కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ తోటి విశ్వాసులను ఎన్నడూ విడిచిపెట్టకండి

మీ తోటి విశ్వాసులను ఎన్నడూ విడిచిపెట్టకండి

మీ తోటి విశ్వాసులను ఎన్నడూ విడిచిపెట్టకండి

“మేము పది సంవత్సరాలపాటు వ్యాపార ప్రపంచపు తళుకుబెళుకులను బట్టి మైమరచిపోతూ ఎన్నో భోగభాగ్యాలను అనుభవించాం. మేము సత్యంలోనే పెరిగినప్పటికీ, యెహోవాకు చాలా దూరమైపోయాం. ఆయన దగ్గరికి తిరిగి రావడానికి కావాల్సిన ఆధ్యాత్మిక బలం మాకు లేదనిపించింది” అని యారొస్వావ్‌ ఆయన భార్య బేయాటా a చెబుతున్నారు.

మరో సహోదరుడైన మరెక్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “పోలండ్‌లో జరిగిన సామాజిక, రాజకీయ మార్పుల వల్ల నాకు దొరికిన ప్రతీ ఉద్యోగం పోయింది. నేను చాలా విసిగిపోయాను. వ్యాపారంలో రాణించడానికి కావాల్సిన సామర్థ్యం నాకు లేదు కాబట్టి, సొంతగా ఒక కంపెనీని ప్రారంభించడానికి భయపడ్డాను. నా ఆధ్యాత్మికతను దెబ్బతీయకుండానే కుటుంబ భౌతిక అవసరాలను మరింత బాగా చూసుకోవడానికి సహాయం చేస్తుందనే ఆలోచనతో చివరకు ఒక కంపెనీని ప్రారంభించాను. కొంతకాలానికి, నేనెంత తప్పుగా ఆలోచించానో అర్థమైంది.”

జీవన వ్యయం, నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్న ఈ ప్రపంచంలో కొంతమంది ఏదో ఒకటి చేయాలనే తొందరలో అవివేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలామంది సహోదరులు పని వేళలు అయిపోయిన తర్వాత కూడా పని చేయాలని, అదనంగా మరో ఉద్యోగాన్ని చేయాలని లేదా అనుభవం లేకున్నా సొంత వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అదనపు సంపాదన కుటుంబానికి సహాయం చేస్తుందని, యెహోవాతో తమకున్న సంబంధానికి ఏ హానీ కలిగించదని వారు అనుకున్నారు. అయితే, సదుద్దేశంతో ప్రణాళికలు వేసుకున్నా అనుకోని సంఘటనల వల్ల, ఆర్థిక అస్థిరత వల్ల అవి విఫలమవ్వవచ్చు. దాని ఫలితంగా కొంతమంది అత్యాశ అనే ఉచ్చులో పడి వస్తుసంపదల కోసం ఆధ్యాత్మిక విషయాలను త్యాగం చేశారు.—ప్రసం. 9:11, 12.

కొంతమంది సహోదర సహోదరీలు వ్యక్తిగత అధ్యయనానికి, కూటాలకు, పరిచర్యకు సమయం ఇవ్వలేనంతగా లోకసంబంధమైన వాటికోసం ప్రాకులాడడంలో మునిగిపోయారు. అలా చేయడం వల్ల వారి ఆధ్యాత్మికత దెబ్బతిని, యెహోవాతో వారికున్న సంబంధం పాడవుతుంది. అంతేగాక “విశ్వాసగృహమునకు చేరినవారి[తో]” తమకున్న అమూల్యమైన సంబంధాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. (గల. మరికొంతమంది నెమ్మదిగా క్రైస్తవ సహోదరత్వం నుండి తొలిగిపోతున్నారు. ఈ విషయం గురించి గంభీరంగా ఆలోచించండి.

తోటి విశ్వాసుల పట్ల మన బాధ్యత

సహోదర సహోదరీలుగా ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపించుకోవడానికి మనకు చాలా అవకాశాలున్నాయి. (రోమా. 13:8) సహాయం కోసం ‘మొరపెడుతున్నవారు’ మీ సంఘంలో కూడా ఉండేవుంటారు. (యోబు 29:12) కొంతమంది తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోతుండవచ్చు. అది మనకు ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తుందో అపొస్తలుడైన యోహాను గుర్తుచేస్తున్నాడు. ఆయనిలా అన్నాడు: “ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?” —1 యోహా. 3:17.

