కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు దాసులుగా ఉండండి

యెహోవాకు దాసులుగా ఉండండి

“ఆసక్తి విషయములో మాంద్యులు కాక . . . ప్రభువును [“యెహోవా,” NW] సేవించుడి.”రోమా. 12:11.

1. రోమీయులు 12:11 ప్రోత్సహిస్తున్న దాస్యానికి, సాధారణంగా ప్రజలు అనుకునే దాస్యానికి తేడా ఏమిటి?

 క్రైస్తవ దాస్యానికి, ప్రజలు సాధారణంగా అనుకునే ఇతర దాస్యానికి చాలా తేడా ఉంది. చాలామందికి, దాస్యం అంటే ఒకరి అధికారం కింద మగ్గిపోవడం, అణచివేతకూ అన్యాయానికీ గురవ్వడం వంటివే గుర్తొస్తాయి. కానీ ప్రేమగల ఒక యజమానికి ఇష్టపూర్వకంగా చేసే దాస్యం గురించి దేవుని వాక్యం మాట్లాడుతోంది. వాస్తవానికి అపొస్తలుడైన పౌలు యెహోవాను ‘సేవించండి’ అని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు చెప్పినప్పుడు, దేవుని మీదున్న ప్రేమతో పరిశుద్ధ సేవ చేయమని వాళ్లను ప్రోత్సహించాడు. (రోమా. 12:11) ఈ దాస్యంలో ఏమి ఉంది? మనం సాతానుకు, అతని లోకానికి దాసులం కాకుండా ఎలా తప్పించుకోవచ్చు? యెహోవాకు నమ్మకమైన దాసులుగా ఉండడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

‘నేను నా యజమానిని ప్రేమిస్తున్నాను’

2. (ఎ) ఒక ఇశ్రాయేలు దాసుడు తన స్వేచ్ఛను వదులుకోవడానికి ఏది పురికొల్పుతుంది? (బి) దాసుని చెవిని కుదురుతో గుచ్చడంలోని ప్రాముఖ్యత ఏమిటి?

2 మనం ఎలాంటి దాసులుగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో ఇశ్రాయేలీయులకు ఆయనిచ్చిన ధర్మశాస్త్రం చూస్తే అర్థమౌతుంది. ఒక హెబ్రీ దాసునికి తన దాస్యం నుండి ఏడవ సంవత్సరంలో విడుదల లభిస్తుంది. (నిర్గ. 21:2) అయితే, తన యజమానిని నిజంగా ప్రేమించి ఆయన చెంతనే ఉండాలనుకునే దాసుల కోసం దేవుడు ఒక ప్రత్యేక ఏర్పాటు చేశాడు. యజమాని ఆ దాసుణ్ణి తలుపు దగ్గరకు కాని గుమ్మం దగ్గరకు కాని తీసుకొచ్చి అతని చెవిని కుదురుతో గుచ్చాలి. (నిర్గ. 21:5, 6) ఈ ఏర్పాటులో చెవికి ముఖ్య పాత్ర ఉందని గమనించండి. హెబ్రీ భాషలో వినడానికి ఉపయోగించిన పదానికి విధేయతతో కూడా సంబంధం ఉంది. కాబట్టి అలాంటి దాసుడు తన యజమానికి ఎల్లప్పుడూ విధేయతతో సేవ చేయాలనుకుంటాడు. మనం యెహోవాకు చేసుకున్న సమర్పణ కూడా అలాంటిదే. మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తామని సమర్పణప్పుడు ఆయనకు చెబుతాం.

3. మన సమర్పణకు ఆధారమేంటి?

3 మనం బాప్తిస్మం తీసుకున్నామంటే, యెహోవా దాసునిగా ఆయనను సేవించాలని అప్పటికే నిర్ణయించుకున్నామని అర్థం. యెహోవాకు విధేయత చూపిస్తూ ఆయన చిత్తాన్ని చేయాలన్న కోరికతోనే మనం సమర్పించుకున్నాం. అలా చేయమని మనల్ని ఎవ్వరూ బలవంతపెట్టలేదు. నిజానికి, పిల్లలు కూడా తమకు తాముగా యెహోవాకు సమర్పించుకున్నాకే బాప్తిస్మం తీసుకుంటారు కాని తమ తల్లిదండ్రులను మెప్పించడానికి కాదు. మన పరలోక యజమానియైన యెహోవా మీదున్న ప్రేమే క్రైస్తవ సమర్పణకు ఆధారం. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట” అని అపొస్తలుడైన యోహాను రాశాడు.—1 యోహా. 5:3.

