కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తన దేవుని వల్ల ఊరట పొందాడు

తన దేవుని వల్ల ఊరట పొందాడు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

తన దేవుని వల్ల ఊరట పొందాడు

కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి, ఏలీయా వర్షంలో తడుస్తూ పరుగెత్తుతున్నాడు. యెజ్రెయేలు చేరుకోవాలంటే ఇంకా ఎంతో దూరం పరుగెత్తాలి, పైగా ఆయన కుర్రవాడు కూడా కాదు. అయినా, “యెహోవా హస్తము” ఆయనను బలపరచింది, అందుకే ఆయన అవిశ్రాంతంగా పరుగెత్తుతున్నాడు. ముందెప్పటికన్నా ఇప్పుడు యెహోవా హస్తం తనను ఎంతో బలపరుస్తోందని ఆయనకు అర్థమైంది. ఆయన ఎంత బలం పొందాడంటే, అహాబు రాజు రథాన్ని లాగుతున్న గుర్రాలను కూడా దాటేశాడు!—1 రాజులు 18:46.

ఇప్పుడు అహాబు రాజును దాటి ఏలీయా చాలాదూరం వచ్చేశాడు, అయినా తను పరుగెత్తాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ఆయన ముఖం మీద కొడుతూవుంటే, తన జీవితంలో అత్యంత గొప్ప సంఘటనలు జరిగిన రోజు గురించి ఆలోచిస్తూ ఆయన పరుగెత్తడం ఊహించుకోండి. ఏలీయా దేవుడైన యెహోవాకు, సత్యారాధనకు నిజంగా అదొక గొప్ప విజయం. ఇప్పుడు ఏలీయా ఇంకా ముందుకు వచ్చేశాడు. యెహోవా తనను ఉపయోగించుకుని ఎంతో శక్తివంతంగా, అద్భుతంగా బయలు ఆరాధనను ఓడించిన స్థలం అంటే కర్మెలు పర్వతం ఆ గాలివానలో, చీకటిలో ఇక ఏమాత్రం కనిపించడం లేదు. వందలాది బయలు ప్రవక్తలు మోసగాళ్లని తేలింది, న్యాయంగానే దేవుడు వాళ్లను నాశనం చేశాడు. మూడున్నర సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో వర్షం పడలేదు, అందుకే వర్షాన్ని కురిపించమని ఏలీయా యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు వర్షం కురిసింది! a1 రాజులు 18:18-45.

ఆ వర్షంలో ఏలీయా, 30 కి.మీ. దూరంలో ఉన్న యెజ్రెయేలుకు పరుగెత్తుతూ, బయలు ప్రవక్తల నాశనం తర్వాత పరిస్థితులు నిజంగా మలుపు తిరుగుతాయని అనుకుని ఉండవచ్చు. అహాబులో మార్పు రావాలి! జరిగిందంతా చూసిన తర్వాత ఆయన ఖచ్చితంగా బయలు ఆరాధనను విడిచిపెడతాడనీ, తన రాణి అయిన యెజెబెలును అదుపులో ఉంచుతాడనీ, యెహోవా సేవకులను హింసించడం ఆపుతాడనీ ఏలీయా తనలోతాను అనుకొనివుంటాడు.

ఒక విషయం మనం అనుకున్నట్టు జరుగుతోందనిపిస్తే మనలో ఆశలు చిగురించడం సహజమే. మన పరిస్థితులు రోజురోజుకూ మెరుగౌతాయని ఊహించుకుంటాం. ఆఖరికి, జీవితంలోని తీవ్రమైన సమస్యలు కూడా తీరిపోయాయని అనుకుంటాం. ఏలీయా ఒకవేళ అలా ఆలోచించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ఆయన కూడా ‘మనలాంటి మనిషే.’ (యాకోబు 5:17) నిజానికి ఏలీయా కష్టాలు అంతటితో ఆగిపోలేదు. కొన్ని గంటల్లోనే ఆయన ఎంతో భయపడి, నిరాశపడి చనిపోవాలని కూడా అనుకుంటాడు. అసలు ఏం జరిగింది? తన ప్రవక్త విశ్వాసాన్ని యెహోవా ఎలా బలపర్చాడు? ఆయనలో ధైర్యాన్ని ఎలా నింపాడు? ఇప్పుడు చూద్దాం.

