యెహోవా మన నివాస స్థలం
“ప్రభువా [“యెహోవా,” NW], తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.”—కీర్త. 90:1.
1, 2. ప్రస్తుత లోకాన్ని చూస్తే దేవుని సేవకులకు ఏమనిపిస్తుంది? ఏ విధంగా వాళ్లకు ఓ “ఇల్లు” ఉందని చెప్పవచ్చు?
ఇప్పటి లోకంలో మీరు సురక్షితంగా లేరని మీకనిపిస్తోందా? అలాగైతే, ఆ విధంగా అనుకునేది మీరొక్కరే కాదు. తరతరాలుగా యెహోవాను నిజంగా ప్రేమించే ఎంతోమంది తాము ఈ లోకంలో పరదేశులమని భావించారు. ఉదాహరణకు, కనాను దేశంలో ఒక చోట నుండి మరో చోటికి వలస వెళ్తూ గుడారాల్లో జీవితం వెళ్లబుచ్చిన దేవుని ఆరాధకులు ‘తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకున్నారు.’—హెబ్రీ. 11:13.
2 అలాగే, ‘పరలోక పౌరసత్వం’ ఉన్న క్రీస్తు అభిషిక్త అనుచరులు ఈ లోకంలో తాము ‘పరదేశులమని, యాత్రికులమని’ భావిస్తారు. (ఫిలి. 3:20; 1 పేతు. 2:11) ‘వేరేగొర్రెలు’ కూడా యేసులాగే “లోకసంబంధులు కారు.” (యోహా. 10:16; 17:16) అలాగని వాళ్లు “ఇల్లు” లేకుండా ఏమీ లేరు. నిజానికి, విశ్వాసంతో చూసినప్పుడు మాత్రమే కనిపించే అత్యంత సురక్షితమైన, ప్రేమపూర్వకమైన వాతావరణం ఉన్న ఇల్లు మనకుంది. మోషే ఇలా రాశాడు: ‘యెహోవా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే.’ a (కీర్త. 90:1) ఇంతకీ పూర్వకాలంలో తన నమ్మకమైన సేవకులకు యెహోవా ఎలా నిజమైన “నివాస స్థలము” అయ్యాడు? నేటి సేవకులకు ఆయన నిజమైన ‘నివాస స్థలముగా’ ఎలా ఉన్నాడు? భవిష్యత్తులో ఆయన మాత్రమే సురక్షితమైన నివాస స్థలముగా ఎలా ఉంటాడు?
పూర్వకాలంలో యెహోవా నిజమైన “నివాస స్థలము” అయ్యాడు
3. కీర్తన 90:1లో ఏ విషయం, భావచిత్రం, సారూప్యత ఉన్నాయి?
3 బైబిల్లో వాడిన చాలా పదచిత్రాలకు ఉన్నట్లే, కీర్తన 90:1లోని పదచిత్రానికి కూడా ఓ విషయం, భావచిత్రం, సారూప్యత ఉన్నాయి. ఇక్కడ విషయం యెహోవా; భావచిత్రం నివాస స్థలము. యెహోవాకు, అలాంటి నివాస స్థలానికి సారూప్యత ఎంతో ఉంది. ఉదాహరణకు, యెహోవా తన ప్రజలకు భద్రతను కల్పిస్తాడు. ఆయన “ప్రేమాస్వరూపి” అనడానికి అది మరో రుజువు. (1 యోహా. 4:8) అంతేకాక, ఆయన తన సేవకులకు నెమ్మదిని దయచేసి ‘సురక్షితంగా నివసింపజేసే’ దేవుడు కూడా. (కీర్త. 4:8) అందుకు రుజువుగా, అబ్రాహాము మొదలుకొని ఇతర ప్రాచీన సేవకులతో యెహోవా ఎలా వ్యవహరించాడో ఇప్పుడు పరిశీలిద్దాం.
