పయినీరు సేవ దేవునితో మనకున్న బంధాన్ని బలపరుస్తుంది
“దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది.”—కీర్త. 147:1.
1, 2. (ఎ) మనం ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
మనం ప్రేమించే వాళ్ల గురించి ఆలోచించడం, మాట్లాడడం వాళ్లతో మనకున్న బంధాన్ని బలపరుస్తుంది. యెహోవా దేవునితో మనకున్న బంధం విషయంలో కూడా అది నిజం. దావీదు గొర్రెలను కాస్తూ ఎన్నో రాత్రులు నక్షత్రాలతో నిండిన ఆకాశం వైపు చూస్తూ, సాటిలేని సృష్టికర్త గురించి ధ్యానించాడు. ఆయనిలా రాశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?” (కీర్త. 8:3, 4) ఆధ్యాత్మిక ఇశ్రాయేలు విషయంలో యెహోవా సంకల్పం అద్భుత రీతిలో నెరవేరుతుండడం గురించి ఆలోచించిన తర్వాత అపొస్తలుడైన పౌలు ఆశ్చర్యంతో, “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము” అని అన్నాడు.—రోమా. 11:17-26, 33.
2 పరిచర్యలో పాల్గొన్నప్పుడు మనం యెహోవా గురించి ఆలోచిస్తాం, మాట్లాడతాం. అదే మనకు ఎన్నో ప్రయోజనాలను తెస్తుంది. పూర్తికాల పరిచర్యలో ఉన్న చాలామంది రాజ్య సేవలో ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల దేవునిపై తమకున్న ప్రేమ అధికమైందని చెబుతారు. మీరు ప్రస్తుతం పూర్తికాల సేవలో ఉన్నా లేదా ఆ గమ్యం వైపుగా పయనిస్తున్నా ఈ విషయం గురించి ఆలోచించండి: పూర్తికాల పరిచర్య యెహోవాతో మీకున్న బంధాన్ని ఎలా బలపరుస్తుంది? మీరు పయినీరైతే ఇలా ప్రశ్నించుకోండి, ‘ఎన్నో ప్రయోజనాలను ఇచ్చే ఈ సేవలో కొనసాగాలంటే నేను ఏమి చేయాలి?’ మీరు ఒకవేళ పయినీరు కాకపోతే, ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ సేవను మొదలుపెట్టడానికి నాకు ఎలాంటి సర్దుబాట్లు అవసరం?’ పూర్తికాల సేవ ఏయే విధాలుగా యెహోవాతో మనకున్న బంధాన్ని బలపరుస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
పూర్తికాల సేవ, యెహోవాతో మనకున్న బంధం
3. పరిచర్యలో, రాబోయే రాజ్యాశీర్వాదాల గురించి మాట్లాడడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?
3 రాబోయే రాజ్యాశీర్వాదాల గురించి ఇతరులతో చర్చించడం వల్ల యెహోవాకు మరింత దగ్గరౌతాం. ఇంటింటి పరిచర్యలో ఏ లేఖనం ఉపయోగించడం మీకు ఇష్టం? మీకిష్టమైన లేఖనాల్లో, కీర్తనలు 37:10, 11; దానియేలు 2:44; యోహాను 5:28, 29; లేదా ప్రకటన 21:3, 4 ఉండవచ్చు. అలాంటి వాగ్దానాల గురించి మాట్లాడిన ప్రతీసారి, యెహోవా “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఉదారంగా ఇచ్చే దేవుడని మనం గుర్తుచేసుకుంటాం. దానివల్ల మనం యెహోవాకు మరింత సన్నిహితం అవుతాం.—యాకో. 1:17.
4. ప్రజల ఆధ్యాత్మిక స్థితి చూసినప్పుడు, యెహోవా మంచితనంపై మనకున్న కృతజ్ఞత ఎందుకు పెరుగుతుంది?
