కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

యెహెజ్కేలు పుస్తకంలోని మాగోగువాడగు గోగు ఎవరు?

మాగోగువాడగు గోగు పరలోకం నుండి పడద్రోయబడిన సాతానే అని మన ప్రచురణలు చాలా సంవత్సరాలుగా చెప్తూ వచ్చాయి. ఎందుకు? ఎందుకంటే, దేవుని ప్రజల మీద ప్రపంచవ్యాప్తంగా జరిగే దాడికి సాతానే నాయకత్వం వహిస్తాడని ప్రకటన గ్రంథం చెప్తుంది. (ప్రక. 12:1-17) కాబట్టి, “గోగు” అనేది సాతానుకున్న మరో పేరు అని ఒకప్పుడు అనుకున్నాం.

కానీ, ఈ వివరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకు, యెహోవా గోగు నాశనం గురించి ప్రవచిస్తూ, అతన్ని ‘నానా విధాలైన క్రూర పక్షులకు, దుష్ట మృగాలకు ఆహారంగా ఇస్తాను’ అని చెప్పాడు. (యెహె. 39:4) అంతేకాదు, “గోగువారిని [“గోగును,” NW] పాతిపెట్టుటకై . . . ఇశ్రాయేలు దేశమున నేనొక స్థలము ఏర్పరచెదను” అని కూడా యెహోవా అన్నాడు. (యెహె. 39:11) ఒకవేళ గోగు సాతానే అయితే, అదృశ్య ఆత్మప్రాణియైన సాతానును పక్షులు, మృగాలు ఎలా తినగలవు? అతన్ని పాతిపెట్టడం ఎలా సాధ్యమౌతుంది? సాతాను 1,000 సంవత్సరాలు అగాధంలో బంధించబడతాడని బైబిలు స్పష్టంగా చెప్తుంది. కాబట్టి, అతన్ని పక్షులు తినవు, అతను పాతిపెట్టబడడు.—ప్రక. 20:1, 2.

వెయ్యి సంవత్సరాల తర్వాత, సాతాను అగాధం నుండి విడుదల అవుతాడు. అప్పుడు అతను “భూమి నలుదిశలయందుండు జనములను . . . గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై” బయలుదేరతాడని బైబిలు చెప్తుంది. (ప్రక. 20:8) ఒకవేళ సాతానే గోగు అయితే, గోగు గోగును మోసగించడం ఎలా సాధ్యం? కాబట్టి యెహెజ్కేలు పుస్తకంలో లేదా ప్రకటన పుస్తకంలో ఉన్న “గోగు” సాతానును సూచించడం లేదు.

మరి “గోగు” ఎవర్ని సూచిస్తున్నాడు? దీనికి జవాబు తెలుసుకోవాలంటే, దేవుని ప్రజల మీద ఎవరు దాడి చేస్తారని బైబిలు చెప్తుందో పరిశీలించాలి. ‘మాగోగువాడగు గోగు,’ “ఉత్తరదేశపు రాజు,” “భూరాజులు” దేవుని ప్రజలమీద దాడి చేస్తారని బైబిలు చెప్తుంది. (యెహె. 38:2, 10-13; దాని. 11:40, 44, 45; ప్రక. 17:14; 19:19) ఇవి వేర్వేరు దాడులా? కాదు. బైబిలు ఒకే దాడిని వేర్వేరు పేర్లతో పిలుస్తుంది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, హార్‌మెగిద్దోను యుద్ధానికి నడిపించే ఆ చివరి దాడిలో భూవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ పాల్గొంటాయని బైబిలు చెప్తుంది.—ప్రక. 16:14-16.

దేవుని ప్రజల మీద జరిగే చివరి దాడి గురించి వివరించే ఆ లేఖనాలన్నిటినీ పోల్చి చూస్తే, మాగోగువాడగు గోగు సాతాను కాదని స్పష్టమౌతుంది. బదులుగా, దేవుని ప్రజల మీద దాడిచేయడానికి ఐక్యమయ్యే దేశాల గుంపును గోగు సూచిస్తున్నాడు. ఆ గుంపుకు “ఉత్తరదేశపు రాజు” నాయకత్వం వహిస్తాడా? ఖచ్చితంగా చెప్పలేం. కానీ, గోగు గురించి యెహోవా చెప్పిన ఈ మాటల్ని చూస్తే బహుశా అదే జరగవచ్చు అనిపిస్తుంది, “ఉత్తరదిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనముల నేకములును గుఱ్ఱములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చును.”—యెహె. 38:6, 15.

యెహెజ్కేలు కాలంలోనే జీవించిన దానియేలు, ఉత్తర దేశపు రాజు గురించి ఇలా చెప్పాడు, “ఉత్తరరాజు తూర్పు, ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని, భయాభ్రాంతుడై, మహోగ్రుడై చాలామందిని సర్వనాశనం చేయడానికి ముందుకు సాగుతాడు. సుందరమైన పరిశుద్ధమైన పర్వతానికి సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.” (దాని. 11:44, 45, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఈ మాటలు, గోగు చేయబోయే దానిగురించి యెహెజ్కేలు చెప్పిన మాటల్లానే ఉన్నాయి.—యెహె. 38:8-12, 16.

ఆ చివరి దాడి తర్వాత ఏమి జరుగుతుంది? దానియేలు ఇలా చెప్పాడు, “ఆ కాలమందు నీ జనుల పక్షమున [1914 నుండి] నిలుచునట్టి మహా అధిపతియగు [యేసుక్రీస్తు] మిఖాయేలు [హార్‌మెగిద్దోను సమయంలో] వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద [మహాశ్రమలు] కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు.” (దాని. 12:1) దేవుని ప్రతినిధిగా యేసు తీసుకునే ఈ చర్య గురించి ప్రకటన 19:11-21 వచనాల్లో కూడా మనం చదువుతాం.

మరి, ప్రకటన 20:8 లో ఉన్న ‘గోగు మాగోగులు’ ఎవరు? వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో జరిగే చివరి పరీక్షలో యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఆయన ప్రజల మీద దాడి చేసేవాళ్లందరూ ‘గోగు మాగోగులు’ అని చెప్పవచ్చు. వీళ్లకు కూడా, ‘మాగోగువాడగు గోగుకు’ అంటే మహాశ్రమల ముగింపులో దేవుని ప్రజల మీద దాడిచేసే దేశాలకు ఉన్నలాంటి ద్వేషమే ఉంటుంది. ఆ “గోగు” హార్‌మెగిద్దోనులో నాశనమైనట్టే, ‘గోగు మాగోగులు’ కూడా సర్వనాశనమౌతారు. (ప్రక. 19:20, 21; 20:9) కాబట్టి ‘గోగు మాగోగులు,’ వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాళ్లందర్నీ సూచిస్తున్నారని చెప్పవచ్చు.

బైబిల్ని శ్రద్ధగా చదివే మనం, ఆ “ఉత్తరదేశపు రాజు” ఎవరో తెలుసుకోవాలని ఆత్రుతతో ఉన్నాం. అయితే, దేవుని ప్రజలపై జరిగే దాడికి ఎవరు నాయకత్వం వహించినా, మనకు రెండు విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసు. అవేంటంటే, (1) మాగోగువాడగు గోగు, అతని సైన్యాలు ఓడిపోతారు, నాశనమౌతారు. (2) మన రాజైన యేసుక్రీస్తు దేవుని ప్రజలను కాపాడి, నిజమైన శాంతిభద్రతలు ఉండే కొత్తలోకంలోకి నడిపిస్తాడు.—ప్రక. 7:14-17.