మీ జీవితంలో దేవుని హస్తాన్ని చూస్తున్నారా?
“యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును.” —యెష. 66:14.
1, 2. కొంతమంది ప్రజలు దేవుని గురించి ఏమనుకుంటారు?
తాము ఏమి చేస్తున్నా, తమకేమి జరిగినా దేవుడు పట్టించుకోడని చాలామంది ప్రజలు అనుకుంటారు. ఉదాహరణకు, 2013 నవంబరులో వచ్చిన ఓ భయంకరమైన తుఫాను వల్ల ఫిలిప్పీన్స్‌లోని చాలా ప్రాంతాలు నాశనమయ్యాయి. దాని గురించి మాట్లాడుతూ ఓ నగర మేయరు ఇలా అన్నాడు, ‘అప్పుడు దేవుడు ఇంకెక్కడో ఉండివుంటాడు.’
2 ఇంకొంతమంది ప్రజలు, తాము ఏమి చేసినా దేవుడు చూడలేడని అనుకుంటారు. (యెష. 26:10, 11; 3 యోహా. 11) అపొస్తలుడైన పౌలు కాలంలోని కొంతమంది అలాగే భావించారు. వాళ్ల గురించి ఆయనిలా అన్నాడు, ‘వాళ్లు తమ మనస్సులో దేవునికి చోటివ్వలేదు.’ వాళ్లు ‘దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం, ఈర్ష్యతో నిండివున్నారు.’—రోమా. 1:28, 29.
3. (ఎ) మనం ఏమని ప్రశ్నించుకోవాలి? (బి) దేవుని ‘బాహువు’ లేదా హస్తం దేన్ని సూచిస్తుంది?
3 మరి మన విషయమేమిటి? మనం చేసే ప్రతీదాన్ని యెహోవా చూస్తాడని మనకు తెలుసు. అయితే యెహోవాకు మనమీద శ్రద్ధ ఉందని మనం నమ్ముతున్నామా? మన జీవితంలో ఆయన సహాయ హస్తాన్ని చూస్తున్నామా? దేవుని ‘బాహువు’ లేదా హస్తం అనే మాట, యెహోవా తన శక్తిని ఉపయోగించడాన్ని సూచిస్తుంది. ఆయన తన సేవకులకు సహాయం చేయడానికి, శత్రువులను ఓడించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. (ద్వితీయోపదేశకాండము 26:8 చదవండి.) కొంతమంది ప్రజలు ‘దేవున్ని చూస్తారు’ అని యేసు చెప్పాడు. (మత్త. 5:8) వాళ్లలో మనం కూడా ఉన్నామా? మనమెలా దేవున్ని చూడవచ్చు? బైబిల్లో, దేవుని హస్తాన్ని చూసినవాళ్ల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అలాగే దాన్ని చూడనివాళ్ల ఉదాహరణలు కూడా ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం. అంతేకాక, దేవుని హస్తాన్ని చూడడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుందాం.
వాళ్లు యెహోవా హస్తాన్ని గుర్తించలేదు
4. ఇశ్రాయేలీయుల శత్రువులు దేవుని హస్తాన్ని గుర్తించలేదని ఎలా చెప్పవచ్చు?
4 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఎలా సహాయం చేశాడో అప్పట్లో చాలామంది ప్రజలు చూశారు, విన్నారు. యెహోవా తన ప్రజల్ని అద్భుతరీతిలో ఐగుప్తునుండి విడిపించాడు. వాళ్లు వాగ్దాన దేశానికి వెళ్లాక యెహోవా సహాయంతో అక్కడున్న చాలామంది రాజుల్ని ఓడించారు. (యెహో. 9:3, 9, 10) ఆ ప్రాంతంలోని ఇతర రాజులు వాటిని చూసి, వాటి గురించి విని కూడా ‘యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి కూడివచ్చారు.’ (యెహో. 9:1, 2) అయితే యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా వాళ్లకు దేవుని హస్తాన్ని గుర్తించే అవకాశం వచ్చింది. ఇశ్రాయేలీయులు ‘తమ శత్రువులపై పగతీర్చుకునే వరకు’ సూర్యచంద్రులు ఆకాశంలో అలాగే నిలిచిపోయేలా యెహోవా చేశాడు. (యెహో. 10:12, 13) ఆ శత్రువుల ‘హృదయాలు కఠినం’ అయ్యేలా యెహోవా అనుమతించాడు, దాంతో వాళ్లు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. (యెహో. 11:20) యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేస్తున్నాడనే విషయాన్ని ఆ శత్రువులు గుర్తించలేదు కాబట్టి వాళ్లు యుద్ధంలో ఓడిపోయారు.