4, 5. యెహోవా అబ్రాహాముకు ఎలా నిజమైన “నివాస స్థలము” అయ్యాడు?
4 యెహోవా తనతో ఈ మాటలు అన్నప్పుడు అబ్రాముకు లేదా అబ్రాహాముకు ఎలా అనిపించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు: “నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు . . . బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.” అప్పుడు ఆయనకు ఆందోళన కలిగినా యెహోవా వెనువెంటనే చెప్పిన మాటలతో ఆ ఆందోళన ఆవిరైపోయి ఉంటుంది. “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును . . . నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను.”—ఆది. 12:1-3.
5 ఆ మాట చెప్పి అబ్రాహాముకు, ఆయన సంతానానికి నివాస స్థలముగా ఉండే బాధ్యతను యెహోవా తన భుజాలపై వేసుకున్నాడు. (ఆది. 26:1-6) యెహోవా తన మాట నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకు, ఐగుప్తు రాజైన ఫరో, గెరారు రాజైన అబీమెలెకు శారాను చెరచకుండా, అబ్రాహామును చంపకుండా యెహోవా కాపాడాడు. ఇస్సాకు రిబ్కాలను కూడా యెహోవా అలాగే కాపాడాడు. (ఆది. 12:14-20; 20:1-14; 26:6-11) యెహోవా చేసిన దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్యలేదు, ఆయన వారికొరకు రాజులను గద్దించెను.”—కీర్త. 105:14, 15.
6. ఇస్సాకు యాకోబును ఏమి చేయమన్నాడు? యాకోబుకు ఎలా అనిపించి ఉంటుంది?
6 ఆ లేఖనం ప్రస్తావిస్తున్న ప్రవక్తల్లో అబ్రాహాము మనుమడైన యాకోబు కూడా ఒకడు. యాకోబు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన తండ్రియైన ఇస్సాకు ఆయనకు ఇలా చెప్పాడు: “నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుము.” (ఆది. 28:1, 2) ఇస్సాకు చెప్పినదాన్ని యాకోబు నమ్మకంగా పాటించాడు. అప్పటివరకు కుటుంబ సభ్యులతో ఉంటున్న ఆయన కనానును వదిలి బహుశా ఒంటరిగా వందల మైళ్ల దూరంలోవున్న హారానుకు పయనమయ్యాడు. (ఆది. 28:10) ఆయన మనసులో ఈ ప్రశ్నలు మెదిలుంటాయి: ‘నేను ఎంతకాలం ఇలా దూరంగా ఉండాలో? మా మామయ్య నన్ను ప్రేమగా చేరదీస్తాడా? దైవభక్తిగల భార్యను ఇస్తాడా?’ ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో ఆయన సతమతమయ్యుంటే, బెయేర్షెబాకు దాదాపు 100 కి.మీ. దూరంలో ఉన్న లూజుకు చేరినప్పుడు అవన్నీ పటాపంచలైపోయి ఉంటాయి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?
7. యెహోవా ఓ కలలో ప్రత్యక్షమై యాకోబును ఎలా బలపర్చాడు?
7 లూజు దగ్గర ఓ కలలో యాకోబుకు యెహోవా ప్రత్యక్షమై ఇలా మాటిచ్చాడు: “ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువను.” (ఆది. 28:15) ఆ మాటలు యాకోబుకు ఎంత ధైర్యాన్ని ఇచ్చుంటాయి! యెహోవా తనకు ఇచ్చిన మాటను ఎలా నెరవేరుస్తాడో చూడాలనే ఆతురతతో యాకోబు వడివడిగా ముందుకు సాగడాన్ని ఊహించుకోగలరా? బహుశా విదేశంలో సేవ చేయడానికి మీరు మీ ఇంటికి దూరంగా వెళ్లి ఉంటే, యాకోబు మనసులో ఉబికిన భావావేశాల్ని సరిగ్గా అర్థంచేసుకోగలుగుతారు. నిస్సందేహంగా, యెహోవాకు మీపై ఎంత శ్రద్ధ ఉందో రుచి చూసివుంటారు.
