బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
“సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.”—లూకా 6:40.
1. యేసు తన భూపరిచర్యలో ఒక గొప్ప సంఘానికి ఎలా పునాది వేశాడు?
అపొస్తలుడైన యోహాను తాను రాసిన సువార్తను ఈ మాటలతో ముగించాడు, “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” (యోహా. 21:25) యేసు పరిచర్య చేసింది తక్కువ కాలమే అయినా దానిని ఉత్సాహంగా చేసి ఎన్నో ఫలితాలు సాధించాడు. తన తర్వాత సువార్త ప్రకటనాపనిలో నాయకత్వం వహించగల పురుషులను కనుగొని, వాళ్లకు శిక్షణ ఇచ్చాడు. సా.శ. 33లో తాను పరలోకానికి ఆరోహణమయ్యే సమయానికల్లా యేసు ఈ భూమ్మీద ఒక గొప్ప సంఘానికి పునాది వేశాడు. త్వరలోనే వేలమంది దానిలో చేరారు.—అపొ. 2:41, 42; 4:4; 6:7.
2, 3. (ఎ) బాప్తిస్మం తీసుకున్న సహోదరులు బాధ్యతలు చేపట్టేందుకు అర్హులు కావడం ఎందుకు అత్యవసరం? (బి) మనం ఈ ఆర్టికల్లో ఏమి పరిశీలిస్తాం?
2 ఇప్పుడు ప్రపంచమంతటా 1,00,000 కన్నా ఎక్కువ సంఘాల్లో డెబ్బై లక్షలకన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు కాబట్టి, ఆధ్యాత్మిక విషయాల్లో నాయకత్వం వహించడానికి సహోదరులు ఎంతో అవసరం. ఉదాహరణకు, ఇప్పుడు సంఘ పెద్దల అవసరం చాలా ఉంది. ఈ బాధ్యతను చేపట్టేందుకు అర్హులౌతున్నవాళ్లను మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్లు ‘దొడ్డపనిని అపేక్షిస్తున్నారు.’—1 తిమో. 3:1.
3 అయితే సహోదరులు సంఘ బాధ్యతలు చేపట్టేందుకు ఇట్టే అర్హులైపోరు. విద్య, జీవితానుభవం, సామర్థ్యాలు ఉన్నంత మాత్రాన వాళ్లు ఆ పని చేయడానికి అర్హులైపోరు. ఒక వ్యక్తి సంఘపెద్దగా సేవ చేయాలంటే ఆయన ఆధ్యాత్మికంగా అర్హుడు కావాలి. ఆయనకు ఆధ్యాత్మిక లక్షణాలు ఉండాలి. అయితే సంఘంలో బాధ్యతలు చేపట్టడానికి సహోదరులకు ఎలాంటి సహాయం అవసరం? “సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును” అని యేసు అన్నాడు. (లూకా 6:40) తన శిష్యులు పెద్దపెద్ద బాధ్యతలు చేపట్టేలా గొప్ప బోధకుడైన యేసుక్రీస్తు వాళ్లకు ఎలా సహాయం చేశాడో, ఆయన చేసిన సహాయం నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఈ ఆర్టికల్లో పరిశీలిస్తాం.
‘నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను’
4. తన శిష్యులకు దగ్గరి స్నేహితునిగా ఉన్నానని యేసు ఎలా చూపించాడు?
4 యేసు తన శిష్యులను తనకన్నా తక్కువ వాళ్లుగా చూడలేదు గానీ స్నేహితులుగా ఎంచాడు. ఆయన వాళ్లతో సమయం గడిపాడు, వాళ్లను నమ్మాడు. ఆయన వాళ్లతో, “తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని” అన్నాడు. (యోహాను 15:15 చదవండి.) “నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని తాము అడిగిన ప్రశ్నకు యేసు జవాబిచ్చినప్పుడు శిష్యులు ఎంత సంతోషించి ఉంటారో ఆలోచించండి. (మత్త. 24:3, 4) యేసు తన ఆలోచనలను, భావాలను కూడా శిష్యులతో పంచుకున్నాడు. ఉదాహరణకు, తాను అప్పగింపబడబోయే రాత్రి యేసు పేతురును, యాకోబును, యోహానును గెత్సేమనే తోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఆయన మనోవేదనతో పట్టుదలగా ప్రార్థించాడు. యేసు ఏమని ప్రార్థించాడో ఆ ముగ్గురు అపొస్తలులు విని ఉండకపోవచ్చు కానీ ఆ సందర్భంలో ఆయన ఎంతో బాధపడుతున్నాడని గమనించేవుంటారు. (మార్కు 14:33-38) ఆ ముగ్గురు అపొస్తలులు అంతకుముందు యేసు రూపాంతరం పొందినప్పుడు కూడా చూశారు. అప్పుడు వాళ్ల విశ్వాసం ఎంత బలపడివుంటుందో ఆలోచించండి. (మార్కు 9:2-8; 2 పేతు. 1:16-18) యేసు తన శిష్యులకు దగ్గరి స్నేహితునిగా ఉన్నందువల్ల వాళ్లు ఆ తర్వాత బరువైన బాధ్యతలు చేపట్టేందుకు కావాల్సిన బలాన్ని పొందారు.
