కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవడానికి శక్తిని పొందాం

ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవడానికి శక్తిని పొందాం

ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోవడానికి శక్తిని పొందాం

“నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలి. 4:13.

1. యెహోవా ప్రజలు ఎందుకు చాలా కష్టాలను అనుభవిస్తున్నారు?

 యెహోవా ప్రజలు తరచూ ఏదోక విధమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు. మన సొంత అపరిపూర్ణత వల్ల లేదా ప్రస్తుత దుష్ట విధానం వల్ల కొన్ని పరీక్షలు వస్తున్నాయి. మరికొన్ని యెహోవాను సేవించేవారికి, ఆయనను సేవించని వారికి మధ్యవున్న శత్రుత్వం వల్ల వస్తున్నాయి. (ఆది. 3:15) మానవ చరిత్ర ఆరంభం నుండి మత హింసను, తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడిని, అలా అన్ని రకాలైన కష్టాలను ఎదుర్కోవడానికి దేవుడు తన నమ్మకమైన సేవకులకు సహాయం చేశాడు. అలాంటి వాటిని తట్టుకునేందుకు దేవుని పరిశుద్ధాత్మ మనకు కూడా శక్తినిస్తుంది.

మత హింస

2. మత హింస ఉద్దేశమేమిటి? అది ఏయే విధాలుగా రావచ్చు?

2 ప్రజల విశ్వాసాన్ని బట్టి లేదా నమ్మకాలను బట్టి వారిని ఉద్దేశపూర్వకంగా వేధించడం లేదా వారికి హాని కలుగజేయడమే మత హింస. ఏదైనా ఒక మత నమ్మకాలను రూపుమాపడం, అవి వ్యాప్తి చెందకుండా ఆపడం లేదా విశ్వాసులు తమ యథార్థతను వదులుకునేలా చేయడమే మత హింస ఉద్దేశం. హింస ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా రావచ్చు. బైబిలు, సాతాను దాడులను కొదమసింహం దాడులతో, నాగుపాము దాడులతో పోలుస్తోంది.—కీర్తన 91:13 చదవండి.

3. సాతాను ఏవిధంగా సింహంలా, నాగుపాములా దాడి చేస్తాడు?

3 దౌర్జన్యం, జైలు శిక్ష, నిషేధం వంటివాటి ద్వారా సాతాను క్రూరమైన సింహంలా తరచూ నేరుగా దాడి చేశాడు. (కీర్త. 94:20) సాతాను ప్రయోగించిన అలాంటి పన్నాగాల గురించి ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షుల కార్యకలాపాలను తెలియజేసే వార్షిక పుస్తకంలో (ఆంగ్లం) ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో అల్లరిమూకలు దేవుని ప్రజలపై దాడి చేశారు. కొన్ని సందర్భాల్లో వారలా చేయడం వెనక మతనాయకులు లేదా రాజకీయ ఛాందసవాదులు ఉన్నారు. సింహంలా సాతాను చేసిన ఇలాంటి దాడుల వల్ల కొందరు యెహోవాను సేవించడం మానేశారు. అంతేకాక, ప్రజలు తన ఇష్టం జరిగించేలా వారి మనసులను పాడుచేసి, వారిని మోసగించేందుకు అపవాది నాగుపాములా చాటు నుండి కూడా దాడి చేస్తాడు. మన విశ్వాసాన్ని బలహీనపర్చాలని లేదా విశ్వాసం విషయంలో మనం రాజీపడేలా చేయాలని సాతాను అలా దాడి చేస్తాడు. అయితే, దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఈ రెండు రకాలైన దాడులను తట్టుకొని నిలబడవచ్చు.

4, 5. హింస కోసం సిద్ధపడేందుకు శ్రేష్ఠమైన పద్ధతి ఏమిటి? ఎందుకు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

4 భవిష్యత్తులో రాబోయే హింస కోసం సిద్ధపడాలంటే అది ఏయే విధాలుగా రావచ్చనేది ఊహించడం శ్రేష్ఠమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎలాంటి హింస ఎదురౌతుందో మనకు తెలియదు, బహుశా ఎప్పటికీ జరగని దాని గురించి చింతించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. అయితే, మనం చేయగలిగింది ఒకటి ఉంది. లేఖనాల్లో ఇవ్వబడిన యెహోవా నమ్మకమైన సేవకుల ఉదాహరణలతో పాటు యేసు మాదిరిని, ఆయన బోధలను ధ్యానించడం ద్వారా చాలామంది హింసలను విజయవంతంగా సహించగలిగారు. దానివల్ల యెహోవాపట్ల వారికున్న ప్రేమ మరింత పెరిగింది. ఆ ప్రేమ వల్లే తమ జీవితంలో ఎదురైన ఎలాంటి పరీక్షలనైనా వారు తట్టుకోగలిగారు.

