కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచి నాయకుల కోసం అన్వేషణ

మంచి నాయకుల కోసం అన్వేషణ

మంచి నాయకుల కోసం అన్వేషణ

“వెళ్ళిపోండి, మీరిక మాకు అవసరం లేదు. దేవుని పేరట వేడుకుంటున్నాను, వెళ్ళిపోండి!”​—⁠ఆలివర్‌ క్రామ్వెల్‌; బ్రిటీష్‌ పార్లమెంటు సభ్యుడైన లియోపోల్డ్‌ అమెరీ ఉల్లేఖించిన మాటలు.

అప్పటికి ఎనిమిది నెలలనుండి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, అది ఎంతో వినాశకరంగా ఉంది. బ్రిటన్‌, దాని మిత్ర దేశాలు యుద్ధంలో ఓడిపోయేలా ఉన్నాయి. లియోపోల్డ్‌ అమెరీ అలాగే ప్రభుత్వంలోని ఇతరులు తమకు కొత్త నాయకుడు కావాలని కోరుకున్నారు. కాబట్టి 1940, మే 7న జరిగిన కామన్స్‌ సభలో, అమెరీ పైన ఉల్లేఖించబడిన మాటలను ప్రధానమంత్రి నెవిల్‌ చాంబర్లేన్‌తో అన్నాడు. మూడు రోజుల తర్వాత చాంబర్లేన్‌ తన పదవినుండి తొలగిపోవడంతో ఆయన స్థానంలో విన్స్‌టన్‌ చర్చిల్‌ అధికారంలోకి వచ్చాడు.

నాయకత్వం వహించడానికి ఒకరు ఉండడం మానవజాతి కనీస అవసరత, అయితే ఎవరో ఒకరు నాయకుడిగా ఉంటే సరిపోదు. కుటుంబంలో కూడా భార్యా పిల్లలు సంతోషంగా ఉండాలంటే తండ్రికి సరిగ్గా నాయకత్వం వహించే సామర్థ్యం ఉండాలి. అలాంటప్పుడు ఒక దేశాన్ని లేదా మొత్తం ప్రపంచాన్నే నడిపించే నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆలోచించండి! మంచి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుండడంలో ఆశ్చర్యం లేదు.

ఫలితంగా వేలాది సంవత్సరాలుగా లెక్కలేనన్ని పట్టాభిషేకాలు, విప్లవాలు, దౌర్జన్యపూరితంగా ప్రభుత్వాలను మార్చడం, పదవుల నియామకాలు, ఎన్నికలు, హత్యలు, పరిపాలనా విధానాలు మార్చబడడం వంటివి జరిగాయి. రాజులు, ప్రధానమంత్రులు, యువరాజులు, దేశాధ్యక్షులు, సెక్రటరీ జనరల్‌లు, నియంతలు మొదలైనవారికి అధికారం ఇవ్వబడింది, వారు అధికారంనుండి తొలగించబడ్డారు. ఊహించని మార్పులవల్ల శక్తివంతులైన పరిపాలకులు కూడా అధికారంలోనుండి తొలగించబడ్డారు. (5వ పేజీలోవున్న “అకస్మాత్తుగా అధికారంనుండి తొలగించబడడం” అనే బాక్సు చూడండి.) అయినా కూడా సమర్థవంతంగా నాయకత్వం వహిస్తూ చాలాకాలం నిలిచే నాయకులను కనుగొనడం కష్టంగానే ఉంది.

‘ఉన్నవాళ్ళతో సర్దుకోవాలా’​—⁠లేక వేరే మార్గం ఉందా?

కాబట్టి మంచి నాయకుడిని కనుగొనే విషయానికి వచ్చేసరికి చాలామంది ఆశ వదులుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాల్లో ప్రజల ఉదాసీనత, నైరాశ్యం ప్రత్యేకించి ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆఫ్రికా విలేఖరి అయిన జెఫ్‌ హిల్‌ ఇలా వ్యాఖ్యానించాడు: “ప్రజలు తమ జీవితాల దయనీయ స్థితిని మార్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు భావించినప్పుడు ఉదాసీనత, [ఓటు వేయడంపట్ల] విముఖత ఎక్కువగా కనిపిస్తాయి. . . . ఆఫ్రికాలో ప్రజలు ఓటు వేయడం లేదంటే దానర్థం వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని కాదు. అది తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని భావించే ప్రజల ఆర్తనాదాన్ని సూచిస్తుంది.” అదేవిధంగా అమెరికాలో రానున్న ఎన్నికల గురించి ఒక వార్తాపత్రిక విలేఖరి ఇలా వ్రాశాడు: “ఒక పరిపూర్ణమైన అభ్యర్థి పోటీ చేస్తే బాగుంటుంది. అయితే అలాంటి వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పటివరకూ అలాంటి వాళ్ళు కనిపించలేదు. మనం ఉన్నవాళ్ళతోనే సర్దుకోవాలి.”

మానవజాతికి అపరిపూర్ణ నాయకులతో ‘సర్దుకోవడం’ తప్ప మరో మార్గం లేదా? మానవ పరిపాలకులు తమ పౌరుల అవసరాలను తీర్చలేకపోయారు కాబట్టి మనకు ఎన్నటికీ మంచి నాయకత్వం లభించదని దానర్థమా? కాదు. అత్యున్నతమైన నాయకత్వం అందుబాటులోనే ఉంది. మానవజాతికి సరైన నాయకుడు ఎవరు, మీతోపాటు అన్ని నేపథ్యాలకు చెందిన కోట్లాదిమందికి ఆయన నాయకత్వం ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది అనే విషయాలను తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

[3వ పేజీలోని చిత్రాలు]

పైన ఎడమవైపు: నెవిల్‌ చాంబర్లేన్‌

పైన కుడివైపు: లియోపోల్డ్‌ అమెరీ

క్రింద: విన్స్‌టన్‌ చర్చిల్‌

[చిత్రసౌజన్యం]

చాంబర్లేన్‌: చిత్రసౌజన్యం Jimmy Sime/Central Press/Getty Images; అమెరీ: చిత్రసౌజన్యం Kurt Hutton/Picture Post/Getty Images; చర్చిల్‌: The Trustees of the Imperial War Museum (MH 26392)