ఊహించని మలుపు

అహాబు యెజ్రెయేలులోవున్న తన రాజభవనానికి చేరుకునేసరికి ఆయనలో మార్పు ఏమైనా కనిపించిందా? ఆయనలో దైవభక్తి పెరిగిందా? ఆయన గురించి మనం ఇలా చదువుతాం: ‘ఏలీయా చేసినదంతా, అతడు ఖడ్గంతో ప్రవక్తలనందరినీ చంపించిన సంగతి అహాబు యెజెబెలుకు తెలియజేశాడు.’ (1 రాజులు 19:1) ఆ రోజు జరిగిన సంగతుల గురించి అహాబు చెబుతున్నప్పుడు ఏలీయా దేవుడైన యెహోవా గురించి ఆయన అసలు ప్రస్తావించలేదని గమనించండి. ఆ అద్భుతాలు ‘ఏలీయా చేశాడు’ అని అహాబు అన్నాడు, అంటే ఆయన వాటిని కేవలం మానవ దృష్టితోనే చూశాడు. అదంతా చూసినా ఆయనలో యెహోవా దేవుని మీద గౌరవం కలగలేదని అర్థమౌతోంది. మరి పగతోవున్న యెజెబెలు ఎలా స్పందించింది?

ఆమె కోపంతో రగిలిపోయింది! ‘రేపు ఈ వేళకు నేను నీ ప్రాణాన్ని వారిలో ఒకని ప్రాణంలా చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక’ అని పగతో ఏలీయాకు వర్తమానం పంపింది. (1 రాజులు 19:2) ఈ చావు బెదిరింపు వెన్నులో వణుకుపుట్టించేదే! మరో మాటలో చెప్పాలంటే, తన బయలు ప్రవక్తలను చంపినందుకు ప్రతీకారంగా ఏలీయాను అదే రోజు చంపించకపోతే తను చచ్చిపోతానని యెజెబెలు శపథం చేసింది. ఒకసారి ఊహించుకోండి, గాలివాన వచ్చిన ఆ రాత్రి యెజ్రెయేలులోని ఒక చిన్న ఇంట్లో బసచేస్తున్న ఏలీయా ఉన్నట్టుండి నిద్రలేవాల్సి వచ్చింది. అదీ, యెజెబెలు రాణి పంపిన ఆ భయంకరమైన వార్త వినడానికే! అప్పుడు ఆయన ఎలా స్పందించాడు?

భయం, నిరుత్సాహం ఆవహించాయి

బయలు ఆరాధనతో యుద్ధం దాదాపు ముగిసిందని ఏలీయా అనుకుంటే ఆయన పొరపడినట్లే. అంత జరిగినా యెజెబెలులో ఎలాంటి మార్పూ రాలేదు. ఆమె అప్పటికే ఏలీయా నమ్మకమైన తోటి ప్రవక్తల్లో చాలామందిని చంపించింది, ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు అనిపించింది. బైబిలు ఆయన గురించి ఇలా చెబుతోంది: ‘ఏలీయా భయపడ్డాడు.’ యెజెబెలు తనను ఎంత ఘోరంగా చంపుతుందో ఏలీయా ఊహించుకొని ఉంటాడా? ఒకవేళ దాని గురించే ఆలోచిస్తూ ఉంటే, ఆయన ధైర్యం తప్పక నీరుగారివుంటుంది. ఏదేమైనా ఏలీయా తన “ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయాడు.”—1 రాజులు 18:4; 19:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

ఏలీయా ఒక్కడే కాదు, చాలామంది విశ్వాసులు కూడా అంతలా భయపడ్డారు. చాలాకాలం తర్వాత జీవించిన అపొస్తలుడైన పేతురు ఉదాహరణే తీసుకోండి. ఆయనను నీళ్ల మీద తనతోపాటు నడిచేలా యేసు చేసినప్పుడు పేతురు ‘గాలిని చూస్తూ’ ఉన్నాడు. దాంతో ధైర్యం కోల్పోయి మునిగిపోసాగాడు. (మత్తయి 14:30) పేతురును, ఏలీయాను చూసి మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ధైర్యం కోల్పోకుండా ఉండాలంటే మనల్ని భయపెట్టే ప్రమాదాల మీద కాకుండా మన నిరీక్షణకు, బలానికి మూలమైన దానిమీద మనసుపెట్టాలి.

