తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—రష్యాలో
రష్యాలో యెహోవాసాక్షుల కార్యకలాపాలపై ఎంతోకాలంగా ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం 1991లో ఎత్తివేసి, వాళ్లను అధికారికంగా గుర్తించినప్పుడు అక్కడి సాక్షులు ఎంతో సంతోషించారు. ఆ దేశంలోని సాక్షుల సంఖ్య పది రెట్లు పెరుగుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు రష్యాలో దాదాపు 1,70,000 మంది సాక్షులు ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. వాళ్లలో, వేరే దేశాలనుండి రష్యాకు వచ్చి కోతపనిలో సహాయం చేస్తున్న సహోదరసహోదరీలు కూడా ఉన్నారు. (మత్త. 9:37, 38) వాళ్లలో కొంతమందిని పరిచయం చేసుకుందాం.
సంఘాల్ని బలపర్చడానికి సహోదరులు ముందుకొచ్చారు
ముందు బ్రిటన్‌కు చెందిన మాథ్యూ గురించి చూద్దాం. రష్యాలో నిషేధం ఎత్తివేసే సమయానికి ఆయనకు 28 ఏళ్లు. ఆ సంవత్సరంలో జరిగిన ఓ సమావేశంలో, తూర్పు యూరప్‌లోని సంఘాల్లో అవసరం ఎక్కువ ఉందని ఆయన విన్నాడు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న సంఘం గురించి ఓ ప్రసంగీకుడు చెప్పాడు. ఆ సంఘంలో ఒకే ఒక్క పరిచర్య సేవకుడు ఉన్నాడు, సంఘపెద్దలు ఎవరూ లేరు, అయినా అక్కడి ప్రచారకులు కొన్ని వందల బైబిలు స్టడీలు చేస్తున్నారు. మాథ్యూ ఇలా అంటున్నాడు, “ఆ ప్రసంగం విన్న తర్వాత రష్యా గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. దాంతో అక్కడికి వెళ్లి సేవ చేయాలనే నా కోరిక గురించి యెహోవాకు ప్రార్థించాను.” ఆయన కొంత డబ్బు దాచుకుని, చాలా వస్తువుల్ని అమ్మేసి 1992లో రష్యాకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమి జరిగింది?
ఆయనిలా చెప్తున్నాడు, “అక్కడి భాష నేర్చుకోవడం నాకు కష్టమైంది. నేను దేవుని గురించి ఇతరులతో సరిగ్గా మాట్లాడలేకపోయేవాణ్ణి.” ఉండడానికి ఇల్లు దొరకడం కూడా కష్టమైంది. “తక్కువ సమయంలో నేను ఎన్నిసార్లు ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిందో లెక్కలేదు” అని ఆయన చెప్తున్నాడు. మొదట్లో అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా మాథ్యూ ఇలా చెప్తున్నాడు, “రష్యాకు వెళ్లి సేవ చేయాలనుకోవడం నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం. దానివల్ల యెహోవాపై ఇంకా ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నాను. ఆయన ఎన్నో విధాలుగా నన్ను నడిపించడం చూశాను.” ఆ తర్వాత సంఘపెద్దగా, ప్రత్యేక పయినీరుగా సేవచేసిన మాథ్యూ ప్రస్తుతం సెయింట్ పీటర్స్‌బర్గ్ దగ్గరున్న బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు.