స్వతంత్రులమే కానీ దాసులం

4. ‘నీతికి దాసులం’ అవ్వాలంటే మనమేమి చేయాలి?

4 తనకు దాసులుగా ఉండే అవకాశాన్ని ఇచ్చినందుకు యెహోవాకు మనమెంత కృతజ్ఞులం! క్రీస్తు విమోచనా క్రయధనం మీద విశ్వాసం ద్వారా మనం పాపపు దాస్యం నుండి విడుదలవ్వగలుగుతాం. మనమింకా అపరిపూర్ణులమే అయినా యెహోవా, యేసు అధికారం కిందకు ఇష్టపూర్వకంగా వచ్చాం. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ పౌలు ఒక ప్రేరేపిత ఉత్తరంలో స్పష్టంగా ఇలా వివరించాడు: “అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.” ఆ తర్వాత ఆయనిలా హెచ్చరించాడు: “లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావునిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.” (రోమా. 6:11, 16-18) ‘హృదయపూర్వకంగా లోబడడం’ గురించి ఆయన ప్రస్తావించడాన్ని గమనించండి. వాస్తవానికి, యెహోవాకు మనం చేసుకున్న సమర్పణ మనల్ని ‘నీతికి దాసులుగా’ చేస్తుంది.

5. మనందరం ఏ అంతర్గత పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం, ఎందుకు?

5 అయితే, మన సమర్పణకు అనుగుణంగా జీవించేటప్పుడు మనకు కొన్ని అడ్డంకులు ఎదురౌతాయి. మనం రెండు రకాలైన పోరాటాలు చేయాల్సివుంటుంది. మొదటిగా, పౌలుకు ఎదురైన పోరాటమే మనకూ ఎదురౌతుంది, దాని గురించి ఆయనిలా రాశాడు: “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.” (రోమా. 7:22, 23) వారసత్వంగా వచ్చిన అపరిపూర్ణత మనలో కూడా ఉంది. ఫలితంగా, మనం కూడా శరీర కోరికలతో ఎల్లప్పుడూ పోరాడాల్సి వస్తుంది. అపొస్తలుడైన పేతురు మనకిలా ఉద్భోధించాడు: “స్వతంత్రులైయుండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, దేవునికి దాసులమని లోబడియుండుడి.”—1 పేతు. 2:16.

6, 7. ఈ లోకాన్ని సాతాను మరింత అందంగా, ఆకర్షణీయంగా ఎలా చూపిస్తున్నాడు?

6 మనం చేయాల్సిన రెండో పోరాటం, సాతాను ప్రభావం కింద ఉన్న ఈ లోకంతో చేసే పోరాటం. యెహోవాకు, యేసుకు మనం చూపించే విధేయతను తుంచేయడానికి ఈ లోక పాలకుడైన సాతాను తన ఆయుధాలను మనవైపుకు ఎక్కుపెడుతున్నాడు. మనం తన చెడు ప్రభావానికి లోనయ్యేలా శోధిస్తూ, మనల్ని తనకు దాసులుగా చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. (ఎఫెసీయులు 6:11, 12 చదవండి.) దానికోసం సాతాను ఉపయోగించే ఒక మార్గం, ఈ లోకాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా చూపించడం. అందుకే అపొస్తలుడైన యోహాను ఇలా హెచ్చరించాడు: “ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”—1 యోహా. 2:15, 16.

7 వస్తుసంపదలను బాగా సంపాదించుకోవాలనే కోరిక ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంది. డబ్బుంటేనే సంతోషంగా ఉంటామనే ఆలోచనను సాతాను ప్రోత్సహిస్తున్నాడు. పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌ కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఆస్తిపాస్తుల్ని కూడబెట్టుకుని, సుఖంగా జీవించడాన్నే వాణిజ్య ప్రకటనలు ప్రోత్సహిస్తున్నాయి. మిమ్మల్ని మీరు మైమర్చిపోయేలా చేసే ప్రాంతాలకు లోకస్థులతోపాటు వెళ్లేలా ట్రావెల్‌ ఏజన్సీలు ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. అవును, మరింత “మెరుగ్గా” జీవించమని మనం అన్నివైపుల నుండి వింటున్నాం, అయితే అది లోక ప్రమాణాలకు అనుగుణంగా ఉండే జీవితం.

