కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు—మరి మీరు?

ఎలీషా అగ్ని రథాల్ని చూశాడు—మరి మీరు?

సిరియా రాజు దేవుని ప్రవక్తయైన ఎలీషాను పట్టుకోవడానికి చూస్తున్నాడు. చివరకు ఎలీషా, ప్రహరి గోడలున్న దోతాను అనే ఎత్తైన పట్టణంలో ఉన్నాడని రాజు తెలుసుకున్నాడు. రాత్రికల్లా సిరియా రాజు గుర్రాల్ని, యుద్ధ రథాల్ని, సైనిక దళాల్ని దోతానుకు పంపించాడు. తెల్లవారేలోపు ఆయన సైన్యాలు పట్టణపు నలుదిశల చుట్టుముట్టాయి.—2 రాజు. 6:13, 14.

ఎలీషా పనివాడు లేచి బయటకు వెళ్లినప్పుడు, ప్రవక్తను చెరపట్టుకుపోవడానికి వచ్చిన సైన్యాన్ని చూశాడు. “అంతట అతని పనివాడు—అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదము” అని అన్నాడు. అందుకు ఎలీషా “భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి” ఇలా ప్రార్థించాడు: “యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుము.” ఆ వెంటనే జరిగిన దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.” (2 రాజు. 6:15-17) ఎలీషా జీవితంలో జరిగిన ఈ సంఘటన నుండి, అలాగే ఇతర సంఘటనల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

ఎలీషా యెహోవా మీద నమ్మకముంచాడు, దేవుని రక్షణ శక్తి పనిచేయడాన్ని చూశాడు కాబట్టి సిరియన్ల ముట్టడికి ఏమాత్రం జడియకుండా ప్రశాంతంగా ఉన్నాడు. నేడు, అలాంటి అద్భుతాలు జరగాలని మనం ఆశించడం లేదు కానీ, యెహోవా తన ప్రజల్ని ఓ గుంపుగా కాపాడుతున్నాడని మనం గుర్తిస్తున్నాం. ఓ విధంగా మన చుట్టూ కూడా అగ్ని గుర్రాలు, రథాలు ఉన్నాయి. మన విశ్వాస నేత్రాలతో వాటిని ‘చూస్తే,’ ఎల్లవేళలా దేవుని మీద ఆధారపడితే మనం “సురక్షితముగా” ఉంటాం, యెహోవా ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. (కీర్త. 4:8) ఎలీషా జీవితంలో జరిగిన ఇతర సంఘటనల నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో చూద్దాం.

ఎలీషా ఏలీయాకు సేవకునిగా పనిచేయనారంభించాడు

ఓ సందర్భంలో ఎలీషా పొలం దున్నుతుండగా, ఏలీయా ప్రవక్త వచ్చి తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. దాని అర్థం ఏంటో ఎలీషాకు తెలుసు. అప్పుడు ఎలీషా విందు చేయించి, వాళ్ల అమ్మానాన్నలకు వీడ్కోలు చెప్పి ఏలీయాకు సేవకునిగా పనిచేసేందుకు ఇంటి నుండి వచ్చేశాడు. (1 రాజు. 19:16, 19-21) యెహోవాను సాధ్యమైనంత ఎక్కువగా సేవించడం కోసం ఎలీషా వెంటనే సుముఖత చూపించినందుకు, ఆయన యెహోవా చేతిలో ఓ పనిముట్టు అయ్యి, కొన్నేళ్లకు ఏలీయాకు మారుగా ప్రవక్త అయ్యాడు.

ఏలీయా దగ్గర ఎలీషా బహుశా ఆరేళ్లు పనిచేసి ఉండవచ్చు. ఎలీషా ఆ సమయంలో, “ఏలీయా చేతులమీద నీళ్లుపోయుచు” వచ్చాడు. (2 రాజు. 3:11) ఆ రోజుల్లో, సాధారణంగా భోజనం తర్వాత ఓ పనివాడు వచ్చి యజమాని చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసేవాడు. దాన్నిబట్టి చూస్తే, ఎలీషా చేసిన పనుల్లో ఓ పనివాడు చేసే పనులు కూడా ఉన్నాయని అర్థమౌతోంది. అయినా, ఏలీయాకు సేవకునిగా ఉండడాన్ని ఎలీషా ఓ గొప్ప అవకాశంగా భావించాడు.

నేడు, ఎలీషాలాగే చాలామంది క్రైస్తవులు వివిధ రకాల పూర్తికాల సేవలో అడుగుపెడుతున్నారు. విశ్వాసంతో, యెహోవా సేవలో తమ శక్తిసామర్థ్యాల్ని సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించాలనే కోరికతో వాళ్లు అలా ముందుకు వస్తున్నారు. పూర్తికాల సేవలోని కొన్ని నియామకాల్లో ఇంటికి దూరంగా ఉండి చేయాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు బెతెల్‌ సేవ చేయడం, నిర్మాణ పనుల్లో పాల్గొనడం వంటివి ఇంటికి దూరంగా ఉండి చేసేవే. అలాంటి సేవావకాశాల్ని చాలామంది చులకనగా చూడవచ్చు. కానీ, అలాంటి సేవను ఏ క్రైస్తవుడూ చిన్నచూపు చూడకూడదు లేదా తక్కువచేసి మాట్లాడకూడదు. ఎందుకంటే, యెహోవా వాటిని ఎంతో గొప్పగా ఎంచుతున్నాడు.—హెబ్రీ. 6:10.