“ఇంతమట్టుకు చాలు”!

భయం వల్ల ఏలీయా నైరుతి దిశలో దాదాపు 150 కి.మీ. దూరంలోవున్న బెయేర్షెబా అనే పట్టణానికి పారిపోయాడు, అది యూదా దక్షిణ సరిహద్దు దగ్గర్లో ఉంది. ఏలీయా అక్కడ తన దాసుణ్ణి వదిలేసి ఒంటరిగా అరణ్యానికి వెళ్లిపోయాడు. ఆయన ‘ఒక రోజు ప్రయాణం’ చేశాడని వృత్తాంతం చెబుతోంది. అంటే తనతోపాటు ఆహారంగానీ కావాల్సిన వస్తువులుగానీ తీసుకెళ్లకుండా ఆయన ఉదయాన్నే బయలుదేరి ఉంటాడని మనం ఊహించుకోవచ్చు. నిరుత్సాహం, భయం ఆవహించిన ఏలీయా మండుటెండలో రాళ్లూరప్పలూ ఉన్న దారిగుండా ఎంతో కష్టపడి నడుచుకుంటూ వెళ్లాడు. ఎండ ప్రతాపం తగ్గి చీకటిపడే సరికి ఏలీయాలో ఇక ఏమాత్రం సత్తువ లేదు. అలిసిపోయి బదరీ చెట్టు కింద (ఒక పొద కింద) కూర్చుండిపోయాడు, ఆ నిర్జన ప్రాంతంలో తలదాచుకోవడానికి దగ్గర్లో ఇంకేదీ లేదు.—1 రాజులు 19:4.

పూర్తిగా కృంగిపోయిన ఏలీయా తన ప్రాణం తీసేయమని ప్రార్థించాడు. “నా పితరులకంటె నేను ఎక్కువవాడను కాను” అని ఆయన అన్నాడు. ఆ సమయానికి తన పితరులు సమాధిలో మట్టి, ఎముకలుగా మాత్రమే మిగిలారని అంటే వాళ్లు ఎవరికీ ఏ మేలూ చేయలేని స్థితిలో ఉన్నారని ఆయనకు తెలుసు. (ప్రసంగి 9:10) తన పరిస్థితి కూడా వాళ్లలాగే ఉందని ఏలీయాకు అనిపించింది. అందుకే “ఇంతమట్టుకు చాలు” అని తన బాధను వెళ్లగ్రక్కాడు. ఇక బ్రతకడం ఎందుకని అనుకున్నాడు.

ఒక దైవజనుడు ఇంతగా కృంగిపోవడం చూసి మనం ఆశ్చర్యపోవాలా? లేదు. ఎందుకంటే రిబ్కా, యాకోబు, మోషే, యోబు వంటి ఎంతోమంది విశ్వాసులైన స్త్రీపురుషులు బాగా కృంగిపోయి చావును కోరుకున్నారని బైబిలు చెబుతోంది.—ఆదికాండము 25:22; 37:35; సంఖ్యాకాండము 11:13-15; యోబు 14:13.

నేడు మనం ‘అపాయకరమైన కాలాల్లో’ జీవిస్తున్నాం. కాబట్టి చాలామంది, చివరకు విశ్వాసులైన దేవుని సేవకులు కూడా అప్పుడప్పుడు కృంగిపోతారు. (2 తిమోతి 3:1) ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైతే, ఏలీయాలాగే మీరు కూడా మీ బాధను దేవునికి చెప్పుకోండి. ఎంతైనా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” యెహోవాయే. (2 కొరింథీయులు 1:3) ఆయన ఏలీయాను ఓదార్చాడా?

