కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనందాన్ని పొందడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు

ఆనందాన్ని పొందడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు

ఆనందాన్ని పొందడానికి బైబిలు మీకు సహాయం చేయగలదు

బైబిలు ఒక వైద్య గ్రంథం కాకపోయినా ఒక వ్యక్తి మానసిక, భౌతిక ఆరోగ్యం మీద సానుకూల భావావేశాలు లేక ప్రతికూల భావావేశాలు చూపించే ప్రభావం గురించి అది వ్యాఖ్యానిస్తోంది. “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును” అని బైబిలు చెబుతోంది. మనమింకా ఇలా చదువుతాం: “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు.” (సామెతలు 17:22; 24:​10) నిరుత్సాహ భావాలు మన శక్తిని హరించివేసి మారాలనే, సహాయం పొందాలనే కోరికే లేకుండా మనం బలహీనులమైపోయినట్లు, దుర్భలులమైనట్లు భావించేలా చేయవచ్చు.

నిరుత్సాహం ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా కూడా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా న్యూనతా భావాలున్న వ్యక్తులు తాము దేవునితో ఎన్నడూ మంచి సంబంధాన్ని అనుభవించలేమని, ఆయన ఆమోదం పొందలేమని భావిస్తారు. ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన సిమోన్‌, తాను “దేవుడు ఆమోదించేలాంటి వ్యక్తేనా” అని అనుమానించేది. అయితే, మనం దేవుని వాక్యమైన బైబిలును పరిశీలిస్తే దేవుడు తనను సంతోషపెట్టాలని ప్రయత్నించేవారిని సానుకూలమైన విధంగా దృష్టిస్తాడని తెలుసుకుంటాం.

దేవునికి నిజంగా శ్రద్ధ ఉంది

“విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును” అని బైబిలు చెబుతోంది. దేవుడు “నలిగిన హృదయమును” అలక్ష్యం చేయడు, అయితే ‘వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తానని నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తానని’ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.​—⁠కీర్తన 34:18; 51:17; యెషయా 57:​15.

దేవుడు తన సేవకులలో ఉన్న మంచిని చూస్తాడనే వాస్తవం వైపు తన శిష్యుల దృష్టిని మళ్ళించాల్సిన అవసరముందని ఒక సందర్భంలో దేవుని కుమారుడైన యేసు గ్రహించాడు. చాలామంది మానవులు అల్పమైనదిగా భావించే ఒక పిచ్చుక భూమ్మీద పడడం దేవుడు గమనిస్తాడని ఆయన ఒక ఉపమానం ద్వారా చెప్పాడు. దేవునికి మానవుల గురించిన అతి చిన్న వివరం తెలుసని, వారి తలమీద ఉన్న వెంట్రుకల సంఖ్య తెలుసని కూడా నొక్కి చెప్పాడు. యేసు తన ఉపమానాన్ని ఇలా చెప్పడం ద్వారా ముగించాడు: “భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (మత్తయి 10:​29-31) * కొందరు తమ గురించి తాము ఎలా భావించినా విశ్వాసమున్న వారు దేవుని దృష్టిలో విలువైనవారు అని యేసు సూచించాడు. వాస్తవానికి అపొస్తలుడైన పేతురు “దేవుడు పక్షపాతి కాడని, . . . ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును” అని మనకు గుర్తు చేస్తున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 10:​34, 35.

సమతుల్యమైన దృక్పథాన్ని కాపాడుకోండి

మనల్ని మనం దృష్టించుకునే విషయంలో సమతుల్యాన్ని వృద్ధిచేసుకోమని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తోంది. అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో ఇలా వ్రాశాడు: “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.”​—⁠రోమీయులు 12:⁠3.

ఖచ్చితంగా మనం గర్విష్ఠులమయ్యేంతగా మనమేదో అధికులమని భావించడానికి ఇష్టపడం, అలాగే దానికి పూర్తి విరుద్ధంగా మనం నిష్ప్రయోజకులమని భావించడానికి కూడా ఇష్టపడం. అయితే మన గురించి మనం సహేతుకమైన దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం అంటే మన బలాలను అలాగే మన పరిమితులను పరిగణలోకి తీసుకొనే దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం మన లక్ష్యంగా ఉండాలి. ఒక క్రైస్తవ స్త్రీ దాన్నిలా వ్యక్తం చేసింది: “నేను మరీ చెడ్డ వ్యక్తినీ కాను, అలాగని నేను ఇతరులకన్నా మంచి వ్యక్తినీ కాను. ఇతరుల్లో ఉన్నట్లే నాలో కూడా మంచి లక్షణాలు, చెడు లక్షణాలు రెండూ ఉన్నాయి.”