5 మలావీలోని ఇద్దరు సహోదరీల ఉదాహరణనే తీసుకోండి. రాజకీయ పార్టీ కార్డులను కొనిపించడానికి ఓ హింసాత్మకమైన అల్లరిమూక వారిని కొట్టారు, బట్టలు ఊడదీశారు, అత్యాచారం చేస్తామని బెదిరించారు. బెతెల్‌ కుటుంబ సభ్యులు కూడా పార్టీ కార్డులను కొన్నారని వారికి అబద్ధం చెప్పారు. దానికి సహోదరీలు ఎలా స్పందించారు? “మేము యెహోవాను మాత్రమే సేవిస్తాం. బ్రాంచి కార్యాలయంలోని సహోదరులు కార్డులను కొన్నా మేము మాత్రం మా నిర్ణయాన్ని మార్చుకోం, మీరు మమ్మల్ని చంపినా మేము రాజీపడం” అని వారు జవాబిచ్చారు. ధైర్యంగా అలా జవాబిచ్చిన తర్వాత ఆ ఇద్దరు సహోదరీలను విడిచిపెట్టేశారు.

6, 7. హింసను సహించడానికి యెహోవా తన సేవకులకు శక్తినెలా ఇస్తాడు?

6 థెస్సలొనీకలోని క్రైస్తవులు “గొప్ప ఉపద్రవము[లో]” ఉన్నా “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో” సత్యవాక్యాన్ని అంగీకరించారని అపొస్తలుడైన పౌలు గమనించాడు. (1 థెస్స. 1:6) గతంలో, ఇప్పుడు అనేకమంది క్రైస్తవులు తమకు ఎదురైన హింసను అధిగమించగలిగారు. ఇక పరీక్షను సహించలేం అనుకున్న సందర్భాల్లో వారు దేవుని పరిశుద్ధాత్మ ఫలంలో భాగమైన సమాధానాన్ని లేక మనశ్శాంతిని చవిచూశామని చెబుతున్నారు. (గల. 5:22) ఆ మనశ్శాంతి వల్ల వారు తమ హృదయాలను, తలంపులను కాపాడుకోగలిగారు. కష్టాలు ఎదురైనప్పుడు జ్ఞానయుక్తంగా ప్రవర్తించేలా, పరీక్షలను సహించేలా పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా తన సేవకులకు శక్తినిస్తాడు. a

7 తీవ్రమైన హింసల్లో కూడా దేవుని ప్రజలు తమ యథార్థతను కాపాడుకోవడాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. మానవులకు సాధారణంగా ఉండే శక్తి కన్నా అధికమైన శక్తిని సాక్షులు పొందారని వారు అనుకున్నారు, అది నిజం కూడా. “క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీమీద” నిలిచివుంది కాబట్టి “మీరు ధన్యులు” అని పేతురు మనకు అభయమిచ్చాడు. (1 పేతు. 4:14) మనం నీతి ప్రమాణాలను పాటిస్తున్నందుకు హింసించబడుతున్నామంటే దేవుని ఆమోదం మనకుందని అర్థం. (మత్త. 5:10-12; యోహా. 15:20) అలా యెహోవా ఆశీర్వాదం మనపై ఉందని తెలుసుకొని ఎంత సంతోషిస్తాం!