అలాంటి అవసరాలను గమనించి మీరు వారికి ఉదారంగా సహాయం చేసి ఉంటారు. అయినప్పటికీ, మన సహోదరుల పట్ల శ్రద్ధ చూపించడమంటే వస్తుపరమైన సహాయం చేయడం ఒక్కటే కాదు. కొంతమంది ఒంటరితనం వల్ల లేక నిరుత్సాహం వల్ల సహాయం కోసం అర్థిస్తుండవచ్చు. తాము పనికిరాని వారమని వారు అనుకుంటుండవచ్చు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండవచ్చు లేదా వారి ఆత్మీయులు చనిపోయి ఉండవచ్చు. అలాంటి వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, వారితో మాట్లాడడం ద్వారా వారిని ప్రోత్సహించవచ్చు. ఆ విధంగా వారి ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయగలుగుతాం. (1 థెస్స. 5:14) సాధారణంగా, అలాచేస్తే సహోదరులతో మనకున్న ప్రేమానుబంధాలు బలపడతాయి.

మరిముఖ్యంగా సంఘ పెద్దలు సహానుభూతితో వినగలుగుతారు, అర్థంచేసుకోగలుగుతారు, ప్రేమతో లేఖనాధార ఉపదేశాన్ని ఇవ్వగలుగుతారు. (అపొ. 20:28) వారలా చేయడం ద్వారా, ఆధ్యాత్మిక సహోదర సహోదరీల పట్ల “విశేషాపేక్ష” లేదా అనురాగం కలిగివున్న అపొస్తలుడైన పౌలును అనుకరిస్తారు.—1 థెస్స. 2:7, 8.

కానీ, ఒక క్రైస్తవుడు మందకు దూరమైపోతే, తోటి విశ్వాసుల పట్ల తనకున్న బాధ్యతను ఎలా నెరవేర్చగలడు? నిజానికి, సంఘ పర్యవేక్షకులు కూడా వస్తుసంబంధమైన ఆకర్షణలకు లోనయ్యే అవకాశం ఉంది. ఒక క్రైస్తవుడు అలాంటి శోధనలో పడితే ఏమౌతుంది?

జీవిత చింతల వల్ల కృంగిపోవడం

మొదట్లో చూసినట్లుగా, కుటుంబ కనీస భౌతిక అవసరాలు తీర్చడం కోసం ఎక్కువగా కష్టపడడం వల్ల చింతల్లో మునిగిపోయి బైబిల్లోని నైతిక విలువల పట్ల మన అభిప్రాయం మారే అవకాశం ఉంది. (మత్త. 13:22) పైన ప్రస్తావించబడిన మరెక్‌ ఇలా అంటున్నాడు: “నేను వ్యాపారంలో నష్టపోయినప్పుడు, విదేశాలకు వెళ్లి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలనుకున్నాను. మొదట మూడు నెలలకని వెళ్లాను, ఆ తర్వాత మరో మూడు నెలలకని వెళ్లాను, అలా వెళ్తూనే ఉన్నాను. మధ్యమధ్యలో కొన్నిరోజులు మాత్రమే నేను ఇంట్లో ఉండేవాడిని. దానివల్ల, అవిశ్వాసియైన నా భార్య మానసికంగా కృంగిపోయింది.”

దాని వల్ల దెబ్బతిన్నది ఆయన కుటుంబ జీవితం ఒక్కటే కాదు. మరెక్‌ ఇంకా ఇలా చెబుతున్నాడు: “తీవ్రమైన వేడి వాతావరణంలో ఎక్కువ గంటలు పనిచేయడంతో పాటు, ఇతరులను దోచుకోవాలని చూసే సంస్కారంలేని ప్రజల మధ్య పని చేయాల్సి వచ్చేది. వాళ్లు రౌడీల్లా ప్రవర్తించేవాళ్లు. నేను కృంగిపోయాను, వాళ్లు నామీద అధికారం చెలాయిస్తున్నట్లు భావించాను. నా బాగోగులు చూసుకోవడానికే సమయం లేదు కాబట్టి, ఇతరులకు ఎలా సహాయం చేయగలననే సందేహం మొదలైంది.”

మరెక్‌ నిర్ణయం వల్ల కలిగిన చెడు ఫలితాలను చూసి, మనం కూడా మన పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి. విదేశాలకు వెళ్తే ఆర్థికసమస్యలు తీరిపోతాయని అనిపించినా, అది ఇతర సమస్యలను సృష్టించదా? ఉదాహరణకు, మన కుటుంబ సభ్యుల ఆధ్యాత్మిక, భావోద్వేగ పరిస్థితి ఎలా ఉంటుంది? అలా వెళ్తే సంఘంతో మనకున్న సంబంధం తెగిపోయే అవకాశం ఉందా? అది తోటి విశ్వాసులకు సహాయం చేసే గొప్ప అవకాశాన్ని కోల్పోయేలా చేయదా?—1 తిమో. 3:2-5.

