కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాధానంగా ఉండడానికి కృషి చేయండి

సమాధానంగా ఉండడానికి కృషి చేయండి

సమాధానంగా ఉండడానికి కృషి చేయండి

‘సమాధానాన్ని కలుగజేసే వాటినే ఆసక్తితో అనుసరిద్దాం.’—రోమా. 14:19.

1, 2. యెహోవాసాక్షులు ఎందుకు సమాధానంగా ఉంటారు?

 నేడు ప్రజల మధ్య నిజమైన సమాధానం లేనే లేదు. ఒకే దేశంలో ఉంటూ ఒకే భాష మాట్లాడుతూ ఉన్న ప్రజలు కూడా చాలామట్టుకు ఐక్యంగా ఉండడం లేదు. మతం, రాజకీయాలు, డబ్బు, విద్య వంటివాటి వల్ల వారి మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, యెహోవా ప్రజలు ‘ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చినప్పటికీ’ ఎంతో ఐక్యంగా ఉంటున్నారు.—ప్రక. 7:9.

2 మన మధ్య సాధారణంగా ఉండే ఆ ఐక్యత దానంతటదే రాలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనకోసం తన ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం ‘దేవునితో సమాధానంగా’ ఉంటాం. (రోమా. 5:1; ఎఫె. 1:7) అంతేకాక, యెహోవా నమ్మకమైన తన సేవకులకు పరిశుద్ధాత్మను ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఫలంలో సమాధానం ఒకటి. (గల. 5:22) మనం సమాధానంగా, ఐక్యంగా ఉండడానికి మరో కారణమేమిటంటే, మనం ‘ఈ లోకసంబంధులం కాదు.’ (యోహా. 15:19) అంటే మనం రాజకీయాల్లో గానీ యుద్ధాల్లో గానీ పాల్గొనం. యెహోవా ప్రజలు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టుకుంటారు’ అని బైబిలు చెబుతోంది.—యెష. 2:4.

3. మనం సమాధానంగా ఉండడం వల్ల ఏమి చేయగలుగుతాం? ఈ ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

3 మన దేశాలు, సంస్కృతులు, ఆలోచనా తీరు వేరైనా మనం ‘ఒకరిపట్ల ఒకరం ప్రేమ కలిగివుండవచ్చు.’ (యోహా. 15:17) సమాధానంగా ఉండడం వల్ల మనం “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయగలుగుతాం. (గల. 6:10) యెహోవాతో, సహోదర సహోదరీలతో మనకున్న సమాధానం ఎంతో అమూల్యమైనది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి. సంఘంలో మనం ఎలా సమాధానంగా ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.

మనం మాటల్లో ‘తప్పిపోయినప్పుడు’

4. మనవల్ల ఎవరికైనా బాధ కలిగితే సమాధానాన్ని కాపాడడానికి మనం ఏమి చేయాలి?

4 “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడు” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 3:2) అంటే కొన్నిసార్లు సహోదరుల మధ్య అభిప్రాయభేదాలు లేదా ఇతర సమస్యలు రావచ్చని ఆ లేఖనం స్పష్టం చేస్తోంది. ఒకవేళ సమస్య వస్తే సహోదరులు దాన్ని పరిష్కరించుకొని సంఘ సమాధానాన్ని కాపాడగలగాలి. ఉదాహరణకు, మనవల్ల ఎవరికైనా బాధ కలిగితే మనం ఏమి చేయాలని యేసు చెప్పాడో చదవండి.—మత్తయి 5:23, 24 చదవండి.

5. ఒకవేళ ఎవరైనా మనల్ని బాధపెడితే మనం ఏమి చేయాలి?

5 ఒకవేళ ఎవరైనా మనల్ని బాధపెడితే మనం ఏమి చేయాలి? వారే వచ్చి క్షమాపణ అడగాలని మనం అనుకోవాలా? ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదని 1 కొరింథీయులు 13:5 చెబుతోంది. కాబట్టి వారిని క్షమించి, సమస్యను మరచిపోవడం ద్వారా మనం వారితో సమాధానపడాలని అనుకుంటున్నామని చూపిస్తాం. (ఎఫెసీయులు 4:32 చదవండి.) చిన్నచిన్న సమస్యలు వచ్చినప్పుడు అలా చేయడమే ఉత్తమం. అలా చేస్తే మన సహోదరులతో ఐక్యంగా ఉండగలుగుతాం. అంతేకాక, సరైనది చేశామనే సంతృప్తిని పొందుతాం. ఇతరుల తప్పులను క్షమిస్తే మనకు ఘనత వస్తుందని ఒక సామెత చెబుతోంది.—సామె. 19:11.

6. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం దాన్ని మరచిపోలేకపోతుంటే ఏమి చేయాలి?

6 ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు మనం దాన్ని మరచిపోలేకపోతుంటే ఎలా? దానిగురించి ఇతరులకు చెప్పడం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే, అలా చేయడం వల్ల సంఘ సమాధానం దెబ్బతింటుంది. మరి సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ఏమి చేయవచ్చు? మత్తయి 18:15 ఇలా చెబుతోంది: “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.” మత్తయి 18:15-17 వచనాలు, ఎవరైనా ఘోరమైన పాపం చేస్తే తీసుకోవాల్సిన చర్యల గురించే మాట్లాడుతున్నా, 15వ వచనంలోని సూత్రం ఇతర సందర్భాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి, ఎవరితోనైనా సమస్య వచ్చినప్పుడు వారితో ఒంటరిగా మాట్లాడడం మంచిది. మనం ఆ సమయంలో మన సహోదరునితో దయగా మాట్లాడి ఆయనతో తిరిగి సమాధానాన్ని ఏర్పరచుకోవడానికి కృషి చేయాలి. a

7. సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా ఎందుకు పరిష్కరించుకోవాలి?

7 అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.” (ఎఫె. 4:26, 27) యేసు కూడా ఇలా చెప్పాడు: ‘నీ ప్రతివాదితో త్వరగా సమాధానపడుము.’ (మత్త. 5:25) కాబట్టి ఇతరులతో సమాధానంగా ఉండాలంటే మనం సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. ఏదైనా గాయానికి త్వరగా చికిత్స చేయించకపోతే అది పెద్దదైనట్లే, సమస్యను త్వరగా పరిష్కరించకపోతే అది కూడా పెద్దదౌతుంది. మన సహోదరులతో వచ్చే ఏ సమస్యనైనా పరిష్కరించుకునేటప్పుడు అహంకారం, అసూయ, ధనాపేక్ష వంటివి అడ్డు రాకుండా చూసుకోవాలి.—యాకో. 4:1-6.

ఎక్కువమంది మధ్య సమస్య వస్తే ఏమి చేయాలి?

8, 9. (ఎ) రోమాలోని సంఘంలో ఏ వాదన రేగింది? (బి) రోమాలోని క్రైస్తవులను పౌలు ఎలా సరిదిద్దాడు?

8 కొన్నిసార్లు సంఘంలో ఎక్కువమంది మధ్య సమస్య వస్తుంది. రోమాలోని క్రైస్తవుల మధ్య అలాగే జరిగింది. క్రైస్తవులుగా మారిన రెండు గుంపులకు అంటే యూదులకు, అన్యులకు మధ్య ఒక వివాదం ఏర్పడింది. వారిలో కొందరి మనస్సాక్షి బలహీనంగా ఉండేది, కొన్ని విషయాలు తప్పు అని లేఖనాలు చెప్పకపోయినా వారి మనస్సాక్షి వాటిని చేయడానికి అంగీకరించేది కాదు. అయితే మరికొందరి మనస్సాక్షి బలంగా ఉండేది కాబట్టి, బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారికన్నా తామే అధికులమని వారు అనుకునేవారు. బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారేమో బలమైన మనస్సాక్షి ఉన్నవారిని తప్పుబట్టడం మొదలుపెట్టారు. నిజానికి, వారి వాదనలన్నీ వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించినవే. అప్పుడు పౌలు సంఘానికి ఏమి చెప్పాడు?—రోమా. 14:1-6.

9 మోషే ధర్మశాస్త్రంలోని విషయాలను పాటించనవసరంలేదని బలమైన మనస్సాక్షి ఉన్నవారు అర్థం చేసుకున్నారు. బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారేమో ధర్మశాస్త్రం ఖండించిన వాటిని తినకూడదని అనుకున్నారు. పౌలు ఆ రెండు గుంపులవారిని సరిదిద్దాడు. బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారికన్నా తామే అధికులమని అనుకోకూడదని బలమైన మనస్సాక్షి ఉన్నవారికి పౌలు చెప్పాడు. (రోమా. 14:2, 10) ఒకవేళ వారి ఆలోచన, ప్రవర్తన అలాగే ఉంటే, బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారు యెహోవాతో తమకున్న స్నేహాన్ని తెంచేసుకునే ప్రమాదం ఉంది. పౌలు ఇంకా ఇలా చెప్పాడు: “భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయకుడి. . . . మాంసము తినుట గాని, ద్రాక్షారసము త్రాగుటగాని, నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది.” (రోమా. 14:14, 15, 20, 21) తమలా ఆలోచించని వారికి తీర్పుతీర్చకూడదని బలహీనమైన మనస్సాక్షి ఉన్నవారికి పౌలు చెప్పాడు. (రోమా. 14:13) ఆయన వారికిలా చెప్పాడు: ‘తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనకూడదని చెప్పుచున్నాను.’ (రోమా. 12:3) ఆ రెండు గుంపుల క్రైస్తవులను సరిదిద్దిన తర్వాత ఆయనిలా అన్నాడు: “కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.”—రోమా. 14:19.