యెహోవా తన ప్రవక్తను పోషించాడు

తనెంతో ప్రేమించే ప్రవక్త అరణ్యంలో ఒక పొద కింద పడుకొని తన ప్రాణం తీసేయమని వేడుకుంటుంటే, దాన్ని పరలోకం నుండి చూస్తున్న యెహోవాకు ఏమనిపించి ఉంటుంది? మనం ఊహించనవసరం లేదు. ఏలీయా నిద్రలోకి జారుకున్నాక యెహోవా ఆయన దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు. ఆ దూత ఏలీయాను మెల్లగా తట్టి లేపి, ‘లేచి భోజనం చేయి’ అన్నాడు. ఏలీయా అలాగే చేశాడు, ఆ దూత ఆయనకు దయతో వేడివేడిగా అప్పాన్ని, నీళ్లను ఇచ్చాడు. ఏలీయా ఆ దేవదూతకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పాడా? ఆ ప్రవక్త అప్పం తిని, నీళ్లు తాగి మళ్లీ పడుకుండిపోయాడని మాత్రమే మనం బైబిల్లో చదువుతాం. ఆయన మాట్లాడలేనంతగా కృంగిపోయాడా? ఏదేమైనా ఆ దేవదూత ఆయనను రెండవసారి లేపాడు, బహుశా అప్పటికి తెల్లవారి ఉంటుంది. ఆ దేవదూత మరోసారి ఏలీయాతో ‘లేచి భోజనం చేయి’ అంటూ ఆలోచింపజేసే ఈ మాటలు అన్నాడు: ‘నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలి.’—1 రాజులు 19:5-7.

దేవుని సహాయంతో ఆ దేవదూత ఆయన ఎక్కడకు వెళ్తున్నాడో తెలుసుకోగలిగాడు. ఏలీయా తన స్వశక్తితో అంత దూరం ప్రయాణించలేడని కూడా ఆ దూతకు తెలుసు. మన లక్ష్యాలేమిటో, మన పరిమితులేమిటో మనకన్నా బాగా తెలిసిన అలాంటి దేవుణ్ణి సేవిస్తే ఎంతో ఊరట పొందుతాం. (కీర్తన 103:13, 14) ఆ భోజనం వల్ల ఆయనకు ఎంత శక్తి వచ్చింది?

మనం ఇలా చదువుతాం: ‘అతడు లేచి భోజనం చేసి, ఆ భోజనపు బలంతో నలువది రాత్రింబగళ్లు ప్రయాణం చేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబుకు వచ్చాడు.’ (1 రాజులు 19:8) తనకన్నా దాదాపు ఆరు శతాబ్దాల ముందు జీవించిన మోషేలా, దాదాపు పది శతాబ్దాల తర్వాత జీవించిన యేసులా ఏలీయా 40 పగళ్లూ 40 రాత్రిళ్లూ ఉపవాసమున్నాడు. (నిర్గమకాండము 34:28; లూకా 4:1, 2) ఆ ఒక్క భోజనంతో ఆయన సమస్యలన్నీ తీరిపోలేదు కానీ ఎంతో అద్భుతంగా అది ఆయనకు శక్తినిచ్చింది. వయసు పైబడిన ఏలీయా ఎలాంటి దారీలేని అరణ్యంలో రోజుల తరబడి, వారాల తరబడి అలా దాదాపు నెలన్నర రోజులు కష్టపడుతూ చేసిన ప్రయాణం గురించి ఒకసారి ఆలోచించండి.

యెహోవా తన సేవకులను ఇప్పుడు కూడా పోషిస్తున్నాడు, అయితే భౌతిక ఆహారంతో కాదుగానీ మరెంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక ఆహారంతో పోషిస్తున్నాడు. (మత్తయి 4:4) ఆయన వాక్యంలో, పూర్తిగా బైబిలు ఆధారంగా రూపొందిన ప్రచురణల్లో ఆయన గురించి తెలుసుకుంటూ ఆధ్యాత్మిక పోషణ పొందుతున్నాం. దానివల్ల సమస్యలన్నీ తీరిపోవు, కానీ మనం సొంతగా సహించలేని వాటిని సహించగలుగుతాం. అంతేకాదు, “నిత్యజీవము” కూడా పొందగలుగుతాం.—యోహాను 17:3.

ఏలీయా దాదాపు 320 కి.మీ. నడిచి చివరకు హోరేబు కొండ దగ్గరకు చేరుకున్నాడు. అంతకుముందు యెహోవా దేవుడు ఒక దేవదూత ద్వారా మండుతున్న పొదలో మోషేకు అక్కడే కనిపించాడు, ఆ తర్వాత అదే స్థలంలో ఇశ్రాయేలుతో ధర్మశాస్త్ర నిబంధన చేశాడు. ఇప్పుడు ఏలీయా అక్కడే ఒక గుహలో తలదాచుకున్నాడు.

యెహోవా తన ప్రవక్తను ఎలా ఓదార్చి, బలపర్చాడు?