4 సువార్త వినేవాళ్ల ఆధ్యాత్మిక స్థితి చూసినప్పుడు, సత్యం పట్ల మనకున్న కృతజ్ఞత పెరుగుతుంది. జీవితంలో విజయం సాధించడానికి, సంతోషంగా ఉండడానికి ఏమి కావాలో తెలియని స్థితిలో లోకంలోని ప్రజలు ఉన్నారు. భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఎలాంటి ఆశ లేకుండా చాలామంది జీవిస్తున్నారు. వాళ్లు జీవితానికి అర్థాన్ని వెదుకుతున్నారు. దేవునిపై నమ్మకం ఉన్న చాలామందికి కూడా లేఖనాల పరిజ్ఞానం అంతగా లేదు. వాళ్లు దాదాపుగా ప్రాచీన కాల నీనెవె పట్టణపు ప్రజల్లానే ఉన్నారు. (యోనా 4:11 చదవండి.) పరిచర్యలో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆధ్యాత్మిక పరిస్థితి విషయంలో, యెహోవా ప్రజలకూ మిగతావాళ్లకూ మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూస్తాం. (యెష. 65:13) మనం యెహోవా మంచితనాన్ని గుర్తుచేసుకుంటాం. ఎందుకంటే, ఆయన మన ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడంతోపాటు ఆధ్యాత్మిక సేదదీర్పును, నిజమైన నిరీక్షణను పొందమని అందరినీ ఆహ్వానిస్తున్నాడు.—ప్రక. 22:17.
5. ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్నప్పుడు మనం మన సమస్యల గురించి ఎలా భావిస్తాం?
5 ఇతరులకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తే, మనం సొంత సమస్యలతో ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండగలుగుతాం. ఆ విషయం వాస్తవమని త్రిష అనే పయినీరు తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు గ్రహించింది. “నన్ను మానసికంగా ఎంతో కృంగదీసిన సంఘటన అది” అని ఆమె అంది. ఓ రోజు ఆమె ఎంతో బాధలో ఉండి ఇంట్లోనే ఉండిపోవాలనుకుంది, కానీ ముగ్గురు పిల్లలతో తను చేస్తున్న బైబిలు అధ్యయనానికి వెళ్లింది. ఆ పిల్లలకున్న కష్టాలు అన్నీఇన్నీ కావు, వాళ్ల తండ్రి వాళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయాడు, వాళ్ల పెద్ద అన్న వాళ్లను కొట్టేవాడు. త్రిష ఇలా అంది: “వాళ్లు అనుభవించే బాధలు, కష్టాలతో పోలిస్తే నాది అసలు సమస్యే కాదు. నేను వాళ్లతో అధ్యయనం చేసేటప్పుడు ఆ పిల్లల కళ్లు ఉత్తేజంతో, ఆనందంతో మెరిసిపోయాయి. ఆ రోజు నేనున్న పరిస్థితిలో, ఆ పిల్లలు యెహోవా ఇచ్చిన బహుమానాలుగా నాకు కనిపించారు.”
6, 7. (ఎ) బైబిలు సత్యాలను బోధించినప్పుడు మన విశ్వాసం ఎలా బలపడుతుంది? (బి) మన విద్యార్థులు బైబిలు సూత్రాలను పాటిస్తూ జీవితాలను మెరుగుపర్చుకోవడం చూసినప్పుడు మనమెలా భావిస్తాం?
6 బైబిలు సత్యాలను బోధించడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది. ఇతరులకు బోధించే వాటిని పాటించని తన కాలం నాటి కొంతమంది యూదుల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా?” (రోమా. 2:21) వాళ్లకూ నేటి పయినీర్లకూ ఎంత తేడా ఉందో కదా! సాధారణంగా, ఇతరులకు సత్యాన్ని బోధించి, వాళ్లతో బైబిలు అధ్యయనం చేయడానికి పయినీర్లకు చాలా అవకాశాలు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా చేయాలంటే వాళ్లు ముందుగానే బాగా సిద్ధపడి, విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జవాబివ్వడానికి పరిశోధన కూడా చేయాల్సివుంటుంది. జానీన్ అనే పయినీరు ఇలా అంది: “ఇతరులకు సత్యాన్ని బోధించే ప్రతీసారి ఆ సత్యం నా మనసులో, హృదయంలో చెరగని ముద్ర వేస్తున్నట్లుగా నాకనిపిస్తుంది. ఫలితంగా, నా విశ్వాసం అంతకంతకూ పెరుగుతూ ఉంది.”