తోటివారి ఒత్తిడి

8. (ఎ) తోటివారి ఒత్తిడిని ఎదిరించేందుకు యెహోషువ కాలేబులకు సహాయం చేసిందేమిటి? (బి) యెహోషువ కాలేబుల ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

8 క్రైస్తవులకు పరోక్షంగా ఎదురయ్యే వ్యతిరేకతల్లో, తోటివారి నుండి వచ్చే హానికరమైన ఒత్తిడి ఒకటి. అయితే, లౌకికాత్మ కన్నా యెహోవా ఆత్మ ఎంతో శక్తివంతమైనది కాబట్టి, మనల్ని ఎగతాళి చేసేవారిని, మన గురించి అబద్ధాలు వ్యాప్తి చేసేవారిని, తమలా ప్రవర్తించాలని ఒత్తిడి చేసేవారిని మనం ఎదిరించగలం. ఉదాహరణకు, కనానుకు పంపించబడిన మిగతా పదిమంది వేగులవారి అభిప్రాయాలతో యెహోషువ కాలేబులు ఏకీభవించకుండా ఉండేందుకు వారికి సహాయం చేసిందేమిటి? వారు “మంచిమనస్సు” కలిగి ఉండేలా పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించింది.—సంఖ్యాకాండము 13:30; 14:6-10, 24 చదవండి.

9. క్రైస్తవులు ఇతరుల నుండి భిన్నంగా ఉండాలని ఎందుకు కోరుకోవాలి?

9 సత్య మత బోధకులని చాలామంది కొనియాడే వారికి కాక దేవునికి లోబడేలా యేసు అపొస్తలులకు కూడా పరిశుద్ధాత్మే శక్తినిచ్చింది. (అపొ. 4:21, 31; 5:29, 32) వాదనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఇతరులు ఏమి చేస్తే అదే చేయాలని చూస్తారు. అయితే, తరచూ నిజ క్రైస్తవులు సరైనదని తమకు తెలిసినదాన్ని సమర్థించాల్సి ఉంటుంది. అయినాసరే పరిశుద్ధాత్మ సహాయం వారికి ఉంటుంది కాబట్టి ఇతరుల నుండి భిన్నంగా ఉండేందుకు వారు భయపడరు. (2 తిమో. 1:7) తోటివారి ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాల్సిన ఒక రంగాన్ని మనమిప్పుడు చూద్దాం.

10. కొంతమంది క్రైస్తవులు ఎలాంటి సందిగ్ధంలో పడవచ్చు?

10 ఒకానొక స్నేహితుడు లేఖన విరుద్ధమైన ప్రవర్తనకు పాల్పడ్డాడని తెలిసినప్పుడు కొంతమంది యౌవనస్థులు సందిగ్ధంలో పడవచ్చు. స్నేహితునికి ఆధ్యాత్మిక సహాయం అందేలా అతని ప్రవర్తన గురించి పెద్దలకు చెబితే అతనికి నమ్మకద్రోహం చేసినట్లౌతుందేమోననే తప్పుడు అభిప్రాయంతో వారు దాని గురించి ఎవరితోనూ చెప్పరు. అంతేకాక, తాను చేసిన తప్పు గురించి ఎవరితోనూ చెప్పవద్దని తప్పుచేసిన వ్యక్తి కూడా ఒత్తిడి చేయవచ్చు. అయితే, ఇలాంటి సమస్య యౌవనస్థులకు మాత్రమే ఎదురుకాదు. ఒక స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు చేసిన తప్పు గురించి సంఘ పెద్దలకు చెప్పడం కొంతమంది పెద్దవాళ్లకు కూడా కష్టమనిపించవచ్చు. అలాంటి ఒత్తిడికి నిజ క్రైస్తవులు ఎలా స్పందించాలి?

11, 12. సంఘంలోని సభ్యుడు తన తప్పు గురించి ఎవరితోనూ చెప్పొద్దంటే మనమేమి చేయడం ఉత్తమం? ఎందుకు?