5. సంఘ పెద్దలు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు?
5 యేసులాగే నేటి క్రైస్తవ పెద్దలు సంఘంలోని ఇతరులతో స్నేహం చేసి, వాళ్లకు సహాయం చేస్తారు. తోటి విశ్వాసులపై తగిన వ్యక్తిగత శ్రద్ధ చూపించడానికి సమయం వెచ్చించడం ద్వారా పెద్దలు ప్రేమతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుంటారు. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం ఎంత ప్రాముఖ్యమో సంఘ పెద్దలు గుర్తిస్తారు. అలాగని వాళ్లు ప్రతీదాన్ని దాచిపెడుతున్నట్లుగా ప్రవర్తించరు. తాము నేర్చుకున్న లేఖన సత్యాలను వాళ్లతో పంచుకుంటారు. పెద్దలకు సహోదరులపై నమ్మకం ఉంటుంది. అయితే, పెద్దలు తమకన్నా తక్కువ వయసులో ఉన్న పరిచర్య సేవకుణ్ణి అస్సలు చిన్నచూపు చూడరు కానీ, సంఘంలో విలువైన సేవలు అందిస్తూ ఇంకా ప్రగతి సాధించే అవకాశమున్న ఆధ్యాత్మిక పురుషునిగా ఆయనను చూస్తారు.
‘మీకు మాదిరి ఉంచాను’
6, 7. యేసు తన శిష్యులకు ఎలాంటి మాదిరి ఉంచాడు? ఆ మాదిరి వల్ల శిష్యులు ఎలా ప్రయోజనం పొందారు?
6 యేసు శిష్యులు ఆధ్యాత్మిక విషయాలను విలువైనవిగా ఎంచారు. కానీ తాము పెరిగిన వాతావరణం, సంస్కృతి వంటివాటి వల్ల కొన్నిసార్లు వాళ్లు పొరపాటుగా ఆలోచించారు. (మత్త. 19:9, 10; లూకా 9:46-48; యోహా. 4:27) అప్పుడు యేసు పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు, బెదిరించలేదు. తమ సామర్థ్యానికి మించిన పనులు చేయమని ఆయన తన శిష్యులను కోరలేదు లేదా తాను చేయని వాటిని చేయమని చెప్పలేదు. కానీ తన మాదిరి ద్వారా వాళ్లకు నేర్పించాడు.—యోహాను 13:15 చదవండి.
7 యేసు తన శిష్యులకు ఎలాంటి మాదిరి ఉంచాడు? (1 పేతు. 2:21) ఇతరులకు పరిచర్య చేయగలిగేలా ఆయన తన జీవితాన్ని నిరాడంబరంగా ఉంచుకున్నాడు. (లూకా 9:58) ఆయన అణకువ చూపించాడు, ఎల్లప్పుడూ లేఖనాలను ఉపయోగించే బోధించేవాడు. (యోహా. 5:19; 17:14, 17) ఇతరులు ఆయన దగ్గరికి రావడానికి సంకోచించలేదు. ఆయన దయ చూపించేవాడు. ఆయన ప్రతీది ప్రేమతోనే చేసేవాడు. (మత్త. 19:13-15; యోహా. 15:12) యేసు మంచి మాదిరి వల్ల ఆయన అపొస్తలులు ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, యాకోబు చావును ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు భయపడలేదు కానీ చనిపోయేంతవరకు దేవుణ్ణి నమ్మకంగా సేవించాడు. (అపొ. 12:1, 2) యోహాను 60 కన్నా ఎక్కువ సంవత్సరాలపాటు నమ్మకంగా యేసు అడుగుజాడల్లో నడిచాడు.—ప్రక. 1:1, 2, 9.
