కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనోభావాల విషయంలో సహాయం

మనోభావాల విషయంలో సహాయం

మనోభావాల విషయంలో సహాయం

కొన్నిసార్లు ప్రతికూల భావాలు మీ జీవితాన్ని నియంత్రిస్తున్నట్లు అనిపిస్తోందా? మీరు త్వరగా మనస్థాపం చెందుతారా, కోప్పడతారా, లేదా నిరాశ చెందుతారా? జీవిత చింతలు మిమ్మల్ని ముంచెత్తుతున్నట్లుగా ఉన్నాయా? అలాంటప్పుడు ఏది సహాయం చేయగలదు?

భావోద్వేగాలు మానవ జీవితంలో సర్వసాధారణం. వాటిని సరిగ్గా అదుపులో ఉంచుకుంటే, అవి జీవితాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి. అయితే, “అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు” అని బైబిలు అంగీకరిస్తోంది. (ప్రసంగి 7:⁠7) హింస, ప్రమాదాలు సర్వసాధారణమైన ఈ లోకంలో తమ చుట్టూ జరుగుతున్న వాటిని చూసి మానసికంగా ప్రభావితం కాని వారెవరు? అయితే, లేఖనాలు ఇలా కూడా తెలియజేస్తున్నాయి: “వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదు.” (ప్రసంగి 3:22) జీవితాన్ని మరింత సంతోషభరితంగా చేసుకోవడానికి, మనం సరైన మనోభావాలను అలవరచుకోవడం ద్వారా ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. మనం హానికరమైన భావాలను నిగ్రహించుకొని, ప్రయోజనం చేకూర్చే భావాలను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు?

ఆచరణాత్మక చర్యలు తీసుకోవడం సాధారణంగా మన ప్రతికూల భావాల తీవ్రతను తగ్గిస్తాయి. ఉదాహరణకు, మన అదుపులోలేని కొన్ని విషయాల గురించి చింతిస్తున్నప్పుడు, మన మనసును బాధతో నింపుకునేకంటే మన దినచర్యను లేదా వాతావరణాన్ని మార్చుకోవడం బావుండదా? నిదానంగా నడవడం, ఉపశమనాన్నిచ్చే సంగీతాన్ని వినడం, మంచి వ్యాయామం చేయడం, లేదా అవసరంలో ఉన్నవారికి ఏదైనా సహాయం చేయడం మనకు కొంత ఉపశమనాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

అయితే, మనం సృష్టికర్త మీద నమ్మకం ఉంచడమే ప్రతికూల ఆలోచనలను తొలగించుకునేందుకు ఉత్తమమైన మార్గం. ప్రతికూల ఆలోచన అలాగే కొనసాగుతున్నప్పుడు, మనం ప్రార్థన ద్వారా మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. (1 పేతురు 5:​6, 7) బైబిలు మనకు ఈ విధంగా హామీ ఇస్తోంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు . . . నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:​18, 19) దేవుడు మన ‘సహాయముగా, రక్షణకర్తగా’ ఉండగలడని మనం ఎలా నమ్మకంతో ఉండవచ్చు? (కీర్తన 40:​17) బైబిలును అధ్యయనం చేయడం ద్వారా, దేవునికి తన సేవకుల సంక్షేమంపట్ల వ్యక్తిగతంగా ఉన్న శ్రద్ధను తెలియజేసే బైబిలులోని నిజ జీవిత ఉదాహరణల గురించి ఆలోచించడం ద్వారా మనమలా నమ్మకంతో ఉండవచ్చు.