కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యులను చేయడానికి ప్రకటించండి

శిష్యులను చేయడానికి ప్రకటించండి

శిష్యులను చేయడానికి ప్రకటించండి

“ప్రిస్కిల్ల అకులయు విని, అతని [అపొల్లోను] చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.”​అపొస్తలుల కార్యములు 18:26.

మొదటి శతాబ్దపు క్రైస్తవ దంపతులైన ప్రిస్కిల్ల, అకుల ఎఫెసు నగరంలోని సమాజమందిరంలో అపొల్లో ప్రసంగించడం గమనించారు. అపొల్లో తన అనర్గళ ప్రసంగాలతో, ఒప్పింపజేసే సామర్థ్యంతో తన ప్రేక్షకుల అవధానం చూరగొన్నాడు. అతడు ‘ఆత్మయందు తీవ్రపడి, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించాడు.’ అయితే, అపొల్లో “యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడు” అని స్పష్టమవుతోంది. క్రీస్తును గురించి అపొల్లో ప్రకటించినది సత్యమే అయినప్పటికీ అది సంపూర్ణంగా లేదు. సమస్యేమిటంటే అది చేరవలసినంత లోతుకు చేరలేదు. యెహోవా సంకల్ప నెరవేర్పులో యేసుక్రీస్తు పాత్రకు సంబంధించిన తన పరిజ్ఞానాన్ని అపొల్లో వృద్ధిచేసుకోవాలి.​—⁠అపొస్తలుల కార్యములు 18:24-26.

2 క్రీస్తు ఆజ్ఞాపించిన “వాటినన్నిటిని” పాటించగల వ్యక్తిగా తయారయ్యేలా అపొల్లోకు సహాయం చేసేందుకు ప్రిస్కిల్ల, అకుల జంకకుండా ముందుకొచ్చారు. (మత్తయి 28:​19, 20) వారు అపొల్లోను ‘చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచారని’ ఆ వృత్తాంతము చెబుతోంది. అయితే, కొంతమంది క్రైస్తవులు అపొల్లోకు బోధించేందుకు అయిష్టపడడానికి దారితీసివుండగల, అతనికి సంబంధించిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఎలాంటి వాస్తవాలు? అపొల్లోతో లేఖనాలు చర్చించడానికి ప్రిస్కిల్ల, అకుల చేసిన ప్రయత్నాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించడంపై దృష్టినిలిపేందుకు ఈ చారిత్రక వృత్తాంతాన్ని సమీక్షించడం మనకెలా సహాయం చేయగలదు?

ప్రజలపై దృష్టి నిలపండి

3 యూదా వంశంలో జన్మించిన అపొల్లో బహుశా అలెక్సంద్రియ నగరంలో పెరిగి ఉంటాడు. అలెక్సంద్రియ ఆ కాలంలో ఐగుప్తుకు రాజధాని, అది ఉన్నత విద్యా కేంద్రమే కాక అక్కడున్న పెద్ద గ్రంథాలయాన్నిబట్టి అది పేరుగాంచింది. ఆ నగరంలో విద్వాంసులతో సహా యూదుల జనాభా అధికంగా ఉండేది. అందువల్ల, సెప్టాజింట్‌ అని పిలువబడే, హెబ్రీ లేఖనాల గ్రీకు అనువాదం అక్కడే తయారైంది. కాబట్టి అపొల్లో “లేఖనములయందు ప్రవీణుడై” ఉన్నాడంటే అందులో ఆశ్చర్యం లేదు. అకుల, ప్రిస్కిల్ల డేరాలు కుట్టేవారు. అపొల్లో అనర్గళత వారిని భయపెట్టిందా? లేదు. ప్రేమనుబట్టి వారు ఆ వ్యక్తిని, అతని అవసరాలను పరిగణలోకి తీసుకొని, అతనికెలా సహాయం చేయగలమా అని ఆలోచించారు.

4 అపొల్లో ఎంత అనర్గళ ప్రసంగీకుడైనా, అతనికి ఉపదేశం అవసరం. అతనికి అవసరమైన సహాయం ఏ విశ్వవిద్యాలయంలోనో కాదుగాని తోటి క్రైస్తవ సంఘ సభ్యులవద్దే లభిస్తుంది. రక్షణకోసం దేవుని ఏర్పాటును గురించి మరింత ప్రామాణిక అవగాహననిచ్చే అంశాలనుండి అపొల్లో ప్రయోజనం పొందబోతున్నాడు. ప్రిస్కిల్ల, అకుల “అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదప[రిచారు].”