7 మన విద్యార్థులు బైబిలు సూత్రాలను పాటిస్తూ జీవితాలను మెరుగుపర్చుకోవడం చూసినప్పుడు, దేవుని జ్ఞానంపై మన కృతజ్ఞత పెరుగుతుంది. (యెష. 48:17, 18) దానివల్ల, మన జీవితంలో కూడా ఆ సూత్రాల్ని పాటిస్తూ ఉండాలని మరింత గట్టిగా నిర్ణయించుకుంటాం. ఏడ్రీయాన అనే మరో పయినీరు ఇలా చెప్పింది: “ప్రజలు తమ సొంత జ్ఞానంపై ఆధారపడితే వాళ్ల జీవితాలు అస్తవ్యస్తంగా తయారౌతాయి. కానీ, వాళ్లు యెహోవా జ్ఞానంపై ఆధారపడడం మొదలుపెట్టినప్పుడు ప్రయోజనాలు వెంటనే కనిపిస్తాయి.” అదేవిధంగా, ఫిల్ అనే సహోదరుడు ఇలా అన్నాడు: “తమ జీవితాల్ని మార్చుకోవాలని ఎంతో ప్రయత్నించి విఫలమైన ప్రజల్ని యెహోవా ఎలా మారుస్తాడో మీరు చూస్తారు.”
8. పరిచర్యలో మంచి సహవాసులతో పనిచేసినప్పుడు ఎలాంటి ప్రయోజనం పొందుతాం?
8 పరిచర్యలో మంచి సహవాసులతో పనిచేసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలపడతాం. (సామె. 13:20) చాలామంది పయినీర్లు తోటి సువార్తికులతో కలిసి పరిచర్యలో ఎక్కువ సమయం గడుపుతారు. అలా చేయడం వల్ల ఒకరి నుండి ఒకరు “ఆదరణ” పొందే ఎన్నో అవకాశాలు ఉంటాయి. (రోమా. 1:11, 12; సామెతలు 27:17 చదవండి.) లీసా అనే పయినీరు ఇలా అంది: “పని స్థలంలో తరచుగా పోటీతత్వం, అసూయలు ఉంటాయి. ప్రతీరోజు మీరు ఎన్నో పుకార్లను, అసభ్యకరమైన మాటలను వినాల్సివస్తుంది. ఏమి చేసైనా సరే జీవితంలో పైకి ఎదగాలన్నదే వాళ్ల లక్ష్యం. కొన్నిసార్లు, మీ క్రైస్తవ ప్రవర్తనను బట్టి ఎగతాళికి, వెక్కిరింపులకు గురౌతారు. కానీ, పరిచర్యలో తోటి క్రైస్తవులతో పనిచేసినప్పుడు నిజంగా ఉపశమనాన్ని పొందుతాం. సాయంత్రానికల్లా నేనెంత అలసిపోయినా, పరిచర్య నుండి ఇంటికివచ్చే సరికి చాలా సేదదీర్పుగా ఉంటుంది.”
9. భార్యాభర్తలు కలిసి పయినీరు సేవ చేయడం వల్ల వాళ్ల వివాహ జీవితానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
9 మీ భాగస్వామితో కలిసి పయినీరు సేవ చేయడం వల్ల, మీ వివాహ బంధం బలపడుతుంది. (ప్రసం. 4:12) తన భర్తతోపాటు పయినీరు సేవచేస్తున్న మాడలన్ అనే సహోదరి ఇలా అంది: “నేనూ నా భర్తా, ఆ రోజు పరిచర్య ఎలా జరిగిందనే విషయం గురించి లేదా మేము చదివే బైబిలు పఠనంలో పరిచర్యకు ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడుకుంటాం. పయినీరు సేవలో ఒక్కో సంవత్సరం గడిచే కొద్ది మేము మరింత దగ్గరౌతున్నాం.” అదేవిధంగా, త్రిష ఇలా అంది: “మేము అప్పులపాలు కాకుండా జాగ్రత్తపడతాం. కాబట్టి, డబ్బు గురించి అనవసరంగా గొడవపడం. మా ఇద్దరి పట్టిక ఒకటే, మేము పునర్దర్శనాలకు, బైబిలు అధ్యయనాలకు కలిసే వెళ్తాం. దానివల్ల మా వివాహ బంధం ఎంతో బలపడింది.”
10. రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చి, యెహోవా మద్దతును అనుభవించినప్పుడు ఆయనపై మనకున్న నమ్మకం ఏమౌతుంది?