హోరేబు కొండ దగ్గర యెహోవా “వాక్కు” అంటే బహుశా ఒక దేవదూత, ‘ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు?’ అని అడిగాడు. బహుశ ఆయన ఆ ప్రశ్నను చాలా మృదువుగా అడిగివుంటాడు, అందుకే ఏలీయా దాన్నొక అవకాశంగా తీసుకుని తన భావాలను కుమ్మరించాడు. ఏలీయా ఇలా అన్నాడు: ‘ఇశ్రాయేలువారు నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠాలను పడగొట్టి, నీ ప్రవక్తలను ఖడ్గంతో హతం చేశారు. సైన్యములకు అధిపతి, దేవుడు అయిన యెహోవా కోసం మహా రోషంగలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలివుండగా వాళ్లు నా ప్రాణం కూడా తీసివేయడానికి చూస్తున్నారు.’ (1 రాజులు 19:9, 10) ఏలీయా అంతగా ఎందుకు కృంగిపోయాడు? కనీసం మూడు కారణాలను ఆయన మాటల్లో చూస్తాం.

మొదటిగా, ఏలీయా తను చేసిన పనంతా వ్యర్థమైపోయిందని అనుకున్నాడు. దేవుని పరిశుద్ధమైన పేరుకూ ఆయన ఆరాధనకూ మొదటి స్థానమిస్తూ ‘మహా రోషంతో’ యెహోవాను ఎన్నో ఏళ్లు సేవించినా పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నట్లు ఆయనకు అనిపించింది. ప్రజలు ఇంకా అవిశ్వాసులుగానే, తిరుగుబాటుదారులుగానే ఉన్నారు. మరోవైపు అబద్ధ ఆరాధన ఎంతో ప్రబలిపోతోంది. రెండవదిగా, ఏలీయా తను ఏకాకినయ్యానని అనుకుని ‘నేను ఒకణ్ణి మాత్రమే మిగిలివున్నాను’ అన్నాడు. ఇశ్రాయేలు జనాంగంలోని యెహోవా ఆరాధకుల్లో తనే చివరివాడని అనుకున్నాడు. మూడవదిగా, ఆయన భయపడ్డాడు. తోటి ప్రవక్తల్లో చాలామంది అప్పటికే చంపబడ్డారు, ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆయనకు బలంగా అనిపించింది. అలాంటి భావాలు బయటకు చెప్పుకోవడం అంత సులువు కాదు. అయినా ఏలీయా అహానికి, అవమానపాలవుతాననే భయానికి చోటివ్వలేదు. ప్రార్థన చేసినప్పుడు దేవునితో మనసు విప్పి మాట్లాడాలని విశ్వాసులందరూ ఆయనను చూసి నేర్చుకోవచ్చు.—కీర్తన 62:8.

ఏలీయా భయాందోళనలను యెహోవా ఎలా పోగొట్టాడు? గుహ ద్వారం దగ్గర నిలబడమని ఆ దేవదూత ఏలీయాకు చెప్పాడు. ఏమి జరుగుతుందో తెలియకపోయినా ఏలీయా ఆయన చెప్పినట్లే చేశాడు. అప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. దాని ధాటికి పర్వతాలు, శిలలు కూడా బద్దలయ్యాయి. అంటే తప్పకుండా చెవులు చిల్లులుపడేంత పెద్ద శబ్దం వచ్చివుంటుంది. అంత బలంగా వీచే గాలిలో, వెంట్రుకలతో తయారుచేసిన బరువైన తన పై వస్త్రం ఊడిపోకుండా పట్టుకుంటూ ఏలీయా తన కళ్లను కాపాడుకోవడానికి ప్రయత్నించడం ఊహించండి. తర్వాత, భూకంపం వచ్చి ఆ ప్రాంతం విపరీతంగా కంపిస్తూవుంటే పడిపోకుండా నిలబడడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఆయన తేరుకునేలోపే ఆ ప్రాంతంలో పెద్దపెద్ద మంటలు రేగాయి, వాటి తీక్షణమైన వేడి నుండి తప్పించుకోవడానికి ఆయన గుహ లోపలికి వెళ్లాల్సివచ్చింది.—1 రాజులు 19:11, 12.

