కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజంగానే దాన్ని జోసిఫస్‌ రాశాడా?

నిజంగానే దాన్ని జోసిఫస్‌ రాశాడా?

మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ జూయిష్‌ యాంటిక్విటీస్‌ అనే పేరుతో రాసిన పుస్తకంలోని 20వ సంపుటిలో “క్రీస్తు అని పిలువబడిన యేసుకు తమ్ముడైన యాకోబు” మరణం గురించి ప్రస్తావించాడు. ఆ మాట ప్రామాణికమైనదేనని చాలామంది విద్వాంసులు పరిగణిస్తున్నారు. అయితే, అదే పుస్తకంలో యేసు గురించి ప్రస్తావించిన మరో వాక్యం ఎంతవరకు నిజమని కొంతమంది సందేహించారు. టెస్టీమోన్యమ్‌ ఫ్లావ్యానమ్‌ అని పిలువబడే ఆ భాగంలో ఇలా ఉంది:

“సరిగ్గా ఆ కాలంలో యేసు అనే జ్ఞానవంతుడైన మానవుడు జీవించాడు. ఆయనను మానవుడు అని పిలవడం ఎంతవరకు సమంజసమో తెలీదు. ఎందుకంటే, ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. అంతేకాదు, ఆయన సత్య బోధలు వినడానికి ఎంతోమంది సంతోషంగా వచ్చేవాళ్లు. ఎంతోమంది యూదులను, అన్యులను ఆయన ఆకట్టుకున్నాడు. ఆయనే క్రీస్తు. యూదుల్లోని ప్రధానుల ప్రోద్బలంతో పిలాతు, యేసును సిలువ మీద వేలాడదీయించాడు. యేసును తొలుత ప్రేమించిన వాళ్లు తనను ఎడబాయలేదు. ఎందుకంటే, ఆయన మూడవ రోజున సజీవునిగా వాళ్లకు కనిపించాడు. అంతేకాదు వీటి గురించి, ఆయనకు సంబంధించిన పదివేల ఇతర అద్భుతమైన విషయాల గురించి దేవుని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. ఆయన వల్లే ఆయన అనుచరులకు క్రైస్తవులు అనే పేరు వచ్చింది. వాళ్లు ఇప్పటివరకు తెరమరుగు అవ్వలేదు.”—విలియమ్‌ విస్టన్‌ అనువదించిన జోసిఫస్‌—ద కంప్లీట్‌ వర్క్స్‌.

16వ శతాబ్దపు చరమాంకం నుండి, ఆ వాక్య భాగం వాస్తవమేనని నమ్మేవాళ్లకు, అసలు దాన్ని జోసిఫసే రాశాడా అని సందేహించే వాళ్లకు మధ్య వాడివేడి చర్చలు సాగాయి. ఫ్రెంచ్‌చరిత్రకారుడు, ప్రాచీన సాహిత్యంలో దిట్ట అయిన సర్జ్‌ బార్డే గత నాలుగు శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ఆ చిక్కుముడిని విప్పేందుకు ప్రయత్నించాడు. ల టెస్టీమోన్యమ్‌ ఫ్లావ్యానమ్‌ ఎక్సామెన్‌ ఈస్టరీక్‌ కన్సీడేరాస్యన్‌ ఈస్టార్యాగ్రాఫీక్‌ (ద టెస్టీమోన్యమ్‌ ఫ్లావ్యానమ్‌—ఎ హిస్టారికల్‌ స్టడీ విత్‌ హిస్టారికల్‌ కన్సిడరేషన్స్‌) అనే పుస్తకంలో తన పరిశోధన విషయాలను పొందుపరిచాడు.