ఎలీషా తన నియామకంలో చివరివరకూ కొనసాగాడు

“యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు” కొనిపోక ముందు ఏలీయా ప్రవక్తను గిల్గాలు నుండి బేతేలుకు పంపించాడు. తనతోపాటు రావద్దని ఏలీయా ఎలీషాకు చెప్పాడు. కానీ ఎలీషా, “నేను నిన్ను విడువను” అన్నాడు. వాళ్ల ప్రయాణం సాగుతుండగా, ఇంకా రెండుసార్లు ఏలీయా ఎలీషాను ఆగిపొమ్మన్నా, ఎలీషా వినకుండా ఏలీయాతోనే ఉన్నాడు. (2 రాజు. 2:1-6) నయోమితోనే ఉండిపోయిన రూతులా ఎలీషా ఏలీయాతోనే ఉండిపోవాలని చూశాడు. (రూతు 1:8, 16, 17) ఎందుకు? ఏలీయాకు పరిచారం చేయడానికి దేవుడు తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ఎలీషా అమూల్యమైనదిగా ఎంచాడని తెలుస్తోంది.

ఎలీషా మనకు చక్కని ఆదర్శాన్ని ఉంచాడు. దేవుని సంస్థలో మనం ఏదైనా సేవావకాశం పొందినప్పుడు, మనం యెహోవాను సేవిస్తున్నామని గుర్తుంచుకుంటే, దాన్ని అమూల్యమైనదిగా ఎంచుతాం. అంతకు మించిన గౌరవం ఇంకొకటి ఉండదు.—కీర్త. 65:4; 84:10.

‘నీ కోసం నేనేమి చేయాలో అడుగు’

ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎలీషాతో ఏలీయా ఇలా అన్నాడు: “నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుము.” అంతకుముందు సొలొమోను కోరినట్లే, ఎలీషా కూడా దేవుని సేవ మరింత మెరుగ్గా చేయడానికి సంబంధించిన దాన్నే కోరాడు. “నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుము” అని ఎలీషా ఏలీయాను అడిగాడు. (1 రాజు. 3:5, 9; 2 రాజు. 2:9) ఇశ్రాయేలులో, ఇంట్లో పెద్ద కుమారునికి ఆస్తిలో రెండు పాళ్లు ఇవ్వాల్సి ఉండేది. (ద్వితీ. 21:15-17) ఒక విధంగా, ఏలీయాకు ఆధ్యాత్మిక వారసునిగా తనను గుర్తించాలని ఎలీషా కోరాడు. అంతేకాక, “యెహోవాకొరకు మహా రోషముగల” వానిగా ఏలీయా చూపించిన ధైర్యాన్నే చూపించాలన్న కోరిక ఎలీషాకు ఉందని తెలుస్తోంది.—1 రాజు. 19:13, 14.

ఎలీషా అడిగిన దానికి ఏలీయా ఎలా స్పందించాడు? ఏలీయా ప్రవక్త ఇలా అన్నాడు: “నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవును.” (2 రాజు. 2:10) ఏలీయా ఇచ్చిన జవాబుకు రెండు పార్శ్వాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటిది, ఎలీషా తాను కోరింది పొందుతాడా లేదా అన్నది నిర్ణయించేది యెహోవాయే. రెండవది, ఒకవేళ ఎలీషా దాన్ని పొందితే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఏలీయాతో ఉంటాననే తన దృఢ నిశ్చయాన్ని ఎలీషా కాపాడుకోవాలి.

ఎలీషా ఏమి చూశాడు?

ఏలీయా “ఆత్మలో రెండుపాళ్లు” కావాలనే ఎలీషా కోరికను యెహోవా ఎలా దృష్టించాడు? ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “వారు ఇంక వెళ్లుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుఱ్ఱములును కనబడి వీరిద్దరిని వేరు చేసెను; అప్పుడు ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను,” అయితే ‘ఎలీషా అదంతా చూశాడు.’ a అది ఎలీషా కోరిన దానికి యెహోవా ఇచ్చిన జవాబు. యెహోవా ఏలీయాను తన దగ్గర నుండి తీసుకెళ్లిపోవడాన్ని ఎలీషా కళ్లారా చూశాడు, ఆ తర్వాత ఏలీయా ఆత్మలో రెండుపాళ్లు పొంది, ఏలీయాకు ఆధ్యాత్మిక వారసుడయ్యాడు.—2 రాజు. 2:11-14.