8, 9. ఏ ప్రమాదం పొంచివుంది? ఎందుకు?

8 ఈ లోక ఆలోచనా తీరును అలవర్చుకున్న కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి మాట్లాడుతూ పేతురు ఇలా హెచ్చరించాడు: “ఒకనాటి సుఖానుభవము సంతోషమని యెంచుకొందురు. వారు కళంకములును నిందాస్పదములునై తమ ప్రేమవిందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు . . . వీరు వ్యర్థమైన డంబపుమాటలు పలుకుచు, తామే శరీరసంబంధమైన దురాశలుగలవారై, తప్పుమార్గమందు నడుచువారిలోనుండి అప్పుడే తప్పించుకొనినవారిని పోకిరిచేష్టలచేత మరలుకొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా.”—2 పేతు. 2:13, 18, 19.

9 “నేత్రాశ” తీర్చుకున్నంత మాత్రాన ఓ వ్యక్తి స్వేచ్ఛా జీవి అయిపోడు. బదులుగా, ఈ లోక అదృశ్య యజమానియైన సాతానుకు దాసుడౌతాడు. (1 యోహా. 5:19) వస్తుసంపదలకు దాసులవ్వడం చాలా ప్రమాదకరం, ఒక్కసారి వాటికి దాసులమైతే బయటపడడం చాలా కష్టం.

సంతృప్తినిచ్చే పని

10, 11. సాతాను నేడు ప్రత్యేకించి ఎవర్ని లక్ష్యంగా చేసుకున్నాడు? ఈ లోకం అందించే విద్య ఎలాంటి అడ్డంకులను కలిగించగలదు?

10 సాతాను అంతగా అనుభవంలేని వాళ్లపైనే దాడి చేస్తాడు. అందుకే, సాతాను నేడు యువతనే లక్ష్యంగా చేసుకున్నాడు. యౌవనులైనా, ఆ మాటకొస్తే ఎవరైనా ఇష్టపూర్వకంగా దేవునికి దాసులుగా ఉండడం సాతానుకు అస్సలు నచ్చదు. యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకునే వాళ్లు తమ భక్తిని, యథార్థతను కోల్పోవాలని దేవుని శత్రువు కోరుకుంటున్నాడు.

11 మొదట్లో చూసిన ఆ దాసుని ఉదాహరణను మళ్లీ చూద్దాం. యజమాని కుదురుతో గుచ్చడం వల్ల ఆ దాసునికి నొప్పి కలిగినా, కొంతకాలానికి అది తగ్గిపోయి తన సేవకు సంబంధించిన ఒక శాశ్వత గుర్తు మిగులుతుంది. అలానే, తోటి స్నేహితులు వెళ్లే మార్గాన్ని కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకోవడం ఓ యౌవనస్థునికి చాలా కష్టంగా, బాధగా ఉండవచ్చు. లోకంలోని విద్య, ఉద్యోగం వల్లే ఒక వ్యక్తి తృప్తిపొందుతాడని సాతాను ప్రోత్సహిస్తున్నాడు కాని క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. “ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు” అని యేసు బోధించాడు. (మత్త. 5:3) సమర్పిత క్రైస్తవులు దేవుని చిత్తం చేయడం కోసమే జీవిస్తారు కాని సాతాను చిత్తం చేయడం కోసం కాదు. వాళ్లు బైబిలు చదివి, దివారాత్రము ధ్యానిస్తారు. (కీర్తన 1:1-3 చదవండి.) అయితే, నేడున్న చాలా విద్యాకోర్సులు యెహోవా సేవకులు ధ్యానించడానికి, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకోవడానికి సమయం మిగల్చడం లేదు.

12. నేడు చాలామంది యౌవనులకు ఏ అవకాశం ఉంది?