జపాన్‌కు చెందిన హిరూ 1999లో పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరయ్యాడు. అప్పుడు ఆయనకు 25 ఏళ్లు. ఆ పాఠశాల
ఉపదేశకుల్లో ఒకరు, వేరే దేశాల్లో సేవచేయమని హిరూని ప్రోత్సహించాడు. రష్యాలో అవసరం ఎక్కువుందని తెలుసుకున్న హిరూ, రష్యన్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆయన మరో ముఖ్యమైన పని కూడా చేశాడు. ఆయనిలా చెప్తున్నాడు, “ఆరు నెలలపాటు రష్యాలో ఉందామని వెళ్లాను. అక్కడ చలికాలంలో తీవ్రమైన చలి ఉంటుంది కాబట్టి నేను తట్టుకోగలనో లేదో చూద్దామని నవంబరులో అక్కడికి వెళ్లాను.” హిరూ చలికాలమంతా అక్కడే ఉండి జపాన్‌కు తిరిగొచ్చాడు. తర్వాత తక్కువ ఖర్చులతో జీవిస్తూ, రష్యాకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు దాచుకుని అక్కడికి వెళ్లిపోయాడు.గత 12 ఏళ్లుగా రష్యాలో ఉంటున్న హిరూ వేర్వేరు సంఘాల్లో సేవచేశాడు. కొన్నిసార్లు, వందకు పైగా ప్రచారకులను ఆయన ఒక్కడే సంఘపెద్దగా చూసుకోవాల్సి వచ్చేది. ఓ సంఘంలోనైతే ఆయనే ప్రతీవారం సేవాకూటంలోని చాలా భాగాలు, పాఠశాల, కావలికోట, ఐదు వేర్వేరు సంఘ పుస్తక అధ్యయనాలు నిర్వహించేవాడు. చాలా కాపరి సందర్శనాలు కూడా చేసేవాడు. ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటూ హిరూ ఇలా అంటున్నాడు, ‘సహోదరసహోదరీలు యెహోవాకు మరింత దగ్గరయ్యేలా సహాయం చేయడంలో చాలా సంతోషించేవాణ్ణి.’ అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడంవల్ల ఆయనెలా ప్రయోజనం పొందాడు? ఆయనిలా చెప్తున్నాడు, “రష్యాకు రాకముందు సంఘపెద్దగా, పయినీరుగా సేవచేశాను. కానీ ఇక్కడికి వచ్చాకే, నాకు యెహోవాతో ఓ కొత్త సంబంధం ఏర్పడినట్లు అనిపిస్తుంది. జీవితంలో ప్రతీ విషయంలో యెహోవాపై మరింతగా నమ్మకం ఉంచడం నేర్చుకున్నాను.” హిరూ 2005లో స్విట్లాన అనే సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ పయినీరు సేవలో కొనసాగుతున్నారు.
కెనడాకు చెందిన 34 ఏళ్ల మాథ్యూ, అతని తమ్ముడు 28 ఏళ్ల మైఖేల్ ఒకసారి రష్యాకు వెళ్లారు. అక్కడ ఓ సంఘ కూటానికి వెళ్లినప్పుడు ఆసక్తిగలవాళ్లు చాలామంది రావడం, కానీ కూటాల్ని నిర్వహించే సహోదరులు కొద్దిమందే ఉండడం చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. మాథ్యూ ఇలా చెప్తున్నాడు, ‘ఆ రోజు కూటానికి 200 మంది వచ్చారు. కానీ కూటాలన్నిటినీ వయసుపైబడిన ఓ సంఘపెద్ద, ఓ యువ పరిచర్య సేవకుడే నిర్వహిస్తున్నారు. అది చూసిన తర్వాత, అక్కడికి వెళ్లి ఆ సహోదరులకు సహాయం చేయాలని నాకనిపించింది.’ ఆయన 2002లో రష్యాకు వెళ్లిపోయాడు.
నాలుగేళ్ల తర్వాత, మైఖేల్ కూడా రష్యాకు వెళ్లాడు. అక్కడ సహోదరుల అవసరం ఇంకా ఎక్కువగానే ఉందని ఆయన గమనించాడు. పరిచర్య సేవకునిగా ఆయన అకౌంట్స్, సాహిత్యం, క్షేత్రం వంటివి చూసుకోవాల్సి వచ్చేది. సంఘ కార్యదర్శి చేసే పనుల్ని కూడా ఆయనే చేయాల్సి వచ్చేది. అంతేకాక బహిరంగ ప్రసంగాలు ఇచ్చేవాడు, సమావేశ ఏర్పాట్లను, రాజ్యమందిర నిర్మాణ పనుల్ని కూడా చూసుకునేవాడు. నిజానికి, ఇప్పటికీ సంఘాల్లో సహోదరుల అవసరం చాలా ఉంది. అన్ని బాధ్యతల్ని చూసుకోవడం కష్టంగా అనిపించినా మైఖేల్ ఇలా అంటున్నాడు, ‘సహోదరులకు సహాయం చేయడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. నా జీవితాన్ని ఇంతకన్నా బాగా ఉపయోగించలేను.’ ఆయన ప్రస్తుతం సంఘపెద్దగా సేవచేస్తున్నాడు.