తన ప్రకృతి శక్తిని అద్భుతరీతిలో చూపించిన ఈ మూడు ప్రదర్శనల్లోనూ యెహోవా ‘ప్రత్యక్షం కాలేదు’ అని బైబిలు చెబుతోంది. బయలులా యెహోవా కల్పితమైన ప్రకృతి దేవుడు కాదని ఏలీయాకు తెలుసు. మోసపోయిన బయలు ఆరాధకులు, “మేఘ వాహకుడు” లేదా వర్షాలు కురిపించేవాడు అని బయలును కొనియాడేవాళ్లు. ప్రకృతిలోని మహా శక్తికి నిజంగా యెహోవాయే మూలం, అయినా ఆయన చేసిన వాటన్నిటికన్నా ఆయనే ఎంతో గొప్పవాడు. నిజానికి ఆకాశాలు కూడా ఆయనకు సరిపోవు! (1 రాజులు 8:27) తను చూసిన ఆ సంఘటనలు ఏలీయాకు ఎలా సహాయం చేశాయి? ఆయన భయాన్ని ఒక్కసారి గుర్తుచేసుకోండి. అంత గొప్ప శక్తిమంతుడైన యెహోవా దేవుడు తన పక్కనుండగా అహాబుకు, యెజెబెలుకు ఏలీయా ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు!—కీర్తన 118:6.

మంటలు ఆరిపోయాక నిశ్శబ్ధం ఆవహించింది, అప్పుడు ఏలీయా ‘మిక్కిలి నిమ్మళంగా మాట్లాడే ఒక స్వరం’ విన్నాడు. అది ఏలీయా భావాలను మళ్లీ చెప్పమని అడిగింది, అప్పుడు ఏలీయా తన భావాలను రెండవసారి కుమ్మరించాడు. b బహుశా దానివల్ల ఏలీయాకు ఇంకాస్త ఊరట కలిగి ఉంటుంది. అయితే, ‘మిక్కిలి నిమ్మళంగా మాట్లాడే స్వరం’ చెప్పిన తర్వాతి మాటలు విని ఏలీయా ఖచ్చితంగా ఇంకెంతో ఓదార్పు పొందాడు. ఏలీయా విలువైనవాడని యెహోవా ఆయనకు అభయమిచ్చాడు. ఎలా? ఇశ్రాయేలులో బయలు ఆరాధనకు వ్యతిరేకంగా జరగబోయే యుద్ధంలో తను చేయాలనుకుంటున్న దాని గురించి దేవుడు చాలా విషయాలు ఆయనకు తెలియజేశాడు. ఏలీయా చేసిన పని ఖచ్చితంగా వృథా కాలేదు, ఎందుకంటే దేవుడు చేయాలనుకున్నది నిరాటంకంగా జరుగుతోంది. అంతేకాదు, యెహోవా అనుకున్నది నెరవేర్చడానికి ఏలీయా ఇంకా పనిచేయాల్సి ఉంది, అందుకే యెహోవా ఆయనకు కొన్ని ప్రత్యేక సూచనలు ఇచ్చి ఆ ప్రాంతంలో పనిచేయమని తిరిగి పంపించాడు.—1 రాజులు 19:12-17.

మరి ఏలీయా ఒంటరితనం విషయంలో యెహోవా ఏమి చేశాడు? ఆయన రెండు రకాలుగా సహాయం చేశాడు. మొదటిగా, ఎలీషాను తర్వాతి ప్రవక్తగా అభిషేకించమని ఏలీయాతో చెప్పాడు. ఆ పరిస్థితుల్లో ఆయనకు అదెంతో ఊరటనిచ్చి ఉంటుంది! రెండవదిగా, యెహోవా సంతోషకరమైన ఈ వార్త చెప్పాడు: ‘ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్లూనని, నోటితో వాని ముద్దుపెట్టుకొనని ఏడు వేలమంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు.’ (1 రాజులు 19:18) ఏలీయా ఒంటరివాడు కాదు. బయలును ఆరాధించని నమ్మకమైన ఇశ్రాయేలీయులు ఇంకా వేలాదిమంది ఉన్నారని తెలుసుకొని ఏలీయా ఎంతో ఊరట పొందివుంటాడు. ఆ రోజుల్లో దాదాపు మిగిలిన వాళ్లంతా యెహోవాకు ఎదురుతిరుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏలీయా యెహోవాకు నమ్మకంగా సేవచేస్తూ, ఆయనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా ఉండే విషయంలో నమ్మకమైన ఇశ్రాయేలీయులకు ఆదర్శంగా ఉండడం ఎంతో అవసరం. ‘మిక్కిలి నిమ్మళమైన స్వరంతో’ యెహోవా దూత మాట్లాడిన ఆ మాటలు ఏలీయా హృదయాన్ని ఎంతో స్పృశించి ఉంటాయి. దేవుడే స్వయంగా తనతో మాట్లాడినట్లు ఆయనకు అనిపించివుంటుంది.