5. చెడ్డ రాజైన అహాబు దేన్ని గుర్తించలేదు?
5 రాజైన అహాబుకు కూడా దేవుని హస్తాన్ని చూసే అవకాశం ఎన్నోసార్లు వచ్చింది. ఏలీయా ఆయనతో ఇలా అన్నాడు, ‘నేను మళ్లీ చెప్పేంతవరకు మంచుగానీ, వర్షంగానీ పడదు.’ (1 రాజు. 17:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) అది కేవలం యెహోవా శక్తితోనే సాధ్యమవుతుంది. కానీ ఆ విషయాన్ని అహాబు గుర్తించలేదు. మరో సందర్భంలో, ఏలీయా ప్రార్థించినప్పుడు యెహోవా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చేలా చేశాడు. అహాబు దాన్నికూడా చూశాడు. ఆ తర్వాత, యెహోవా కుండపోతగా వర్షం కురిపించి ఆ దేశంలో కరువును తీసేస్తాడని ఏలీయా అహాబుకు చెప్పాడు. (1 రాజు. 18:22-45) అహాబు ఆ అద్భుతాలన్నిటినీ చూసినా దేవుని హస్తాన్ని గుర్తించలేదు. ఈ ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మనం మన జీవితంలో యెహోవా హస్తాన్ని గుర్తించాలి.
వాళ్లు యెహోవా హస్తాన్ని చూశారు
6, 7. గిబియోనీయులు, రాహాబు దేన్ని గుర్తించారు?
6 గిబియోనీయులు తమ చుట్టూ ఉన్న జనాంగాల్లా కాకుండా దేవుని హస్తాన్ని చూడగలిగారు. వాళ్లు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసే బదులు సమాధానపడ్డారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు యెహోవా గురించి, ఆయన చేసిన వాటన్నిటి గురించి విన్నారు. (యెహో. 9:3, 9, 10) యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున యుద్ధం చేస్తున్నాడనే విషయాన్ని వాళ్లు తెలివిగా గుర్తించారు.
7 రాహాబు కూడా యెహోవా హస్తాన్ని చూసింది. ఆమె ఇశ్రాయేలీయురాలు కాకపోయినా, యెహోవా తన ప్రజల్ని ఐగుప్తునుండి ఎలా విడిపించాడో ఆమె విన్నది. ఇద్దరు ఇశ్రాయేలు వేగులవాళ్లు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వాళ్లతో ఇలా అంది, ‘యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని నేనెరుగుదును.’ యెహోవా తనను, తన కుటుంబాన్ని కాపాడగలడని రాహాబు నమ్మింది. తన ప్రాణం ప్రమాదంలో పడుతుందని తెలిసినా ఆమె యెహోవామీద విశ్వాసం చూపించింది.—యెహో. 2:9-13; 4:23, 24.
8. కొంతమంది ఇశ్రాయేలీయులు ఎలా దేవుని హస్తాన్ని చూశారు?
8 రాజైన అహాబులా కాకుండా కొంతమంది ఇశ్రాయేలీయులు దేవుని హస్తాన్ని చూశారు. ఏలీయా ప్రార్థనకు జవాబుగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చినప్పుడు, యెహోవాయే ఆ అద్భుతాన్ని చేశాడని వాళ్లు గుర్తించారు. దాంతో వాళ్లు “యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు. (1 రాజు. 18:39) ఆ ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని స్పష్టంగా చూశారు.
9. మనం యెహోవాను లేదా ఆయన హస్తాన్ని ఎలా చూడగలం?