5 ప్రిస్కిల్ల, అకుల ఆధ్యాత్మికంగా బలంగా, విశ్వాసంలో స్థిరంగా పాతుకుని ఉన్నారు. అంతేకాకుండా వారు ధనికుడైనా, బీదవాడైనా, విద్వాంసుడైనా లేదా దాసుడైనా ‘తమలోవున్న నిరీక్షణ గురించి హేతువు అడుగు ప్రతివానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నారు.’ (1 పేతురు 3:​15) అకుల అతని భార్య ‘దేవుని వాక్యము సరిగా ఉపదేశించే’ సామర్థ్యంతో ఉన్నారు. (2 తిమోతి 2:​15) వారు లేఖనాలను పరిశీలనాత్మకంగా అధ్యయనం చేసేవారు. ‘సజీవమైనదైన, బలముగలదైన దేవుని వాక్యం’ ఆధారంగా హృదయానికి తాకేలా ఇవ్వబడ్డ ఉపదేశాన్నిబట్టి అపొల్లో బాగా కదిలించబడ్డాడు.​—⁠హెబ్రీయులు 4:12.

6 అపొల్లో తన బోధకుల మాదిరికి ముగ్ధుడై, శిష్యులను చేయడంలో మరింత నిష్ణాతుడయ్యాడు. ప్రత్యేకించి యూదుల మధ్య సువార్త ప్రకటనా పనిలో పూర్తి ప్రయోజనం సాధించేందుకు అతను తన పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించాడు. క్రీస్తును గురించి యూదులను ఒప్పించడానికి అపొల్లో అసాధారణ రీతిలో ఉపయోగపడ్డాడు. ఆయన ‘లేఖనాల్లో ప్రవీణుడైన’ కారణంగా ప్రాచీనకాల ప్రవక్తలందరూ రాబోయే క్రీస్తుకోసం ఎదురు చూశారని వారికి నిరూపించగలిగాడు. (అపొస్తలుల కార్యములు 18:​24) అపొల్లో ఆ తర్వాత అకయకువెళ్లి, ‘దేవుని కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేశాడని, యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడని’ కూడా ఆ వృత్తాంతం తెలియజేస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 18:27, 28.

ఇతర బోధకుల మాదిరినుండి నేర్చుకోండి

7 అకుల, ప్రిస్కిల్ల ప్రవీణతగల దేవుని వాక్య బోధకులుగా ఎలా తయారయ్యారు? పట్టుదలగాచేసే వ్యక్తిగత అధ్యయనంతో పాటు కూటాలకు క్రమంగా హాజరుకావడం, అపొస్తలుడైన పౌలుతో సన్నిహితంగా సహవసించడం వారికి చాలా సహాయం చేసి ఉండవచ్చు. కొరింథులో పౌలు ప్రిస్కిల్ల, అకులతో వారింట్లో దాదాపు 18 నెలలపాటు నివసించాడు. వారు డేరాలు కుడుతూ బాగుచేస్తూ కలిసి పనిచేశారు. (అపొస్తలుల కార్యములు 18:​2, 3) వారిమధ్య లోతైన లేఖన సంభాషణలు ఎంతగా చోటుచేసుకుని ఉంటాయో ఊహించండి. పౌలుతో అలాంటి సహవాసం వారి ఆధ్యాత్మికతను ఎంతగా బలపరచి ఉంటుందో గదా! “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును” అని సామెతలు 13:⁠20 చెబుతోంది. మంచి సహవాసం వారి ఆధ్యాత్మిక నడవడిపై చక్కని ప్రభావం చూపింది.​—⁠1 కొరింథీయులు 15:33.

8 ప్రిస్కిల్ల, అకుల పౌలును రాజ్య ప్రచారకునిగా గమనించినప్పుడు ఆయనలో ఓ మంచి బోధకుని అద్భుత మాదిరిని వారు చూశారు. ఆయన “ప్రతి విశ్రాంతిదినమున [కొరింథు] సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను” అని అపొస్తలుల కార్యముల వృత్తాంతం చెబుతోంది. ఆ తర్వాత ఆయనను సీల, తిమోతి కలుసుకున్నప్పుడు “పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.” సమాజమందిర సభ్యుల్లో ఏ మాత్రం ఆసక్తి కనబడనప్పుడు, పౌలు తన ప్రకటనా కేంద్రాన్ని మరింత అనుకూలమైన స్థలానికి అంటే సమాజమందిరానికి ఆనుకునివున్న ఇంటికి మార్చడాన్ని ప్రిస్కిల్ల, అకుల గమనించారు. అక్కడ పౌలు “సమాజమందిరపు అధికారియైన” క్రిస్పు శిష్యుడు కావడానికి సహాయం చేయగలిగాడు. అతనిని శిష్యునిగా చేయడం ఆ ప్రాంతంలో ఫలవంతమైన గొప్ప ప్రభావాన్ని చూపిందని బహుశా ప్రిస్కిల్ల, అకుల గమనించేవుంటారు. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “క్రిస్పు తన యింటివారందరితో కూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 18:4-8.