మాథ్యూ మారీన అనే సహోదరిని, మైఖేల్ ఓల్గ అనే సహోదరిని పెళ్లిచేసుకున్నారు. ఈ దంపతులు, అలాగే చాలామంది స్వచ్ఛంద సేవకులు రష్యాలో వృద్ధి చెందుతున్న సంఘాలకు మద్దతిస్తున్నారు.
కోతపనిలో ఉత్సాహంగా పాల్గొంటున్న సహోదరీలు
యుక్రెయిన్‌కు చెందిన టాట్యాన అనే సహోదరి విషయమే తీసుకోండి. ఆమెకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఛెక్ రిపబ్లిక్, పోలండ్, స్లోవాకియా దేశాలకు చెందిన ఆరుగురు ప్రత్యేక పయినీర్లు 1994లో ఆమె సంఘానికి వచ్చారు. వాళ్లను ఆప్యాయంగా గుర్తుచేసుకుంటూ ఆమె ఇలా చెప్తుంది, ‘ఆ పయినీర్లు ఎంతో ఉత్సాహంగా పరిచర్య చేస్తూ అందరితో కలిసిపోయేవాళ్లు, చాలా ప్రేమగా ఉండేవాళ్లు. వాళ్లకు బైబిల్లోని విషయాలు బాగా తెలుసు.’ వాళ్లు చేసిన త్యాగాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడో చూశాక, ఆమె కూడా వాళ్లలా అవ్వాలనుకుంది.
ఆ పయినీర్లను చూసి ప్రోత్సాహం పొందిన టాట్యాన, స్కూల్‌కు సెలవులు ఇచ్చినప్పుడల్లా తోటి సాక్షులతో కలిసి యుక్రెయిన్, బెలారస్‌లో సువార్త చేరని మారుమూల ప్రాంతాలకు
వెళ్లి ప్రకటించేది. అది ఆమెకు ఎంత నచ్చిందంటే, మరింతగా పరిచర్య చేయడానికి రష్యాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె ముందుగా, వేరే దేశంనుండి వచ్చి రష్యాలో సేవచేస్తున్న ఓ సహోదరితోపాటు కొంతకాలం ఉండడానికి రష్యాకు వెళ్లింది. అంతేకాదు, తన ఖర్చులు కోసం ఓ చిన్న ఉద్యోగం కూడా వెతుక్కుంది. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి, 2000వ సంవత్సరంలో రష్యాకు వెళ్లిపోయింది. మరి ఆమెకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?టాట్యాన ఇలా చెప్తుంది, “నాకు ఓ ఇంటిని అద్దెకు తీసుకునే స్తోమత లేక వేరేవాళ్ల ఇంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాను. అయితే అలా ఉండడం కూడా కష్టంగానే అనిపించింది. తిరిగి వెళ్లిపోవాలని కొన్నిసార్లు అనిపించింది. కానీ తన సేవలో కొనసాగడం వల్ల వచ్చే ప్రయోజనాల్ని గుర్తించేందుకు యెహోవా నాకు ప్రతీసారి సహాయం చేశాడు.” ప్రస్తుతం రష్యాలో మిషనరీగా సేవచేస్తున్న టాట్యాన ఇలా చెప్తుంది, ‘మా దేశాన్ని వదిలి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేయడంవల్ల మంచి అనుభవాలను, చాలామంది స్నేహితులను సంపాదించుకున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నా విశ్వాసం బలపడింది.’