8, 9. యెహోవా ఏ విధంగా యాకోబుకు నిజమైన “నివాస స్థలము” అయ్యాడు? దాన్నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
8 యాకోబు హారానుకు చేరుకున్నప్పుడు లాబాను ఆయనను అక్కున చేర్చుకొని కొన్నేళ్లకు లేయాను, ఆ తర్వాత రాహేలును ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే, లాబాను ఆ మధ్యకాలంలో యాకోబు జీతాన్ని పదిసార్లు మార్చి, ఆయన కష్టాన్ని దోచుకోవాలని చూశాడు. (ఆది. 31:41, 42) అయినా, యెహోవా తన బాగోగులను చూసుకుంటాడనే నమ్మకంతో యాకోబు ఆ అన్యాయాన్ని సహించాడు. నిజంగానే ఆ కాలమంతటిలో యెహోవా యాకోబును ఆశీర్వదించాడు. వాస్తవానికి, కనానుకు తిరిగి వెళ్లమని యెహోవా యాకోబుకు చెప్పే సమయానికి యాకోబు, “విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు” సంపాదించుకున్నాడు. (ఆది. 30:43) కృతజ్ఞతతో ఉప్పొంగిపోతూ యాకోబు ఇలా ప్రార్థించాడు: “నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.”—ఆది. 32:10.
9 అవును, వాటన్నిటినీ ధ్యానిస్తూ మోషే చేసిన ఈ ప్రార్థన అక్షర సత్యం! ‘యెహోవా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.’ (కీర్త. 90:1) ఆ వాక్యం ఇప్పటికీ వర్తిస్తుంది. ఎందుకంటే “గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను” లేని యెహోవా తన నమ్మకమైన సేవకులకు సురక్షితమైన, ప్రేమపూర్వకమైన నివాస స్థలముగా ఉంటాడు. (యాకో. 1:17) అదెలాగో ఇప్పుడు చూద్దాం.
సేడు యెహోవా మన నిజమైన “నివాస స్థలము”
10. యెహోవా ఇప్పటికీ తన సేవకులకు సురక్షితమైన నివాస స్థలముగా ఉన్నాడని మనం ఎందుకు నమ్మవచ్చు?
10 ఒకసారి ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: మీరు ఓ అంతర్జాతీయ నేర సంస్థకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఆ సంస్థ నాయకుడు చాలా తెలివి, ప్రాబల్యం ఉన్నవాడు, పైగా పచ్చి అబద్ధాల కోరు, క్రూరమైన హంతకుడు. అలాంటప్పుడు, సురక్షితంగా ఉంటాననే భరోసాతో మీరు కోర్టు బయటకు అడుగుపెట్టగలరా? లేదు! అందుకే మీకు భద్రత కల్పించమని అడుగుతారు. ఈ సన్నివేశం, యెహోవా పక్షాన ధైర్యంగా సాక్ష్యం చెబుతూ ఆయన ప్రధాన శత్రువు, క్రూరుడు అయిన సాతాను నేరాల్ని బట్టబయలు చేస్తున్న నేటి యెహోవా సేవకులకు సరిగ్గా సరిపోతుంది. (ప్రకటన 12:17 చదవండి.) కానీ, దేవుని ప్రజల నోళ్లను సాతాను మూయించగలిగాడా? లేదు! నిజానికి, మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నాం. దానికిగల ఒకే ఒక్క కారణం, యెహోవా ఇప్పటికీ, ప్రత్యేకించి ఈ అంత్యదినాల్లో మన ఆశ్రయంగా, నిజమైన ‘నివాస స్థలముగా’ ఉంటున్నాడు. (యెషయా 54:14, 17 చదవండి.) అయితే, సాతాను ఆశ చూపించే వాటికి లొంగి మనం మన నివాస స్థలం నుండి బయటకు వెళ్తే, యెహోవా మనకు సురక్షితమైన నివాస స్థలముగా ఉండడు.