ఏలీయా వెళ్తుండగా కిందపడిన ఆయన దుప్పటిని ఎలీషా తీసుకొని తన మీద వేసుకున్నాడు. ఆ దుప్పటితో ఆయన దేవుని ప్రవక్తగా గుర్తింపు పొందాడు. ఎలీషా అద్భుతరీతిలో యొర్దాను నదిని రెండు పాయలుగా చేసినప్పుడు యెహోవా ఆయనను ప్రవక్తగా నియమించాడనేందుకు అదనపు రుజువు దొరికింది.

సుడిగాలిలో ఏలీయా ఆరోహణమైనప్పుడు చూసిన దృశ్యం నిశ్చయంగా ఎలీషా మీద చెరగని ముద్ర వేసింది. ఎందుకంటే, అది ప్రతీరోజు కనిపించే దృశ్యం కాదు కదా! తాను కోరిన దాన్ని యెహోవా ఆమోదించాడనేందుకు అవి అదనపు రుజువులు. దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చినప్పుడు మనకు అగ్నిజ్వాలతో కూడిన యుద్ధ రథం, అగ్ని గుర్రాలు కనిపించవు. కానీ, తన చిత్తం నెరవేర్చడానికి యెహోవా గొప్ప శక్తిని ఉపయోగిస్తాడని మనం గుర్తించగలుగుతాం. యెహోవా తన సంస్థలోని భూభాగాన్ని దీవించడాన్ని మనం గమనించినప్పుడు, ఒక విధంగా మనం పరలోక రథం దూసుకెళ్లడాన్ని ‘చూస్తాం.’—యెహె. 10:9-13.

ఎలీషా జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలు యెహోవాకున్న అద్భుత శక్తి మీద ఆయనకున్న నమ్మకాన్ని దృఢపర్చాయి. నిజానికి, ఏలీయా చేసిన అద్భుతాలకు రెండింతల అద్భుతాల్ని అంటే 16 అద్భుతాల్ని చేసేందుకు దేవుని పరిశుద్ధాత్మ ఎలీషా ప్రవక్తను సమర్థుణ్ణి చేసింది. b ఈ ఆర్టికల్‌ ఆరంభంలో ప్రస్తావించినట్లుగా సిరియన్లు దోతానును మట్టడించిన సందర్భంలోనే ఎలీషా రెండవమారు అగ్ని గుర్రాల్ని, యుద్ధ రథాల్ని చూశాడు.

ఎలీషా యెహోవా మీద నమ్మకం ఉంచాడు

దోతానులో తనను శత్రువులు చుట్టుముట్టినా ఎలీషా ఏమాత్రం జడియకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా మీద ఆయన బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడు. మనకు కూడా అలాంటి బలమైన విశ్వాసం అవసరం. కాబట్టి విశ్వాసాన్ని, అలాగే ఆత్మఫలంలోని ఇతర లక్షణాల్ని చూపించేలా తన పరిశుద్ధాత్మను ఇవ్వమని మనం యెహోవాకు ప్రార్థిద్దాం.—లూకా 11:13; గల. 5:22, 23.

దోతానులో జరిగిన సంఘటన యెహోవా మీద, సంరక్షణను ఇచ్చే ఆయన అదృశ్య సైన్యాల మీద నమ్మకం ఉంచడానికి కూడా ఎలీషాకు సహాయం చేసింది. తానున్న పట్టణాన్ని, ముట్టడి చేయడానికి వచ్చిన సైన్యాన్ని చుట్టుముట్టడానికి యెహోవాయే తన దూతల్ని పంపాడని ఎలీషా ప్రవక్త గుర్తించాడు. శత్రువులకు అంధత్వం కలుగజేసి, దేవుడు ఎలీషాను, ఆయన సేవకుణ్ణి అద్భుతరీతిలో కాపాడాడు. (2 రాజు. 6:17-23) ఎప్పటిలాగే ఆ క్లిష్ట సమయంలో ఎలీషా యెహోవాపై విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని కనబర్చాడు.

ఎలీషాలానే మనం కూడా యెహోవా దేవుని మీద నమ్మకం ఉంచుదాం. (సామె. 3:5, 6) అలాచేస్తే, ‘దేవుడు మనల్ని కరుణించి, ఆశీర్వదిస్తాడు.’ (కీర్త. 67:2) నిజమే, మన చుట్టూ అక్షరార్థమైన అగ్ని రథాలు, గుర్రాలు లేవు. కానీ, రాబోయే “మహాశ్రమల” కాలంలో ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో భాగంగా ఉన్న మనల్ని యెహోవా ఓ గుంపుగా కాపాడతాడు. (మత్త. 24:21; ప్రక. 7:9, 14) అప్పటివరకు, “దేవుడు మనకు ఆశ్రయము” అని మనం ఎల్లవేళలా గుర్తుంచుకుందాం.—కీర్త. 62:8.

a యెహోవా, ఆయన ఆత్మ కుమారులైన దూతలు ఉండే పరలోకానికి ఏలీయా వెళ్లలేదు. కావలికోట సెప్టెంబరు 15, 1997 సంచికలోని 15వ పేజీ చూడండి.