8. సంఘ పెద్దలు తమకన్నా చిన్న వయసులో ఉన్న సహోదరులకు, సంఘంలోని ఇతరులకు ఎలాంటి మాదిరి ఉంచుతారు?
8 స్వయంత్యాగ స్ఫూర్తిని, వినయాన్ని, ప్రేమను చూపించే సంఘ పెద్దలు తమకన్నా చిన్న వయసులో ఉన్న సహోదరులకు మంచి మాదిరిని ఉంచుతారు. (1 పేతు. 5:2, 3) అంతేకాక విశ్వాసం, బోధన, క్రైస్తవ జీవితం, పరిచర్య వంటివాటిలో మాదిరికరంగా ఉన్న పెద్దలు తమ మాదిరి ఇతరులు పాటించే విధంగా ఉందని తెలుసుకొని ఎంతో సంతృప్తి చెందుతారు.—హెబ్రీ. 13:7.
‘యేసు వాళ్లను పంపిస్తూ వాళ్లకు ఆజ్ఞలు ఇచ్చాడు’
9. సువార్త ప్రకటనా పని చేయడానికి యేసు తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడని మనకెలా తెలుసు?
9 దాదాపు రెండు సంవత్సరాలపాటు పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొన్న తర్వాత యేసు 12 మంది అపొస్తలులను ప్రకటనాపని కోసం పంపించడం ద్వారా పరిచర్యను విస్తృతం చేశాడు. మొదటిగా ఆయన వాళ్లకు నిర్దేశాలిచ్చాడు. (మత్త. 10:5-14) యేసు అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టే ముందు, అందరికీ ఆహారం అందేలా వాళ్లను ఎలా ఒక వరుస క్రమంలో కూర్చోబెట్టాలో తన శిష్యులకు చెప్పాడు. (లూకా 9:12-17) దీన్నిబట్టి యేసు స్పష్టమైన, నిర్దిష్టమైన సూచనలు ఇచ్చి తన శిష్యులకు శిక్షణ ఇచ్చాడని తెలుస్తోంది. అలాంటి శిక్షణకు పరిశుద్ధాత్మ శక్తి తోడవడంతో అపొస్తలులు సా.శ. 33లో, ఆ తర్వాతి సంవత్సరాల్లో జరిగిన గొప్ప ప్రకటనాపనిని వ్యవస్థీకరించగలిగారు.
10, 11. కొత్తవాళ్లకు క్రమక్రమంగా ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?
10 ఈ రోజుల్లో ఒక వ్యక్తి బైబిలు అధ్యయనాన్ని అంగీకరించినప్పుడే ఆయనకు ఆధ్యాత్మిక ఉపదేశం మొదలౌతుంది. చక్కగా చదవడానికి ఆయనకు మనం సహాయం చేయాల్సిరావచ్చు. మనం ఆయనతో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నంతకాలం ఆయనకు మనం సహాయం చేస్తూనే ఉంటాం. ఆయన క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరవడం మొదలుపెట్టి దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పాల్గొంటూ బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడైనప్పుడు ఆయనకు మరింత ఆధ్యాత్మిక శిక్షణ దొరుకుతుంది. బాప్తిస్మం తర్వాత, రాజ్యమందిర బాగోగులు చూసుకోవడం వంటివాటిలో ఆయనకు శిక్షణ ఇవ్వవచ్చు. కొంతకాలానికి, పరిచర్య సేవకుడు అయ్యేందుకు ఆయన ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఆయనకు సహాయం చేయవచ్చు.
11 బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరునికి ఏదైనా నియామకాన్ని ఇచ్చేటప్పుడు దానికి సంబంధించి సంస్థ ఇచ్చిన నిర్దేశాలను, అవసరమైన మరితర సూచనలను సంఘ పెద్ద సంతోషంగా వివరిస్తాడు. ఆ పనిని నెరవేర్చడానికి తానేమి చేయాలో ఆ సహోదరుడు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అప్పగించిన పని చేయడం ఆ సహోదరునికి కష్టమౌతుంటే, ఆయన దానికి అర్హుడు కాడని ప్రేమగల పెద్ద వెంటనే ఒక ముగింపుకు రాడు. కానీ, ఆ సహోదరుడు ఏ విషయంలో మెరుగుపర్చుకోవాలో దయగా చూపించి, అసలు ఆ పని ఎందుకు చేయాలో, ఎలా చేయాలో వివరిస్తాడు. సంఘంలోని ఇతరులకు సేవ చేయడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుందని పెద్దలకు తెలుసు కాబట్టి బాధ్యతలు నెరవేర్చేందుకు ఆ సహోదరునికి వాళ్లు సంతోషంగా సహాయం చేస్తారు.—అపొ. 20:35.