జపాన్‌కు చెందిన మాసాకో ప్రస్తుతం 50వ పడిలో ఉంది. మిషనరీ సేవ ఆమె చిరకాల కోరిక, కానీ అనారోగ్య సమస్యలవల్ల అది ఆమెకు అసాధ్యం అనిపించింది. కానీ ఆరోగ్యం కాస్త కుదుటపడగానే రష్యాకు వెళ్లి సేవ చేయాలని నిర్ణయించుకుంది. అక్కడికి వెళ్లాక మంచి ఇల్లు, ఉద్యోగం దొరకకపోయినా తన ఖర్చుల కోసం ఓ ఇంట్లో పనిచేస్తూ, ఇతరులకు జపనీస్ భాష నేర్పిస్తూ పయినీరు సేవ చేసింది. ఆ సేవలో కొనసాగడానికి ఆమెకేమి సహాయం చేసింది?
రష్యాలో 14 ఏళ్లుగా చేస్తున్న సేవను గుర్తుచేసుకుంటూ మాసాకో ఇలా చెప్తుంది, ‘పరిచర్యలో ఉన్న ఆనందంవల్ల, నాకు ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలుగుతున్నాను. అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడంవల్ల జీవితం మరింత ఉత్సాహంగా, ఉత్తేజంగా అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా యెహోవా నాకు కావాల్సిన ఆహారాన్ని, వస్త్రాల్ని, వసతిని ఎలా ఇస్తున్నాడో చూస్తుంటే ఓ అద్భుతంలా అనిపిస్తుంది.’ ఆమె రష్యాతోపాటు కిర్గిజ్‌స్థాన్‌లో కూడా సేవ చేసింది. అంతేకాక ఇంగ్లీష్, చైనీస్, వీగుర్ భాషా గుంపులకు కూడా సహాయం చేసింది. ప్రస్తుతం ఆమె సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పయినీరుగా సేవ చేస్తోంది.
ప్రకటనా పనికి మద్దతిస్తూ ఆశీర్వాదాలు పొందుతున్న కుటుంబాలు
ఆర్థిక ఒత్తిళ్ల వల్ల, చాలా కుటుంబాలు డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళ్తున్నాయి. కానీ, కొన్ని కుటుంబాలు ప్రాచీన కాలంలోని అబ్రాహాము శారాల్లాగే ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం విదేశాలకు వెళ్తున్నాయి. (ఆది. 12:1-9) యుక్రెయిన్‌కు చెందిన మికాయీల్, ఇంగ అనే జంట 2003లో రష్యాకు వెళ్లారు. వాళ్లు సత్యం కోసం వెదుకుతున్న చాలామందిని అక్కడ కలుసుకున్నారు.
మికాయీల్ ఇలా చెప్తున్నాడు, “సాక్షులు ఇంతవరకూ ప్రకటించని ప్రాంతంలో ఓసారి మేము ప్రకటిస్తున్నప్పుడు, ఓ వృద్ధుడు తలుపు తీసి ‘మీరు సువార్తికులా?’ అని అడిగాడు. మేము అవునని చెప్పగానే, ‘ఏదో ఒక రోజు మీరు వస్తారని నాకు తెలుసు. యేసు చెప్పిన మాటలు నెరవేరకుండా పోవు’ అంటూ మత్తయి 24:14లోని మాటల్ని చెప్పాడు. ఆ తర్వాత మేము, బాప్టిస్ట్ చర్చికి వెళ్లే పదిమంది స్త్రీలను కూడా ఆ ప్రాంతంలో కలిశాం. వాళ్లు సత్యం కోసం పరితపిస్తున్నారు. వాళ్లు తమ దగ్గరున్న ‘పరదైసు’ పుస్తకం సహాయంతో ప్రతీవారం బైబిలు అధ్యయనం చేసుకుంటున్నారు. వాళ్ల ప్రశ్నలకు జవాబిస్తూ మేము చాలా గంటలు గడిపాం, వాళ్లతో కలిసి రాజ్యగీతాలు పాడాం, కలిసి భోజనం చేశాం. నాకున్న మధుర జ్ఞాపకాల్లో అదొకటి.” అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడంవల్ల యెహోవాకు దగ్గరయ్యామని, ప్రజలమీద ప్రేమ ఇంకా పెరిగిందని, మరింత సంతోషంగా సంతృప్తిగా ఉన్నామని మికాయీల్, ఇంగ చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్లు ప్రాంతీయ సేవ చేస్తున్నారు.