12 ఈ లోక సంబంధమైన యజమానులు ఒక క్రైస్తవ దాసుని జీవితాన్ని కష్టతరం చేస్తారు. కొరింథీయులకు తాను రాసిన మొదటి ఉత్తరంలో పౌలు ఈ సలహానిచ్చాడు: “దాసుడవై యుండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడవగుటకు శక్తి కలిగినయెడల, స్వతంత్రుడవగుట మరి మంచిది.” (1 కొరిం. 7:20, 21) దాస్యం నుండి స్వేచ్ఛను కోరుకోవాలి. నేడు అనేక దేశాల్లో, ఒక నిర్దిష్ట వయస్సు వరకూ పాఠశాలకు వెళ్లడం తప్పనిసరి. ఆ తర్వాతే, ఏమి చేయాలో ఎంచుకునే అవకాశం వాళ్లకు ఉంటుంది. ఇంకా పైచదువులు చదవాలా వద్దా అని వాళ్లు నిర్ణయించుకోవచ్చు. ఈ లోకంలో మంచి స్థాయికి చేరుకోవాలనే కోరికతో విద్యను కొనసాగించడం వల్ల పూర్తికాల సేవ చేసే స్వేచ్ఛ లేకుండాపోవచ్చు.—1 కొరింథీయులు 7:23 చదవండి.

మీరు ఎవరికి దాసులుగా ఉంటారు?

ఉన్నత విద్యా? అత్యున్నత విద్యా?

13. యెహోవా సేవకులకు ఏ విద్య ఎక్కువగా ప్రయోజనాన్ని ఇస్తుంది?

13 కొలొస్సయిలోని క్రైస్తవులను పౌలు ఇలా హెచ్చరించాడు: “ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలొ. 2:8) నేడు మేధావి వర్గానికి చెందినవాళ్లు ప్రోత్సహిస్తున్న లోకసంబంధ ఆలోచనా విధానంలో ‘మనుష్యుల పారంపర్యాచారం, నిరర్థక తత్వ జ్ఞానమే’ ఎక్కువగా ఉంటున్నాయి. ఉన్నత విద్య కేవలం పుస్తకాలు చదవడాన్నే ప్రోత్సహిస్తుంది. దానివల్ల పట్టభద్రులు అయ్యేవాళ్లకు బ్రతకడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో, జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోలేకపోతున్నారు. దానికి భిన్నంగా యెహోవా సేవకులు, ఆయన సేవలో సరళమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమయ్యే నైపుణ్యాల్ని అందించే విద్యను ఎంచుకుంటారు. వారు తిమోతికి పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని పాటించడానికి కృషి చేస్తారు: “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.” (1 తిమో. 6:6-8) లోకంలో పెద్దపెద్ద చదువులు చదివి, తన పేరు చివరన డిగ్రీలను తగిలించుకోవడానికి ప్రయత్నించే బదులు, ఓ నిజ క్రైస్తవుడు సాధ్యమైనంత ఎక్కువగా క్షేత్ర పరిచర్యలో పాల్గొంటూ, “సిఫారసు పత్రికలు” పొందడానికి కృషి చేస్తాడు.—2 కొరింథీయులు 3:1-3 చదవండి.

14. ఫిలిప్పీయులు 3:8-11 ప్రకారం యెహోవాకు, యేసుకు దాస్యం చేసే గొప్ప అవకాశాన్ని పౌలు ఎలా ఎంచాడు?

14 అపొస్తలుడైన పౌలు విషయమే తీసుకోండి. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలు దగ్గర విద్యను అభ్యసించాడు. పౌలు చదివిన విద్యను నేటి విశ్వవిద్యాలయ విద్యతో పోల్చవచ్చు. అయితే యెహోవాకు, యేసుకు దాస్యం చేసే గొప్ప అవకాశం ముందు పౌలు తన విద్యను ఎలా దృష్టించాడు? ఆయనిలా రాశాడు: ‘నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొను నిమిత్తం సమస్తాన్ని నష్టపర్చుకుని, వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.’ (ఫిలి. 3:8-11) యౌవన క్రైస్తవులు, దైవభయంగల వాళ్ల తల్లిదండ్రులు పౌలులాగే ఆలోచిస్తే, విద్య విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. (చిత్రాల్ని చూడండి.)

అత్యున్నత విద్య నుండి ప్రయోజనం పొందండి

15, 16. యెహోవా సంస్థ ఏ విద్యను అందిస్తుంది? దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి?