9 క్షేత్ర పరిచర్యలో పౌలు చూపిన మాదిరిని ప్రిస్కిల్ల, అకులవంటి ఇతర రాజ్య ప్రచారకులు అనుకరించారు. అపొస్తలుడైన పౌలు ఇతర క్రైస్తవులకిలా హితవుచెప్పాడు: “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి.” (1 కొరింథీయులు 11:⁠1) పౌలు మాదిరికి అనుగుణంగా, ప్రిస్కిల్ల, అకుల క్రైస్తవ బోధలను మరింత ఖచ్చితంగా అర్థంచేసుకోవడానికి అపొల్లోకు సహాయం చేయగా, అపొల్లో మరితరులకు సహాయపడ్డాడు. రోమాలో, కొరింథులో, ఎఫెసులో శిష్యులను చేయడంలో ప్రిస్కిల్ల, అకుల నిస్సందేహంగా సహాయం చేశారు.​—⁠అపొస్తలుల కార్యములు 18:1, 2, 18, 19; రోమీయులు 16:3-5.

10 అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయపు పరిశీలన నుండి మనమేమి నేర్చుకోగలము? పౌలు నుండి అకుల ప్రిస్కిల్ల నేర్చుకొన్నట్లే, దేవుని వాక్యాన్ని చక్కగా బోధించేవారి మాదిరిని అనుసరించడం ద్వారా మనం శిష్యులనుచేసే సామర్థ్యాన్ని వృద్ధిచేసుకోవచ్చు. “వాక్యము బోధించుటయందు ఆతురతగల” వారితో, ఇతరులకు “దృఢముగా సాక్ష్యమిచ్చు” వారితో మనం సహవాసం చేయవచ్చు. (అపొస్తలుల కార్యములు 18:⁠5) ఒప్పింపజేసే బోధనా నైపుణ్యంతో వారెలా ప్రజల హృదయం చేరుతున్నారో మనం గమనించవచ్చు. అలాంటి నైపుణ్యాలు శిష్యులను చేయడంలో మనకు సహాయపడగలవు. ఒక వ్యక్తి మనతో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, అతను ఇతర కుటుంబ సభ్యులను లేదా పొరుగువారిని అధ్యయనానికి ఆహ్వానించవచ్చని మనం సూచించవచ్చు. లేదా మనం బైబిలు అధ్యయనం ప్రతిపాదించగల ఇతరులను గురించి మనకు చెప్పమని అతనిని అడుగవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 18:6-8.

శిష్యులను చేసేందుకు అవకాశాలు కల్పించుకోండి

11 పౌలు, అతని తోటి క్రైస్తవులు ఇంటింటా, సంత వీధుల్లో, ప్రయాణాల్లో​—⁠నిజానికి ప్రతీచోటా ప్రకటిస్తూ శిష్యులను చేయడానికి ప్రయత్నించారు. శిష్యులను చేయడానికి ప్రయత్నించే ఆసక్తిగల రాజ్య పనివారిగా మీ క్షేత్ర సేవా కార్యకలాపాలను మీరు విస్తృతపరచుకోగలరా? యోగ్యులైన వారిని కనుగొని వారికి ప్రకటించే అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోగలరా? మన తోటి సువార్త ప్రచారకులు శిష్యులను కనుగొన్న కొన్ని మార్గాలేమిటి? మనం మొదట టెలిఫోను సాక్ష్యమిచ్చే క్షేత్రాన్ని చూద్దాం.