‘జ్ఞానంగలవాళ్లు ఆలోచనను అంగీకరిస్తారు’
12. యేసు ఇచ్చిన ఉపదేశం ఎందుకు సహాయకరంగా ఉంది?
12 యేసు తన శిష్యుల అవసరాలకు తగినట్లు ఉపదేశాన్ని ఇవ్వడం ద్వారా వాళ్లకు శిక్షణ ఇచ్చాడు. ఉదాహరణకు, యేసును చేర్చుకోని కొంతమంది సమరయుల మీదికి ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేద్దామని యాకోబు, యోహాను అనుకున్నప్పుడు యేసు వాళ్లను గద్దించాడు. (లూకా 9:52-55) అంతేకాక, యాకోబు యోహానుల తల్లి యేసు దగ్గరికి వచ్చి తన కుమారులకు రాజ్యంలో ప్రత్యేకమైన స్థానాలను ఇవ్వమని అడిగినప్పుడు, యేసు నేరుగా ఆ ఇద్దరిని చూసి ఇలా అన్నాడు, “నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును.” (మత్త. 20:20-23) యేసు అన్ని సందర్భాల్లో స్పష్టమైన, పాటించదగిన, దేవుని సూత్రాలపై ఆధారపడిన ఉపదేశాన్ని ఇచ్చాడు. ఆ సూత్రాల గురించి ఆలోచించి, వాటి ప్రకారం జీవించడాన్ని యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్త. 17:24-27) అంతేకాక, యేసు తన శిష్యుల పరిమితులను గుర్తించాడు, వాళ్ల నుండి పరిపూర్ణతను ఆశించలేదు. ఆయన నిజమైన ప్రేమతో ఉపదేశమిచ్చాడు.—యోహా. 13:1.
13, 14. (ఎ) ఎవరికి సలహా అవసరం? (బి) ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించని వ్యక్తికి అవసరమైన సలహాను ఒక సంఘ పెద్ద ఎలా ఇవ్వవచ్చో చూపించేందుకు ఉదాహరణలు చెప్పండి.
13 క్రైస్తవ సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు కృషి చేస్తున్న ప్రతీ సహోదరునికి ఏదో ఒక సందర్భంలో ఉపదేశం లేదా లేఖన సలహా అవసరమౌతుంది. “జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును” అని సామెతలు 12:15 చెబుతోంది. ఒక యౌవన సహోదరుడు ఇలా అన్నాడు, “నా అపరిపూర్ణతలతో పోరాడడం చాలా కష్టమని నాకు అనిపించింది. అయితే ఒక సంఘ పెద్ద ఇచ్చిన సలహా వల్ల, నేను సేవచేయడానికి పరిపూర్ణుడిగా ఉండాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాను.”
14 ఒక సహోదరుడు తన ప్రవర్తనా తీరు వల్లే ప్రగతి సాధించలేకపోతున్నాడని సంఘ పెద్దలు గమనిస్తే వాళ్లు “సాత్వికమైన మనస్సుతో” వెంటనే ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. (గల. 6:1) కొన్నిసార్లు, ఆ సహోదరునికున్న ఏదో ఒక లక్షణం వల్ల కూడా ఆయనకు ఉపదేశం అవసరం కావచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరుడు ప్రకటనాపనిలో అంతగా పాల్గొనకపోతున్నట్లయితే, యేసు ఉత్సాహంగా ప్రకటనా పని చేసి, శిష్యులను తయారుచేయమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడనే విషయాన్ని సంఘ పెద్ద ఆయనకు వివరించవచ్చు. (మత్త. 28:19, 20; లూకా 8:1) ఒకవేళ ఒక సహోదరుడు సంఘంలో ఇతరులకన్నా పైస్థానంలో ఉండాలని ఆశిస్తున్నట్లయితే, ప్రముఖ స్థానాన్ని ఆశించడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి యేసు తన శిష్యులకు ఎలా సహాయం చేశాడో సంఘ పెద్ద ఆ సహోదరునికి చూపించవచ్చు. (లూకా 22:24-27) ఒకవేళ ఒక సహోదరునికి ఇతరులను క్షమించే స్వభావం లేదనుకోండి. పెద్ద మొత్తంలో అప్పు చేసిన ఒక దాసుని గురించి యేసు చెప్పిన ఉపమానాన్ని సంఘ పెద్ద ఆయనకు గుర్తుచేస్తే ఆయన వైఖరి మారవచ్చు. ఉపమానంలోని ఆ దాసుడు చేసిన పెద్ద అప్పు క్షమించబడింది. కానీ ఆయన తన దగ్గర చిన్న మొత్తంలో అప్పు చేసిన వ్యక్తిని క్షమించలేదు. (మత్త. 18:21-35) సహోదరులకు సలహా అవసరమైతే, పెద్దలు దాన్ని సాధ్యమైనంత త్వరగా ఇస్తే మంచిది.—సామెతలు 27:9 చదవండి.
