కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?

మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?

మాసిదోనియకు వచ్చి సహాయం చేస్తారా?

అపొస్తలుడైన పౌలు ఆసియా మైనరులోని తీరపట్టణమైన త్రోయలో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో ఓ మాసిదోనియ వ్యక్తి, “నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుము” అని పౌలును వేడుకున్నాడు. పౌలు దాన్ని చూసిన వెంటనే ఆయన, ఆయన తోటి సువార్తికులు మాసిదోనియ ప్రజలకు ‘సువార్త ప్రకటించడానికి దేవుడు తమను పిలిచాడని’ అర్థం చేసుకున్నారు. వారు అలా ప్రకటించడం వల్ల మాసిదోనియలోని ప్రధాన పట్టణమైన ఫిలిప్పీలో లూదియ, ఆమె కుటుంబస్థులు విశ్వాసులయ్యారు. వారేకాక, రోమా పాలిత ప్రాంతమైన మాసిదోనియలో చాలామంది విశ్వాసులయ్యారు.—అపొ. 16:9-15.

నేటి యెహోవాసాక్షులు కూడా వారిలాంటి ఉత్సాహాన్నే చూపిస్తున్నారు. చాలామంది తమ సొంత ఖర్చులతో రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి ఇష్టపూర్వకంగా తరలివెళ్లారు. ఈ విషయంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. లీసా అనే సహోదరి తన జీవితంలో సువార్త ప్రకటనా పనికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలనుకుంది. దానికోసం ఆమె కెనడా నుండి కెన్యాకు తరలివెళ్లింది. అదే దేశానికి చెందిన ట్రెవర్‌, ఎమాలి అనే దంపతులు కూడా మరింత పరిచర్య చేయడానికి మలావీకి వెళ్లారు. ఇంగ్లాండుకు చెందిన పౌల్‌, మ్యాగీలు తమ పదవీ విరమణను సువర్ణావకాశంగా భావించి యెహోవా సేవ మరింత చేయడానికి తూర్పు ఆఫ్రికాకు తరలివెళ్లారు. మీరు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వారిలా మీరు వేరే ప్రాంతాలకు వెళ్లగలరేమో ఆలోచించండి. అలాగైతే, ఏ బైబిలు సూత్రాలు, సలహాలు పాటిస్తే మీరు అనుకున్నదాన్ని సాధించగలుగుతారు?

మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి

మొదటిగా, మీరు వేరే ప్రాంతానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆలోచించాలి. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [“యెహోవాను,” NW] ప్రేమింపవలెను” అనే ఆజ్ఞ గొప్పదని యేసు చెప్పాడు. కాబట్టి, వేరే దేశంలో సేవ చేయాలని అనుకునేవారు, దేవుని పట్ల ప్రేమతో, శిష్యులను చేయాలన్న ఆజ్ఞను పాటించాలనే కోరికతో అక్కడికి వెళ్లాలి. యేసు ఇంకా ఇలా అన్నాడు: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే.” మనస్ఫూర్తిగా సహాయం చేయాలన్న కోరిక కనబరచడం ద్వారా ఇతరులపట్ల ప్రేమ చూపిస్తాం. (మత్త. 22:36-39; 28:19, 20) వేరే దేశంలో సేవ చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో త్యాగాలు చేయాలి. అది విహారయాత్రకు వెళ్లడంలాంటిది కాదు, ప్రేమతోనే ఆ సేవ చేపట్టాలి. నెదర్లాండ్స్‌ దేశస్థులైన రెమ్కో, సుజేన్‌లు ప్రస్తుతం నమీబియాలో సేవ చేస్తున్నారు. “మాకు ప్రేమ ఉంది కాబట్టే మేము ఇక్కడున్నాం” అని వారంటున్నారు.

నమీబియాలో ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవ చేస్తున్న విల్లీ ఇలా అన్నాడు: “తమదికాని దేశంలో సేవచేయడానికి వచ్చినవారు, స్థానిక సహోదరులు తమను చూసుకుంటారులే అని అనుకొని ఇక్కడికి రాలేదు. కానీ, వారితోకలిసి సేవ చేస్తూ ప్రకటనా పనిలో వారికి సహాయం చేయడానికని వచ్చారు.”