12 బ్రెజిల్‌లో ఇంటింటి సేవచేస్తూ ఒక క్రైస్తవురాలు, ఆమెను మనం మారీయ అని పిలుద్దాం, అపార్టుమెంటు నుండి బయటకు వస్తున్న ఓ యువతికి కరపత్రమిచ్చింది. ఆ కరపత్రపు శీర్షికను ఉపోద్ఘాతంగా ఉపయోగిస్తూ మారీయ ఇలా అడిగింది, “మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా?” దానికి ఆ యువతి, “నాకు చాలా ఇష్టం. కానీ సమస్యేమిటంటే నేను టీచర్‌ని, పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే దినమంతా గడిచిపోతుంది” అని చెప్పింది. బైబిలు అంశాలను టెలిఫోను ద్వారా పరిశీలించవచ్చని మారీయ వివరించింది. ఆ యువతి మారీయకు తన ఫోన్‌ నంబరు ఇవ్వడంతో, ఆ సాయంత్రమే టెలిఫోను ద్వారా దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ ఉపయోగిస్తూ ఆమె అధ్యయనం ఆరంభించింది. *

13 ఇథియోపియాలో పూర్తికాల పరిచారకురాలు ఒకాయనకు టెలిఫోను సాక్ష్యమిస్తుండగా ఫోన్‌లో అతని మాటలతోపాటు వెనుకనుండి వస్తున్న కేకలు విని ఆమె ఉలిక్కిపడింది. మళ్లీ ఫోన్‌ చేయండని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఆమె ఫోన్‌ చేసినప్పుడు, అతను క్షమాపణ అడుగుతూ, ముందు ఫోన్‌ చేసినప్పుడు తను తన భార్య తీవ్రంగా వాదించుకుంటున్నట్టు చెప్పాడు. ఆ మాటల్ని ఓ అవకాశంగా తీసుకొని ఆ సహోదరి కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడానికి బైబిలిచ్చే జ్ఞానవంతమైన నిర్దేశాన్ని సూచిస్తూ, యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యం అనే పుస్తకం చాలా కుటుంబాలకు సహాయం చేసిందని అతనికి వివరించింది. పుస్తకం ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆ సహోదరి అతనికి మళ్లీ ఫోన్‌ చేసింది. అతను పట్టలేని ఆనందంతో, “ఈ పుస్తకం మా వివాహాన్ని కాపాడిందండి!” అని చెప్పాడు. నిజానికి అతను పుస్తకంలో తాను చదివిన చక్కని అంశాలు చెప్పాలని కుటుంబాన్ని సమావేశపరిచాడు. గృహ బైబిలు అధ్యయనం ఆరంభించబడింది, కొద్దిరోజుల్లోనే అతను క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం ఆరంభించాడు.

14 డెన్మార్క్‌లో టెలిఫోను సాక్ష్యమిచ్చి బైబిలు అధ్యయనం ఆరంభించిన ఓ రాజ్య ప్రచారకురాలు ఇలా చెబుతోంది: “టెలిఫోను సాక్ష్యంలో పాలుపంచుకోవల్సిందిగా సేవా పైవిచారణకర్త నన్ను ప్రోత్సహించాడు. మొదట్లో, ‘అది నావల్ల కాదని’ చెప్పి నేను వెనుకంజవేశాను. అయితే ఒకరోజు, ధైర్యం తెచ్చుకొని మొదటి గృహస్థునికి నెంబరు డయల్‌ చేయడం ప్రారంభించాను. అవతల సోన్య టెలిఫోను అందుకుంది, అలా కాస్సేపు మాట్లాడిన తర్వాత బైబిలు ఆధారిత సాహిత్యాలు తీసుకోవడానికి ఆమె అంగీకరించింది. ఓ సాయంకాలం మేము సృష్టికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాము, దానితో ఆమె జీవము—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం మూలంగానా లేక సృష్టి మూలంగానా? * (ఆంగ్లం) పుస్తకం చదవడానికి ఇష్టపడింది. వ్యక్తిగతంగా కలిసి ఆ అంశం గురించి మాట్లాడగలిగితే బాగుంటుందని నేనామెకు చెప్పాను. దానికి ఆమె అంగీకరించింది. నేను వెళ్లేసరికి సోన్య సిద్ధంగా ఉంది, అప్పటినుండి ప్రతివారం మేము అధ్యయనం చేశాము.” మన క్రైస్తవ సహోదరి చివరికిలా అంది: “చాలా సంవత్సరాలుగా నేను బైబిలు అధ్యయనం గురించి ప్రార్థించాను, అయితే టెలిఫోను సాక్ష్యం ద్వారా నాకు ఒక అధ్యయనం లభిస్తుందని నేను అనుకోలేదు.”