మీకు మీరే శిక్షణ ఇచ్చుకోండి
15. ఒక సహోదరుడు సంఘంలోని ఇతరులకు సేవచేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ఎలా సహాయం చేయవచ్చు?
15 సహోదరులకు శిక్షణ ఇచ్చేది ముఖ్యంగా పెద్దలే అయినా ఇతరులు కూడా వాళ్లకు సహకరించవచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరుడు సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు ఆయన కుటుంబం ఆయనకు సహాయం చేయవచ్చు, చేయాలి కూడా. ఒకవేళ ఒక సహోదరుడు ఇప్పటికే సంఘ పెద్దగా సేవచేస్తుంటే ప్రేమగల భార్య, నిస్వార్థపరులైన పిల్లల సహకారం నుండి ఆయన ప్రయోజనం పొందుతాడు. ఆయన తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలంటే కుటుంబ సభ్యులు కూడా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్లు అలా చేస్తే ఆయన సంతోషిస్తాడు, ఇతరులు కూడా వాళ్లు చేసే త్యాగాలను ఎంతగానో మెచ్చుకుంటారు.—సామె. 15:20; 31:10, 23.
16. (ఎ) బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా కృషి చేయాల్సింది ఎవరు? (బి) ఒక సహోదరుడు సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు ఎలా అర్హుడు కావచ్చు?
16 అయితే ఒక సహోదరుని కుటుంబ సభ్యులు సహకరించినా, బాధ్యతలు చేపట్టేందుకు ఎక్కువగా కృషి చేయాల్సింది ఆ సహోదరుడే. (గలతీయులు 6:5 చదవండి.) సంఘంలోని ఇతరులకు సహాయం చేయాలన్నా, పరిచర్యలో ఎక్కువగా పాల్గొనాలన్నా ఒక సహోదరుడు పరిచర్య సేవకుడిగానో సంఘ పెద్దగానో ఉండాల్సిన అవసరం లేదు. కానీ, బాధ్యతలను చేపట్టేందుకు ఒక సహోదరుడు కృషి చేస్తున్నాడంటే, ఆయన లేఖనాల్లో ఉన్న అర్హతల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లే. (1 తిమో. 3:1-13; తీతు 1:5-9; 1 పేతు. 5:1-3) కాబట్టి, ఒక సహోదరునికి పరిచర్య సేవకునిగానో, సంఘ పెద్దగానో ఉండాలనే కోరిక ఉన్నా ఇంకా అలా నియమించబడకపోతే, ఆయన ఆధ్యాత్మికంగా ఏయే విషయాల్లో ప్రగతి సాధించాల్సి ఉందో ఆలోచించుకోవాలి. క్రమంగా బైబిలు చదవడం, శ్రద్ధగా వ్యక్తిగత అధ్యయనం చేయడం, బాగా ధ్యానించడం, హృదయపూర్వకంగా ప్రార్థించడం, క్రైస్తవ పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొనడం వంటివి చేస్తే ఆయన ప్రగతి సాధించగలుగుతాడు. అవన్నీ చేయడం ద్వారా ఆయన తిమోతికి పౌలు ఇచ్చిన ఈ సలహాను పాటించగలుగుతాడు, “దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.”—1 తిమో. 4:7.
17, 18. ఒక సహోదరుడు తగినవాణ్ణి కానని అనుకోవడం వల్ల లేదా సేవ చేయాలనే కోరిక లేనందువల్ల బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడు కాలేకపోతుంటే ఆయన ఏమి చేయవచ్చు?