సృష్టిలోని గొప్ప ప్రకృతి శక్తులను చూసి మనం ఏలీయాలా ఎంతో ఆశ్చర్యపోతుంటాం, అలా ఆశ్చర్యపోవాలి కూడా. యెహోవాకు ఎంత శక్తి ఉందో సృష్టిని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. (రోమీయులు 1:20) తన సేవకులకు సహాయం చేయడానికి తన అపారమైన శక్తిని ఉపయోగించడం యెహోవాకు ఇప్పటికీ ఇష్టం. (2 దినవృత్తాంతములు 16:9) అయితే, దేవుడు ఎక్కువగా తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. (యెషయా 30:21) ఒక విధంగా బైబిలు ‘మిక్కిలి నిమ్మళమైన’ ఆ ‘స్వరంలాంటిది.’ దాని ద్వారా యెహోవా నేడు మనల్ని నిర్దేశిస్తున్నాడు, సరిదిద్దుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాననే హామీ ఇస్తున్నాడు.

హోరేబు కొండ దగ్గర యెహోవా ఇచ్చిన ఊరటకు ఏలీయా సానుకూలంగా స్పందించాడా? నిస్సందేహంగా! అబద్ధ ఆరాధనలోని దుష్టత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యస్థుడు, నమ్మకస్థుడు అయిన ప్రవక్త మళ్లీ తన పని మొదలుపెట్టాడు. ఏలీయాలాగే మనం కూడా దేవుడు ప్రేరేపించిన మాటలను, అంటే ‘లేఖనాల వల్ల కలిగే ఆదరణను’ మనసులోకి తీసుకుంటే ఆయన చూపించినలాంటి విశ్వాసాన్ని చూపించగలుగుతాం.—రోమీయులు 15:4. (w11-E 07/01)

[అధస్సూచీలు]

a కావలికోట జనవరి - మార్చి, 2008 సంచికలోని, “వారి విశ్వాసాన్ని అనుసరించండి—స్వచ్ఛారాధనను అనుసరించిన వ్యక్తి” అనే ఆర్టికల్‌ చూడండి.

b ‘మిక్కిలి నిమ్మళంగా మాట్లాడిన స్వరం,’ 1 రాజులు 19:9 లో ప్రస్తావించిన ‘యెహోవా వాక్కును’ తెలియజేసిన దేవదూతదే అయ్యుంటుంది. ఈ దూత కేవలం “యెహోవా” అని 15వ వచనంలో ఉంది. ఆ మాటలు చదువుతున్నప్పుడు, అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులను నడిపించడానికి ఉపయోగించుకున్న దూత మనకు గుర్తుకురావచ్చు. “నా నామము ఆయనకున్నది” అని ఆ దూత గురించే దేవుడు చెప్పాడు. (నిర్గమకాండము 23:21) ఈ విషయాన్ని మనం మొండిగా వాదించలేం. అయినా భూమ్మీదకు రాకముందు యేసు ‘వాక్యంగా,’ అంటే యెహోవా ముఖ్య ప్రతినిధిగా ఆయన సేవకులతో మాట్లాడాడన్న విషయాన్ని గమనించండి.—యోహాను 1:1.

[15వ పేజీలోని చిత్రం]

మంచి సమయాల్లోనూ కష్ట సమయాల్లోనూ యెహోవా ఏలీయాను గొప్పగా ఆశీర్వదించాడు

[16వ పేజీలోని చిత్రం]

ఏలీయా తీవ్రంగా కృంగిపోయినప్పుడు తన భావాలను యెహోవా ముందు కుమ్మరించాడు

[17వ పేజీలోని చిత్రం]

ఏలీయాను ఓదార్చడానికి, ప్రోత్సహించడానికి యెహోవా తన అపారమైన శక్తిని ఉపయోగించాడు