కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి’

‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి’

‘పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్తపడండి’

“పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి” అని యేసు తన శిష్యుల్ని హెచ్చరించాడు. (లూకా 12:1) ఈ విషయం గురించే చెబుతున్న మరో సువార్తలోవున్న యేసు మాటలను బట్టి ఆయన పరిసయ్యుల “బోధను” ఖండించాడని స్పష్టమౌతోంది.—మత్త. 16:12.

బైబిలు కొన్నిసార్లు, కలుషితం చేసేదాన్ని సూచించడానికి “పులిసిన పిండి” అనే మాటను ఉపయోగిస్తోంది. నిస్సందేహంగా పరిసయ్యుల బోధలు, వాళ్ల వైఖరి ప్రజల మనసులను కలుషితం చేశాయి. అయితే, పరిసయ్యుల బోధ ఎందుకు ప్రమాదకరమైనది?

1 పరిసయ్యులు ఇతరులకన్నా తామే నీతిమంతులమని గర్వించేవాళ్లు, సాధారణ ప్రజల్ని చిన్నచూపు చూసేవాళ్లు.

యేసు చెప్పిన ఒక చిన్న కథలో ఆ స్వనీతి గురించి స్పష్టంగా ఉంది. ఆయన ఇలా చెప్పాడు, “పరిసయ్యుడు నిలువబడి—దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవవంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు—దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.”—లూకా 18:11-13.

కథలోని సుంకరి చూపించిన వినయ స్వభావాన్ని యేసు మెచ్చుకుంటూ, “అతని [ఆ పరిసయ్యుని] కంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను” అన్నాడు. ఆ తర్వాత, దానికి కారణాన్ని చెబుతూ, ‘తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’ అని యేసు అన్నాడు. (లూకా 18:14) ఆ రోజుల్లో సుంకరులకు అవినీతిపరులనే పేరున్నా, తన మాట విన్న సుంకరులకు సహాయం చేయడానికి యేసు ప్రయత్నించాడు. కనీసం ఇద్దరు సుంకరులు అంటే మత్తయి, జక్కయ్య యేసు అనుచరులయ్యారు.

దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యాలను బట్టి లేదా సేవావకాశాలను బట్టి లేదా ఇతరుల వైఫల్యాలు, బలహీనతలు వంటివాటిని బట్టి ఇతరులకన్నా మనమే మెరుగైన వ్యక్తులమని మనకనిపిస్తే ఏమి చేయాలి? అలాంటి ఆలోచనల్ని వెంటనే తీసిపారేయాలి. ఎందుకంటే, లేఖనాలు ఇలా చెబుతున్నాయి, “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి [‘ఇతరుల పాపాల,’ ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌] విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.”—1 కొరిం. 13:4-6.

అపొస్తలుడైన పౌలుకున్న వైఖరే మనకూ ఉండాలి. “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను” అని చెప్పిన తర్వాత పౌలు, “అట్టివారిలో నేను ప్రధానుడను” అన్నాడు.—1 తిమో. 1:15.

ధ్యానించడానికి ప్రశ్నలు:

నేను పాపినని, యెహోవా కృప చూపిస్తేనే నాకు రక్షణ కలుగుతుందని గుర్తిస్తున్నానా? లేక ఎన్నో సంవత్సరాలుగా యెహోవా సేవలో నమ్మకంగా కొనసాగడాన్ని బట్టి లేదా దేవుని సంస్థలో పొందిన సేవావకాశాలను బట్టి లేదా నాకున్న సామర్థ్యాలను బట్టి ‘ఇతరులకన్నా నేనే గొప్ప’ అనుకుంటున్నానా?

2 పరిసయ్యులు తమ నీతిని బహిరంగంగా ప్రదర్శిస్తూ ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు ప్రముఖమైన స్థానాలను, గొప్పగొప్ప బిరుదులను కోరుకునేవాళ్లు.

యేసు వాళ్ల గురించి ఇలా చెప్పాడు, “మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.” (మత్త. 23:5-7) యేసు వైఖరికి, వాళ్ల వైఖరికి ఉన్న తేడాను గమనించండి. ఆయన దేవుని పరిపూర్ణ కుమారుడైనా వినయం చూపించాడు. ఒకతను వచ్చి తనను “సద్బోధకుడా” అని పిలిచినప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు, “నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.” (మార్కు 10:17, 18) మరో సందర్భంలో, యేసు తన శిష్యుల పాదాలు కడిగి, వినయం చూపించే విషయంలో తన అనుచరులకు ఆదర్శంగా నిలిచాడు.—యోహా. 13:1-15.