అలాంటి సమతుల్యమైన దృక్పథాన్ని సంపాదించుకోవడం చెప్పినంత సులభం కాదు. మనం ఎన్నో సంవత్సరాలుగా వృద్ధి చేసుకున్న అతి న్యూనతా భావాలను తొలగించుకోవడానికి ఎంతో కృషి చేయాల్సి రావచ్చు. అయితే, దేవుని సహాయంతో మనం మన వ్యక్తిత్వాన్నే కాక జీవితం గురించిన మన దృకోణాన్ని కూడా మార్చుకోవచ్చు. వాస్తవానికి దేవుని వాక్యం మనం అలాగే చేయాలని ప్రోత్సహిస్తోంది. మనమిలా చదువుతాం: “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.”​—⁠ఎఫెసీయులు 4:​22-24.

‘మన చిత్తవృత్తిని’ అంటే మన మనస్సుకు సంబంధించిన ప్రబలమైన స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మనం పూర్తి ప్రతికూలమైన మన వ్యక్తిత్వాన్ని సానుకూలమైన వ్యక్తిత్వంగా మార్చుకోవచ్చు. ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన లీనా, తనను ఎవరూ ప్రేమించలేరు లేక తనకు ఎవరూ సహాయం చేయలేరు అనే ఆలోచన తొలగించుకొనేంతవరకు తన గురించి తనకున్న భావాలను ఏదీ మార్చదు, మార్చలేదు అని గుర్తించింది. అలాంటి మార్పు చేసుకోవడానికి బైబిల్లోని ఏ ఆచరణాత్మకమైన సలహా లీనా, సిమోన్‌లతోపాటు ఇతరులకూ సహాయం చేసింది?

ఆనందాన్ని అధికం చేసుకోవడానికి సహాయం చేసే బైబిలు సూత్రాలు

“నీ భారము యెహోవామీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును.” (కీర్తన 55:​22) మొట్టమొదటిగా ప్రార్థన నిజమైన ఆనందాన్ని పొందేందుకు మనకు సహాయం చేయగలదు. సిమోన్‌ ఇలా చెబుతోంది: “నేను ఎప్పుడు నిరుత్సాహపడినా, సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తాను. నేను అన్ని పరిస్థితుల్లో ఆయన శక్తిని ఆయన నిర్దేశాన్ని చవిచూశాను.” కీర్తనకర్త, యెహోవా మీద మన భారాన్ని మోపమని మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, నిజానికి ఆయన, యెహోవా మన గురించి శ్రద్ధ తీసుకోవడమే కాక తన సహాయ సహకారాలు పొందడానికి అర్హులైన వ్యక్తులుగా మనల్ని దృష్టిస్తున్నాడు అని మనకు గుర్తు చేస్తున్నాడు. సా.శ. 33 పస్కా పండుగ రాత్రి, తాను త్వరలో వారిని వదిలి వెళ్తున్నాను అనే విషయాన్ని యేసు తన శిష్యులతో చెప్పినప్పుడు వారు దుఃఖించారు. తండ్రికి ప్రార్థించమని యేసు వారిని ప్రోత్సహించాడు, ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.”​—⁠యోహాను 16:​23, 24.

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) యేసు బోధించినట్లు, జీవితంలో నిజమైన ఆనందం పొందడానికి ఇవ్వడం కీలకం. మనం ఈ బైబిలు సత్యాన్ని అన్వయించుకోవడం, మన సొంత లోపాల మీద కన్నా ఇతరుల అవసరాల మీద దృష్టి నిలపడానికి మనకు దోహదపడుతుంది. మనం ఇతరులకు సహాయం చేసి వారి కృతజ్ఞతాపూర్వకమైన ప్రతిస్పందన చూస్తే మన గురించి మనం సంతృప్తి చెందుతాం. బైబిల్లోని సువార్తను క్రమంగా ఇతరులకు ప్రకటించడం తనకు రెండు విధాలుగా సహాయం చేస్తోందనే నమ్మకం లీనాకు కలిగింది. లీనా ఇలా చెబుతోంది: “మొదటిగా, అది నాకు యేసు చెప్పినలాంటి సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది. రెండవదిగా, ఇతరుల నుండి ఎంతో అనుకూలమైన ప్రతిస్పందన లభిస్తుంది, ఆనందాన్ని పొందేందుకు అది నాకు సహాయం చేస్తుంది.” మనల్ని మనం ఉదారంగా అర్పించుకోవడం ద్వారా సామెతలు 11:​25లోని సత్యాన్ని మనం చవిచూస్తాం: “నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”

“బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.” (సామెతలు 15:​15) మనల్ని మనం దృష్టించుకొనే విషయంలో, మన పరిస్థితులను దృష్టించుకొనే విషయంలో ఎంపిక చేసుకొనే అవకాశం మనందరికీ ఉంది. అన్నిటినీ ప్రతికూల దృక్పథంతో దృష్టించి బాధించబడినట్లు భావించే వ్యక్తిలా మనం ఉండవచ్చు లేక మనం అనుకూల దృక్పథంతో ఆలోచిస్తూ, ‘సంతోషహృదయంతో’ ఉండి విందులో కూర్చున్నట్లు ఆనందంగా ఉండడానికి ఇష్టపడవచ్చు. సిమోన్‌ ఇలా చెబుతోంది: “నేను సాధ్యమైనంత అనుకూలమైన దృక్పథంతో ఉండడానికి ప్రయత్నిస్తాను. నేను వ్యక్తిగత అధ్యయనంలో, పరిచర్యలో నిమగ్నమైవుంటాను, పట్టుదలతో ప్రార్థిస్తాను. నేను అనుకూల దృక్పథంగలవారితో ఉండడానికి కూడా ప్రయత్నిస్తాను, ఇతరులకు భావోద్రేకంగా సహకరించడానికి, సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను.” అలాంటి హృదయవైఖరి నిజమైన ఆనందానికి దోహదపడుతుంది, బైబిలు కూడా మనల్ని ఇలా ప్రోత్సహిస్తోంది: “నీతిమంతులారా, యెహోవానుబట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా, మీరందరు ఆనందగానము చేయుడి.”​—⁠కీర్తన 32:​11.

“నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.” (సామెతలు 17:​17) ప్రియమైనవారికి, నమ్మకమైన సలహాదారునికి చెప్పుకోవడం, ప్రతికూల భావాలతో వ్యవహరిస్తూ అవి మనల్ని ముంచెత్తే ముందు వాటిని తొలగించుకోవడానికి మనకు సహాయం చేయగలదు. మనం ఇతరులతో మాట్లాడడం, విషయాలను సమతుల్యమైన, అనుకూలమైన దృక్పథంతో దృష్టించడానికి మనకు సహాయం చేయగలదు. “నా భావాల గురించి ఇతరులతో మాట్లాడడం నాకు ఎంతో సహాయం చేస్తుంది” అని సిమోన్‌ ఒప్పుకుంటుంది. “మీరెలా భావిస్తున్నారో అనేది మీరు ఎవరికైనా చెప్పాలి. సాధారణంగా ఒక వ్యక్తి తన భావాలను ఇతరులకు వ్యక్తం చేస్తే సరిపోతుంది.” అలా చేయడం ద్వారా మీరు ఈ సామెతలోని సత్యాన్ని చవిచూస్తారు: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును, దయగల మాట దాని సంతోషపెట్టును.”​—⁠సామెతలు 12:​25.

మీరు ఏమి చేయవచ్చు?

మనం మన ప్రతికూల భావాలను అధిగమించి నిజమైన ఆనందాన్ని పొందడానికి సహాయపడగల, బైబిల్లోని అనేక అద్భుతమైన, ఆచరణాత్మకమైన ప్రమాణాలలో కేవలం కొన్నింటినే మనం పరిశీలించాం. మీరు న్యూనతా భావాలతో పోరాడుతున్నవారిలో ఒకరైతే, దేవుని వాక్యమైన బైబిలును క్షుణ్ణంగా పరిశీలించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. మీ గురించి, దేవునితో మీ సంబంధం గురించి మీరు వాస్తవమైన సమతుల్యమైన భావాలను వృద్ధి చేసుకోవడం నేర్చుకోండి. మీరు దేవుని వాక్య నిర్దేశంతో, చేసే పనులన్నిటిలో నిజమైన ఆనందాన్ని పొందుతారని మేము హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం.

[అధస్సూచి]

^ పేరా 6 ఈ లేఖనం 22, 23 పేజీల్లో వివరంగా చర్చించబడింది.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడం ఆనందాన్నిస్తుంది