కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఇప్పుడు అశక్తురాలినే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండను!”

“ఇప్పుడు అశక్తురాలినే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండను!”

“ఇప్పుడు అశక్తురాలినే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండను!”

సర వాన్‌ డెర్‌ మాన్డ్‌ చెప్పినది

“సర, నీ నవ్వు చాలా బాగుంటుంది. నువ్వు ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండడానికి కారణమేంటి?” అని తరచూ వేరేవాళ్లు నన్ను అడుగుతుంటారు. ఒక ప్రత్యేకమైన దానికోసం ఆశతో ఎదురుచూస్తున్నానని, మరో మాటలో చెప్పాలంటే “నేను ఇప్పుడు అశక్తురాలినే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండను!” అని వాళ్లతో అంటాను.

నేను ఫ్రాన్స్‌లోని పారిస్‌లో 1974లో పుట్టాను. అమ్మ నన్ను ప్రసవిస్తున్నప్పుడు కష్టమవడం వల్ల పుట్టుకతోనే నాకు పాక్షిక పక్షవాతం వచ్చింది. నా కాళ్లు, చేతులు సరిగ్గా ఆడేవికావు, మాటలు స్పష్టంగా వచ్చేవికావు. నాకు మూర్ఛరోగం కూడా రావడంతో తరచూ అంటువ్యాధుల బారినపడేదాన్ని.

నాకు రెండేళ్లు ఉన్నప్పుడు మా కుటుంబం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు తరలివెళ్లింది. రెండేళ్ల తర్వాత మా నాన్న నన్ను, మా అమ్మను వదిలేసి వెళ్లిపోయాడు. నాకిప్పటికీ గుర్తు, అప్పుడే మొదటిసారిగా దేవునికి దగ్గరైనట్లు నాకు అనిపించింది. మా అమ్మ ఒక యెహోవాసాక్షి, ప్రతీవారం నన్ను కూటాలకు తీసుకెళ్లేది. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, నా మీద ఆయనకు శ్రద్ధ ఉందని నేను అక్కడే తెలుసుకున్నాను. అలా తెలుసుకోవడం వల్లా అమ్మ నన్ను ఎంతో ప్రేమిస్తూ నాలో ధైర్యం నింపడం వల్లా ఆ గడ్డు పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉండగలిగాను.

యెహోవాకు ఎలా ప్రార్థించాలో కూడా అమ్మ నాకు నేర్పింది. నిజానికి మాట్లాడడం కన్నా ప్రార్థించడమే ఎంతో తేలికగా ఉండేది. ఎందుకంటే, ప్రార్థిస్తున్నప్పుడు నేను పైకి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా మనసులోని మాటలను నేను స్పష్టంగా “వింటున్నట్టు” అనిపిస్తుంది. నా మాటలు స్పష్టంగా అర్థం కావు, కాబట్టి నేను మనసులో అనుకున్నా లేదా అస్పష్టమైన మాటలతో పైకి చెప్పినా యెహోవా ప్రతీది అర్థం చేసుకోగలడని తెలుసుకోవడం నాకెంతో ఊరటనిస్తుంది.—కీర్త. 65:2.

సమస్యలతో జీవించడం

ఐదేళ్లు వచ్చేసరికి నా జబ్బు ముదరడంతో నడవడానికి నాకు బరువైన కాలిపర్‌ స్‌ప్లింట్స్‌ (నడవడానికి ఉపయోగించే సాధనాలు) అవసరమయ్యాయి. వాటితో నడవడం కన్నా ఎక్కువగా తడబడేదాన్ని! నాకు 11 ఏళ్లు వచ్చేసరికి బొత్తిగా నడవలేకపోయాను. ఆ తర్వాత కనీసం మంచం ఎక్కడం, దిగడం కూడా చేయలేకపోయాను. కరెంటుతో పనిచేసే ఒక యంత్రం నన్ను మంచం మీదనుండి లేపి మోటారుతో నడిచే చక్రాల కుర్చీలో పెట్టేది, దాన్ని నేను చేతి లీవరు సహాయంతో నడిపేదాన్ని.