11 ఈ పరిస్థితిని ఊహించుకోండి. సంఘంలోని సతీష్‌ అనే తన స్నేహితునికి అశ్లీల దృశ్యాలు చూసే అలవాటుందని అఖిల్‌ అనే ఓ యౌవన సహోదరునికి తెలిసిందనుకుందాం. అతడు చేస్తున్న దాని పట్ల అఖిల్‌ విచారాన్ని వ్యక్తం చేస్తాడు. అయితే, అఖిల్‌ మాటలను సతీష్‌ అంతగా పట్టించుకోడు. చేసిన తప్పు గురించి సంఘ పెద్దలతో మాట్లాడమని అఖిల్‌ తన స్నేహితుణ్ణి కోరినప్పుడు, “నువ్వు నిజంగా నా స్నేహితుడివైతే నా గురించి పెద్దలకు చెప్పవు” అని అతడు అంటాడు. అప్పుడు స్నేహితుణ్ణి పోగొట్టుకుంటానేమో అని అఖిల్‌ భయపడాలా? ఒకవేళ తాను చెప్పినదాన్ని సతీష్‌ నిరాకరిస్తే సంఘ పెద్దలు ఎవర్ని నమ్ముతారోనని అఖిల్‌ భయపడవచ్చు. అలాగని అఖిల్‌ దాని గురించి పెద్దలకు చెప్పకపోతే పరిస్థితి మెరుగవ్వదు. అంతేకాక, యెహోవాతో ఉన్న సంబంధాన్ని సతీష్‌ పాడుచేసుకుంటాడు. “భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును” అనే మాటలను అఖిల్‌ గుర్తుంచుకోవడం మంచిది. (సామె. 29:25) అఖిల్‌ ఇంకేమి చేయవచ్చు? ప్రేమతో సతీష్‌ దగ్గరకు వెళ్లి అతని తప్పు గురించి నిర్మొహమాటంగా చర్చించాలి. అలా చేయాలంటే ధైర్యం ఉండాలి. అయితే, సతీష్‌ తన సమస్య గురించి మాట్లాడేందుకు ఈసారి మొగ్గు చూపవచ్చు. సమస్య గురించి పెద్దలతో మాట్లాడమని సతీష్‌ను అఖిల్‌ మరోసారి కోరాలి, ఒకవేళ మాట్లాడకపోతే తగిన వ్యవధి దాటిన తర్వాత తానే పెద్దలతో మాట్లాడతానని కూడా చెప్పాలి.—లేవీ. 5:1.

12 అలాంటి పరిస్థితితో మీరు ఎప్పుడైనా వ్యవహరించాల్సి వస్తే, మీ సహాయాన్ని మొదట్లో మీ స్నేహితుడు ఇష్టపడకపోవచ్చు. కానీ మీరు తన మేలు కోసమే అలా చేశారని కొంతకాలానికి అతడు గ్రహించవచ్చు. తప్పుచేసిన వ్యక్తి, సహాయాన్ని స్వీకరించి దాన్ని అంగీకరిస్తే మీరు చూపించిన ధైర్యాన్ని, నమ్మకాన్ని బట్టి అతడు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుడై ఉంటాడు. తనకు సహాయం చేయమని పెద్దలను కోరినందుకు మీమీద అతడు కోపాన్ని పెంచుకున్నాడనుకోండి, అలాంటి వ్యక్తితో స్నేహం చేయడం సరైనదేనా? అన్నివేళలా మనం మన మహాగొప్ప స్నేహితుడైన యెహోవాను సంతోషపరచడమే మంచిది. మనం ఆయనకు మొదటి స్థానమిచ్చినప్పుడు ఆయనను ప్రేమించేవారు మన యథార్థతను బట్టి మనల్ని గౌరవిస్తారు, మనకు నిజమైన స్నేహితులౌతారు. క్రైస్తవ సంఘంలో మనం ఎన్నడూ అపవాదికి చోటివ్వకూడదు. ఒకవేళ అలా చేస్తే మనం నిజంగా యెహోవా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. కానీ, క్రైస్తవ సంఘాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషిచేస్తే మనం పరిశుద్ధాత్మకు అనుగుణంగా ప్రవర్తిస్తాం.—ఎఫె. 4:27, 30.

అన్ని రకాల కష్టాలు

13. యెహోవా ప్రజలు ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారు? అలాంటి కష్టాలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి?

13 ఆర్థిక పరిస్థితులు తారుమారవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ప్రకృతి విపత్తులు సంభవించడం, ప్రియమైన వారు చనిపోవడం, ఆరోగ్యం క్షీణించడం, అలా ఎన్నో రకాలుగా కష్టాలు ఎదురుకావచ్చు. మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనలో ప్రతీ ఒక్కరం ఏదో ఒక విధమైన పరీక్షను ఎదుర్కోవాల్సిరావచ్చు. (2 తిమో. 3:1) అలా జరిగినప్పుడు మనం ఆందోళన పడకుండా ఉండడం ప్రాముఖ్యం. ఎలాంటి కష్టాలనైనా సహించడానికి పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది.