మీరు ఎందుకు వేరే దేశంలో సేవచేయాలనుకుంటున్నారో పరిశీలించుకున్న తర్వాత ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘వేరే దేశంలో సహాయం చేయడానికి కావాల్సినంత అనుభవం నాకుందా? నేను ప్రకటనా పనిని ఎంత సమర్థంగా చేయగలుగుతున్నాను? నాకు ఏ భాషలొచ్చు? నేను కొత్త భాష నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా?’ సాధ్యా అసాధ్యాల గురించి నిజాయితీగా కుటుంబస్థులతో చర్చించండి, సంఘ పెద్దల సలహా తీసుకోండి, యెహోవాకు ప్రార్థించండి. మీరు అలా నిజాయితీగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీరు వేరే దేశానికి వెళ్లి సేవ చేయగలుగుతారో లేదో, ఆ సేవలో పట్టుదలతో కొనసాగగలుగుతారో లేదో నిర్ణయించుకోగలుగుతారు.—“మిమ్మల్ని మీరు తెలుసుకోండి” అనే బాక్సు చూడండి.

ఏ దేశంలో సేవచేయాలి?

మాసిదోనియకు వెళ్లి సేవచేయమని పౌలుకు ఓ దర్శనంలో చెప్పబడింది. అయితే మనకాలంలో, ఏ ప్రాంతానికి వెళ్లి సేవచేయాలనే విషయంలో యెహోవా మనకు అలాంటి దర్శనాలు ఏమీ ఇవ్వడంలేదు. కానీ, దేవుని సేవకులు సువార్త ప్రకటనా పనిచేసేవారి అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో ఈ పత్రిక ద్వారా, ఇతర ప్రచురణల ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి, మొదట మీరు అలాంటి ప్రాంతాల లిస్టును తయారు చేసుకోండి. మీరు వేరే భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే లేదా వేరే దేశంలో స్థిరపడడానికి ఇష్టంలేకపోతే, ఇప్పటికే మీకు వచ్చిన భాషను ఎక్కువగా మాట్లాడే ప్రాంతాల్లో సేవ చేయగలరేమో ఆలోచించండి. ఆ తర్వాత వీసా, ప్రయాణం, భద్రతా పరిస్థితులు, జీవన వ్యయం, వాతావరణ పరిస్థితుల వంటి విషయాల గురించి తెలుసుకోండి. ఇప్పటికే, వేరే ప్రాంతాలకు వెళ్లిన వారిని అడిగి తెలుసుకోండి. మీరు సరైన నిర్ణయం తీసుకునేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. “ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ” పౌలును, ఆయన తోటి సువార్తికులను ‘ఆటంకపరచింది’ అని గుర్తుంచుకోండి. వారు అప్పుడు బితూనియకు వెళ్లడానికి ప్రయత్నించారు కానీ, “యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు.” అలాగే, మీ అవసరం ఏ ప్రాంతంలో ఎక్కువగావుందో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టవచ్చు.—అపొ. 16:6-10.

మీరు వెళ్లగల కొన్ని ప్రాంతాలను ఇప్పటికే గుర్తించివుంటారు. మీరు వెళ్లాలనుకునే దేశంలోని బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయండి. ప్రస్తుతం మీకున్న సేవాధిక్యతల గురించిన వివరాలను ఆ ఉత్తరంలో తెలపండి. అలాగే మీరు వెళ్లాలనుకునే దేశంలోని జీవన వ్యయం గురించి, గృహవసతి గురించి, అందుబాటులోవున్న వైద్య సదుపాయాల గురించి, ఉద్యోగావకాశాల గురించి ఏమైన ప్రశ్నలుంటే వాటిని కూడా ఆ ఉత్తరంలో చేర్చండి. ఆ ఉత్తరాన్ని మీ సంఘ సేవా కమిటీకి ఇవ్వండి. వారు తమ సిఫారసు లేఖను జతచేసి నేరుగా మీరు వెళ్లాలనుకుంటున్న దేశ బ్రాంచి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడినుండి వచ్చే జవాబునుబట్టి, మీ అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో మీరు తెలుసుకోగలుగుతారు.