15 ఈ లోకంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నేడు ఎలాంటి వాతావరణం ఉందో ఆలోచించండి. అవి కొన్నిసార్లు రాజకీయ, సామాజిక తిరుగుబాటులకు కేంద్రాలు కావట్లేదా? (ఎఫె. 2:2) దానికి భిన్నంగా యెహోవా సంస్థ, ప్రశాంతమైన వాతావరణంలో క్రైస్తవ సంఘం ద్వారా అత్యున్నత విద్యను అందిస్తోంది. ప్రతీ వారం జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందే అవకాశం మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. దానితో పాటు ఒంటరి సహోదరుల కోసం “ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల,” పెళ్లైన క్రైస్తవుల కోసం “క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల” వంటి కొన్ని ప్రత్యేకమైన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి దైవిక విద్య మన పరలోక యజమానియైన యెహోవాకు లోబడేందుకు సహాయం చేస్తుంది.

16 వాచ్‌టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌, వాచ్‌టవర్‌ లైబ్రరీ సీడీ-రామ్‌ నుండి మనం విలువైన ఆధ్యాత్మిక నిధిని తవ్వి తియ్యవచ్చు. దైవిక విద్య ముఖ్యోద్దేశం యెహోవాను ఆరాధించడమే. దేవునితో సమాధానపడేలా ఇతరులకు ఎలా సహాయం చేయాలో అది మనకు బోధిస్తుంది. (2 కొరిం 5:20) తద్వారా వాళ్లు కూడా ఇతరులకు బోధించడం వీలవుతుంది.—2 తిమో. 2:2.

దాసుడు పొందే బహుమానం

17. అత్యున్నత విద్యను ఎంచుకోవడం వల్ల ఏ ఆశీర్వాదాలు వస్తాయి?

17 యేసు చెప్పిన తలాంతుల ఉపమానంలో, ఇద్దరు నమ్మకమైన దాసులు తమ యజమాని మెప్పును పొందారు. అంతేకాదు, వాళ్లు మరిన్ని బాధ్యతలు చేపట్టి యజమాని సంతోషంలో పాలుపొందారు. (మత్తయి 25:21, 23 చదవండి.) అత్యున్నత విద్యను ఇప్పుడే ఎంచుకోవడం వల్ల ఎన్నో ఆనందాలు, ఆశీర్వాదాలు వస్తాయి. మైఖేల్‌ ఉదాహరణనే చూడండి. అతను పాఠశాల విద్యలో ఎంతగానో రాణించాడు. దాంతో విశ్వవిద్యాలయానికి వెళ్లడానికి అతనికున్న అవకాశాల గురించి చర్చించడానికి టీచర్లు అతన్ని ఒక మీటింగ్‌కు పిలిచారు. అయితే, వాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ మైఖేల్‌ ఒక చిన్న వృత్తివిద్యా కోర్సును ఎంచుకున్నాడు. దానివల్ల అతను కొద్దికాలంలోనే తననుతాను పోషించుకుంటూ క్రమ పయినీరు సేవ మొదలుపెట్టాడు. తను తీసుకున్న నిర్ణయం తప్పని మైఖేల్‌ ఏనాడైనా బాధపడ్డాడా? అతనిలా అన్నాడు: “ఒక పయినీరుగా, ప్రస్తుతం ఒక సంఘ పెద్దగా నేను పొందిన దైవిక విద్య వెలకట్టలేనిది. నేను పొందుతున్న ఆశీర్వాదాలు, సేవావకాశాలు, నేను సంపాదించగల డబ్బు కంటే ఎంతో గొప్పవి. నేను ఉన్నత విద్యను అభ్యసించనందుకు ఎంతో సంతోషిస్తున్నాను.”

18. అత్యున్నత విద్యను ఎంచుకోవడానికి మిమ్మల్ని ఏది పురికొల్పుతుంది?

18 అత్యున్నత విద్య మనకు యెహోవా చిత్తమేంటో బోధించి, ఆయనకు దాసులుగా ఉండడానికి సహాయం చేస్తుంది. దానితోపాటు, “నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందే” నిరీక్షణను మనకిస్తుంది. (రోమా. 8:20, 21) అన్నింటికంటే ముఖ్యంగా, మనం మన పరలోక యజమానియైన యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చో నేర్చుకుంటాం.—నిర్గ. 21:5.