10. రోమాలోని క్రైస్తవుల మధ్య తలెత్తినట్లే నేటి సంఘాల్లో కూడా ఏదైనా వాదన తలెత్తితే ఎలా పరిష్కరించుకోవాలి?

10 ఆ క్రైస్తవులు పౌలు చెప్పిన మాటలను అంగీకరించి కావాల్సిన మార్పులు చేసుకొనివుంటారు. నేడు, మనం కూడా బైబిలు చెబుతున్న విషయాలను పాటిస్తే సహోదర సహోదరీలతో ప్రేమపూర్వకంగా వాదనలను పరిష్కరించుకోగలుగుతాం. రోమాలోని క్రైస్తవులకు వచ్చినట్లే నేటి సంఘాల్లో కూడా ఏదైనా సమస్య వస్తే, సహోదర సహోదరీలందరూ ‘ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడానికి’ కావాల్సిన మార్పులు చేసుకోవాలి.—మార్కు 9:50.

పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?

11. తోటి క్రైస్తవునితో వచ్చిన సమస్య గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి వస్తే సంఘ పెద్ద ఏమి చేయాలి?

11 కుటుంబంలో లేదా సంఘంలో ఒక వ్యక్తితో వచ్చిన సమస్య గురించి మాట్లాడడానికి ఒక వ్యక్తి వస్తే సంఘ పెద్ద ఏమి చేయాలి? సామెతలు 21:13 ఇలా చెబుతోంది: “దరిద్రుల మొఱ్ఱ వినక చెవి మూసికొనువాడు తాను మొఱ్ఱపెట్టునప్పుడు అంగీకరింపబడడు.” సహాయం కోసం ఎవరైనా తన దగ్గరికి వచ్చినప్పుడు సంఘ పెద్ద ఆ వ్యక్తి చెప్పేది వినకపోతే ఆయన ‘చెవి మూసుకున్నట్లే.’ కానీ మరో సామెత ఇలా చెబుతోంది: “వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.” (సామె. 18:17) కాబట్టి, సంఘ పెద్ద అవతలి వ్యక్తి చెప్పేది దయతో వినాలి. అంతేకానీ, సమస్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పుతీర్చకూడదు. సమస్య గురించి విన్న తర్వాత, ‘విభేదం తలెత్తిన వ్యక్తితో విషయాన్ని చర్చించావా?’ అని సంఘ పెద్ద ఆయనను అడగవచ్చు. అంతేకాక, సహోదర సహోదరీలతో సమాధానంగా ఉండడానికి ఏమి చేయమని బైబిలు చెబుతుందో ఆయనకు వివరించవచ్చు.

12. ఏదైనా సమస్య గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పుతీర్చడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఏ మూడు ఉదాహరణలు చూపిస్తున్నాయి?