జోసిఫస్‌ క్రైస్తవ రచయిత కాదు. ఆయన ఓ యూదా చరిత్రకారుడు కాబట్టి, యేసును “క్రీస్తు” అని సంబోధించినందుకే ఈ దుమారం చెలరేగింది. అయితే, జోసిఫస్‌ గ్రీకుల పద్ధతిని అనుసరించి యేసుకు ఒక్కడికే క్రీస్తు అనే పేరు వర్తిస్తుందని చూపించే ఓ నిర్దిష్టమైన పదం ఉపయోగించాడని పూర్వాపరాలు పరిశీలించిన మీదట బార్డే నిర్ధారించాడు. యూదులు, క్రైస్తవులు సాధారణంగా నమ్మే విషయాలను బట్టి చూస్తే “జోసిఫస్‌, క్రీస్టోస్‌ అనే పదం వాడడం అసంభవమేమీ కాదని, విమర్శకులు ఆ వాస్తవాన్ని విస్మరించి పెద్ద తప్పే చేశారని” తెలుస్తున్నట్లు బార్డే రాశాడు.

జోసిఫస్‌ తర్వాత జీవించిన ఓ వ్యక్తి ఆయన శైలిని అనుకరిస్తూ ఆ వాక్య భాగాన్ని కలిపాడా? చరిత్రను, మూల గ్రంథాలను పరిశీలించిన మీదట, జోసిఫస్‌ను అలా అనుకరించడం దాదాపు ఓ అద్భుతమే అవుతుందనే ముగింపుకు బార్డే వచ్చాడు. ఒకవేళ నిజంగా అలా జరగాలన్నా, “ప్రాచీన కాలమంతటిలో సాటిలేని అనుకరణ సామర్థ్యం కలిగిన వ్యక్తి కావాలి,” ఇంకో మాటలో చెప్పాలంటే ‘మరో జోసిఫస్‌ కావాలి’ అని బార్డే అన్నాడు.

మరి ఎందుకు ఈ దుమారమంతా? ఆ సమస్యకు గల ముఖ్య కారణాన్ని గుర్తిస్తూ బార్డే ఇలా అన్నాడు: “అనేక ప్రాచీన గ్రంథాల విషయంలో తలెత్తని సందేహాలు టెస్టీమోన్యమ్‌ విషయంలో తలెత్తాయి. టెస్టీమోన్యమ్‌ విషయంలో విమర్శకులు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తినందుకే అదంతా జరిగింది.” ఈ రచన ప్రామాణికతను రుజువుచేస్తున్న తర్కబద్ధమైన విశ్లేషణ ఆధారంగా కాకుండా, “వాస్తవాలకు మించి ఆలోచించడం” వల్లే శతాబ్దాలుగా విమర్శకులు అలాంటి అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారని బార్డే వ్యాఖ్యానించాడు.

బార్డే విశ్లేషణను బట్టి, టెస్టీమోన్యమ్‌ ఫ్లావ్యానమ్‌ విషయంలో విద్వాంసులు తమ అభిప్రాయాన్ని ఏమేరకు మార్చుకుంటారో వేచిచూడాల్సిందే. గ్రీకు తత్వంతో ప్రభావితమైన యూదామతం విషయంలో, తొలినాళ్లలోని క్రైస్తవత్వం విషయంలో నిష్ణాతుడైన పయర్‌ జోల్‌ట్రెన్‌, బార్డే విశ్లేషణను బట్టి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. టెస్టీమోన్యమ్‌ అనేది జోసిఫస్‌ తర్వాతి కాలాల్లో ఆయన రచనలో కలిపిన భాగమని ఎన్నో సంవత్సరాల పాటు పయర్‌ నమ్మాడు. అంతేకాక, అది ప్రామాణికమైనదని విశ్వసించిన వాళ్లను అపహసించాడు. కానీ ఆ తర్వాత ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. బార్డే విశ్లేషణే దానికి కారణమని ఆయన అన్నాడు. “ఇకమీదట ఎవరైనా సరే, ఆ వాక్య భాగాన్ని (టెస్టీమోన్యమ్‌) జోసిఫస్‌ రాయలేదని చెప్పే సాహసం చేయకూడదు” అని జోల్‌ట్రెన్‌ ఇప్పుడు అంటున్నాడు.

అయితే, యేసే క్రీస్తని నమ్మేందుకు యెహోవాసాక్షులకు వీటన్నిటికీ మించిన బలమైన కారణాలు బైబిల్లోనే ఉన్నాయి.—2 తిమో. 3:16, 17.