17 పరిచర్య సేవకుడిగా లేదా సంఘ పెద్దగా సేవచేసేందుకు తగినవాణ్ణి కానని ఒక సహోదరుడు అనుకుంటుంటే ఆయన ఏమి చేయవచ్చు? యెహోవా, యేసుక్రీస్తు మనకోసం ఎంత చేస్తున్నారనే దానిగురించి ఆయన ఆలోచిస్తే మంచిది. నిజానికి, యెహోవా ‘అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు.’ (కీర్త. 68:19) కాబట్టి సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు మన పరలోక తండ్రి సహాయం చేయగలడు. ఇంకా పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా నియమించబడని సహోదరుడు, దేవుని సంస్థలో సేవాధిక్యతల్ని చేపట్టడానికి పరిణతిగల సహోదరుల అవసరం ఎంతగానో ఉందనే విషయం గురించి ఆలోచిస్తే మంచిది. అలా ఆలోచిస్తే, తగినవాణ్ణి కాననే భావనను ఆయన తీసివేసుకోగలుగుతాడు. అంతేకాక, ఆయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఫలంలో భాగంగా ఉన్న సమాధానం, ఆశానిగ్రహం అనే లక్షణాల వల్ల, పరిచర్య సేవకుడిగా లేదా సంఘ పెద్దగా సేవచేసేందుకు తగినవాణ్ణి కానని అనుకోకుండా ఉండగలుగుతాడు. (లూకా 11:13; గల. 5:22, 23) సరైన ఉద్దేశంతో సంఘ బాధ్యతలు చేపట్టేందుకు కృషి చేస్తున్న వాళ్ల ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని ఆయన కలిగివుండవచ్చు.
18 బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుడు సేవ చేయాలనే కోరిక లేనందువల్ల బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడు కాలేకపోతున్నాడా? ఆయనకు ఎలా సహాయం చేయవచ్చు? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.” (ఫిలి. 2:13) ఒక వ్యక్తిలో సేవ చేయాలనే కోరిక కలుగజేసేది యెహోవాయే. పరిశుద్ధ సేవ చేయడానికి యెహోవా ఆత్మ ఆయనకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది. (ఫిలి. 4:13) అంతేకాక, సరైనది చేయడానికి సహాయం చేయమని ఒక క్రైస్తవుడు యెహోవాకు ప్రార్థించవచ్చు.—కీర్త. 25:4, 5.
19. ‘ఏడుగురు గొర్రెల కాపరులు, ఎనిమిది మంది ప్రధానులు’ ఉంటారంటే అర్థమేమిటి?
19 ఇతరులకు శిక్షణ ఇచ్చేందుకు సంఘ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఆశీర్వదిస్తాడు. పెద్దలు ఇచ్చే శిక్షణను తీసుకొని బాధ్యతలు చేపట్టేందుకు అర్హులయ్యేవాళ్లు కూడా యెహోవా ఆశీర్వాదాలను రుచి చూస్తారు. యెహోవా సంస్థలో నాయకత్వం వహించడానికి ఆయన ప్రజల మధ్య ‘ఏడుగురు గొర్రెల కాపరులు, ఎనిమిది మంది ప్రధానులు’ ఉంటారని, అంటే కావాల్సినంతమంది సమర్థులైన పురుషులు ఉంటారని లేఖనాలు అభయమిస్తున్నాయి. (మీకా 5:5) యెహోవాను మహిమపర్చేలా ఎంతోమంది సహోదరులు శిక్షణ పొంది వినయంగా బాధ్యతల్ని చేపట్టేందుకు అర్హులౌతుండడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం.
మీరెలా జవాబిస్తారు?
• శిష్యులు పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు యేసు వాళ్లకెలా సహాయం చేశాడు?
• సంఘంలో నాయకత్వం వహించడానికి సహోదరులకు సహాయం చేస్తున్నప్పుడు సంఘ పెద్దలు యేసును ఎలా అనుకరించవచ్చు?
• ఒక సహోదరుడు సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు ఆయన కుటుంబం ఆయనకు ఎలా సహాయం చేయవచ్చు?
• ఒక సహోదరుడు సంఘంలో బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడు కావాలంటే ఆయన ఏమి చేయాలి?
[అధ్యయన ప్రశ్నలు]
[31వ పేజీలోని చిత్రం]
ప్రగతి సాధించడానికి కృషి చేస్తున్న బైబిలు విద్యార్థికి మీరు ఎలాంటి శిక్షణ ఇవ్వవచ్చు?
[32వ పేజీలోని చిత్రం]
బాధ్యతలు చేపట్టేందుకు అర్హులమౌతున్నామని సహోదరులు ఎలా చూపించవచ్చు?