11. పూర్వకాలంలోని సేవకుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
11 పూర్వకాలంలోని దేవుని సేవకుల నుండి మనం మరో పాఠాన్ని కూడా నేర్చుకోవచ్చు. వాళ్లు కనాను దేశంలోనే ఉన్నా అక్కడి ప్రజల చెడు మార్గాలను, అనైతికతను అసహ్యించుకొని ప్రత్యేకమైన ప్రజలుగా ఉన్నారు. (ఆది. 27:46) వాళ్లు తప్పొప్పుల చిట్టాను కాదుగానీ దేవుని సూత్రాలను పాటించారు. సరైన మార్గంలో నడవడానికి వాళ్లకు యెహోవా గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన విషయాలు సరిపోయాయి. వాళ్లకు దేవుడే నివాస స్థలముగా ఉన్నాడు కాబట్టి వాళ్లు లోకంతో కలిసిపోవడానికి లొసుగులు వెదకలేదు. కానీ, లోకానికి సాధ్యమైనంత దూరంగా ఉన్నారు. ఆ విషయంలో వాళ్లు మనకు ఆదర్శప్రాయులు. సహవాసుల్ని, వినోదాన్ని ఎంచుకునేటప్పుడు మీరు ఆ నమ్మకమైన సేవకుల్ని అనుకరించడానికి కృషిచేస్తారా? విచారకరంగా, క్రైస్తవ సంఘంలోని కొంతమంది, సాతాను లోకంలోనే కొంతవరకు సౌఖ్యంగా ఉందన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మీకు ఏమాత్రం అలా అనిపించినా, వెంటనే దాని గురించి యెహోవాకు ప్రార్థించండి. ఈ ప్రపంచం సాతానుదని గుర్తుంచుకోండి. ప్రేమలేని ఆ స్వార్థపరుని లక్షణాలే దీనిలో కూడా కనిపిస్తాయని మర్చిపోకండి.—2 కొరిం. 4:4; ఎఫె. 2:1, 2.
12. (ఎ) యెహోవా తన ఆధ్యాత్మిక గృహంలోని వాళ్లకు ఎలాంటి ఏర్పాట్లు చేశాడు? (బి) ఆ ఏర్పాట్లను చూస్తుంటే మీకెలా అనిపిస్తోంది?
12 సాతాను కుతంత్రాలను ఎదిరించాలంటే మనం తన విశ్వాస గృహంలోని వాళ్ల కోసం, తనను నివాస స్థలముగా చేసుకున్న వాళ్లకోసం యెహోవా చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లను పూర్తిగా వినియోగించుకోవాలి. యెహోవా దేవుడు క్రైస్తవ కూటాలను, కుటుంబ ఆరాధనను ఏర్పాటు చేశాడు. అంతేకాక జీవితంలోని ఒత్తిళ్లతో పోరాడడానికి మనకు సహకరించేలా, మనల్ని ఓదార్చేలా దేవుడు ‘మనుష్యుల్లో ఈవుల్లాంటి’ కాపరుల్ని కూడా ఇచ్చాడు. (ఎఫె. 4:8-12) ఎన్నో సంవత్సరాలు పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన సహోదరుడు జార్జ్ గ్యాంగస్ ఇలా రాశాడు: “[దేవుని ప్రజల] మధ్య ఉన్నప్పుడు నేను నా సొంత కుటుంబంతో కలిసి సురక్షితంగా ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నట్లు అనిపిస్తుంది.” మీకు కూడా అలాగే అనిపిస్తుందా?
13. హెబ్రీయులు 11:13లో మనకు ఏ ప్రాముఖ్యమైన పాఠం ఉంది?