యుక్రెయిన్‌కు చెందిన యూర్యీ, ఒక్సాన ప్రస్తుతం 30వ పడిలో ఉన్నారు, వాళ్ల అబ్బాయి అలిక్సేకు ప్రస్తుతం 13 ఏళ్లు. వాళ్లు 2007లో రష్యా బ్రాంచిని చూడ్డానికి వెళ్లినప్పుడు, రష్యాలో సువార్త చేరని చాలా ప్రాంతాలను ఓ మ్యాప్‌లో చూశారు. ఒక్సాన ఇలా చెప్తుంది, “ఆ మ్యాప్ చూశాక, అక్కడ రాజ్యప్రచారకుల అవసరం ఎంత ఉందో మాకు అర్థమైంది. దాంతో రష్యాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.” అలా వెళ్లడానికి వాళ్లింకా ఏమి చేశారు? యూర్యీ ఇలా చెప్తున్నాడు, “‘మీరు విదేశీక్షేత్రంలో సేవ చేయగలరా?’ వంటి ఆర్టికల్స్‌ను మన ప్రచురణల్లో చదవడం మాకెంతో ఉపయోగపడింది. a రష్యా బ్రాంచి మాకు చెప్పిన ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఓ ఇంటి కోసం, ఉద్యోగం కోసం వెదికాం.” వాళ్లు 2008లో రష్యాకు వెళ్లారు.
మొదట్లో వాళ్లకు ఉద్యోగం దొరకడం కష్టమైంది, చాలాసార్లు ఇల్లు మారాల్సి వచ్చింది కూడా. యూర్యీ ఇలా చెప్తున్నాడు, “మేము నిరుత్సాహపడకుండా ఉండడానికి తరచూ ప్రార్థించేవాళ్లం. యెహోవా సహాయం చేస్తాడన్న నమ్మకంతో మా సేవను కొనసాగించాం. రాజ్యానికి మొదటి స్థానమిచ్చినప్పుడు యెహోవా మన అవసరాల్ని ఎలా తీరుస్తాడో మేము చూశాం. ఆ సేవ మా కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా బలపర్చింది.” (మత్త. 6:22, 33) మరి అలిక్సే ఎలా ప్రయోజనం పొందాడు? ఒక్సాన ఇలా చెప్తుంది, ‘మా అబ్బాయి ఎంతో ప్రయోజనం పొందాడు. తను తొమ్మిది ఏళ్లకే యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం పొందాడు. రాజ్యప్రచారకుల అవసరం ఎంత ఉందో చూస్తున్నాడు కాబట్టి, అతను స్కూల్‌కు సెలవులు ఇచ్చినప్పుడల్లా సహాయ పయినీరు సేవ చేస్తున్నాడు. పరిచర్యపట్ల తనకున్న ప్రేమ, ఉత్సాహం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది.’ ప్రస్తుతం యూర్యీ, ఒక్సాన ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నారు.
‘నాకున్న ఒకే ఒక బాధ’
వాళ్ల అనుభవాలు విన్నాక, మరింత ఎక్కువ సేవ చేయడం కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే, యెహోవాపై పూర్తి నమ్మకముంచాలని మీకు అర్థమయ్యే ఉంటుంది. నిజమే, అలా వెళ్లేవాళ్లకు కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. కానీ సువార్తను చక్కగా వినే ప్రజలకు ప్రకటించడంలో ఉన్న గొప్ప ఆనందాన్ని వాళ్లు అనుభవిస్తారు. కాబట్టి అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి మీరు సేవచేయగలరా? అలా వెళ్లాలని నిర్ణయించుకుంటే, మీరు కూడా యూర్యీలాగే భావించవచ్చు. అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేయాలన్న తన నిర్ణయం గురించి ఆయనిలా అన్నాడు, “నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే, నేను ఈ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదా అని.”
a కావలికోట అక్టోబరు 15, 1999 సంచిక 23-27 పేజీలు చూడండి.