కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లోయ ప్రాంతంలోవున్న పేరును చూడండి

లోయ ప్రాంతంలోవున్న పేరును చూడండి

లోయ ప్రాంతంలోవున్న పేరును చూడండి

సేయింట్‌ మోరిట్స్‌ అనే పేరును మీరెప్పుడైనా విన్నారా? బహుశా వినేవుంటారు ఎందుకంటే అది ప్రపంచంలో పేరుగాంచిన ఓ హాలిడే రిసార్టు. అది స్విట్జర్లాండ్‌లోని ఎంగడీన్‌ లోయ ప్రాంతంలో ఉంది. చాలా సంవత్సరాలుగా ప్రజలను ఆకట్టుకుంటున్న ప్రదేశాల్లో సేయింట్‌ మోరిట్స్‌ ఒకటి. ఇది ఇటలీ సరిహద్దు దగ్గర్లో, స్విట్జర్లాండ్‌కు ఆగ్నేయాన ఓ మారుమూల ప్రాంతంలో మంచుతో కప్పబడినవున్న ఆల్ఫ్స్‌ పర్వతాల్లోని లోయ ప్రాంతం. ఆ ప్రాంతంలోనే స్విస్‌ నేషనల్‌ పార్కు కూడా ఉంది. వివిధ రకాల మొక్కలు, జంతువులు ఉన్న ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యం మహాగొప్ప సృష్టికర్తయైన యెహోవాను మహిమపరుస్తుంది. (కీర్త. 148:7-10) అంతేకాదు, 17వ శతాబ్దం మధ్యకాలంలోని సాంప్రదాయపు అవశేషాలు కూడా యెహోవాను మహిమపరుస్తున్నాయి.

ఇక్కడ చాలా ఇళ్లపై మీరు ఓ అసాధారణమైన విషయాన్ని గమనిస్తారు. ఇప్పటికీ ఇళ్ల ముందుభాగంలో అంటే, ఇంటి ముఖద్వారం వంటి వాటిపై దేవుని పేరు చెక్కబడి ఉండడాన్ని చూస్తారు. గడిచిన శతాబ్దాల్లో ఇళ్ల ముందుభాగాన్ని ఏదైనా రాతలతో అలంకరించుకునే సాంప్రదాయం ఉండేది. పెయింట్‌ చేసిగానీ సిమెంటుపై తొలచిగానీ రాతిపై చెక్కిగానీ వాటిని రాసేవారు. బేవర్‌ గ్రామంలోని ఓ ఇంటిని మీరు ఈ చిత్రంలో చూడవచ్చు. దానిపై, “ఈ ఇల్లు 1715లో కట్టబడింది. యెహోవాయే ఆది, యెహోవాయే అంతం. ఆయనవల్లే అన్నీ సాధ్యమౌతాయి, ఆయన లేకుండా ఏదీ జరగదు” అని రాసివుంది. ఇంటిపైన రాయబడిన ఆ ప్రాచీన రాతలో దేవుని పేరు రెండుసార్లు కనిపిస్తుంది.

మాడూలైన్‌ అనే గ్రామంలో దానికన్నా పురాతన రాతను కనుగొంటాం. అక్కడ ఇలా ఉంది: “కీర్తన 127. యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. లూక్యస్‌ రూమేడ్యస్‌. 1654.”

ఆ లోయ ప్రాంతంలో దేవుని పేరు ఎందుకలా బహిరంగంగా రాయబడింది? సంస్కరణోద్యమ సమయంలో ఎంగడీన్‌ ప్రజలు మాట్లాడే రోమాన్ష్‌ భాషలో బైబిలు ప్రచురించబడింది, అది లాటిన్‌పై ఆధారపడిన భాష. చెప్పాలంటే, ఆ భాషలో అనువాదమైన మొదటి పుస్తకం అదే. దేవుని వాక్యంలో చదివినదాన్ని బట్టి ముగ్ధులై చాలామంది స్థానిక ప్రజలు తమ ఇళ్లపై తమ పేర్లనేకాక దేవుని పేరున్న బైబిలు వచనాలను కూడా రాసుకునేవారు.

అవి శతాబ్దాల పూర్వం రాయబడినప్పటికీ, నేటి వరకూ యెహోవా దేవుని నామాన్ని తెలియజేస్తున్నాయి, ఆయనను మహిమపరుస్తున్నాయి. మహాగొప్ప దేవుడైన యెహోవా పేరున్న మరో భవనాన్ని అంటే బేవర్‌లోవున్న యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని కూడా సందర్శించి, యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవాలని అక్కడి స్థానికులను, సందర్శకులను ఆహ్వానిస్తున్నాం.

[7వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Stähli Rolf A/age fotostock