15 ప్రజలెక్కడ ఉంటే అక్కడ సాక్ష్యమివ్వాలనే సూచనను అన్వయించుకున్న కారణంగా చాలామంది విజయం సాధిస్తున్నారు. అమెరికాలో ఓ క్రైస్తవురాలు పార్కింగ్‌ స్థలంలో ఓ వాణిజ్య వాహనం ప్రక్కనే తన కారు నిలిపింది. ఆ వాహనంలో కూర్చునివున్న ఒక స్త్రీ ఆమెను చూసినప్పుడు, ఆ సహోదరి మన బైబిలు విద్యా పని విధానం గురించి వివరించడం ఆరంభించింది. ఆ స్త్రీ విని, వాహనం దిగి సహోదరి కారు దగ్గరకు వచ్చి, “నాతో మాట్లాడడానికి మీరు ఆగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా మీ సాహిత్యాలు నాకు అందుబాటులో లేవు. అంతేకాదు, నేను మళ్లీ బైబిలు అధ్యయనం చేయాలనుకుంటున్నాను. నాతో మీరు అధ్యయనం చేస్తారా?” అని అడిగింది. ఆ విధంగా మన సహోదరి సువార్త పంచుకోవడానికి ఓ ఆహ్లాదకరమైన పరిస్థితి కల్పించింది.

16 అమెరికాలో ఓ సహోదరి ఒక నర్సింగ్‌హోమ్‌కు వెళ్ళినప్పుడు ఆమెకు ఈ క్రింది అనుభవం కలిగింది: ఆమె మొదట అక్కడ ఆయాపనులు చూసే సంచాలకుని దగ్గరకు వెళ్లి, ఆసుపత్రిలోవున్న వారి ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు తాను స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు ఇష్టపడుతున్నానని అతనికి చెప్పింది. అలాగే ఇష్టపడ్డవారందరికి ప్రతీవారం ఉచిత బైబిలు అధ్యయనం నిర్వహించడానికీ తనకు ఇష్టమేనని కూడా ఆమె తెలియజేసింది. ఆ సంచాలకుడు వివిధ వ్యక్తులున్న గదులు సందర్శించడానికి ఆమెకు అనుమతి ఇచ్చాడు. కొద్దిరోజుల్లోనే ఆమె మొత్తం 26 మందితో వారానికి మూడుసార్లు బైబిలు అధ్యయనం నిర్వహించడం ఆరంభించింది, వారిలో ఒకరు క్రమంగా మన కూటాలకు హాజరు కాగలుగుతున్నారు.

17 కొందరు రాజ్య ప్రచారకులు సూటిగా బైబిలు అధ్యయనం ప్రతిపాదించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఒకరోజు ఉదయం 105 మంది ప్రచారకులున్న ఓ సంఘం, కలిసిన ప్రతి గృహస్థునికి బైబిలు అధ్యయనం ప్రతిపాదించే ప్రత్యేక ప్రయత్నం చేసింది. క్షేత్రసేవకు 86 మంది ప్రచారకులు వచ్చారు, రెండు గంటలు ప్రకటనా పనిచేసిన తర్వాత కనీసం 15 కొత్త బైబిలు అధ్యయనాలు ఆరంభించబడినట్లు వారు తెలుసుకొన్నారు.

యోగ్యులైన వారికోసం నిరంతరం అన్వేషించండి

18 రాజ్య ప్రచారకులుగా మీరు, ఈ ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన సూచనలు ప్రయత్నించాలని కోరుకోవచ్చు. అయితే, సాక్ష్యమిచ్చే విధానాల గురించి ఆలోచించేటప్పుడు స్థానిక ఆచారాలను పరిగణలోకి తీసుకోవడం జ్ఞానయుక్తం. అన్నింటికంటే ముఖ్యంగా, యోగ్యులైన వారికోసం అన్వేషించి అలాంటివారు శిష్యులయ్యేందుకు సహాయపడాలనే యేసు నిర్దేశాన్ని మనం మనస్సులో ఉంచుకొందాం.​—⁠మత్తయి 10:11; 28:19.