9 ఈ ఉదాహరణలన్నీ పరిశీలించడం వల్ల, దేవున్ని చూడడం లేదా దేవుని హస్తాన్ని చూడడం అంటే ఏమిటో మనం అర్థం చేసుకున్నాం. మనం యెహోవా గురించి, ఆయన లక్షణాల గురించి తెలుసుకునే కొద్దీ మన ‘మనోనేత్రాలతో’ ఆయన హస్తాన్ని చూడగలుగుతాం. (ఎఫె. 1:17, 18) గతంలో, అలాగే మనకాలంలో దేవుని హస్తాన్ని చూసిన నమ్మకమైన దేవుని సేవకులను అనుకరించాలని మనం కోరుకుంటాం. అయితే, యెహోవా నేడు ప్రజలకు సహాయం చేస్తున్నాడని మనమెలా చెప్పవచ్చు?
మనకాలంలో దేవుని హస్తాన్ని చూడడం
10. యెహోవా నేడు ప్రజలకు సహాయం చేస్తున్నాడని చూపించే ఓ అనుభవం చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.)
10 యెహోవా నేడు కూడా ప్రజలకు సహాయం చేస్తున్నాడని చెప్పడానికి కావల్సినన్ని రుజువులున్నాయి. సహాయం కోసం ప్రార్థించిన వాళ్లకు యెహోవా ఏవిధంగా జవాబిచ్చాడో మనం తరచూ వింటుంటాం. (కీర్త. 53:2) ఉదాహరణకు, అలెన్ అనే ఓ సహోదరుడు ఫిలిప్పీన్స్‌లోని ఓ చిన్న ద్వీపంలో ఇంటింటి పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఓ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆయనిలా చెప్తున్నాడు, “సాక్షులు తనను కలుసుకోవాలని ఆ రోజు ఉదయమే ఆమె యెహోవాకు ప్రార్థించింది. ఆమె టీనేజీలో ఉన్నప్పుడు సాక్షుల దగ్గర బైబిలు స్టడీ తీసుకుంది. కానీ పెళ్లైన తర్వాత ఆమె ఈ ద్వీపానికి వచ్చేయడంతో స్టడీ మధ్యలో ఆగిపోయింది. తన ప్రార్థనకు యెహోవా వెంటనే జవాబివ్వడం చూసి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.” సంవత్సరంలోపే ఆమె యెహోవాకు సమర్పించుకుంది.
11, 12. (ఎ) నేడు యెహోవా తన ప్రజలకు ఎలా సహాయం చేస్తున్నాడు? (బి) ఆయన ఓ సహోదరికి ఎలా సహాయం చేశాడో వివరించండి.
11 పొగత్రాగడం, మత్తు పదార్థాలను వాడడం, అశ్లీల చిత్రాలు చూడడం వంటి చెడు అలవాట్లను మానుకోవడానికి యెహోవా తమకెలా సహాయం చేశాడో చాలామంది దేవుని సేవకులు చూశారు. సత్యం తెలుసుకోకముందు వాటినుండి బయటపడడానికి వాళ్లు ఎంత ప్రయత్నించినా వాళ్ల వల్ల కాలేదు. అయితే వాళ్లు యెహోవా సహాయం అడిగినప్పుడు ఆయన వాళ్లకు అసాధారణమైన ‘బలాన్ని’ ఇచ్చాడు. దాంతో వాళ్లు చివరికి ఆ చెడు అలవాట్లు మానుకోగలిగారు.—2 కొరిం. 4:7; కీర్త. 37:23, 24.
12 జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి కూడా యెహోవా సహాయం చేస్తాడు. యామీ అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె పసిఫిక్‌లోని ఒక చిన్న ద్వీపంలో ఓ రాజ్యమందిరాన్ని, మిషనరీ గృహాన్ని నిర్మించడంలో సహాయం చేయడానికి వెళ్లింది. అక్కడి పద్ధతులన్నీ వేరుగా ఉండేవి. పైగా కరెంటు, నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉండేవి. ఆమె ఓ చిన్న హోటల్ రూమ్‌లో ఉండేది, అక్కడినుండి తన పని స్థలానికి వెళ్లాలంటే, మురికి నీళ్లతో నిండిన రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లాలి. దానికితోడు ఆమెకు తన ఇంట్లోవాళ్లు బాగా గుర్తొచ్చేవాళ్లు. ఆ చిరాకులో ఆమె ఓ రోజు తనతోపాటు పని చేస్తున్న ఓ సహోదరిమీద కోపంతో అరిచేసింది. కానీ ఆ తర్వాత చాలా బాధపడింది. రూమ్‌కు వెళ్లాక, సహాయం చేయమని యెహోవాకు తీవ్రంగా ప్రార్థించింది, ఆ సమయంలో కరెంటు లేదు. కరెంటు వచ్చాక కావలికోటలో గిలియడ్ గ్రాడ్యుయేషన్ గురించి ఉన్న ఓ ఆర్టికల్ చదివింది. తాను ఎదుర్కొంటున్నలాంటి ఇబ్బందుల గురించే ఆ ఆర్టికల్‌లో ఉంది. ఆమె ఇలా చెప్తుంది, “ఆ రాత్రి యెహోవాయే స్వయంగా నాతో మాట్లాడుతున్నట్టు నాకనిపించింది. దానివల్ల నా సేవను కొనసాగించడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందాను.”—కీర్త. 44:25, 26; యెష. 41:9-10, 13.