12 ఏదైనా సమస్య గురించి ఒక్క వైపు నుండి మాత్రమే విని చర్య తీసుకోవడం ప్రమాదకరం. ఈ విషయంలో మూడు బైబిలు ఉదాహరణలు ఉన్నాయి. మొదటిది పోతీఫరుకు సంబంధించినది. పోతీఫరు భార్య, యోసేపు తనను బలాత్కరించడానికి ప్రయత్నించాడని అబద్ధం చెప్పింది. ఆమె మాటలను నమ్మిన పోతీఫరు కోపంతో యోసేపును చెరసాలలో వేయించాడు. (ఆది. 39:19, 20) రెండవది రాజైన దావీదుకు సంబంధించింది. మెఫీబోషెతు దావీదు శత్రువులకు సహాయం చేస్తున్నాడని మెఫీబోషెతు సేవకుడైన సీబా దావీదుకు చెప్పాడు. దావీదు దాన్ని నమ్మి ఏ మాత్రం ఆలోచించకుండా, “మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే” అని సీబాతో చెప్పాడు. (2 సమూ. 16:4; 19:25-27) మూడవది రాజైన అర్తహషస్తకు సంబంధించింది. ఆయనపై తిరుగుబాటు చేయడానికే యూదులు యెరూషలేమును మళ్లీ కడుతున్నారని యూదుల శత్రువులు చెప్పినప్పుడు ఆయన దాన్ని నమ్మి వారి పనిని ఆపేయమని ఆజ్ఞాపించాడు. దానివల్ల యూదులు దేవుని ఆలయ నిర్మాణాన్ని ఆపేశారు. (ఎజ్రా 4:11-13, 23, 24) కాబట్టి పౌలు తిమోతికి రాసిన మాటలను క్రైస్తవ పెద్దలు పాటించాలి. ఏదైనా సమస్య గురించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా వారు తీర్పుతీర్చకూడదు.—1 తిమోతి 5:21, 22 చదవండి.

13, 14. (ఎ) ఇద్దరి మధ్య వాదన జరిగినప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి? (బి) సరిగ్గా తీర్పు తీర్చాలంటే పెద్దలు ఏమి చేయాలి?

13 బైబిలు ఇలా చెబుతోంది: “తనలో జ్ఞానముందని భావిస్తున్న వానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు.” (1 కొరిం. 8:2, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఇద్దరి మధ్య ఏదైనా వాదన వచ్చినప్పుడు వారిమధ్య జరిగిన దానిగురించి మనకు అంతా తెలుసని అనుకునే ప్రమాదం ఉంది. కానీ, మనకు వాస్తవాలన్నీ తెలియవని గుర్తుంచుకోవాలి. అంతేకాక, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి కూడా మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితి విషయంలో తీర్పుతీర్చే ముందు పెద్దలు చాలా జాగ్రత్త వహించాలి. అబద్ధాలు, పుకార్ల వంటివాటి వల్ల మోసపోకూడదు. అంతేకాక, ఒక వ్యక్తి ధనవంతుడైనంత మాత్రాన ఆయన చెప్పే ప్రతీదాన్ని నమ్మకూడదు. దేవుడు ఎంచుకున్న న్యాయాధిపతియైన యేసు, ‘కంటి చూపునుబట్టి తీర్పుతీర్చడు తాను వినుదానినిబట్టి విమర్శచేయడు.’ (యెష. 11:3, 4) ఆయన దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటిస్తాడు. క్రైస్తవ పెద్దలు కూడా ఆయనలాగే పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటించాలి.

14 ఒక సమస్య విషయంలో తీర్పుతీర్చే ముందు సంఘ పెద్దలు యెహోవా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. బైబిలునూ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ప్రచురణలనూ ఉపయోగించడం ద్వారా వారు పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటిస్తారు.—మత్త. 24:45.

మనం దేవునితో సమాధానంగా ఉండాలి

15. ఒక సహోదరుడు/సహోదరి ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే మనం దానిగురించి పెద్దలకు ఎప్పుడు చెప్పాలి?

15 ఇతరులతో సమాధానంగా ఉండమని బైబిలు మనకు చెబుతోంది. అయితే, “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది” అని కూడా అది చెబుతోంది. (యాకో. 3:17) అంటే బైబిలు చెబుతున్నట్లుగా మనం ముందు పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా లేక పరిశుభ్రంగా ఉండడమంటే, తప్పొప్పుల విషయంలో దేవుడు చెప్పేది వింటూ ఆయనకు ఇష్టమైన విధంగా జీవించడమని అర్థం. ఒక సహోదరుడు/సహోదరి ఏదైనా ఘోరమైన పాపం చేశారని మనకు తెలిస్తే పెద్దల దగ్గర దాన్ని ఒప్పుకోమని మనం ఆయనకు/ఆమెకు చెప్పాలి. (1 కొరిం. 6:9, 10; యాకో. 5:14-16) ఒకవేళ ఆ వ్యక్తి అలా చేయకపోతే, మనమే వెళ్లి పెద్దలకు చెప్పాలి. అలాంటి వారితో సమాధానంగా ఉండాలనే ఉద్దేశంతో వారు చేసిన పాపం గురించి మనం పెద్దలకు చెప్పకపోతే మనం కూడా పాపులమే అవుతాం.—లేవీ. 5:1; సామెతలు 29:24 చదవండి.