ఉద్యోగంలో తలమునకలవడానికి ఒక వ్యక్తి విదేశాలకే వెళ్లక్కర్లేదని బహుశా మీకు తెలిసే ఉంటుంది. యారొస్వావ్‌, బేయాటా విషయంలో ఏమి జరిగిందో చూడండి. యారొస్వావ్‌ ఇలా చెబుతున్నాడు: “అదంతా అనుకోకుండానే జరిగింది. మా వివాహమైన కొత్తలో, వ్యాపారం బాగా జరిగే ఒక స్థలంలో హాట్‌-డాగ్‌ (బ్రెడ్డు, మాంసంతో కూడిన అల్పాహారం) స్టాల్‌ను ప్రారంభించాం. మంచి లాభాలు రావడంతో ఆ వ్యాపారాన్ని విస్తరింపజేయాలని అనుకున్నాం. మాకు చాలా తక్కువ సమయం ఉన్నందువల్ల క్రైస్తవ కూటాలకు వెళ్లలేకపోయాం. కొద్దికాలానికే నేను పయినీరుగా, పరిచర్య సేవకునిగా సేవచేయడం ఆపేశాను. మేము ఆర్జించే లాభాలను బట్టి ఒక పెద్ద షాపును ప్రారంభించి, ఒక అవిశ్వాసిని వ్యాపార భాగస్వామిగా చేసుకున్నాను. త్వరలోనే, లక్షల డాలర్ల వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విదేశాలకు వెళ్లడం ఆరంభించాను. నేను చాలా అరుదుగా ఇంట్లో ఉండేవాడిని కాబట్టి నా భార్యతో, కూతురుతో ఉన్న బంధం బలహీనమైపోయింది. అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యాపారంలో మునిగిపోయి మేము మెల్లమెల్లగా యెహోవాను సేవించడం మానేశాం. సంఘంతో మాకున్న సంబంధం తెగిపోవడంతో మన సహోదర సహోదరీల గురించి అస్సలు ఆలోచించలేదు.”

దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? సొంత “పరదైసు” సృష్టించుకోవాలనే కోరిక ఒక క్రైస్తవుణ్ణి ప్రమాదంలో పడవేయగలదు. ఆయన ‘నాకు ఇంకేమీ అవసరం లేదు’ అని అనుకునేటట్లు చేసి, చివరకు క్రైస్తవ గుర్తింపు అనే ‘తన వస్త్రాన్ని’ వదులుకునే పరిస్థితికి అది దారి తీయగలదు. (ప్రక. 16:15) అంతేగాక అది మనల్ని సహోదరుల నుండి దూరం చేయగలదు. అలా జరిగితే ఇక ఏమాత్రం మనం సహోదరులకు సహాయం చేయలేం.

నిజాయితీగా పరిశీలించుకోండి

‘నాకు అలా జరగదులే’ అని మనం అనుకుంటుండవచ్చు. అయితే, మనం జీవించడానికి ఎంత అవసరం అనేది మనలో ప్రతీ ఒక్కరు గంభీరంగా ఆలోచించాలి. పౌలు ఇలా రాశాడు: “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమో. 6:7, 8) నిజమే, జీవన స్థాయి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఒక దేశంలో కనీస అవసరాలు మరొక దేశంలో విలాసాలు కావచ్చు.

అయితే మన ప్రాంతంలో జీవన స్థాయి ఎలా ఉన్నప్పటికీ, పౌలు తర్వాత చెబుతున్న ఈ మాటల్ని పరిశీలిద్దాం: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” (1 తిమో. 6:9) ఉరి సాధారణంగా జంతువుకు కనిపించదు. జంతువు హఠాత్తుగా వచ్చి చిక్కుకునేలా ఉరిని అమరుస్తారు. కాబట్టి, మనం ‘హానికరమైన దురాశలు’ అనే ఉరుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

సరైన ప్రాధాన్యతలను ఏర్పరచుకుంటే యెహోవా సేవకు, వ్యక్తిగత అధ్యయనానికి ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. ప్రార్థనాపూర్వక అధ్యయనం వల్ల ఒక క్రైస్తవుడు ఇతరులకు సేవచేయడానికి ‘సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి’ ఉండగలుగుతాడు.—2 తిమో. 2:15; 3:16, 17.

యారొస్వావ్‌ను బలపరచడానికి, ప్రోత్సహించడానికి ప్రేమగల పెద్దలు కొన్ని సంవత్సరాల పాటు కృషి చేశారు. దాంతో ఆయన పెనుమార్పులు చేసుకున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “ఒక సందర్భంలో పెద్దలు బైబిల్లోవున్న ధనవంతుడైన ఒక యౌవనస్థుని ఉదాహరణను చూపించారు. అతను నిత్యం జీవించాలని అనుకున్నప్పటికీ, తనకున్న వస్తుసంపదలను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆ ఉదాహరణ చెప్పాక, అది నాకు వర్తిస్తుందా అని వారు నేర్పుగా అడిగారు. అది నిజంగా నా కళ్లు తెరిపించింది!”—సామె. 11:28; మార్కు 10:17-22.

