ఇశ్రాయేలు అని పిలువబడిన ప్రజల బైబిలేతర ఉదాహరణ
ఇశ్రాయేలు అని పిలువబడిన ప్రజల బైబిలేతర ఉదాహరణ
ఈజిప్టులోని కైరో మ్యూజియమ్‌లో ఐగుప్తు ఫరో మెర్నిఫ్తా విజయాల స్మారక శిలాఫలకం ఒకటి ఉంది. విద్వాంసుల అంచనాల ప్రకారం, రామెసేస్ IIకు 13వ కుమారుడైన ఈ మెర్నిఫ్తా ఫరో సా.శ.పూ. 1212 నుండి సా.శ.పూ. 1202 వరకున్న మధ్యకాలంలో అంటే ప్రాచీన ఇశ్రాయేలులో న్యాయాధిపతుల కాలంలోని ఆఖరి సంవత్సరాల్లో పరిపాలించాడు. మెర్నిఫ్తా స్మారక శిలాఫలకంపై వ్రాయబడిన చివరి రెండు వాక్యాలు ఇలా ఉన్నాయి: “కనాను దేశం పూర్తిగా దోచుకోబడింది. అష్కెలోను, గెజెరు స్వాధీనపరచుకోబడ్డాయి, యానోమ్ పూర్తిగా నాశనం చేయబడింది. ఇశ్రాయేలు నిర్మానుష్యం చేయబడింది, ఇశ్రాయేలు సంతతి అంతరించింది.”
ఈ సందర్భంలో “ఇశ్రాయేలు” అనే పదానికి అర్థమేమిటి? చిత్ర సంకేత లిపిలో, పదాలు ఏ కోవకు చెందినవో సూచించడానికి అక్షరక్రమానికి జతగా కొన్ని చిత్ర సంకేతాలు కూడా గీసేవారు. ద రైస్ ఆఫ్ ఏన్షియంట్ ఇజ్రాయేల్ అనే పుస్తకం ఇలా వివరిస్తోంది: “ఆ నాల్గింటిలో అష్కెలోను, గెజెరు, యానోమ్ అనే మూడు పదాల ప్రక్కన గీయబడిన చిత్ర సంకేతం అవి పట్టణాలని సూచిస్తోంది. . . . అయితే, ఇశ్రాయేలు అనే పదం ప్రక్కన గీయబడిన చిత్ర సంకేతం వారొక ప్రజల గుంపు అని సూచించింది.”—ఇటాలిక్కులు మావి.
ఆ వ్యాఖ్యల ప్రాముఖ్యతేమిటి? సంపాదకుడు, రచయిత అయిన హెర్షెల్ షాంక్స్ ఆ ప్రశ్నకిలా జవాబిస్తున్నాడు: “సా.శ.పూ. 1212లో ఇశ్రాయేలు అనబడే ప్రజలు ఉనికిలో ఉన్నారనీ, ఐగుప్తు ఫరోకు వారెవరో తెలియడమే కాదు, ఆయన వారిని యుద్ధంలో ఓడించానని ప్రగల్భాలు పలికేంత ప్రముఖమైన ప్రజలన్నట్లు భావించాడనీ ఆ మెర్నిఫ్తా శిలాఫలకం చూపిస్తోంది.” ప్రాచ్యదేశ పురావస్తుశాస్త్ర పండితుడైన విలియమ్. జి. డెవర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “ఆ మెర్నిఫ్తా శిలాఫలకం మనకు ఒక విషయాన్ని సాటిలేని రీతిలో స్పష్టం చేస్తోంది. అదేమిటంటే, తమను ‘ఇశ్రాయేలు’ అని పిలుచుకునే ప్రజలు కనాను దేశంలో ఖచ్చితంగా ఉండేవారు. అందుకే, ఐగుప్తీయులు కూడా వారిని ‘ఇశ్రాయేలు’ అనే పిలిచేవారు. బైబిలు ప్రామాణికతను రుజువు చేయాల్సిన అవసరమేలేని ఐగుప్తీయులు తమ గురించి చాటుకోవడానికి ‘ఇశ్రాయేలు’ అనే ప్రత్యేకమైన, అసాధారణమైన ప్రజలను సృష్టించడం అసంభవం.”
బైబిల్లో మొదటిసారిగా ఇశ్రాయేలు అనే పదం, పితరుడైన యాకోబుకు ఇవ్వబడిన పేరుగా పేర్కొనబడింది. యాకోబు 12 కుమారుల సంతతి ‘ఇశ్రాయేలు కుమారులుగా’ పేరుగాంచారు. (ఆదికాండము 32:22-28, 32; 35:9, 10) అనేక సంవత్సరాల తర్వాత, ప్రవక్తయైన మోషే, ఐగుప్తు ఫరో వీరిరువురూ యాకోబు సంతతిని సంబోధించేందుకు “ఇశ్రాయేలు” అనే పదాన్ని ఉపయోగించారు. (నిర్గమకాండము 5:1, 2) మెర్నిఫ్తా శిలాఫలకమే, ఇశ్రాయేలు అని పిలువబడే ప్రజలకు సంబంధించిన అతి ప్రాచీన బైబిలేతర ఉదాహరణ.
[24వ పేజీలోని చిత్రాలు]
మెర్నిఫ్తా శిలాఫలకం
చివరి మూడు చిత్ర సంకేతాలు (కుడి నుండి ఎడమకు) అంటే కూర్చుని ఉన్న స్త్రీ, పురుషుడు, విసిరే కర్ర అన్నీ కలిసి ఇశ్రాయేలు పరాయి దేశస్థులని సూచిస్తున్నాయి
[చిత్రసౌజన్యం]
Egyptian National Museum, Cairo, Egypt/Giraudon/The Bridgeman Art Library