కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయనకు ‘మానవుల హృదయం’ తెలుసు

ఆయనకు ‘మానవుల హృదయం’ తెలుసు

దేవునికి దగ్గరవ్వండి

ఆయనకు ‘మానవుల హృదయం’ తెలుసు

2 దినవృత్తాంతములు 6:29-31

మనందరం ఎన్నో సవాళ్లతో, సమస్యలతో సతమతమవుతున్నాం. కొన్నిసార్లు, మనం పడుతున్న కష్టాల్ని, బాధల్ని ఎవ్వరూ పూర్తిగా అర్థంచేసుకోలేరని అనిపించవచ్చు. అయితే, మన భావాలను పూర్తిగా అర్థంచేసుకునే వ్యక్తి ఒకరున్నారు, ఆయన యెహోవా దేవుడు. 2 దినవృత్తాంతములు 6:29-31 వచనాల్లో ఉన్న సొలొమోను మాటలు మనకు ఊరటనిస్తాయి.

సా.శ.పూ. 1026లో యెరూషలేములోని దేవాలయాన్ని ప్రతిష్ఠించేటప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు. ఆయన దాదాపు పది నిమిషాలు చేసిన ఆ ప్రార్థనలో, యెహోవా నమ్మకస్థుడైన దేవుడని, ఇచ్చిన మాట నెరవేర్చేవాడని, ప్రార్థన వినేవాడని కీర్తించాడు.—1 రాజులు 8:23-53; 2 దినవృత్తాంతములు 6:14-42.

‘నీ ఆరాధకుల ప్రార్థనలను ఆలకించు’ అని సొలొమోను దేవుణ్ణి వేడుకున్నాడు. (29వ వచనం) సొలొమోను ప్రార్థనలో ఎన్నో బాధల గురించి ప్రస్తావించినా, (28వ వచనం) ఆయన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరు అనుభవించే ‘నొప్పి,’ పడే ‘కష్టం’ వాళ్లకే తెలుస్తుందని అన్నాడు. ఒక వ్యక్తిని ఒక విషయం బాధ పెడితే, మరో వ్యక్తిని మరో విషయం బాధపెట్టవచ్చు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేవునికి భయపడేవాళ్లు తమ కష్టాలను ఒంటరిగా భరించాల్సిన అవసరం లేదు. సొలొమోను ప్రార్థన చేస్తున్నప్పుడు, ‘తన చేతులు చాపి’ యెహోవాను హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి కదిలించబడిన ఒక ఆరాధకుడు ఆయన మనసులో మెదిలివుండవచ్చు. a తన తండ్రియైన దావీదు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ‘నీ భారం యెహోవా మీద మోపుము’ అని అన్నాడని సొలొమోనుకు గుర్తొచ్చి ఉండవచ్చు.—కీర్తన 55:4, 22.

సహాయం కోసం నిజాయితీగా ప్రార్థించినప్పుడు యెహోవా ఎలా స్పందిస్తాడు? ‘నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నువ్వు ఆలకించి క్షమించి, వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలాన్ని దయచేయుము’ అని సొలొమోను యెహోవాను వేడుకున్నాడు. (29, 31 వచనాలు) ‘ప్రార్థన ఆలకించువాడు’ ఒక గుంపుగా తన ఆరాధకులందరినే కాదు, వాళ్లలో ఒక్కొక్కర్నీ పట్టించుకుంటాడని సొలొమోనుకు తెలుసు. (కీర్తన 65:2) యెహోవా అవసరమైన సహాయాన్ని ఇస్తాడు, అంతేకాదు పాపం చేసిన వ్యక్తి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడితే క్షమిస్తాడు.—2 దినవృత్తాంతములు 6:36-39.

పశ్చాత్తాపపడుతున్న ఆరాధకుడు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడని సొలొమోనుకు ఎందుకు నమ్మకం ఉంది? ఎందుకంటే, సొలొమోను తన ప్రార్థనను కొనసాగిస్తూ ‘వాళ్ల వాళ్ల హృదయాలను నువ్వు [యెహోవా] ఎరిగియున్నావు. (నువ్వు ఒక్కడవే మానవుల హృదయాన్ని ఎరిగినవాడవు)’ అన్నాడు. యెహోవాకు తన నమ్మకమైన ఆరాధకుల్లో ప్రతి ఒక్కరు అనుభవించే నొప్పి, పడే కష్టం తెలుసు, వాళ్ల బాధను ఆయన అర్థంచేసుకుంటాడు.—కీర్తన 37:4.

సొలొమోను ప్రార్థన మనకు ఊరటనిస్తుంది. మన తోటి వాళ్లు మన మనసులోని భావాలను అంటే మనం అనుభవించే ‘నొప్పిని’, పడే ‘కష్టాన్ని’ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. (సామెతలు 14:10) కానీ యెహోవాకు మన హృదయం తెలుసు, మనమంటే ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంది. మన మనసులోని భావాలను ప్రార్థనలో ఆయనకు చెప్పుకుంటే, బాధల్ని సులువుగా తట్టుకోగలుగుతాం. ‘ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత అంతా ఆయన మీద వేయండి’ అని బైబిలు చెబుతోంది.—1 పేతురు 5:7. (w10-E 12/01)

[అధస్సూచి]

a ఆ రోజుల్లో, ‘చేతులు చాపడం,’ అంటే అరచేతులు పైకి ఉండేలా ఆకాశంవైపు చేతులు ఎత్తడం, ప్రార్థన చేయడాన్ని సూచించేది.—2 దినవృత్తాంతములు 6:13.