కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరీక్షలు ఎదురైనా యెహోవాను సేవించగలిగినందుకు ఆయనకు కృతజ్ఞురాలిని

పరీక్షలు ఎదురైనా యెహోవాను సేవించగలిగినందుకు ఆయనకు కృతజ్ఞురాలిని

పరీక్షలు ఎదురైనా యెహోవాను సేవించగలిగినందుకు ఆయనకు కృతజ్ఞురాలిని

మార్చె డ యొంగ వాన్‌ డెన్‌ హ్యూవల్‌ చెప్పినది

నా కిప్పుడు 98 ఏళ్లు. వాటిలో 70 ఏళ్లు యెహోవా సేవలో ఆనందించాను. అదే సమయంలో విశ్వాసానికి సంబంధించి ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాను. రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు నేను సామూహిక నిర్బంధ శిబిరానికి పంపించబడ్డాను. ఒకానొక సమయంలో నిరుత్సాహం వల్ల నేను ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, అయితే అలా చేసినందుకు తర్వాత బాధపడ్డాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మరో దుఃఖకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. పరీక్షల్లో సహితం యెహోవాను సేవించే గొప్ప అవకాశం దొరికినందుకు ఆయనకు నేను కృతజ్ఞురాలిని.

1940 అక్టోబరులో నా జీవితం ఓ మలుపు తిరిగింది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కు ఆగ్నేయాన దాదాపు 24 కిలోమీటర్ల దూరంలోవున్న హిల్వర్సమ్‌ అనే పట్టణంలో నేను నివసించాను. ఆ దేశం నాజీ పరిపాలన క్రింద ఉండేది. నేను యాప్‌ డ యొంగను పెళ్లి చేసుకుని అప్పటికి ఐదేళ్లయ్యింది, ఆయన ప్రేమగల భర్త. మా ప్రియమైన కూతురు విల్లీకి అప్పుడు మూడేళ్లు. మా పక్కింట్లో, ఎనిమిది మంది పిల్లలున్న ఓ బీద కుటుంబం నివసించేది. అంతమంది పిల్లలను పోషించడం కష్టంగావున్నా, ఒక యౌవనస్థుణ్ణి తమ ఇంట్లో ఎల్లప్పుడూ అతిథిగా పెట్టుకొని ఆయనకు వారు భోజనం పెడుతుండేవారు. ‘ఆ అదనపు భారాన్ని ఎందుకు మోస్తున్నారు?’ అని నాకనిపించేది. నేను వారికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకెళ్లి ఇచ్చినప్పుడు, ఆ యౌవనస్థుడు ఓ పయినీరు అని తెలుసుకున్నాను. దేవుని రాజ్యం గురించి, అది తీసుకొచ్చే ఆశీర్వాదాల గురించి ఆయన నాకు చెప్పాడు. నేను నేర్చుకున్నదాన్నిబట్టి కదిలించబడి వెంటనే సత్యాన్ని అంగీకరించాను. అదే సంవత్సరంలో నేను యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నాను. నేను బాప్తిస్మం తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత నా భర్త కూడా బాప్తిస్మం తీసుకున్నాడు.

నాకు బైబిలు జ్ఞానం తక్కువగా ఉన్నా, యెహోవాసాక్షిని అవ్వడం ద్వారా నేను నిషేధించబడిన ఓ సంస్థలో సభ్యురాలినయ్యానని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అంతేకాక, రాజ్య సందేశాన్ని ప్రకటించినందువల్ల చాలామంది సాక్షులు అప్పటికే జైల్లో వేయబడ్డారని కూడా నాకు తెలుసు. అయినా, నేను వెంటనే ఇంటింటి పరిచర్యను ప్రారంభించాను. మేము పయినీర్లను, ప్రయాణ పర్యవేక్షకులను మా ఇంట్లో ఉండనిచ్చేవాళ్లం. అంతేకాక, ఆమ్‌స్టర్‌డామ్‌ నుండి సహోదర సహోదరీలు తీసుకొచ్చిన బైబిలు సాహిత్యాన్ని కూడా మా ఇంట్లోనే నిలువచేసేవాళ్లు. పెద్దపెద్ద బరువులను మోసే సైకిళ్లపై ఆ పుస్తకాలను పెట్టి తారు పూసిన నారగుడ్డను (టార్పాలిన్‌) వాటిపై కప్పేవారు. ఆ సహోదర సహోదరీలు ఎంతో ప్రేమను, ధైర్యాన్ని చూపించారు. వారు సహోదరుల కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారు.—1 యోహా. 3:16.

“అమ్మా, నువ్వు త్వరగా వచ్చేస్తావా?”

నా బాప్తిస్మం అయిన దాదాపు ఆరు నెలలకు ముగ్గురు పోలీసు అధికారులు మా ఇంట్లోకి వచ్చి సోదా చేశారు. సాహిత్యంతో నిండివున్న చిన్న గదిని వారు చూడలేదు కానీ మా పరుపు కింద పెట్టిన కొన్ని పుస్తకాలను కనుగొన్నారు. ఉన్నపళంగా నన్ను హిల్వర్సమ్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు రమ్మని ఆజ్ఞాపించారు. వెళ్లొస్తానని చెప్పడానికి మా పాపను హత్తుకున్నప్పుడు, “అమ్మా నువ్వు త్వరగా వచ్చేస్తావా?” అని తాను అడిగింది. “అవునమ్మా, నేను త్వరగానే వచ్చేస్తాను” అని చెప్పాను. కానీ, నేను మళ్లీ తనను ఎత్తుకోవడానికి 18 నెలలు పట్టింది. ఆ సమయం ఎంతో కష్టంగా గడిచింది.

అయితే, ఆ రోజు నన్ను ప్రశ్నించడానికి ఒక పోలీసు అధికారి రైల్లో ఆమ్‌స్టర్‌డామ్‌కు తీసుకెళ్లాడు. హిల్వర్సమ్‌లోని ముగ్గురు సహోదరులను చూపించి, వారు యెహోవాసాక్షులా కాదా గుర్తుపట్టమని నన్ను ప్రశ్నిస్తున్నవాళ్లు అడిగారు. దానికి నేను, “అందులో నాకు ఒకరే తెలుసు. ఆయన మాకు పాలు పోయడానికి వస్తాడు. కానీ ఆయన యెహోవాసాక్షా కాదా అనేది ఆయననే అడగండి, నన్ను కాదు” అని చెప్పాను. నిజంగానే ఆ సహోదరుడు పాలు అమ్మేవాడు. అయితే, ఆ తర్వాత నేను ఇంకేమీ చెప్పకపోవడంతో వారు నా ముఖం మీద కొట్టి నన్ను జైల్లో పెట్టారు, రెండు నెలలు అక్కడే ఉంచారు. నేను ఎక్కడున్నానో నా భర్తకు తెలిసినప్పుడు ఆయన నాకోసం కొన్ని బట్టలు, కొంత ఆహారం తీసుకువచ్చాడు. ఆ తర్వాత 1941 ఆగస్టులో, జర్మనీలోని బెర్లిన్‌కు ఉత్తరాన దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోవున్న రవెన్స్‌బ్రూక్‌ అనే స్త్రీల సామూహిక నిర్బంధ శిబిరానికి పంపించబడ్డాను. అది చాలా భయంకరమైన నిర్బంధ శిబిరం.

“ఏం బాధపడకు”

ఆ శిబిరానికి చేరుకున్న తర్వాత, మా విశ్వాసాన్ని వదులుకుంటున్నట్లు రాసివున్న అధికారిక పత్రం మీద సంతకం పెడితే మేము ఇంటికి వెళ్లవచ్చు అని చెప్పారు. అయితే నేను సంతకం పెట్టలేదనుకోండి. కానీ అలా సంతకం పెట్టనందుకు మా దగ్గరున్న వస్తువులనేకాక బాత్రూమ్‌లోకి వెళ్లి మేము వేసుకున్న బట్టలను కూడా తీసేసి వాళ్లకు ఇవ్వాల్సొచ్చింది. అక్కడే నేను నెదర్లాండ్స్‌ నుండి వచ్చిన కొంతమంది క్రైస్తవ సహోదరీలను కలుసుకున్నాను. మేము వేసుకోవడానికి ఊదారంగు త్రికోణం కుట్టివున్న శిబిరపు బట్టలను, ఒక ప్లేటును, కప్పును, స్ఫూన్‌ను మాకిచ్చారు. మొదటి రోజు రాత్రి మమ్మల్ని ఖైదీలను తాత్కాలికంగా ఉంచే బారకాసుల్లో ఉంచారు. నేను అరెస్టు అయిన తర్వాత మొదటిసారిగా అప్పుడే ఏడ్చాను. “నాకు ఏం జరుగుతుందో, ఎంతకాలం నన్నిక్కడ ఉంచుతారో?” అని వెక్కివెక్కి ఏడ్చాను. నిజం చెప్పాలంటే, నేను సత్యం తెలుసుకుని కేవలం కొన్ని నెలలే అయింది కాబట్టి అప్పటికి యెహోవాతో నాకున్న సంబంధం అంత బలంగా లేదు. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆ తర్వాతి రోజు హాజరు తీసుకుంటున్నప్పుడు నేను బాధగా ఉండడాన్ని ఒక డచ్‌ సహోదరి గమనించి, “ఏం బాధపడకు, మనకేం కాదు” అని చెప్పింది.

అలా హాజరు తీసుకున్న తర్వాత మమ్మల్ని వేరే బారకాసులకు తీసుకెళ్లారు, అక్కడ అప్పటికే జర్మనీకి, నెదర్లాండ్స్‌కు చెందిన కొన్ని వందలమంది క్రైస్తవ సహోదరీలు ఉన్నారు. ఆ జర్మనీ సహోదరీల్లో కొందరు అప్పటికే ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం నుండి ఈ బారకాసుల్లో ఉన్నారు. వారితో సహవాసం వల్ల నేను ప్రోత్సాహాన్ని, ఎంతో ఊరటను పొందాను. ఆ శిబిరంలోని ఇతర బారకాసులకన్నా మన సహోదరీలున్న బారకాసులు చాలా శుభ్రంగా ఉండడాన్ని చూసినప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది. సహోదరీలున్న బారకాసులు శుభ్రంగా ఉండేవి. అక్కడ దొంగతనాలు, తిట్టుకోవడాలు లేక కొట్లాటలు ఉండేవి కావు. శిబిరంలోవున్న క్రూరమైన పరిస్థితులకు భిన్నంగా మా బారకాసులు, కలుషితమైన సముద్రం మధ్యలో శుభ్రమైన ద్వీపంలా ఉండేవి.

శిబిరంలో అనుదిన జీవితం

శిబిరంలో తిండి తక్కువ పని ఎక్కువ. మేము ఉదయం ఐదు గంటలకే లేవాలి. లేచిన కొద్దిసేపటికి హాజరు తీసుకునేవాళ్లు. గార్డులు మమ్మల్ని దాదాపు ఒక గంటసేపు బయట నిలబెట్టేవాళ్లు. వాతావరణం ఎలావున్నాసరే అలాగే నిలబడాల్సి వచ్చేది. రోజంతా కష్టపడిన తర్వాత, సాయంత్రం 5 గంటలకు మళ్లీ హాజరు తీసుకునేవాళ్లు. అప్పటికే చాలా అలసిపోయిన మేము ఆ తర్వాత కొంచెం సూప్‌, బ్రెడ్‌ తిని పడుకునేవాళ్లం.

ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో నేను పొలాల్లో పనిచేసేదాన్ని. కొడవలి పెట్టి గోధుమలను కోసేదాన్ని, చిన్న నీటి కాలువల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తీసేదాన్ని, పందుల దొడ్డిని శుభ్రం చేసేదాన్ని. అది చాలా కష్టమైన, మురికితో కూడుకున్న పనైనా నేనింకా యౌవనంగా, బలంగా ఉన్నాను కాబట్టి ప్రతిరోజూ ఆ పని చేయగలిగేదాన్ని. అంతేకాక, పనిలో ఉన్నప్పుడు రాజ్య గీతాలను పాడడం ద్వారా బలాన్ని పొందేదాన్ని. అయితే నా భర్తను, కూతుర్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ప్రతీరోజు ఎదురుచూసేదాన్ని.

మాకు ఆహారం చాలా కొద్దిగా దొరికినప్పటికీ ఆదివారాల్లో బైబిలు అంశాలను చర్చించుకోవడానికి కలుసుకున్నప్పుడు తినేందుకు అదనంగా ఏదో ఒకటి ఉండాలని అక్కడున్న సహోదరీలందరం ప్రతీరోజు ఒక బ్రెడ్‌ ముక్కను దాచుకునేవాళ్లం. మా దగ్గర బైబిలు సాహిత్యం లేకపోయినా నాకన్నా వయసులో పెద్దవారైన, నమ్మకస్థులైన జర్మనీ సహోదరీలు బైబిలును చర్చిస్తున్నప్పుడు ఆసక్తితో వినేదాన్ని. అక్కడ క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని కూడా ఆచరించాం.

ఆందోళన, తప్పు చేశాననే బాధ, ప్రోత్సాహం

కొన్నిసార్లు, యుద్ధానికి నేరుగా సంబంధమున్న పనిని చేయమని నాజీలు మమ్మల్ని ఆదేశించేవాళ్లు. రాజకీయాల్లో తటస్థంగా ఉండడం వల్ల ఆ పని చేయడానికి సహోదరీలందరూ నిరాకరించారు, నేనూ వారి ధైర్యాన్ని అనుకరించాను. చెప్పిన పని చేయనందుకు శిక్షగా వాళ్లు మాకు కొన్ని రోజులు భోజనం పెట్టలేదు. అంతేకాక, హాజరు తీసుకునే స్థలంలో కొన్ని గంటలపాటు నిలబెట్టేవాళ్లు. చలికాలంలో ఒకసారి, ఒక బారకాసులో మమ్మల్ని 40 రోజులు బంధించారు. ఆ బారకాసును వెచ్చగా ఉంచే సదుపాయాలేమీ లేవు.

మా విశ్వాసాన్ని విడిచిపెడుతున్నామని రాసివున్న ఓ అధికారిక పత్రంపై సంతకం చేస్తే మమ్మల్ని వదిలేస్తామని, మేము ఇంటికి వెళ్లిపోవచ్చని యెహోవాసాక్షులమైన మాకు పదేపదే చెప్పేవాళ్లు. రవెన్స్‌బ్రూక్‌లో ఒక సంవత్సరం కన్నా ఎక్కువకాలం ఉన్న తర్వాత నేను చాలా నిరుత్సాహపడ్డాను. నా భర్తను, కూతుర్ని చూడాలని ఎంతగా కోరుకున్నానంటే గార్డుల దగ్గరకు వెళ్లి ఇక బైబిలు విద్యార్థిగా ఉండనని రాసివున్న అధికారిక పత్రాన్ని తీసుకొని దానిపై సంతకం పెట్టేశాను.

నేను సంతకం పెట్టానని సహోదరీలు తెలుసుకున్నప్పుడు వారిలో కొందరు నాతో సహవసించడం మానేశారు. హేట్విక్‌, గెర్‌ట్రూట్‌ అనే ఇద్దరు వృద్ధ జర్మనీ సహోదరీలు మాత్రం నన్ను కలిసి తాము నన్ను ఇంకా ప్రేమిస్తున్నామని చెప్పారు. పందుల దొడ్లలో కలిసి పనిచేస్తున్నప్పుడు వారు నాతో యెహోవా పట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవడం ఎంతో ప్రాముఖ్యమని, దేనికీ రాజీపడకుండా ఉంటే యెహోవా పట్ల మనకున్న ప్రేమను చూపించవచ్చని ప్రేమతో వివరించారు. తల్లిలా వారు చూపించిన ప్రేమానురాగాలు నా హృదయాన్ని తాకాయి. a నేను చేసింది తప్పని నాకు తెలుసు, కాబట్టి నేను సంతకం చేసిన పత్రాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నాను. ఒక రోజు సాయంకాలం నా నిర్ణయం గురించి ఓ సహోదరితో చెప్పాను. మా మాటలను ఒక శిబిరపు అధికారి విన్నాడనుకుంటా, ఎందుకంటే అదే రోజు సాయంకాలం నన్ను అకస్మాత్తుగా శిబిరం నుండి విడుదల చేసి, రైల్లో తిరిగి నెదర్లాండ్స్‌కు పంపించేశారు. సూపర్‌వైజర్‌లలో ఒకామె ముఖం నాకింకా గుర్తుంది. ఆమె ఆ రోజు నాతో, “నువ్వు ఇంకా బీబల్‌ఫోర్షర్‌వే (బైబిలు విద్యార్థి), ఎప్పుడూ అలాగే ఉంటావు” అని అంది. దానికి నేను, “అవును ఉంటాను, యెహోవాకు కూడా అది ఇష్టమే” అని జవాబిచ్చాను. ఆ తర్వాత ‘నేను సంతకం చేసి ఇచ్చిన పత్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలి?’ అని ఆలోచించాను.

ఆ పత్రంలో అనేక విషయాలు ఉన్నాయి. “అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సంస్థతో ఇక ఏమాత్రం కలిసి పనిచేయనని మాటిస్తున్నాను” అనేది అందులో ఒకటి. కానీ, విడుదలైన తర్వాత ఏమి చేయాలో నాకు తెలుసు. 1943 జనవరిలో ఇంటికి చేరుకున్న వెంటనే నేను మళ్లీ ప్రకటనా పనిలో పాల్గొనడం ఆరంభించాను. దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ రెండవసారి నాజీ అధికారుల కంటబడితే మాత్రం నన్ను తీవ్రంగా శిక్షిస్తారు.

నమ్మకమైన సేవకురాలిగా ఉండాలన్న నా హృదయపూర్వక కోరికను యెహోవాకు మరింత చూపించేందుకు మేము మరో పని కూడా చేశాం. నేనూ నా భర్త కలిసి ప్రయాణ పర్యవేక్షకులను, సాహిత్యాలను చేరవేసేవారిని మళ్లీ మా ఇంట్లో ఉండనిచ్చాం. యెహోవా పట్ల, ఆయన ప్రజల పట్ల నా ప్రేమను చూపించే అవకాశం మరోసారి లభించినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.

ఎంతో వేదనను అనుభవించాం

యుద్ధం ముగియడానికి కొన్ని నెలల ముందు నేను, నా భర్త ఎంతో వేదనను అనుభవించాం. 1944 అక్టోబరులో మా కూతురు విల్లీకి అకస్మాత్తుగా జబ్బు చేసింది. కంఠవాతము (డిఫ్తీరియా) వల్ల ఆమె పరిస్థితి త్వరగా క్షీణించడంతో మూడు రోజుల్లో చనిపోయింది. అప్పటికి తనకు కేవలం ఏడేళ్లే.

మా ఒక్కగానొక్క కూతుర్ని మరణంలో కోల్పోవడాన్ని తట్టుకోలేకపోయాం. నిజం చెప్పాలంటే, మా కూతురు చనిపోయినప్పుడు నేను పడిన బాధతో పోలిస్తే రవెన్స్‌బ్రూక్‌లో నేను అనుభవించిన పరీక్షలు అసలు లెక్కలోకి రావు. అయితే, ఆందోళనగా ఉన్నప్పుడల్లా కీర్తన 16:8లోని మాటల నుండి ఓదార్పు పొందాం. అక్కడిలా ఉంది: “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.” యెహోవా వాగ్దానం చేసిన పునరుత్థాన నిరీక్షణ మీద మేము పూర్తి నమ్మకముంచాం. మేము సత్యంలో కొనసాగి, ఎల్లప్పుడూ ఆసక్తితో సువార్తను ప్రకటించాం. నా భర్త 1969లో చనిపోయేంతవరకూ, నేను కృతజ్ఞతతో యెహోవాను ఆరాధించేలా ఆయన నాకు సహాయం చేశాడు.

ఆశీర్వాదాలు, ఆనందాలు

గడిచిన దశాబ్దాల్లో పూర్తికాల సేవకులతో సన్నిహితంగా సహవసించడం వల్ల మేము చాలా ఆనందించాం. యుద్ధ సమయంలోలాగే, ప్రయాణ పర్యవేక్షకులు, వారి భార్యలు మా సంఘాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వారిని మా ఇంట్లోనే ఉంచుకునేవాళ్లం. ప్రయాణ పనిలో ఉన్న మార్టన్‌, అతని భార్య నెల్‌ కాప్టీన్‌ 13 సంవత్సరాలపాటు మా ఇంట్లోనే ఉన్నారు. నెల్‌కు ప్రాణాంతక వ్యాధి వచ్చి తాను చనిపోయేంతవరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాం. అలా మూడు నెలలపాటు ఆమెను చూసుకునే గౌరవం నాకు దక్కింది. వారితో, స్థానిక సహోదర సహోదరీలతో సహవసించడం వల్ల నేడు మనం జీవిస్తున్న ఆధ్యాత్మిక పరదైసును అనుభవించగలుగుతున్నాను.

నా జీవితంలో 1995వ సంవత్సరం కూడా ప్రత్యేకమైనది. ఆ సంవత్సరం రవెన్స్‌బ్రూక్‌లో జరిగిన ఒక స్మారకోత్సవానికి నేను ఆహ్వానించబడ్డాను. 50కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం నాతో పాటు శిబిరంలోవున్న సహోదరీలను అక్కడ కలుసుకున్నాను. మళ్లీ వారిని కలవడం మరచిపోలేని, సంతోషకరమైన అనుభూతి. అంతేకాక, చనిపోయిన మన ప్రియమైన వారిని తిరిగి కలుసుకునే సమయం కోసం వేచి చూడమని ఒకరినొకరం ప్రోత్సహించుకునేందుకు మంచి అవకాశం దొరికింది.

రోమీయులు 15:4లో అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగు[తుంది].” పరీక్షల్లో సహితం యెహోవాను కృతజ్ఞతతో సేవించగలిగేలా ఈ నిరీక్షణను ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞురాలిని.

[అధస్సూచి]

a ఆ సమయంలో, ప్రధాన కార్యాలయంతో సంప్రదించే అవకాశం లేకపోవడం వల్ల తటస్థతకు సంబంధించిన విషయాలను చూసుకోవడానికి సహోదరులు తాము చేయగలిగింది చేసేవారు. ఆ కారణం వల్లే, సహోదరి మార్చెతో ఆ శిబిరంలోని సహోదరీలు వేర్వేరు విధాలుగా ప్రవర్తించారు.

[10వ పేజీలోని చిత్రం]

1930లో యాప్‌తో

[10వ పేజీలోని చిత్రం]

ఏడేళ్లున్నప్పుడు మా కూతురు విల్లీ

[12వ పేజీలోని చిత్రం]

1995లో స్నేహితులను మళ్లీ కలుసుకోగలిగే సంతోషకరమైన ఓ సందర్భానికి హాజరయ్యాను. మొదటి వరుసలో ఎడమ నుండి రెండవ వ్యక్తిని నేనే