13. ప్రకటించే హక్కును సమర్థించడంలో యెహోవా తన ప్రజలకు సహాయం చేశాడని ఎలా చెప్పవచ్చు?
13 రాజ్యసువార్తను సమర్థించడానికి, దాన్ని చట్టబద్ధంగా స్థిరపర్చడానికి యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తున్నాడు. (ఫిలి. 1:7) ఉదాహరణకు, కొన్ని ప్రభుత్వాలు మన ప్రకటనా పనిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు మనం కోర్టులకు వెళ్లాం. మనం 2000వ సంవత్సరం నుండి వివిధ దేశాల హైకోర్టుల్లో 268కు పైగా కేసులు గెలిచాం. వాటిలో యూరోపియన్ మానవ హక్కుల కోర్టులో గెలిచిన 24 కేసులు కూడా ఉన్నాయి. యెహోవా హస్తాన్ని ఎవరూ ఆపలేరనేది స్పష్టం.—యెష. 54:17; యెషయా 59:1 చదవండి.
14. యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తున్నాడని చెప్పడానికి ఇంకా ఏ రుజువులున్నాయి?
14 యెహోవా సహాయ హస్తం ఉండడంవల్లే మనం ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించగలుగుతున్నాం. (మత్త. 24:14; అపొ. 1:8) అంతేకాదు, మనం ఏ దేశానికి చెందిన వాళ్లమైనా ఐక్యంగా ఉండగలుగుతున్నాం. ఆ ఐక్యత ఎంత ప్రత్యేకమైనదంటే, యెహోవాను ఆరాధించనివాళ్లు కూడా మన గురించి ఇలా చెప్తున్నారు, “దేవుడు నిజముగా మీలో ఉన్నాడు.” (1 కొరిం. 14:25) కాబట్టి యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తున్నాడని చెప్పడానికి ఎన్నో రుజువులున్నాయి. (యెషయా 66:14 చదవండి.) మరి మీ విషయమేమిటి? మీ జీవితంలో యెహోవా హస్తాన్ని స్పష్టంగా చూస్తున్నారా?
మీ జీవితంలో యెహోవా హస్తాన్ని చూస్తున్నారా?
15. మనం కొన్నిసార్లు యెహోవా హస్తాన్ని ఎందుకు చూడలేకపోవచ్చు?
15 మనం కొన్నిసార్లు మన జీవితంలో యెహోవా హస్తాన్ని చూడలేకపోవచ్చు. ఎందుకు? మనం తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, యెహోవా అంతకుముందు మనకు చాలాసార్లు సహాయం చేశాడనే విషయాన్ని మర్చిపోతాం. ఏలీయా విషయంలో అదే జరిగింది. ఆయన ధైర్యవంతుడే అయినా, యెజెబెలు రాణి తనను చంపుతానని చెప్పినప్పుడు చాలా భయపడ్డాడు. యెహోవా అంతకుముందు తనకు సహాయం చేశాడనే విషయాన్ని ఏలీయా ఆ క్షణంలో మర్చిపోయాడు. ఆయన చనిపోవాలని కోరుకున్నాడని కూడా బైబిలు చెప్తుంది. (1 రాజు. 19:1-4) అలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఎవరు సహాయం చేయగలరు? ఆయన సహాయం కోసం యెహోవామీద ఆధారపడాల్సింది.—1 రాజు. 19:14-18.
16. కష్టాలొచ్చినప్పుడు మనం యెహోవాను చూడాలంటే ఏమి చేయాలి?