పైన ప్రస్తావించబడిన విల్లీ అనే సహోదరుడు ఇలా చెప్పాడు: “ప్రస్తుతం ఇక్కడ సమర్థంగా సేవ చేస్తున్న సహోదరులు, ఒకప్పుడు దేశం చూడడానికి వచ్చి, తాము ఏ ప్రాంతంలో సంతోషంగా సేవ చేయగలుగుతారో చూసి వెళ్లారు. మారుమూల ప్రాంతాల్లో సేవ చేయడం తమకు కష్టమని ఒక జంటకు అనిపించింది. అందుకే వారు సంతోషంగా సేవించేందుకు అనువైన జీవన ప్రమాణాలున్న ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డారు.”

ఎదురయ్యే కొత్త సవాళ్లు

ఇంటికి దూరంగా పూర్తిగా కొత్త వాతావరణంలో సేవచేయడం వల్ల మీకు ఖచ్చితంగా కొన్ని కొత్త సవాళ్లు ఎదురౌతాయి. పైన ప్రస్తావించబడిన లీసా ఇంకా ఇలా అంది: “ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టం.” అయితే, ఆమెకు ఏది సహాయం చేసింది? ఆమె ఇప్పుడు సహవసిస్తున్న సంఘంతో సన్నిహితంగా ఉండడమేకాక, సంఘంలో ప్రతీ ఒక్కరి పేరును తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అందుకే ఆమె కూటాలకు ముందు, తర్వాత అందరినీ పలకరించేది. ఇతరులతో కలిసి ప్రకటనాపనిలో పాల్గొనేది, చాలామందిని తన ఇంటికి ఆహ్వానించి కొత్త స్నేహితులను సంపాదించుకుంది. ఆమె ఇలా అంది: “నేను చేసిన త్యాగాలనుబట్టి చింతించను. యెహోవా నిజంగా నన్ను ఆశీర్వదించాడు.”

పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత పౌల్‌, మ్యాగీలు 30 సంవత్సరాలు అలవాటుపడిన తమ ఇంటిని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్లారు. ఆయనిలా అన్నాడు: “ఆస్తిపాస్తుల్ని విడిచివెళ్లడం పెద్ద కష్టమనిపించలేదు గానీ, కుటుంబాన్ని వదిలివెళ్లడం మాత్రం చాలా కష్టమనిపించింది. అలా వదిలివెళ్లడం మేమనుకున్నంత తేలికేమీ కాదు. దుఃఖం పట్టలేక విమానంలో ఏడ్చేశాం. ‘ఇది మా వల్ల కాదు’ అనుకోవడం చాలా సులభమే గానీ, మేము యెహోవా సహాయం కోసం ప్రార్థించాం. కొత్త స్నేహితులను సంపాదించుకుంటే పరాయి దేశంలోవున్నా పరిచర్యలో కొనసాగాలనే పట్టుదల పెరుగుతుంది.”

గ్రెగ్‌, క్రిస్టల్‌లు కెనడా నుండి నమీబియాకు వెళ్లారు. వీరికి ఆ దేశ అధికారిక భాషయైన ఇంగ్లీషు వచ్చు కాబట్టి అక్కడికి వెళ్లారు. అయితే, అక్కడి స్థానిక భాష నేర్చుకోవడం ఎంత ప్రయోజనకరమో వారు ఆ తర్వాత గ్రహించారు. వారిలా అన్నారు: “ఇక్కడ సర్దుకుపోలేక కొన్నిసార్లు మేము నిరాశచెందాం. అయితే, స్థానిక భాషను నేర్చుకున్నాకే మాకు అక్కడి సంస్కృతి అర్థమైంది. సహోదరులతో సన్నిహితంగా ఉండడంవల్లే మేము కొత్త పరిస్థితులకు అలవాటుపడ్డాం.”