14. యోబు తనకు ఎదురైన కష్టాలను సహించడానికి ఎలా శక్తిని పొందాడు?

14 యోబు ఎన్నో కష్టాలను అనుభవించాడు. ఆయన తన జీవనాధారాన్ని, పిల్లలను, స్నేహితులను పోగొట్టుకున్నాడు, అనారోగ్యం పాలయ్యాడు, తన భార్య యెహోవాపై నమ్మకాన్ని కోల్పోయింది. (యోబు 1:13-19; 2:7-9) అయితే, ఆయన ఎలీహు నుండి నిజమైన ఓదార్పును పొందాడు. యోబుకు ఎలీహు చెప్పిన మాటల్లో, యెహోవా చెప్పిన మాటల్లో ముఖ్యాంశం ఇదే: “ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము.” (యోబు 37:14) యోబు తనకు ఎదురైన పరీక్షలను ఎలా సహించగలిగాడు? మనకు ఎదురయ్యే పరీక్షలను మనమెలా సహించగలం? యెహోవా తన పరిశుద్ధాత్మను, తన శక్తిని ఏయే విధాలుగా ఉపయోగించాడో గుర్తుపెట్టుకొని వాటిని ధ్యానించడం ద్వారా అలా చేయవచ్చు. (యోబు 38:1-41; 42:1, 2) మన జీవితంలో యెహోవా మనపట్ల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించిన సమయాలను మనం గుర్తుచేసుకోవచ్చు. ఆయనకు మనపట్ల ఇప్పటికీ శ్రద్ధవుంది.

15. పరీక్షలను సహించేందుకు అపొస్తలుడైన పౌలు ఎలా శక్తి పొందాడు?

15 తన విశ్వాసం కారణంగా ప్రాణాలకు ముప్పు తెచ్చే అనేక కష్టాలను అపొస్తలుడైన పౌలు సహించాడు. (2 కొరిం. 11:23-28) అలాంటి కష్ట సమయాల్లో భావోద్వేగపరంగా స్థిరంగావుండి వాటిని తట్టుకోవడానికి ఆయనకు ఏది సహాయం చేసింది? యెహోవాకు ప్రార్థించి ఆయనపై ఆధారపడడం వల్ల ఆయన తట్టుకోగలిగాడు. బహుశా తాను హతసాక్షిగా మరణించేందుకు దారితీసిన పరీక్షా కాలమప్పుడు పౌలు ఇలా రాశాడు: “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.” (2 తిమో. 4:17) అందుకే ‘దేని విషయంలోనూ చింతించనవసరం’ లేదని పౌలు తన సొంత అనుభవం నుండి తోటి విశ్వాసులకు అభయాన్నివ్వగలిగాడు.—ఫిలిప్పీయులు 4:6, 7, 13 చదవండి.

16, 17. కష్టాలను సహించడానికి నేడు యెహోవా తన ప్రజలకు ఎలా శక్తినిస్తున్నాడో తెలియజేసే ఓ ఉదాహరణనివ్వండి.