నిజ క్రైస్తవులు తోటి విశ్వాసులకు సేవచేయాలి. (గల. 5:13) సంఘ పెద్దలుగా ఉండేందుకు అర్హులవ్వాలని అనుకుంటున్నవాళ్లు ముఖ్యంగా అలా ఉండాలి. ‘అధ్యక్ష్యపదవిని ఆశించడం’ లేక సంఘ పెద్దగా ఉండడానికి కృషి చేయాలనుకోవడం సరైనదే కానీ, ఇతరులకు సహాయం చేయాలనే కోరికతోనే అలా కృషి చేయాలి. సంఘ పెద్దగా ఉండడమంటే, ఒక ప్రముఖ స్థానంలో లేదా అధికారం గల స్థానంలో ఉండడమని కాదు. సంఘ పెద్దలుగా సేవ చేస్తున్నవాళ్లు యేసులా “దీనమనస్సు” కలిగివుండాలి.—1 తిమో. 3:1, 6; మత్త. 11:29.

ధ్యానించడానికి ప్రశ్నలు:

ప్రముఖ స్థానాన్ని లేక అదనపు సేవావకాశాల్ని పొందాలనే ఆశతో నేను సంఘంలో బాధ్యతగల స్థానంలో ఉన్న సహోదరులను కాకాపట్టడానికి ప్రయత్నిస్తున్నానా? దేవుని సేవలో సహోదరుల మధ్య గుర్తింపు, ఘనత వచ్చేలా చేసే విషయాలపైనే ముఖ్యంగా దృష్టి పెడుతున్నానా? అందరి ముందు గొప్పగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నానా?

3 పరిసయ్యుల నియమాల వల్ల, సాంప్రదాయాల వల్ల ధర్మశాస్త్రాన్ని పాటించడం సాధారణ ప్రజలకు భారంగా తయారైంది.

యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి కావాల్సిన సాధారణ విషయాలను ధర్మశాస్త్రం తెలియజేసింది. అయితే, ప్రతీ చిన్న వివరణ అందులో లేదు. ఉదాహరణకు, సబ్బాతు దినాన పని చేయకూడదని ధర్మశాస్త్రం చెప్పింది. కానీ, ఏది పనిగా లెక్కించబడుతుంది, ఏది లెక్కించబడదు అనే దాని గురించి అందులో వివరంగా లేదు. (నిర్గ. 20:10) ధర్మశాస్త్రంలో లేవని తమకనిపించిన వివరణలను ఇవ్వడానికి పరిసయ్యులు తమ సొంత నియమాలను, నిర్వచనాలను, సాంప్రదాయాలను రూపొందించారు. పరిసయ్యులు తమకు ఇష్టమొచ్చినట్లు రూపొందించిన నియమాలను యేసు పట్టించుకోకపోయినా ధర్మశాస్త్రాన్ని మాత్రం పాటించాడు. (మత్త. 5:17, 18; 23:23) ఆయన ధర్మశాస్త్రంలోని నియమాలను కాదుగానీ వాటి వెనకున్న సూత్రాలను గ్రహించాడు. అంతేకాక దయ, కనికరం చూపించడం అవసరమని గుర్తించాడు. శిష్యులు తాను అనుకున్నట్లుగా ప్రవర్తించకపోయినా వాళ్లను అర్థంచేసుకొని వ్యవహరించాడు. ఉదాహరణకు, తాను బంధింపబడబోయే రాత్రి మెలకువగా, అప్రమత్తంగా ఉండమని తన ముగ్గురు అపొస్తలులకు చెప్పినా వాళ్లు యేసు వచ్చి చూసిన ప్రతీసారి నిద్రపోతూ కనిపించారు. అయినా, యేసు సానుభూతితో ఇలా అన్నాడు, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.”—మార్కు 14:34-42.

ధ్యానించడానికి ప్రశ్నలు:

నేను నా ఇష్టమొచ్చినట్లు కఠినమైన నియమాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నానా? నా అభిప్రాయాల్నే దేవుని వాక్యంలోని నియమాల్లా చూపించడానికి ప్రయత్నిస్తున్నానా? ఇతరుల పరిస్థితిని అర్థంచేసుకొని వ్యవహరిస్తున్నానా?

యేసు బోధలకు, పరిసయ్యుల బోధలకు మధ్య ఉన్న తేడా గురించి ఆలోచించండి. మీరు ఏ విషయాల్లోనైనా ఇంకా మెరుగవ్వాల్సి ఉందా? అలాగైతే, మెరుగవ్వాలని గట్టిగా నిర్ణయించుకోండి.

[28వ పేజీలోని చిత్రం]

పరిసయ్యులు రక్షరేకులను లేదా లేఖనాలు రాసివున్న చిన్న పెట్టెల్ని ధరించేవాళ్లు.—మత్త. 23:2, 5

[29వ పేజీలోని చిత్రం]

గర్విష్ఠులైన పరిసయ్యుల్లా కాక, వినయంగల సంఘ పెద్దలు ఇతరులకు సేవచేస్తారు

[30వ పేజీలోని చిత్రం]

మీరు యేసులా ఇతరులను అర్థంచేసుకొని వ్యవహరిస్తారా?