పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
పస్కా పండుగ సమయంలో “పులిసినదేదియు” ఉండకూడదని యూదులకు ఆజ్ఞాపించబడినా, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను యేసు ప్రారంభించినప్పుడు పులిసిన ద్రాక్షారసాన్ని ఎందుకు ఉపయోగించాడు?—నిర్గమకాండము 12:20; లూకా 22:7, 8, 14-20.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలవడాన్ని సూచించిన పస్కా పండుగ, సా.శ.పూ. 1513లో ప్రారంభించబడింది. ఆచరణకు సంబంధించిన ఆదేశాలనిస్తున్నప్పుడు యెహోవా ఇలా చెప్పాడు: “మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెను.” (నిర్గమకాండము 12:11, 20) ఈ దైవిక నిషేధం, పస్కా పండుగ సమయంలో ఎలాంటి రొట్టె తినాలనే విషయానికి మాత్రమే వర్తిస్తుంది. అక్కడ ద్రాక్షారసం గురించి ప్రస్తావించబడలేదు.
పులిపిండిని నిషేధించడానికిగల ముఖ్యకారణం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఉన్నపాటున బయలుదేరాల్సి ఉండడమే. నిర్గమకాండము 12:34 ఇలా వివరిస్తోంది: “ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొని పోయిరి.” ఆ తర్వాతి కాలాల్లో జరుపుకునే పస్కాపండుగల్లో పులిపిండి లేకపోవడమనేది ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని భావితరాలకు గుర్తుచేస్తుంది.
చివరకు, పులిపిండి తరచూ పాపానికీ లేదా భ్రష్టత్వానికీ గుర్తుగా దృష్టించబడింది. ఉదాహరణకు, క్రైస్తవ సంఘంలోని దుర్నీతిపరుణ్ణి సూచిస్తూ అపొస్తలుడైన పౌలు, “పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?” అని అడిగి, ఆ తర్వాత ఇలా చెప్పాడు: “మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.” (1 కొరింథీయులు 5:6-8) పులియని రొట్టె మాత్రమే యేసు పాపరహిత మానవ శరీరానికి చిహ్నంగా ఉపయోగించబడగలదు.—హెబ్రీయులు 7:26.
యూదులు ఆ తర్వాతి కాలాల్లో, పస్కా పండుగ ఆచరణలో ద్రాక్షారసం ఉపయోగించడాన్ని చేర్చారు. బహుశా, వారు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తర్వాత దీనిని చేర్చివుండవచ్చు. ఇలా చేర్చడం విషయంలో బైబిలు అభ్యంతరం చెప్పడంలేదు కాబట్టి, యేసు పస్కా భోజనం సమయంలో ద్రాక్షారసాన్ని తగిన రీతిలో ఉపయోగించగలిగాడు. ప్రాచీనకాలాల్లో సహజంగా పులిసే గుణమున్న ద్రాక్షారసానికి, రొట్టెలు పులియబెట్టడానికి వ్యత్యాసముంది. రొట్టెల విషయానికొస్తే, వాటిని పులియబెట్టడానికి ఈస్ట్ లేదా పులిపిండిని చేర్చాలి. ద్రాక్షాపళ్ళతో తయారుచేసే రసానికి అలాంటివేమీ చేర్చనవసరం లేదు. పులియడానికి అవసరమైన మూలపదార్థాలు ద్రాక్షాల్లోనే ఉంటాయి. పస్కా పండుగ సమయంలో తాజా ద్రాక్షాపళ్ళ రసం దొరికే అవకాశమే లేదు, ఎందుకంటే ఆకురాలేకాలంలో పంటకొచ్చే ద్రాక్షాపళ్ల నుండి తీసిన రసం (జ్యూస్), వసంతకాలంలో ఆచరించే పస్కా పండుగ సమయానికి పులిసిపోతుంది.
కాబట్టి, యేసు జ్ఞాపకార్థ చిహ్నంగా ద్రాక్షారసాన్ని వాడడం, పస్కా ఆచరణలో పులిపిండికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలకు ఏ మాత్రం విరుద్ధంగా లేదు. తీపిపదార్థాలు, ఘాటు పదార్థాలు లేదా ఎలాంటి సుగంధ ద్రవ్యాలు చేర్చకుండా తయారుచేసిన ఎర్రని ద్రాక్షారసాన్ని క్రీస్తు ‘అమూల్యమైన రక్తానికి’ చిహ్నంగా వాడడం సముచితమే.—1 పేతురు 1:19.