10 రాజ్యసంబంధ విషయాలను ముందుంచినప్పుడు, యెహోవా మద్దతును అనుభవించినప్పుడు, మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చినప్పుడు యెహోవాపై మన నమ్మకం అధికమౌతుంది. కొంతమేరకు, నమ్మకమైన క్రైస్తవులందరి విషయంలో అది నిజం. కానీ, యెహోవా మీద పూర్తిగా ఆధారపడడం వల్లే పయినీరు సేవలో కొనసాగడం తమకు సాధ్యమౌతుందని చాలామంది ఒప్పుకుంటారు. (మత్తయి 6:30-34 చదవండి.) కర్ట్ అనే సహోదరుడు పయినీరుగా, ప్రత్యామ్నాయ ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్నాడు. తన ఇంటి నుండి రెండున్నర గంటల ప్రయాణ దూరంలో ఉన్న ఓ సంఘాన్ని సందర్శించడానికి ఆయన ఒప్పుకున్నాడు. ఆయనా, ఆయన భార్యా ఇద్దరూ పయినీర్లే, అయితే వాళ్ల కారులో ఆ సంఘానికి వెళ్లడానికి సరిపోయేంత పెట్రోలు మాత్రమే ఉంది కానీ, తిరిగి రావడానికి లేదు. పైగా, జీతం రావాలంటే వారం రోజులు ఆగాలి. కర్ట్ ఇలా అన్నాడు: “‘నేను సరైన నిర్ణయాన్నే తీసుకున్నానా?’ అని నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను.” బాగా ప్రార్థించి ఆలోచించిన తర్వాత, దేవుడు తమ అవసరాలను చూసుకుంటాడనే నమ్మకంతో వాళ్లు అక్కడకు వెళ్లాలనుకున్నారు. వాళ్లు ఇక బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఓ సహోదరి ఫోన్ చేసి ఓ బహుమానం తెస్తున్నానని చెప్పింది. వాళ్ల పూర్తి ప్రయాణానికి సరిగ్గా సరిపోయేంత డబ్బే ఆ బహుమానం. కర్ట్ ఇలా అంటున్నాడు: “ఇలాంటి అనుభవాలు తరచుగా ఎదురైనప్పుడు, యెహోవా సహాయం మనకు ఉందని అర్థమౌతుంది.”
11. పయినీర్లు అనుభవించే కొన్ని ఆశీర్వాదాలు ఏమిటి?
11 అవును, యెహోవా సేవను ఎక్కువగా చేస్తూ, ఆయనకు మరింత సన్నిహితమవ్వడానికి కృషి చేయడం వల్ల తమకు యెహోవా విస్తారమైన ఆశీర్వాదాలు ‘ప్రాప్తిస్తాయి’ అని పయినీర్లు గ్రహిస్తారు. (ద్వితీ. 28:2) అయితే, పయినీరు సేవలో కూడా సవాళ్లు ఉన్నాయి. ఆదాము తిరుగుబాటు వల్ల వచ్చిన కష్టాలను మానవులందరూ పడాల్సిందే. ఏవో సమస్యల వల్ల తమ పయినీరు సేవను కొంతకాలంపాటు ఆపేయాలని కొంతమంది పయినీర్లకు అనిపిస్తుంది, కానీ అలాంటి సమస్యలు చాలావరకు తట్టుకోవచ్చు లేదా రాకుండ చూసుకోవచ్చు. ఈ ప్రత్యేక సేవలో కొనసాగడానికి పయినీర్లకు ఏది తోడ్పడుతుంది?
పూర్తికాల సేవలో కొనసాగండి
12, 13. (ఎ) ఓ పయినీరుకు గంటలను పూర్తిచేయడం కష్టంగా ఉంటే ఏమి చేయాలి? (బి) ప్రతీరోజు బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం చేయడం, ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం?
12 చాలామంది పయినీర్లు ఎంతో బిజీగా ఉంటారు. అన్ని పనులు సవ్యంగా చేయడం అంటే వాళ్లకు ఓ సవాలే కాబట్టి సరైన ప్రణాళిక ఎంతో అవసరం. (1 కొరిం. 14:33, 39-40) ఓ పయినీరు తన గంటలను పూర్తిచేయలేకపోతుంటే, ఆయన తన సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడో కాస్త పరిశీలించుకోవాలి. (ఎఫె. 5:15, 16) ఆయన వీటి గురించి ఆలోచించడం మంచిది: ‘నేను వినోదం, సరదాల కోసం మరీ ఎక్కువ సమయం వెచ్చిస్తున్నానా? నేను నా పని గంటల్లో ఏవైనా సర్దుబాట్లు చేసుకోవాలా? నేను అనవసరమైనవాటి కోసం ఎక్కువ సమయం వృథా చేస్తున్నానా?’ పయినీర్లు ఎప్పటికప్పుడు అలా ప్రశ్నించుకుంటూ, కావాల్సిన మార్పులు చేసుకోవాలి.