అవును, నా అశక్తత వల్ల కొన్నిసార్లు దుఃఖం పొంగుకొస్తుంది. అలాంటప్పుడు, మావాళ్లు అనే ఈ మాట గుర్తుచేసుకుంటాను: “చేయలేని వాటి గురించి బాధపడకు. చేయగలిగే వాటినే చేయి.” దానివల్ల నేను గుర్రపు స్వారీ, తెరచాప పడవనూ తెడ్ల పడవనూ నడపడం, క్యాంపులకు వెళ్లడం, జనం లేని రోడ్డు మీద కారు నడపడం వంటివి చేయగలిగాను! నాకు చిత్రకళ తెలుసు కాబట్టి పెయింటింగ్‌ చేసేదాన్ని, కుట్టేదాన్ని, ఎంబ్రాయిడరీ చేసేదాన్ని, బొంతలను, బంకమట్టితో వస్తువులను తయారు చేసేదాన్ని.

దేవుణ్ణి ఆరాధించాలని నిర్ణయించుకునేంత తెలివి నాకు లేదని నా పరిస్థితి చూసిన కొందరు అన్నారు. నాకు 18 ఏళ్లు వచ్చినప్పుడు ఒక టీచరు, ‘మీ అమ్మ మతం నుండి “తప్పించుకోవడానికి” ఇల్లు వదిలి వెళ్లిపో’ అంది. కావాలంటే ఇల్లు వెదకడానికి సహాయం కూడా చేస్తానంది. కానీ నేను నా విశ్వాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టనని, నేను నా పనులు సొంతగా చేసుకోగలిగినప్పుడే ఇల్లు విడిచివెళ్తానని ఆమెతో చెప్పాను.

అది జరిగి ఎంతోకాలం కాకముందే నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షినయ్యాను. రెండేళ్ల తర్వాత నేను ఒక చిన్న అపార్ట్‌మెంటులోకి మారాను. ఇక్కడ నాకు అవసరమైన సహాయమూ నేను కోరుకున్న స్వేచ్ఛా ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నాను.

పెళ్లి ప్రస్తావన

గడిచిన సంవత్సరాల్లో నా విశ్వాసాన్ని పరీక్షించే ఇతర పరిస్థితులు ఎదురయ్యాయి. ఒకరోజు, అశక్తుడైన తోటి విద్యార్థి తనను పెళ్లి చేసుకోమని అడగడంతో అవాక్కయ్యాను. మొదట్లో ఎంతో సంబరపడ్డాను. అందరమ్మాయిల్లాగే జీవిత భాగస్వామి కావాలని నేనూ ఎంతో కోరుకుంటాను. అయితే, ఇద్దరమూ అశక్తులమైనంత మాత్రాన మా వివాహ జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పలేం కదా. పైగా ఆయన నాలా విశ్వాసి కూడా కాదు. మా నమ్మకాలు, అభిరుచులు, లక్ష్యాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. మరి మేమిద్దరం కలిసి జీవించడం ఎలా కుదురుతుంది? అంతేకాదు, విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనే దేవుని స్పష్టమైన నిర్దేశాన్ని పాటించాలని కూడా తీర్మానించుకున్నాను. (1 కొరిం. 7:39) అందుకే, తనను పెళ్లి చేసుకోలేనని నొప్పించకుండా వివరించాను.

నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని నాకిప్పటికీ అనిపిస్తుంది. అంతేకాదు, దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకంలో సంతోషంగా ఉంటాననడంలో నాకు రవ్వంత సందేహం కూడా లేదు. (కీర్త. 145:16; 2 పేతు. 3:13) ఈలోగా యెహోవాకు యథార్థంగా ఉండాలని, నేనున్న స్థితిలో సంతృప్తిగా ఉండాలని తీర్మానించుకున్నాను.

నా చక్రాల కుర్చీలో నుండి ఉన్నపళంగా లేచి లేడిలా పరుగెత్తే రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. అప్పుడు సంతోషంతో ఇలా అంటాను, “ఒకప్పుడు నేను అశక్తురాలిని కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఎప్పటికీ ఇలాగే ఉంటాను!”