19 అది సాధించేందుకు మనం ‘సత్య వాక్యమును సరిగా ఉపదేశిద్దాం.’ లేఖనాలను స్థిరమైన ఆధారంగా చేసుకొని ఒప్పింపజేసే పద్ధతి ద్వారా మనమలా చేయవచ్చు. వినేవారి హృదయాన్ని తాకి, చర్య తీసుకొనేలా వారిని పురికొల్పడానికి ఇది మనకు సహాయం చేస్తుంది. ప్రార్థనాపూర్వకంగా మనం యెహోవాపై ఆధారపడుతుండగా, కొందరైనా యేసుక్రీస్తు శిష్యులు కావడానికి సహాయపడడంలో భాగం వహించగలం. ఇది ఎంత ప్రతిఫలదాయకమైన పనో గదా! కాబట్టి, శిష్యులను చేసే ఉద్దేశంతో ప్రకటించే, ఆసక్తిగల రాజ్య ప్రచారకులుగా మనమన్ని సందర్భాల్లో యెహోవాను ఘనపరుస్తూ ‘దేవుని ఎదుట యోగ్యులుగా కనబరచుకొనుటకు జాగ్రత్తపడుతూ’ ఉందాం.​—⁠2 తిమోతి 2:15.

[అధస్సూచీలు]

^ పేరా 17 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 19 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీకు గుర్తున్నాయా?

• అపొల్లోకు దేవుని మార్గము మరి పూర్తిగా విశదపరచవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది?

• ప్రిస్కిల్ల అకులలు ఏ యే విధాలుగా అపొస్తలుడైన పౌలునుండి నేర్చుకొన్నారు?

అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం నుండి, శిష్యులనుచేసే పనిని గురించి మీరేమి నేర్చుకొన్నారు?

• శిష్యులను చేయడానికి మీరెలా అవకాశాలు కల్పించుకోవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. అపొల్లో “ఆత్మయందు తీవ్రపడి” ఉన్నప్పటికీ, అతనికి ఏమి అవసరమైంది?

2. ప్రిస్కిల్ల, అకుల ఏ సవాలును అంగీకరించారు?

3. అపొల్లో నేపథ్యం ప్రిస్కిల్ల, అకుల అతనికి బోధించకుండా ఎందుకు అడ్డగించలేదు?

4. అవసరమైన సహాయాన్ని అపొల్లో ఎక్కడ, ఎలా పొందాడు?

5. ప్రిస్కిల్ల, అకుల ఆధ్యాత్మికతను గురించి మీరేమి చెప్పగలరు?

6. అపొల్లో తాను పొందిన సహాయాన్ని ప్రశంసించాడని మనకెలా తెలుసు?

7. అకుల, ప్రిస్కిల్ల ప్రావీణ్యంగల బోధకులెలా అయ్యారు?

8. పౌలు పరిచర్యను గమనించడం ద్వారా ప్రిస్కిల్ల, అకుల ఏమి నేర్చుకొన్నారు?

9. పౌలు మాదిరికి ప్రిస్కిల్ల, అకుల ఎలా ప్రతిస్పందించారు?

10. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం నుండి, శిష్యులను చేసే పనిలో సహాయపడగల దేనిని మీరు నేర్చుకొన్నారు?

11. కొత్త శిష్యులను ఎక్కడ కనుక్కోవచ్చు?

12-14. టెలిఫోను సాక్ష్య ప్రయోజనాలను ఉదహరించేందుకు మీ సొంత అనుభవాన్ని లేదా ఈ పేరాల్లోని ఒక దానిని వివరించండి.

15, 16. బైబిలు అధ్యయనాలు ఆరంభించడానికి వివిధ మార్గాల గురించి అప్రమత్తంగా ఉండడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని చూపేందుకు ఎలాంటి అనుభవాలు మీరు వివరించగలరు?

17. గృహ బైబిలు అధ్యయనాలు ఆరంభించేందుకు ఏ విధంగా సమీపించడం తరచూ ఫలవంతంగా ఉంటుంది?

18, 19. యేసు ఇచ్చిన ఏ ప్రాముఖ్యమైన నిర్దేశాన్ని మనం మనస్సులో ఉంచుకోవాలి, అది నెరవేర్చేందుకు మనమేమి చేయడానికి తీర్మానించుకోవాలి?

[18వ పేజీలోని చిత్రం]

ప్రిస్కిల్ల అకుల అపొల్లోకు ‘దేవునిమార్గము మరి పూర్తిగా విశదపరిచారు’

[20వ పేజీలోని చిత్రం]

అపొల్లో శిష్యులను చేయడంలో నిష్ణాతుడయ్యాడు

[21వ పేజీలోని చిత్రం]

పౌలు తాను వెళ్లిన ప్రతీచోట ప్రకటించాడు

[23వ పేజీలోని చిత్రాలు]

ప్రకటించడానికి అవకాశాలు కల్పించుకోండి