13 పూర్వకాలంలోని దేవుని సేవకులకున్న మరో లక్షణాన్ని కూడా మనం అనుకరించవచ్చు. అదేమిటంటే, వాళ్లు తమ చుట్టూ ఉన్న ప్రజలకు భిన్నంగా ఉన్నారు. మనం మొదటి పేరాలో చూసినట్లు వాళ్లు, ‘భూమ్మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకున్నారు.’ (హెబ్రీ. 11:13) ఇతరులకు భిన్నంగా ఉండాలని మీరు గట్టిగా నిర్ణయించుకున్నారా? అలా ఉండడం అన్నివేళలా సులభం కాదు. కానీ దేవుని సహాయంతో, తోటి క్రైస్తవుల మద్దతుతో మీరలా ఉండవచ్చు. మీరు ఒంటరిగా లేరనే విషయాన్ని గుర్తుంచుకోండి. యెహోవాను సేవించాలనుకునే వాళ్లందరూ ఓ పోరాటంలో ఉన్నారు. (ఎఫె. 6:12) అయితే యెహోవాపై నమ్మకం ఉంచి, ఆయనను మన నివాస స్థలముగా చేసుకుంటే మనం ఆ పోరాటంలో విజయం సాధించవచ్చు.
14. యెహోవా సేవకులు ఏ “పట్టణము” కోసం ఎదురుచూశారు?
14 అబ్రాహాములా బహుమానంపై దృష్టి నిలపడం కూడా ప్రాముఖ్యమే. (2 కొరిం. 4:18) “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునైయున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (హెబ్రీ. 11:10) మెస్సీయ రాజ్యమే “ఆ పట్టణము.” అయితే, అబ్రాహాము ఆ “పట్టణము” కోసం వేచి ఉండాల్సి వచ్చింది. ఒక విధంగా చూస్తే మనమలా వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఆ రాజ్యపరిపాలన పరలోకంలో మొదలైంది. అంతేకాక, త్వరలోనే అది భూమ్మీద పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పేందుకు మన చుట్టూ ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆ రాజ్యం నిజమైనదని మీరు నమ్ముతున్నారా? మీ జీవితాన్ని, ప్రస్తుత లోకం విషయంలో మీకున్న అభిప్రాయాన్ని, మీ ప్రాధాన్యతలను ఆ రాజ్యానికి అనుగుణంగా మలచుకుంటున్నారా?—2 పేతురు 3:11, 12 చదవండి.
అంతం సమీపిస్తుండగా మన నిజమైన “నివాస స్థలము”
15. ప్రస్తుత లోకం మీద నమ్మకం పెట్టుకునే ప్రజల భవిష్యత్తు ఏమిటి?
15 సాతాను లోకాంతం సమీపిస్తుండగా “వేదనలు” మరింత పెరుగుతాయి. (మత్త. 24:7, 8) మహాశ్రమల కాలంలో పరిస్థితులు ఖచ్చితంగా దారుణంగా తయారౌతాయి. ప్రపంచంలోని ఆయా వ్యవస్థలు కుప్పకూలి, ప్రజలు తమ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతారు. (హబ. 3:16, 17) ఏమి చేయాలో పాలుపోక, వాళ్లు ఒక విధంగా “కొండ గుహలలోను, బండల సందులలోను” దాక్కుంటారు. (ప్రక. 6:15-17) అయితే నిజమైన కొండగుహలు గానీ కొండలా కనిపించే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు గానీ ఆశ్రయాన్ని కల్పించలేవు.
16. క్రైస్తవ సంఘాన్ని మనం ఎలా ఎంచాలి? ఎందుకు?