యారొస్వావ్‌ తన పరిస్థితిని నిజాయితీగా పరిశీలించుకొని, ఇక పెద్ద వ్యాపారం చేయకూడదనుకున్నాడు. రెండు సంవత్సరాల్లో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు తిరిగి యెహోవాతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనిప్పుడు ఒక సంఘపెద్దగా ఉంటూ తన సహోదరులకు సేవ చేస్తున్నాడు. యారొస్వావ్‌ ఇలా అంటున్నాడు: “సహోదరులు తమ ఆధ్యాత్మికతను నిర్లక్ష్యం చేసేంతగా వ్యాపారంలో మునిగిపోయినప్పుడు, అవిశ్వాసులతో జట్టుగా పనిచేయడం ఎంత అవివేకమో నేను నా సొంత అనుభవాన్ని ఉపయోగించి వివరిస్తాను. ఆకర్షణీయమైన అవకాశాలను తిరస్కరించడం, మోసపూరితమైన పనులు చేయకుండా ఉండడం అంత సులభమేమీ కాదు.”—2 కొరిం. 6:14.

మరెక్‌ కూడా చెడు ఫలితాలు అనుభవించాకే ఒక పాఠం నేర్చుకున్నాడు. విదేశంలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వల్ల తన కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పటికీ దేవునితో, సహోదరులతో తనకున్న సంబంధం దెబ్బతింది. కొంతకాలానికి ఆయన తన ప్రాధాన్యతలను మార్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “ఆ సంవత్సరాల్లో నా పరిస్థితి, ‘తన కోసం గొప్పవాటిని వెదికిన’ ప్రాచీనకాల బారూకు పరిస్థితిలాగే ఉండేది. చివరికి, నా చింతలను యెహోవాకు తెలియజేస్తూ నా హృదయాన్ని కుమ్మరించాను, నేను ఆధ్యాత్మిక సమతుల్యాన్ని తిరిగి పొందానని ఇప్పుడు అనిపిస్తుంది.” (యిర్మీ. 45:1-5) మరెక్‌ ఇప్పుడు సంఘ పర్యవేక్షకుడిగా “దొడ్డపని” చేసే దిశగా ప్రగతి సాధిస్తున్నాడు.—1 తిమో. 3:1.

ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారిని మరెక్‌ ఇలా హెచ్చరిస్తున్నాడు: “విదేశంలో ఉన్నప్పుడు, దుష్ట లోకపు ఉరుల్లో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అక్కడి భాష సరిగ్గా రాకపోవడం వల్ల ఇతరులతో మాట్లాడలేం. మీరు ఇంటికి డబ్బుల్ని తీసుకెళ్తారేమో కానీ, మానడానికి చాలా కాలం పట్టే ఆధ్యాత్మిక గాయాలతో వెళ్తారు.”

మన సహోదరుల పట్ల మనకున్న బాధ్యతకు, ఉద్యోగానికి మధ్య సమతుల్యాన్ని కాపాడుకుంటే యెహోవాను సంతోషపెట్టగలుగుతాం. అలా చేస్తే ఇతరులకు మాదిరికరంగా ఉంటూ, వారు జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయగలుగుతాం. కృంగిపోయినవారికి సహోదర సహోదరీలు చేసే సహాయం, వారు చూపించే కనికరం, వారు కనబరిచే మంచి మాదిరి ఎంతో అవసరం. తోటి విశ్వాసులు జీవన చింతల్లో మునిగిపోకుండా తమ సమతుల్యతను కాపాడుకోవడానికి సంఘ పెద్దలు, పరిణతిగల ఇతర క్రైస్తవులు సహాయం చేయగలరు.—హెబ్రీ. 13:7.

మనం తోటి విశ్వాసులను విడిచిపెట్టేంతగా ఉద్యోగంలో మునిగిపోకుండా ఉందాం. (ఫిలి. 1:9-11) బదులుగా, మన జీవితంలో రాజ్యాసక్తులకు మొదటి స్థానం ఇస్తూ “దేవునియెడల ధనవంతు[లుగా]” ఉందాం.—లూకా 12:21.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

[21వ పేజీలోని చిత్రాలు]

మీ ఉద్యోగం వల్ల కూటాలకు హాజరు కాలేకపోతున్నారా?

[23వ పేజీలోని చిత్రాలు]

మీ సహోదర సహోదరీలకు సహాయం చేయడానికి ఉన్న అవకాశాలను విలువైనవిగా ఎంచుతున్నారా?