13 పయినీర్లు ప్రతీరోజు తప్పకుండా చేసే పనుల్లో బైబిలు చదవడం, వ్యక్తిగత అధ్యయనం, ధ్యానించడం వంటివి ఉండాలి. కాబట్టి, ప్రాముఖ్యమైన ఆ పనుల కోసం కేటాయించిన సమయాన్ని అనవసరమైన వాటికి వెచ్చించకుండా ఉండాలంటే పయినీర్లకు క్రమశిక్షణ అవసరం. (ఫిలి. 1:9, 10) ఉదాహరణకు, ఓ పయినీరు రోజంతా పరిచర్య చేసి ఇంటికి వచ్చాడని ఊహించుకోండి. ఆ సాయంత్రం కూటాలకు సిద్ధపడాలని ఆయన అనుకున్నాడు. అయితే, ముందు కాసేపు ఈ-మెయిల్స్ చూసుకుందామని కంప్యూటర్ ఆన్ చేసి ఈ-మెయిల్స్ చదవడం, వాటికి జవాబివ్వడం మొదలుపెట్టాడు. తర్వాత, ఆయన కొనాలనుకుంటున్న ఓ వస్తువు ధర ఏమైనా తగ్గిందో లేదో చూద్దామని మరో వెబ్సైట్లోకి వెళ్లాడు. ఆయన గుర్తించేలోపే కంప్యూటర్ ముందు కూర్చొని దాదాపు రెండు గంటలు గడిచిపోయాయి, పైగా కూటాలకు సిద్ధపడడం అసలు మొదలేపెట్టలేదు. అలా చేయడం ఎందుకు సరైనది కాదు? పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారుడు ఆ రంగంలో ఎక్కువ కాలం రాణించాలంటే, తన శరీరం విషయంలో మంచి శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా, పయినీర్లు కూడా పూర్తికాల సేవలో కొనసాగాలంటే, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేస్తూ మంచి ఆధ్యాత్మిక ఆహారం తీసుకోవాలి.—1 తిమో. 4:16.
14, 15. (ఎ) పయినీర్లు తమ జీవితాన్ని ఎందుకు సరళంగా ఉంచుకోవాలి? (బి) కష్టాలు వచ్చినప్పుడు పయినీర్లు ఏమి చేయాలి?
14 పయినీర్లు విజయం సాధించాలంటే తమ జీవితాల్ని సరళంగా ఉంచుకోవాలి. కంటిని తేటగా ఉంచుకోమని యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. (మత్త. 6:22) యేసు తన జీవితాన్ని సరళంగా ఉంచుకున్నాడు కాబట్టే ఎలాంటి ఆటంకం లేకుండా తన పరిచర్యను పూర్తిచేయగలిగాడు. అందుకే, “నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు” అని ఆయన చెప్పగలిగాడు. (మత్త. 8:20) యేసును ఆదర్శంగా తీసుకునే పయినీర్లు, తమకు ఎక్కువ వస్తువులుంటే, వాటిని శుభ్రం చేయడం, బాగుచేయడం వంటివాటి కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి ఉంటుందని గుర్తుంచుకుంటారు.
15 పయినీరు సేవ చేసే గొప్ప అవకాశం తమ సొంత ప్రతిభ వల్ల రాలేదని పయినీర్లకు తెలుసు. మనకున్న ఏ సేవా అవకాశమైనా దేవుని కృప వల్లే వచ్చింది. కాబట్టి, పయినీరుగా కొనసాగాలంటే యెహోవాపై ఆధారపడాలి. (ఫిలి. 4:13) సమస్యలు, ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. (కీర్త. 34:19) అవి వచ్చినప్పుడు పయినీర్లు వెంటనే తమ సేవను ఆపేయకుండా, నిర్దేశం కోసం యెహోవా వైపు చూడాలి, ఆయనిచ్చే సహాయాన్ని తీసుకోవాలి. (కీర్తన 37:5 చదవండి.) అలా ప్రేమతో యెహోవా ఇచ్చే మద్దతును చవిచూసినప్పుడు, వాళ్లు యెహోవాను శ్రద్ధగల పరలోక తండ్రిగా భావించి ఆయనకు మరింత దగ్గరౌతారు.—యెష. 41:10.