16 అయితే యెహోవా ప్రజలు మాత్రం తమ నిజమైన ‘నివాస స్థలములో’ సురక్షితంగా ఉంటారు. హబక్కూకు ప్రవక్తలాగే వాళ్లు, ‘యెహోవాయందు ఆనందిస్తారు, తమ రక్షణకర్తయైన దేవునియందు సంతోషిస్తారు.’ (హబ. 3:18) అయితే ఆ అల్లకల్లోల సమయంలో యెహోవా ఏయే విధాలుగా నిజమైన “నివాస స్థలము” అవుతాడు? దానికోసం మనం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం నిజం: విడుదలై వస్తున్న సమయంలో క్రమబద్ధంగా వచ్చిన ఇశ్రాయేలీయుల్లా, “గొప్ప సమూహము” కూడా దేవుని నిర్దేశానికి లోబడుతూ చక్కని వ్యవస్థీకరణ కలిగి ఉంటుంది. (ప్రక. 7:9; నిర్గమకాండము 13:18 చదవండి.) ఆ సమయంలో దేవుడు ఇచ్చే నిర్దేశం బహుశా సంఘం ద్వారానే రావచ్చు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది సంఘాలకు, యెషయా 26:21 ప్రవచిస్తున్న సురక్షితమైన ‘అంతఃపురములతో’ సంబంధం ఉందనిపిస్తోంది. (చదవండి.) క్రైస్తవ కూటాల్ని మీరు అమూల్యంగా ఎంచుతున్నారా? సంఘ ఏర్పాటు ద్వారా యెహోవా ఇస్తున్న నిర్దేశాన్ని తూ.చా. తప్పకుండా పాటిస్తున్నారా?—హెబ్రీ. 13:17.
17. మరణించిన తన నమ్మకమైన సేవకులకు కూడా యెహోవా నిజమైన ‘నివాస స్థలముగా’ ఉన్నాడని ఎలా చెప్పవచ్చు?
17 మహాశ్రమలు రాకముందే చనిపోయే నమ్మకమైన సేవకులు కూడా తమ నిజమైన ‘నివాస స్థలముగా’ ఉన్న యెహోవా జ్ఞాపకంలో సురక్షితంగా ఉంటారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? తన నమ్మకమైన సేవకులు చనిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలకు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను . . . అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను.” (నిర్గ. 3:6) మొదటి శతాబ్దంలో యేసు అవే మాటల్ని ఉల్లేఖించి ఇలా అన్నాడు: “ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారు.” (లూకా 20:37, 38) అవును, మరణించిన తన నమ్మకమైన సేవకులు యెహోవా దృష్టిలో ఇంకా సజీవంగానే ఉన్నారు. వాళ్లు తప్పక పునరుత్థానం అవుతారు.—ప్రసం. 7:1.
18. నూతనలోకంలో యెహోవా ఎలా ఓ ప్రత్యేకమైన రీతిలో నిజమైన “నివాస స్థలము” అవుతాడు?
18 అతిత్వరలోనే రాబోయే నూతనలోకంలో యెహోవా మరో విధంగా కూడా నిజమైన “నివాస స్థలము” అవుతాడు. ప్రకటన 21:3 ఇలా చెబుతోంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును.” ప్రారంభ దశలో, యెహోవా తన ప్రతినిధియైన క్రీస్తుయేసు ద్వారా భూనివాసులతో కలిసి ఉంటాడు. భూమి విషయంలో దేవుడు ఉద్దేశించినవన్నీ యేసు పూర్తిగా నెరవేర్చి వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో రాజ్యాన్ని తన తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరిం. 15:28) ఆ తర్వాత, పరిపూర్ణులైన మానవులకు యేసు మధ్యవర్తిత్వం అవసరం ఉండదు. అప్పుడు యెహోవా వాళ్లతో ఉంటాడు. ఎంత ఉజ్వలమైన భవిష్యత్తు! అయితే అవన్నీ జరిగేలోపు, మనం పూర్వకాలంలోని నమ్మకమైన సేవకుల్లా ఉండడానికి శాయశక్తులా కృషిచేస్తూ యెహోవాను నిజమైన ‘నివాస స్థలముగా’ చేసుకుందాం.