16 యోబు తన కష్టాలమీదే మనసుపెట్టడం వల్ల, తన పరిస్థితిని యెహోవా చూసినట్లు చూడలేకపోయాడు. (యోబు 42:3-6) కొన్నిసార్లు మనం కూడా కష్టాలమీదే మనసుపెట్టడం వల్ల దేవుని హస్తాన్ని చూడలేకపోవచ్చు. అలాంటప్పుడు మనమేమి చేయాలి? మనం ఎదుర్కొనే కష్టాల గురించి బైబిలు ఏమి చెప్తుందో ధ్యానించాలి. యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో అర్థం చేసుకునేకొద్దీ ఆయన మనకు మరింత వాస్తవమైన వ్యక్తి అవుతాడు. అప్పుడు యోబులాగే మనం కూడా ఇలా చెప్తాం, “వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.”
17, 18. (ఎ) మీ జీవితంలో యెహోవా హస్తాన్ని మీరెలా చూడవచ్చు? (బి) యెహోవా నేడు మనకు సహాయం చేస్తున్నాడని చూపించే ఓ అనుభవం చెప్పండి.
17 మీ జీవితంలో యెహోవా హస్తాన్ని మీరెలా చూడవచ్చు? ఈ ఐదు విషయాల గురించి ఆలోచించండి. మొదటిది, మీరు సత్యం తెలుసుకునేలా యెహోవా సహాయం చేశాడు. రెండవది, కూటాల్లో ఏదైనా ఓ ప్రసంగం విన్నప్పుడు “సరిగ్గా ఇదే నాకు కావాల్సింది” అని మీకు అనిపించివుంటుంది. మూడవది, మీరు చేసిన ఓ ప్రార్థనకు యెహోవా జవాబిచ్చివుండవచ్చు. నాలుగవది, యెహోవా సేవలో మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన మీకు సహాయం చేసివుంటాడు. ఐదవది, యెహోవా సేవకు ఆటంకంగా ఉన్న ఉద్యోగాన్ని మీరు వదిలేసివుండవచ్చు. ఆ సమయంలో, ‘నిన్ను ఎన్నడు ఎడబాయను’ అని తానిచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకోవడం మీరు చూసివుంటారు. (హెబ్రీ. 13:5) మనకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన హస్తాన్ని చూస్తాం.
18 కెన్యాకు చెందిన శారా అనే సహోదరి ఇలా చెప్తుంది, “నేను స్టడీ ఇస్తున్న ఓ అమ్మాయి, స్టడీకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వట్లేదని నాకనిపించింది. ఆ స్టడీ కొనసాగించాలా వద్దా అని యెహోవాకు ప్రార్థించాను. నేను ‘ఆమెన్’ అన్నానో లేదో అంతలోనే ఫోన్ మోగింది. ఆ అమ్మాయే ఫోన్ చేసి, ‘నేను మీతోపాటు మీటింగ్‌కు రావచ్చా’ అని అడిగింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది.” దేవుడు మనకోసం ఏమేమి చేస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచిస్తే మనం కూడా ఆయన సహాయ హస్తాన్ని చూడగలుగుతాం. ఆసియాకు చెందిన రోనా అనే ఓ సహోదరి ఇలా చెప్తుంది, ‘యెహోవా మనకు సహాయం చేస్తున్నాడనే విషయాన్ని గుర్తించడం మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే, ఆయనకు మనమీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోతాం.’
19. మనం దేవున్ని చూడాలంటే ఇంకా ఏమి చేయాలి?
19 ‘హృదయశుద్ధిగలవాళ్లు’ దేవున్ని చూస్తారని యేసు చెప్పాడు. (మత్త. 5:8) కాబట్టి, మనం మన ఆలోచనల్ని పవిత్రంగా ఉంచుకుంటూ, చెడు పనులకు దూరంగా ఉండాలి. (2 కొరింథీయులు 4:2 చదవండి.) మనం దేవున్ని చూడాలంటే ఆయనతో మన సంబంధాన్ని బలపర్చుకోవాలని ఈ ఆర్టికల్‌లో చూశాం. అయితే మన జీవితంలో యెహోవా హస్తాన్ని మరింత స్పష్టంగా చూడడానికి విశ్వాసం ఎలా సహాయం చేస్తుందో తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.