మీరు పయినీరు సేవ చేయగలరా?
16. మీరు పయినీరు సేవ చేయాలనుకుంటే ఏమి చేయాలి?
16 పూర్తికాల సేవలో ఉన్నవాళ్లు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు మీకూ కావాలనుకుంటే, మీ కోరికను యెహోవాకు తెలియజేయండి. (1 యోహా. 5:14, 15) ప్రస్తుతం పయినీరు సేవచేస్తున్న వాళ్లతో మాట్లాడండి. పయినీరు అవ్వడానికి తోడ్పడే లక్ష్యాల్ని పెట్టుకోండి. కీత్, ఎరిక అదే చేశారు. తమ వయసులో ఉన్న ఇతర దంపతుల్లాగే వాళ్లు పూర్తికాల ఉద్యోగాలు చేస్తూ, పెళ్లైన కొంతకాలానికి సొంత ఇల్లు, కారు కొనుక్కున్నారు. వాళ్లు ఇలా అన్నారు: “అవన్నీ ఉంటే మేము చాలా సంతృప్తిగా ఉంటామని అనుకున్నాం, కానీ అవి మాకు అస్సలు సంతృప్తి ఇవ్వలేదు.” కీత్ ఉద్యోగం పోయిన తర్వాత సహాయ పయినీరు సేవ చేశాడు. ఆయనిలా అన్నాడు: “పరిచర్య చేయడం వల్ల ఎంత ఆనందం ఉంటుందో పయినీరు సేవ నాకు గుర్తుచేసింది.” కొన్ని రోజులకు, వాళ్లకు ఓ పయినీరు జంట స్నేహితులయ్యారు. సరళమైన జీవితాన్ని గడుపుతూ పయినీరు సేవ చేయడం ఎంత సంతోషాన్నిస్తుందో గ్రహించడానికి ఆ దంపతులు వాళ్లకు సహాయం చేశారు. మరి కీత్, ఎరిక ఏమి చేశారు? ‘మేము మా ఆధ్యాత్మిక లక్ష్యాలను ఓ పేపరు మీద రాసి ఫ్రిజ్‌పై వాటిని అంటించాము, వాటిలో ఒక్కొక్కటి చేరుకున్నాక దాని పక్కన పెన్నుతో టిక్కు పెట్టేవాళ్లం.’ కొంతకాలానికే వాళ్లు పయినీరు సేవ మొదలుపెట్టారు.
17. పయినీరు సేవ చేసేలా మీ జీవన శైలిలో లేదా రోజూ చేసే పనుల్లో కాస్త సవరింపులు చేసుకోవడం గురించి ఆలోచించడం ఎందుకు మంచిది?
17 మీరు పయినీరు సేవ చేయగలరా? మీ పరిస్థితినిబట్టి ఇప్పుడు చేయడం సాధ్యంకాకపోయినా, పరిచర్యలో పూర్తిగా పాల్గొంటూ యెహోవాతో మీకున్న సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. బాగా ప్రార్థించి ఆలోచించిన తర్వాత, బహుశా మీ జీవన శైలిలో లేదా రోజూ చేసే పనుల్లో కాస్త సవరింపులు చేసుకుంటే పయినీరు సేవ చేయవచ్చని మీకనిపించవచ్చు. మీరు పయినీరు సేవ కోసం చేసే ఏ త్యాగమైనా, ఆ సేవవల్ల వచ్చే ఆనందం ముందు చాలా చిన్నది. మీ సొంత ఇష్టాలకన్నా రాజ్య సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల కలిగే రెట్టింపు సంతృప్తి మీ సొంతమౌతుంది. (మత్త. 6:33) ఇతరులకు ఇవ్వడం వల్ల కలిగే అధిక ఆనందాన్ని మీరు రుచి చూస్తారు. దానికితోడు, యెహోవా గురించి ఆలోచించే, మాట్లాడే ఎన్నో అవకాశాలు మీకు దొరుకుతాయి. అది యెహోవాపై మీకున్న ప్రేమను పెంచుతుంది, ఆయనను సంతోషపరుస్తుంది.