16. రాజైన యెహోరాముపై యెహూ తీసుకున్న చర్య నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 పాపం చేసిన వ్యక్తితో సమాధానంగా ఉండడంకన్నా సరైనది చేయడమే ప్రాముఖ్యమని యెహూ చూపించాడు. ఆహాబు కుటుంబాన్ని శిక్షించమని దేవుడు యెహూను పంపించాడు. ఆహాబుకు, యెజెబెలుకు పుట్టిన యెహోరాము దుష్టరాజు. ఆయన యెహూను కలవడానికి రథంపై వచ్చి, “యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ—నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.” (2 రాజు. 9:22) ఆ తర్వాత యెహూ యెహోరాము గుండెల్లోకి దూసుకుపోయేలా బాణం వదిలాడు. యెహూ చర్య తీసుకున్నట్లే, సంఘ పెద్దలు కూడా పశ్చాత్తాపపడని పాపి విషయంలో చర్య తీసుకోవాలి. సమాధానంగా ఉండాలి కదా అని చెప్పి పశ్చాత్తాపపడని పాపిని పెద్దలు సంఘంలో ఉండనివ్వరు. సంఘం దేవునితో సమాధానంగా ఉండడానికి వారు అతణ్ణి సంఘంలో నుండి బహిష్కరిస్తారు.—1 కొరిం. 5:1, 2, 11-13.

17. సమాధానంగా ఉండడానికి క్రైస్తవులందరూ ఏమి చేయాలి?

17 చాలా సందర్భాల్లో సహోదరుల మధ్య చిన్నచిన్న సమస్యలే తలెత్తుతాయి. కాబట్టి ప్రేమతో వాటిని మరచిపోవడమే చాలా మంచిది. బైబిలు ఇలా చెబుతోంది: “ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.” (సామె. 17:9) బైబిలు చెప్పింది పాటిస్తే, మనం సంఘంలో సమాధానాన్ని కాపాడగలుగుతాం, యెహోవాతో స్నేహాన్ని కాపాడుకోగలుగుతాం.—మత్త. 6:14, 15.

సమాధానంగా ఉండేవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు

18, 19. సమాధానంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు?

18 సమాధానంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు. మనకు యెహోవాతో బలమైన స్నేహం ఉంటుంది. సంఘ ఐక్యతను కాపాడే విషయంలో మనకంటూ ఒక వంతు ఉంటుంది. అంతేకాక, సంఘంలో సమాధానంగా ఉంటే, “సమాధాన సువార్త ” ప్రకటిస్తున్నప్పుడు ఇతరులతో కూడా సమాధానంగా ఉండగలుగుతాం. (ఎఫె. 6:15) “అందరి యెడల సాధువుగా” ఉండడానికి, ‘కీడును సహించడానికి’ సిద్ధంగా ఉంటాం.—2 తిమో. 2:24-26.

19 సమాధానంగా ఉండడానికి ఇప్పుడు మనం చేసే కృషి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. యెహోవా నీతిమంతులను, అనీతిమంతులను పునరుత్థానం చేస్తాడని బైబిలు చెబుతోంది. (అపొ. 24:14, 15) అంటే “లోకము పుట్టినది మొదలుకొని” జీవించిన వివిధ వ్యక్తిత్వాలు గల లక్షలాదిమందిని యెహోవా పునరుత్థానం చేస్తాడని దానర్థం. (లూకా 11:50, 51) పునరుత్థానం చేయబడిన వారికి సమాధానాన్ని ఎలా ప్రేమించాలో నేర్పించే అరుదైన అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి, ఇప్పుడు మనకు దొరికే శిక్షణ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది.

[అధస్సూచి]

a కొండెములు చెప్పడం, మోసం చేయడం వంటి పెద్ద సమస్యలతో ఎలా వ్యవహరించాలనే దాని గురించి బైబిలు మరింత సమాచారాన్నిస్తోంది. కావలికోట అక్టోబరు 15, 1999 సంచికలోని 17-22 పేజీలు చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• మనవల్ల ఎవరికైనా బాధ కలిగితే సమాధానాన్ని కాపాడడానికి మనం ఏమి చేయవచ్చు?

• ఒకవేళ ఎవరైనా మనల్ని బాధపెడితే వారితో సమాధానపడడానికి మనమేమి చేయవచ్చు?

• ఇద్దరి మధ్య వాదన జరిగినప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి?

• పాపం చేసిన వ్యక్తితో సమాధానంగా ఉండడంకన్నా సరైనది చేయడమే ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రాలు]

ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించేవారిని యెహోవా ప్రేమిస్తాడు