అలా వారు వినయంతో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటే, అది స్థానిక సహోదరులపై మంచి ప్రభావం చూపిస్తుంది. జెన్నీ అనే సహోదరి తాను పెరిగిన ఐర్లాండ్‌ దేశానికి వచ్చిన కుటుంబాలను ఎంతో ఆప్యాయంగా జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అంది: “వారు మంచి అతిథిప్రియులు. వారు నిజంగా సేవ చేయడానికే వచ్చారు గానీ సేవ చేయించుకోవడానికి కాదు. వారు ఎంత ఉత్సాహంగా, సంతోషంగా సేవ చేసేవారంటే నేను కూడా వారిలాగే సేవ చేయాలనుకున్నాను.” జెన్నీ ఇప్పుడు తన భర్తతో కలిసి జాంబియాలో మిషనరీగా సేవ చేస్తోంది.

యెహోవా ఆశీర్వాదం ‘ఐశ్వర్యమిస్తుంది’

మాసిదోనియలో పౌలు ఎంత చక్కటి అనుభవాన్ని చవిచూశాడు! దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆయన ఫిలిప్పీలోని సహోదరులకు ఇలా రాశాడు: “నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.”—ఫిలి. 1:3.

ట్రెవర్‌, ఎమిలీలు గిలియడ్‌ పాఠశాలకు ఆహ్వానించబడే ముందు మలావీలో సేవ చేశారు. వారు కూడా ఇలా అంటున్నారు: “మేము సరైనదే చేస్తున్నామా అన్న అనుమానం మాకు కలిగేది కానీ, మేము సంతోషంగా ఉన్నాం. మేము ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ యెహోవా ఆశీర్వాదాన్ని చవిచూశాం.” పైన ప్రస్తావించబడిన గ్రెగ్‌, క్రిస్టల్‌లు ఇలా అన్నారు: “దీనంత మంచి పని వేరేది లేదు.”

అయితే, వేరే దేశంలో సేవ చేయడం ప్రతీ ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. కొంతమంది తమ దేశంలోనే అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేసి మంచి ఫలితాలు సాధించవచ్చు. మరికొంతమంది, తమ ఇంటికి దగ్గర్లో ఉన్న సంఘాల్లో సేవ చేసే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు. అయితే, యెహోవా సేవలో మీరు చేయగలిగినదంతా చేయడమే ప్రాముఖ్యం. (కొలొ. 3:23) అలా చేస్తే, “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు” అనే మాటలు మీ విషయంలో నెరవేరతాయి.—సామె. 10:22.

[5వ పేజీలోని బాక్సు/చిత్రం]

మిమ్మల్ని మీరు తెలుసుకోండి

వేరే దేశంలో సేవ చేయగలుగుతారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఈ కింది ప్రశ్నలు వేసుకోండి. నిజాయితీగా, ప్రార్థనాపూర్వకంగా మీ పరిస్థితులను బేరీజు వేసుకోండి. ఈ విషయంలో, గతంలో వచ్చిన కావలికోట సంచికల్లోని సమాచారం మీకు సహాయకరంగా ఉంటుంది.

• నేను ఆధ్యాత్మిక వ్యక్తినేనా?—“సంతోషం కొరకైన చర్యలు” (అక్టోబరు 15, 1997, 6వ పేజీ)

• నేను సమర్థంగా ప్రకటనా పనిని చేయగలుగుతున్నానా?—“పయినీరు సేవలో ఎలా మంచి ఫలితాలు సాధించవచ్చు?” (మే 15, 1989 (ఆంగ్లం), 21వ పేజీ)

• నేను కుటుంబాన్ని, స్నేహితులను విడిచిపెట్టి ఉండగలనా?—“దేవుని సేవలో ఇంటిమీద బెంగను అధిగమించండి” (మే 15, 1994, 28వ పేజీ)

• నేను కొత్త భాషను నేర్చుకోగలుగుతానా?—“వేరే భాషా సంఘంలో సేవచేయడం” (మార్చి 15, 2006, 17వ పేజీ)

• వేరే దేశానికి వెళ్లడానికి అయ్యే ఖర్చులను భరించగలుగుతానా?—“మీరు విదేశీ క్షేత్రంలో సేవ చేయగలరా?” (అక్టోబరు 15, 1999, 23వ పేజీ)

[6వ పేజీలోని చిత్రం]

వినయంతో నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటే, అది స్థానిక సహోదరులపై మంచి ప్రభావం చూపిస్తుంది

[7వ పేజీలోని చిత్రం]

సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినవారే ఈ పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు