కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’

‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’

‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’

‘దుఃఖితులగు దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించు జనశేషముగా ఉండనిత్తును.’—జెఫ. 3:12.

1, 2. త్వరలో మానవులందరిపైకి ఏ సూచనార్థకమైన తుఫాను రాబోతోంది?

 భారీ వర్షం లేదా వడగండ్ల వాన పడుతున్నప్పుడు ఆశ్రయం కోసం మీరెప్పుడైనా బ్రిడ్జి కింద ఆగారా? అలాంటివాటి నుండి బ్రిడ్జి మిమ్మల్ని కాపాడవచ్చేమో కానీ, హరికేన్‌ వంటి ఓ పెద్ద తుఫాను వస్తే మాత్రం అది మీకు అంత భద్రతను ఇవ్వకపోవచ్చు.

2 మానవజాతి ఉనికినే ప్రమాదంలో పడవేసే ఒక భిన్నమైన తుఫాను రాబోతుంది. అది సూచనార్థకమైన ‘ఉపద్రవ దినం.’ రాబోయే ఈ “యెహోవా మహా దినము” మానవులందరిపై ప్రభావం చూపిస్తుంది. అయితే, మనం సురక్షితంగా ఉండేందుకు ఆశ్రయాన్ని పొందవచ్చు. (జెఫన్యా 1:14-18 చదవండి.) త్వరలో “యెహోవా ఉగ్రత దినము” వచ్చినప్పుడు, మనమెలా ఆశ్రయాన్ని పొందవచ్చు?

బైబిలు కాలాల్లో వచ్చిన ఉపద్రవ దినాలు

3. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం మీదికి ఏ ‘ప్రచండమైన వడగండ్ల’ తుఫాను వచ్చింది?

3 భూమ్మీదున్న అబద్ధమతాలన్నిటినీ నాశనం చేయడం ద్వారా యెహోవా దినం అకస్మాత్తుగా విరుచుకుపడుతుంది. ఆ నాశనాన్ని తప్పించుకునేందుకు మనం ఎలా ఆశ్రయం పొందవచ్చో ప్రాచీనకాల దేవుని సేవకుల ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది. సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో జీవించిన యెషయా, మతభ్రష్టమైన ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యం మీదికి రాబోయే యెహోవా తీర్పును ఎవరూ ఆపలేని ‘ప్రచండమైన వడగండ్ల’ తుఫానుతో పోల్చాడు. (యెషయా 28:1, 2 చదవండి.) సా.శ.పూ. 740లో ఎఫ్రాయిము ప్రముఖ గోత్రంగావున్న పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరీయులు ముట్టడించినప్పుడు ఆ ప్రవచనం మొదటిసారి నెరవేరింది.

4. సా.శ.పూ. 607లో యెరూషలేము మీదికి “యెహోవా మహా దినము” ఎలా వచ్చింది?

4 అవిశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగం మీదికి తీర్పు వచ్చిన తర్వాత, సా.శ.పూ. 607లో యెరూషలేము మీదికి, యూదా రాజ్యం మీదికి “యెహోవా మహా దినము” వచ్చింది. యూదా ప్రజలు కూడా మతభ్రష్టులయ్యారు కాబట్టే అలా జరిగింది. నెబుకద్నెజరు నాయకత్వంలో బబులోనీయులు యూదా రాజ్యాన్ని, దాని రాజధానియైన యెరూషలేమును బెదిరించారు. అప్పుడు ఆ యూదులు, “మాయాశరణ్యమును” అంటే, ఐగుప్తుతో వారు చేసుకున్న రాజకీయ ఒప్పందాన్ని ఆశ్రయించారు. అయినా ఆ బబులోనీయులు, నాశనకరమైన వడగండ్ల తుఫానులా వారి “శరణ్యమును” తుడిచిపెట్టేశారు.—యెష. 28:14, 17.

5. అబద్ధమతాలన్నీ నాశనం చేయబడినప్పుడు ఒక గుంపుగా దేవుని ప్రజలకు ఏమి జరుగుతుంది?

5 యెరూషలేము మీదికి వచ్చిన యెహోవా మహా దినం మన కాలంలోని మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యం మీదికి రాబోయే తీర్పును సూచించింది. అయితే, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను” మిగతా భాగం కూడా నాశనం చేయబడుతుంది. ఆ తర్వాత, సాతాను దుష్ట విధానంలోని ప్రతీది పూర్తిగా తీసివేయబడుతుంది. కానీ, ఒక గుంపుగా దేవుని ప్రజలు కాపాడబడతారు. ఎందుకంటే వారు యెహోవాను ఆశ్రయిస్తున్నారు.—ప్రక. 7:14; 18:2, 8; 19:19-21.

ఆధ్యాత్మిక ఆశ్రయం, భౌతిక ఆశ్రయం

6. దేవుని ప్రజలు ఎలా ఆశ్రయాన్ని పొందవచ్చు?

6 దేవుని ప్రజలు ఈ అంత్యదినాల్లో కూడా ఎలా ఆశ్రయాన్ని పొందవచ్చు? ప్రార్థనాపూర్వకంగా “[దేవుని] నామమును స్మరించుచు,” ఆసక్తితో ఆయనను సేవించడం ద్వారా మనం ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని పొందుతాం. (మలాకీ 3:16-18 చదవండి.) అయితే, కేవలం ఆయన నామాన్ని స్మరించడం మాత్రమే సరిపోదని మనకు తెలుసు. “యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు” అని బైబిలు చెబుతోంది. (యోవే. 2:32) యెహోవా నామమున ప్రార్థించడానికి, ఆయన ద్వారా కలిగే రక్షణకు మధ్య సంబంధముంది. భక్తితో యెహోవా “నామమును స్మరించుచు” ఆయన సాక్షులుగా సేవచేస్తున్న నిజ క్రైస్తవులకు, ఆయనను సేవించని వారికి మధ్యవున్న తేడాను చాలామంది యథార్థహృదయులు ఇప్పుడు చూడగలుగుతున్నారు.

7, 8. మొదటి శతాబ్దపు క్రైస్తవులు భౌతిక ఆశ్రయాన్ని ఎలా పొందారు? దానికి నేడు ఏ పోలిక ఉంది?

7 అయితే, మనల్ని రక్షించేందుకు ఆధ్యాత్మిక ఆశ్రయమేకాక భౌతిక ఆశ్రయం కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే, దేవుని ప్రజలకు భౌతిక ఆశ్రయం ఉంటుందని వాగ్ధానం చేయబడింది. సా.శ. 66లో సెస్టియస్‌ గ్యాలస్‌ నాయకత్వం కింద రోమా సైన్యం యెరూషలేమును ముట్టడించినప్పుడు జరిగిన దానిని చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఆ శ్రమ దినాలు “తక్కువ చేయబడును” అని యేసు ముందే చెప్పాడు. (మత్త. 24:15, 16, 21, 22) రోమా సైన్యాలు అనుకోకుండా పట్టణాన్ని ముట్టడించడం ఆపేసి వెనక్కి వెళ్లిపోయినప్పుడు అలా జరిగింది. దానివల్ల కొంతమంది ‘శరీరులు’ అంటే, నిజ క్రైస్తవులు ‘తప్పించుకోగలిగారు.’ వారు పట్టణాన్ని, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలను విడిచి పారిపోగలిగారు. కొంతమంది యొర్దాను నదిని దాటి, దానికి తూర్పు వైపున ఉన్న కొండల్లో ఆశ్రయాన్ని పొందారు.

8 ఆ క్రైస్తవులకు, నేటి దేవుని ప్రజలకు మధ్య పోలిక ఉంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆశ్రయం కోసం వెదికారు, నేటి దేవుని సేవకులు కూడా అలాగే చేస్తారు. కానీ, నిజ క్రైస్తవులు భూవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వారు అక్షరార్థంగా ఒక ప్రాంతానికి పారిపోవాల్సిన అవసరం లేదు. అయితే ‘ఏర్పరచబడినవారు,’ వారి నమ్మకమైన సహవాసులు యెహోవానూ కొండలాంటి ఆయన సంస్థనూ ఆశ్రయించడం ద్వారా ఒక జనాంగంగా మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యపు నాశనాన్ని తప్పించుకుంటారు.

9. ప్రజలు యెహోవా నామాన్ని మరచిపోయేలా చేయడానికి ఎవరు ప్రయత్నించారు? ఒక ఉదాహరణ చెప్పండి.

9 యెహోవా గురించి, ఆయన ప్రమాణాల గురించి తమ చర్చీలకు వచ్చే ప్రజలకు బోధించనందుకు, ఆయన నామాన్ని ఉపయోగించనందుకు క్రైస్తవమత సామ్రాజ్యం రాబోయే నాశనానికి తగినదే. మధ్యయుగాల్లో, యూరప్‌లోని చాలామందికి యెహోవా పేరు తెలుసు. టెట్రగ్రామటన్‌ అనే నాలుగు హెబ్రీ అక్షరాల చేత సూచించబడిన, యహ్‌వహ్‌ (లేదా జహ్‌వహ్‌) అని సాధారణంగా లిప్యంతరీకరించబడిన ఆ పేరు నాణేలపై, ఇంటి ముఖభాగాలపై, అనేక పుస్తకాల్లో, బైబిళ్లలో, చివరకు కొన్ని క్యాథలిక్‌ మరియు ప్రొటస్టెంటు చర్చీల్లో కూడా కనిపించేది. ఆధునిక కాలాల్లో బైబిలు అనువాదాల నుండి, మరితర వాడుకల్లో నుండి దేవుని పేరును తీసివేయడం ఆనవాయితి అయిపోయింది. దానికి సంబంధించి ఓ వాస్తవాన్ని గమనించండి. జూన్‌ 29, 2008 తేదీతోవున్న ఓ అధికారిక ఉత్తరంలో రోమన్‌ క్యాథలిక్‌ చర్చి, వివిధ అనువాదాల్లో నుండి టెట్రగ్రామటన్‌ను తీసేసి దాని స్థానంలో “ప్రభువు” అని పెట్టాలని ఆదేశించింది. క్యాథలిక్‌ మత సేవలు జరిగేటప్పుడు పాటల్లో, ప్రార్థనల్లో దేవుని పేరును ఉపయోగించకూడదని, దానిని ఉచ్చరింపకూడదని వాటికన్‌ ఆదేశించింది. క్రైస్తవ మతనాయకులే కాక క్రైస్తవేతర మతాలకు చెందిన మతనాయకులు కూడా, లక్షలాదిమంది ప్రజలు సత్యదేవుణ్ణి తెలుసుకోకుండా చేశారు.

యెహోవా నామాన్ని పరిశుద్ధపరిచేవారు కాపాడబడతారు

10. నేడు దేవుని నామం ఎలా ఘనపర్చబడుతోంది?

10 ఇతర మతాలు చేసే దానికి భిన్నంగా యెహోవాసాక్షులు దేవుని నామాన్ని ఘనపర్చి, మహిమపరుస్తారు. అంతేకాక, గౌరవప్రదమైన విధంగా ఆ పేరును ఉపయోగించడం ద్వారా దాన్ని పరిశుద్ధపరుస్తారు. తనపై నమ్మకముంచే వారి విషయంలో యెహోవా సంతోషించడమేకాక వారిని ఆశీర్వదించి కాపాడడానికి ఎలా కావాలంటే అలా అవుతాడు. “తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.”—నహూ. 1:7; అపొ. 15:14.

11, 12. ప్రాచీన యూదాలో ఎవరు యెహోవా నామాన్ని సమర్థించారు? ఆధునిక కాలాల్లో ఎవరు అలా చేశారు?

11 ప్రాచీన యూదాలో చాలామంది మతభ్రష్టులుగా మారినప్పటికీ కొంతమంది మాత్రం ‘యెహోవా నామాన్ని ఆశ్రయించారు.’ (జెఫన్యా 3:12, 13 చదవండి.) యూదాను ఓడించి అందులోని ప్రజలను చెరపట్టుకొని పోయేందుకు బబులోనీయులను అనుమతించడం ద్వారా యెహోవా అవిశ్వాసులైన యూదులను శిక్షించాడు. ఆ సమయంలో యిర్మీయా, బారూకు, ఎబెద్మెలెకు వంటి కొంతమంది వ్యక్తులను ఆయన తప్పించాడు. మతభ్రష్ట జనాంగం “మధ్య” వారు జీవించారు. ఇతరులేమో చెరలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నారు. సా.శ.పూ. 539లో కోరెషు నాయకత్వం కింద మాదీయులు, పారసీకులు బబులోనును జయించారు. ఆ తర్వాత కొంతకాలానికే, మిగిలిన యూదులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవచ్చనే ఆజ్ఞను కోరెషు జారీచేశాడు.

12 సత్యారాధనను మళ్లీ ప్రారంభించి ఆయనను సేవించేవారిని యెహోవా కాపాడతాడని, వారి విషయంలో ఆయన సంతోషిస్తాడని జెఫన్యా ముందే చెప్పాడు. (జెఫన్యా 3:14-17 చదవండి.) అది మనకాలంలో కూడా నిజమైంది. దేవుని రాజ్యం పరలోకంలో స్థాపించబడిన తర్వాత నమ్మకమైన అభిషిక్త శేషాన్ని మహాబబులోను ఆధ్యాత్మిక చెర నుండి యెహోవా విడిపించాడు. అంతేకాక, నేటి వరకూ ఆయన వారి విషయంలో సంతోషిస్తున్నాడు.

13. అన్ని దేశాల ప్రజలు ఎలాంటి విడుదలను అనుభవిస్తున్నారు?

13 భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణగలవారు కూడా మహాబబులోను నుండి బయటికి వచ్చి, అబద్ధమత బోధలనుండి విడుదల పొందారు. (ప్రక. 18:4) అలా, జెఫన్యా 2:3లోని మాటలు మనకాలంలో విస్తృత భావంలో నెరవేరుతున్నాయి. అక్కడిలా ఉంది: ‘దేశంలో సాత్వికులైన సమస్త దీనులారా, యెహోవాను వెదకండి.’ అన్ని దేశాల్లోని సాత్వికులు అంటే పరలోక నిరీక్షణగలవారు, భూనిరీక్షణ గలవారు ఇప్పుడు యెహోవా నామాన్ని ఆశ్రయిస్తున్నారు.

దేవుని పేరు ఒక తాయెత్తు కాదు

14, 15. (ఎ) కొంతమంది వేటిని తాయెత్తుల్లా ఉపయోగించారు? (బి) దేనిని రక్షరేకులా ఉపయోగించకూడదు?

14 కొంతమంది ఇశ్రాయేలీయులు ఆలయాన్ని, శత్రువుల నుండి తమను కాపాడే ఓ తాయెత్తు అనుకున్నారు. (యిర్మీ. 7:1-4) అంతకుముందు, నిబంధన మందసం గురించి కూడా వారు అలాగే అనుకున్నారు. (1 సమూ. 4:3, 10, 11) యుద్ధంలో తన సైన్యాన్ని రక్షిస్తుందనే నమ్మకంతో, కాన్‌స్టంటైన్‌ ది గ్రేట్‌ గ్రీకు భాషలో “క్రీస్తు” అనే పదంలోని మొదటి రెండు అక్షరాలైన ఖై, రో లను తన సైనికుల డాళ్లపై రాయించాడు. అంతేకాక, ‘ముప్పై ఏళ్ల యుద్ధంలో’ పోరాడిన స్వీడన్‌ రాజైన గస్టవ్‌ ఆడాల్ఫ్‌ II, 7వ పేజీలో చూపించబడిన కవచాన్ని ధరించాడని భావించబడుతోంది. యెహోవా (Iehova) అనే పేరు దానిమీద ఉందని గమనించండి.

15 దయ్యాల దాడికి గురైన కొంతమంది యెహోవా ప్రజలు, ఆయన నామాన్ని గట్టిగా పలకడం ద్వారా ఆయన దగ్గర ఆశ్రయం పొందారు. అలాగని యెహోవా పేరున్న ఏదైనా వస్తువును, అద్భుతరీతిలో రక్షించే శక్తివున్న తాయెత్తులా లేదా రక్షరేకులా ఎంచకూడదు. యెహోవా నామాన్ని ఆశ్రయించడమంటే అది కాదు.

నేడు మనమెలా ఆశ్రయాన్ని పొందుతాం?

16. నేడు మనమెలా ఆధ్యాత్మిక ఆశ్రయాన్ని పొందవచ్చు?

16 దేవుని ప్రజలందరూ ఒక గుంపుగా అనుభవిస్తున్న ఆధ్యాత్మిక భద్రతలో మనం ఆశ్రయాన్ని పొందుతాం. (కీర్త. 91:1) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా, సంఘంలోని పెద్దల ద్వారా మన ఆధ్యాత్మిక సంక్షేమానికి హాని కలిగించే వాటి విషయంలో హెచ్చరించబడుతున్నాం. (మత్త. 24:45-47; యెష. 32:1, 2) వస్తుసంపదలను సమకూర్చుకునే విషయంలో మనం ఎంత తరచుగా హెచ్చరించబడ్డామో, అలాంటి హెచ్చరికలు ఆధ్యాత్మిక ప్రమాదం నుండి మనల్ని ఎలా కాపాడాయో ఆలోచించండి. కొన్నిసార్లు, అంతా క్షేమంగానే ఉందిలే అనే ధోరణి వృద్ధికావచ్చు. యెహోవా సేవలో నిష్క్రియులయ్యేలా చేసే అలాంటి ప్రమాదం విషయమేమిటి? దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.” (సామె. 1:32, 33) నైతిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండేందుకు కృషిచేయడం ద్వారా కూడా మనం ఆధ్యాత్మిక భద్రతను అనుభవించగలుగుతాం.

17, 18. యెహోవాను ఆశ్రయించేలా నేడు లక్షలాదిమందికి ఏది సహాయం చేస్తోంది?

17 భూమ్మీదున్న సకల జనములకు రాజ్యసువార్త ప్రకటించాలనే యేసు ఆజ్ఞను పాటించే విషయంలో నమ్మకమైన దాసుడు ఇచ్చే ప్రోత్సాహం గురించి కూడా ఆలోచించండి. (మత్త. 24:14; 28:19, 20) ప్రజలు దేవుని నామాన్ని ఆశ్రయించేలా చేసే ఓ మార్పు గురించి జెఫన్యా ప్రస్తావించాడు. ఆయనిలా రాశాడు: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల [‘స్వచ్ఛమైన భాష,’ NW] నిచ్చెదను.”—జెఫ. 3:9.

18 ఈ స్వచ్ఛమైన భాష ఏమిటి? అది యెహోవా దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి బైబిలులో ఉన్న సత్యం. అసలు దేవుని రాజ్యమంటే ఏమిటి, అది ఆయన నామాన్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది అనే వాటి గురించిన సత్యాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఒక విధంగా మీరు ఆ భాషను ఉపయోగిస్తారు. అంతేకాక, యెహోవా సర్వాధిపత్యం సరైనదని నిరూపించబడడం గురించి నొక్కి చెప్పినప్పుడు, నమ్మకమైన మానవులు ఎలాంటి శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతారనే విషయం గురించి సంతోషంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఆ భాషనే ఉపయోగిస్తారు. చాలామంది ఈ సూచనార్థక భాషను మాట్లాడడం వల్ల, ‘యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవిస్తున్నవారి’ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అవును, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యెహోవాను ఆశ్రయిస్తున్నారు.—కీర్త. 1:1, 3.

19, 20. బైబిలు కాలాల్లో, “మాయాశరణ్యము” మీద నమ్మకముంచినవారు ఎలా నిరాశచెందారు?

19 లోకంలోని ప్రజలు పెద్దపెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలను ఎలాగైనా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వారు అపరిపూర్ణ మానవులను ఆశ్రయిస్తున్నారు లేదా ప్రాచీన ఇశ్రాయేలీయుల్లా పరిష్కారం కోసం రాజకీయ వ్యవస్థల మీద ఆశ పెట్టుకుంటున్నారు. ఆ ఇశ్రాయేలీయులు కొన్నిసార్లు మద్దతు కోసం పొరుగు రాజ్యాలతో సంధి చేసుకున్నారు. కానీ, అలా చేయడం వల్ల ఇశ్రాయేలీయులకు మేలు జరగలేదని మీకు తెలుసు. నేడున్న ఏ రాజకీయ వ్యవస్థ లేదా ఐక్య రాజ్య సమితి మానవుల సమస్యలను పూర్తిగా పరిష్కరించలేదు. కాబట్టి, రాజకీయ వ్యవస్థలూ వాటితో చేసుకున్న ఒప్పందాలూ వంటి బూటకమైన వాటిని మనం ఆశ్రయించకూడదు. బైబిలు వాటిని ప్రవచనాత్మకంగా “మాయాశరణ్యము[లు]” అని పిలుస్తోంది. మీరు కూడా వాటిని అలాగే ఎంచవచ్చు ఎందుకంటే, వాటిని ఆశ్రయించే వారందరికీ ఎదురయ్యేది నిరాశే.—యెషయా 28:15, 17 చదవండి.

20 త్వరలోనే, యెహోవా దినమనే సూచనార్థక వడగండ్ల తుఫాను భూమిని తాకుతుంది. ఆ సమయంలో మానవ పథకాలు, అణు ఆశ్రయాలు, సిరిసంపదలు వంటివేవీ రక్షణ కలుగజేయలేవు. ‘వడగండ్లు మాయాశరణ్యమును కొట్టివేయును, దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును’ అని యెషయా 28:17 చెబుతోంది.

21. మనం 2011వ సంవత్సరపు వార్షిక వచనాన్ని పాటించడం వల్ల ఏ ప్రయోజనం పొందవచ్చు?

21 ఇప్పుడూ భవిష్యత్తులో యెహోవా దినం వచ్చినప్పుడూ తన ప్రజలు ఆయన దగ్గర నిజమైన భద్రతను కనుగొంటారు. “యెహోవా దాచిపెట్టాడు” అనే అర్థమున్న జెఫన్యా పేరు, దాక్కునే స్థలాన్ని ఎవరు ఏర్పాటు చేశారో తెలియజేస్తోంది. సముచితంగానే, ‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’ అనే జ్ఞానయుక్తమైన సలహా 2011వ సంవత్సరానికి వార్షిక వచనంగా ఉంది. (జెఫ. 3:12) యెహోవాపై పూర్తిగా నమ్మకముంచడం ద్వారా ఇప్పుడు కూడా మనం ఆయన నామాన్ని ఆశ్రయించవచ్చు, ఆశ్రయించాలి కూడా. (కీర్త. 9:10) కాబట్టి ప్రతీరోజు ఈ ప్రేరేపిత అభయాన్ని గుర్తుచేసుకుందాం: “యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగానుండును.”—సామె. 18:10.

మీకు గుర్తున్నాయా?

• నేడు మనం యెహోవా నామాన్ని ఎలా ఆశ్రయించవచ్చు?

• మనం “మాయాశరణ్యమును” ఎందుకు నమ్ముకోకూడదు?

• భవిష్యత్తులో మనకు ఏ ఆశ్రయం ఉంటుందని అభయం ఇవ్వబడింది?

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని బ్లర్బ్‌]

‘యెహోవా నామాన్ని ఆశ్రయించండి’ అనేదే 2011వ సంవత్సరపు వార్షిక వచనం.—జెఫన్యా 3:12.

[7వ పేజీలోని చిత్రసౌజన్యం]

Thüringer Landesmuseum Heidecksburg Rudolstadt, Waffensammlung “Schwarzburger Zeughaus”