‘వృద్ధాప్యంలో కూడా ఫలిస్తూ ఉంటారు’
‘వృద్ధాప్యంలో కూడా ఫలిస్తూ ఉంటారు’
మధ్యధరా ప్రాంతాల్లో చాలామంది తమ ఇంటి పెరట్లో ఖర్జూరపు చెట్లు నాటుతారు. ఈ చెట్లు అందానికి, రుచికరమైన పళ్లకు పేరుగాంచాయి. అంతేకాక, అవి దాదాపు వందకన్నా ఎక్కువ సంవత్సరాలపాటు ఫలిస్తూనే ఉంటాయి.
ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను కావ్యభాషలో, సౌందర్యవతియైన షూలమ్మీతీని తాళవృక్షమంత తిన్ననిదానవు అని వర్ణించాడు. (పరమగీతము 7:7) ప్లాంట్స్ ఆఫ్ ద బైబిల్ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఖర్జూరపు చెట్టుకున్న హెబ్రీ పదం టీమర్. . . . యూదులు ఈ పదాన్ని సొగసుకు, సౌందర్యానికి చిహ్నంగా వాడేవారు, వారు తరచూ ఆ పేరును అమ్మాయిలకు పెట్టేవారు.” ఉదాహరణకు, సౌందర్యవతియైన సొలొమోను సవతి సోదరిపేరు తామారు. (2 సమూయేలు 13:1) కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ వారి అమ్మాయిలకు అదే పేరు పెడతారు.
అందమైన స్త్రీలు మాత్రమే ఖర్జూరపు చెట్టుతో పోల్చబడలేదు. కీర్తనకర్త ఇలా పాడాడు: “నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు. మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు. వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.”—కీర్తన 92:12-14, ఈజీ-టు-రీడ్ వర్షన్.
అలంకారార్థంగా చెప్పాలంటే, వృద్ధాప్యంలో దేవుణ్ణి నమ్మకంగా సేవించేవారికి, శోభితమైన ఖర్జూరపు చెట్టుకు చాలా పోలికలున్నాయి. బైబిలు ఇలా చెబుతోంది: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును.” (సామెతలు 16:31) వృద్ధులకు, వయసు మీరుతున్నకొద్దీ శారీరక బలం తగ్గిపోతున్నప్పటికీ, దేవుని వాక్యమైన బైబిలును క్రమంగా చదవడం ద్వారా వారు పోషించబడుతూ తమ ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవచ్చు. (కీర్తన 1:1-3; యిర్మీయా 17:7, 8) నమ్మకస్థులైన వృద్ధులు తమ దయగల మాటలతో, మంచి మాదిరితో ఇతరులను అద్భుతరీతిలో ప్రోత్సహిస్తూ, సంవత్సరాలు గడుస్తున్నా ఫలిస్తూనే ఉన్నారు. (తీతు 2:2-5; హెబ్రీయులు 13:15, 16) ఖర్జూరపు చెట్టువలే వృద్ధులు, తమ వృద్ధాప్యమందు కూడా ఫలిస్తూ ఉంటారు.