16 రోక్సానా అనే ఓ పయినీరు సహోదరి, యెహోవా తన ప్రజలకు కావాల్సినవి ఎలా సమకూరుస్తాడో అనుభవపూర్వకంగా తెలుసుకుంది. ఒకానొక సమావేశానికి హాజరయ్యేందుకు తనకు సెలవులు కావాలని యజమానిని అడిగినప్పుడు, ఆయన కోపంగా ‘నువ్వు వెళ్తే పనిలో నుండి నిన్ను తీసేస్తాను’ అని అన్నాడు. రోక్సానా సమావేశానికైతే హాజరైంది. కానీ, తన ఉద్యోగం పోకుండా ఉండాలని పట్టుదలతో ప్రార్థన చేసి ఆ తర్వాత దాని గురించి చింతించలేదు. నిజంగానే సమావేశమైన తర్వాతి రోజు అంటే సోమవారం యజమాని ఆమెను పనిలో నుండి తీసేశాడు. రోక్సానా చాలా బాధపడింది. జీతం తక్కువైనా తన కుటుంబాన్ని పోషించేందుకు ఆ ఉద్యోగం ఆమెకు చాలా అవసరం. ఆమె మళ్లీ ప్రార్థించి, సమావేశంలో తనను ఆధ్యాత్మికంగా పోషించిన దేవుడు ఇప్పుడు భౌతికంగా కూడా పోషించగలడని అనుకుంది. తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు, పారిశ్రామిక కుట్టు మెషిన్లను ఉపయోగించడంలో అనుభవంగల వ్యక్తులు “కావలెను” అని ఉన్న ఒక పోస్టరును చూసింది. దాని కోసం దరఖాస్తు పెట్టుకుంది. తనకు అనుభవం లేకపోయినా యజమాని ఆమెకు ఎలాగోలా పని ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకు ముందుకన్నా దాదాపు రెండింతలు ఎక్కువ జీతం వస్తుంది. తన ప్రార్థనలకు జవాబు లభించిందని రోక్సానా అనుకుంది. అయితే మరింత గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఆమె తన తోటి పనివారిలోని చాలామందితో సువార్తను పంచుకోగలిగింది. దానివల్ల, తన యజమానితో కలిపి ఐదుగురు బైబిలు సత్యాన్ని అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నారు.

17 మన ప్రార్థనలకు వెంటనే లేదా మనం ఊహించిన రీతిలో జవాబు రానప్పుడు, అసలు మన ప్రార్థనలకు జవాబు దొరకడం లేదని కొన్నిసార్లు అనిపించవచ్చు. మనమనుకున్నట్లుగా జవాబు రాకపోవడానికి సరైన కారణమే ఉంటుంది. అదేమిటో యెహోవాకు తెలుసు కానీ మనకైతే భవిష్యత్తులోనే అర్థమౌతుంది. అయితే, యెహోవా తన నమ్మకమైన సేవకులను విడిచిపెట్టడనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు.—హెబ్రీ. 6:10.

పరీక్షలను, శోధనలను అధిగమించడం

18, 19. (ఎ) మనకు పరీక్షలు, శోధనలు వస్తాయని ఎందుకు ఎదురుచూడవచ్చు? (బి) పరీక్షలను మనం విజయవంతంగా ఎలా సహించవచ్చు?

18 శోధనలు, నిరుత్సాహం, హింస, తోటివారి ఒత్తిడి ఎదురైనప్పుడు యెహోవా ప్రజలు ఆశ్చర్యపోరు. సాధారణంగా లోకం మనల్ని ద్వేషిస్తుంది. (యోహా. 15:17-19) యెహోవా సేవలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. మనం సహింపగలిగినదానికంటే ఎక్కువగా యెహోవా మనల్ని శోధింపబడనివ్వడు. (1 కొరిం. 10:13) ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎడబాయడు. (హెబ్రీ. 13:5) ఆయన ప్రేరేపిత వాక్యానికి విధేయులముగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం, శక్తిని పొందుతాం. అంతేకాక, మనకు బాగా అవసరమైన సమయంలో సహాయం చేయడానికి దేవుని ఆత్మ తోటి విశ్వాసులను ప్రేరేపిస్తుంది.

19 మనలో ప్రతి ఒక్కరం ప్రార్థన ద్వారా, బైబిలు అధ్యయనం ద్వారా పరిశుద్ధాత్మను పొందేందుకు కృషిచేస్తూ ఉందాం. మనం “ఆనందముతోకూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన [దేవుని] మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో” బలపరచబడుతూ ఉందాం.—కొలొ. 1:9-12.

[అధస్సూచి]

మీరెలా జవాబిస్తారు?

• హింసను తట్టుకోవడానికి మీరెలా సిద్ధపడవచ్చు?

• తమ తప్పు గురించి ఇతరులకు చెప్పవద్దని ఎవరైనా కోరినప్పుడు మీరేమి చేయాలి?

• ఎలాంటి కష్టాలు ఎదురైనా మీరు ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[28వ పేజీలోని చిత్రం]

యెహోషువ కాలేబుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

[29వ పేజీలోని చిత్రం]

ఏదైనా తప్పు చేసిన స్నేహితునికి మీరెలా సహాయం చేయవచ్చు?