భూమిని కమ్ముకుంటున్న ‘చీకటిలో మన కోసం వెలుగు ప్రకాశించేలా’ చేస్తున్నందుకు యెహోవాకు మనం ఎంత కృతజ్ఞులమో గదా !—యెషయా 58:10.

17. దేవుని నుంచి ఆధ్యాత్మిక వెలుగు మనకెందుకు అవసరం?

17 భౌతిక సంబంధమైన వెలుగు మనం చూసేలా చేస్తుంది. అంతేగాక అది అనేక రకాల పంటలు పండేలా చేస్తుంది. భౌతిక వెలుగు లేకుండా మనం జీవించలేము. ఆధ్యాత్మిక వెలుగు విషయం ఏమిటి? దేవుని వాక్యమైన బైబిలులో ముందుగా చెప్పబడినట్లుగా అది భవిష్యత్తును చూపిస్తుంది, మనకు నడిపింపునిస్తుంది. (కీర్తన 119:105) యెహోవా దేవుడు ప్రేమపూర్వకంగా ‘తన వెలుగును సత్యమును పంపిస్తున్నాడు.’ (కీర్తన 43:3) అలాంటి ఏర్పాట్లకు నిశ్చయంగా మనం లోతైన మెప్పుదలను చూపించాలి. కాబట్టి మన సూచనార్థక హృదయాన్ని మరింతగా వెలిగించేలా, ‘దేవుని మహిమను గూర్చిన జ్ఞానపు’ వెలుగును పొందటానికి మనం చేయగలిగినంతా చేద్దాం.—2 కొరింథీయులు 4:5-6; ఎఫెసీయులు 1:18.

18. యెహోవా యొక్క వేకువచుక్క ఇప్పుడు ఏమి చేయటానికి సిద్ధంగా ఉంది?

18 వేకువచుక్కయైన యేసుక్రీస్తు 1914 లో విశ్వమంతటిపైనా ఉదయించాడనీ, రూపాంతర దర్శన నెరవేర్పు మొదలైందనీ తెలుసుకున్నందుకు మనం ఎంత ఆశీర్వదించబడిన వారమో గదా ! రూపాంతరంలోని తర్వాతి నెరవేర్పైన “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధ”మును చేపట్టడానికి యెహోవా యొక్క వేకువచుక్క ఇప్పుడు రంగంపై సిద్ధంగా ఉంది. (ప్రకటన 16:14, 16) ఈ పాత విధానం తుడిచిపెట్టుకు పోయినప్పుడు, విశ్వ సర్వాధిపతిగానూ, నిజ ప్రవచనానికి దేవునిగానూ ఆయనను నిరంతరమూ మనం స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉండగల ‘క్రొత్త ఆకాశాల్ని గూర్చిన, క్రొత్త భూమిని గూర్చిన’ తన వాగ్దానాన్ని యెహోవా నెరవేరుస్తాడు. (2 పేతురు 3:13) ఆ మహా దినము వరకు, దేవుని ప్రవచన వాక్యంపై లక్ష్యముంచటం ద్వారా దైవిక వెలుగులో నడుస్తూ ఉందాము.

మీరెలా జవాబిస్తారు?

• యేసు రూపాంతరాన్ని మీరెలా వర్ణిస్తారు?

• రూపాంతరం విశ్వాసాన్ని ఎలా ప్రోది చేస్తుంది?

• యెహోవా యొక్క వేకువచుక్క ఎవరు లేక ఏమిటి, అది ఎప్పుడు ఉదయించింది?

• దేవుని ప్రవచన వాక్యంపై మనం ఎందుకు లక్ష్యముంచాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

రూపాంతరం యొక్క సూచనను మీరు వివరించగలరా?

[15వ పేజీలోని చిత్రం]

వేకువచుక్క ఇప్పటికే ఉదయించింది. ఎప్పుడు, ఎలా మీకు తెలుసా?