కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేదలకు శుభవార్త

పేదలకు శుభవార్త

పేదలకు శుభవార్త

‘పే దవాళ్లను దేవుడు శాశ్వతంగా మర్చిపోడు’ అని దేవుని వాక్యం మనకు అభయమిస్తోంది. (కీర్తన 9:18, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ‘నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు’ అని కూడా అది మన సృష్టికర్త గురించి చెబుతోంది. (కీర్తన 145:16) ఇవి వట్టి మాటలు కావు. సర్వశక్తిగల దేవుడు పేదరికాన్ని రూపుమాపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయగలడు. అసలు పేదలకు అవసరమైనదేమిటి?

పేద దేశాలకు, సాధ్యమైతే ఒక “దయగల నియంత” కావాలని ఆఫ్రికా ఆర్థికశాస్త్రవేత్త ఒకరు అన్నారు. అంటే, పేదరికాన్ని రూపుమాపే వ్యక్తికి చర్య తీసుకునేంత శక్తి, శ్రద్ధ చూపించేంత దయ ఉండాలి. చెప్పాలంటే, పేదరికాన్ని నిర్మూలించే పాలకుడు ప్రపంచ పాలకుడు కూడా అయ్యుండాలి. ఎందుకంటే, దేశాలన్నీ సామాజికంగా, ఆర్థికంగా ఒకే స్థాయిలో లేకపోవడం వల్లే తరచూ కడు పేదరికం ఏర్పడుతుంది. అంతేకాదు పేదరికానికి కారణమైన, మనుషుల స్వార్థపూరిత నైజం విషయంలో కూడా ఆయన ఏదో ఒకటి చేయగలగాలి. అలాంటి పరిపూర్ణ పరిపాలకుడు ఎవరైనా ఉన్నారా?

బీదలకు సువార్త ప్రకటించడానికి యేసును దేవుడు పంపించాడు. దేవుడు తనకు అప్పగించిన పని గురించి చదువుతూ యేసు ఇలా అన్నాడు: ‘యెహోవా ఆత్మ నామీద ఉంది. బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు.’—లూకా 4:16-18.

ఆ సువార్త ఏమిటి?

యేసును దేవుడు రాజుగా అభిషేకించాడు. ఇది నిజంగా శుభవార్తే! పేదరికాన్ని రూపుమాపడానికి నిజంగా ఆయన పరిపూర్ణ పాలకుడు. ఎందుకంటే, (1) ఆయన మానవులందరినీ పరిపాలించే శక్తిగల రాజు; (2) ఆయన పేదవాళ్లతో దయగా వ్యవహరిస్తాడు, వాళ్లపట్ల శ్రద్ధ చూపించమని తన అనుచరులకు బోధిస్తాడు; (3) ఆయన పేదరికానికి మూలకారణాన్ని అంటే వారసత్వంగా వచ్చిన మనలోని స్వార్థపూరిత నైజాన్ని కూడా తీసివేస్తాడు. సువార్తలోని ఈ మూడు అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

1. అన్ని దేశాల మీద యేసుకున్న అధికారం దేవుని వాక్యం ఆయన గురించి ఇలా చెబుతోంది: ‘సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవాళ్లు ఆయనను సేవించేలా ప్రభుత్వం ఆయనకు ఇవ్వబడింది.’ (దానియేలు 7:14) మానవులందరినీ ఒకే ప్రభుత్వం పరిపాలిస్తే ఎన్ని ప్రయోజనాలుంటాయో ఒక్కసారి ఊహించగలరా? భూవనరుల కోసం పోరాటాలు, తగవులు ఇక ఉండవు. అందరూ సమానంగా లాభం పొందుతారు. తను శక్తిగల ప్రపంచ పాలకుణ్ణి అవుతానని యేసే స్వయంగా హామీ ఇచ్చాడు. ఆయనిలా అన్నాడు: ‘పరలోకంలో, భూమ్మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది.’—మత్తయి 28:18.

2. పేదల మీద యేసుకున్న దయ సువార్త ప్రకటించినంత కాలం ఆయన పేదలతో దయగా వ్యవహరించాడు. ఉదాహరణకు, వైద్య చికిత్సకు తన డబ్బంతా ఖర్చుపెట్టిన ఒక స్త్రీ బాగుపడాలనే ఆశతో యేసు వస్త్రాన్ని ముట్టుకుంది. 12 సంవత్సరాలుగా ఆమెకు రక్తస్రావం అవుతోంది కాబట్టి తప్పకుండా రక్తహీనతతో బాధపడివుంటుంది. ధర్మశాస్త్రం ప్రకారం, ఆమె ముట్టుకున్న వాళ్లందరూ అపవిత్రులౌతారు. కానీ యేసు ఆమెతో దయగా వ్యవహరించాడు. ఆయన ఆమెతో ఇలా అన్నాడు: ‘కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపర్చింది, సమాధానంతో వెళ్లు. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక.’—మార్కు 5:25-34.

ప్రజల స్వభావాన్ని మార్చే శక్తి యేసు బోధలకు ఉంది, దానివల్ల వాళ్లూ ఇతరులతో దయగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు, దేవుణ్ణి ఎలా సంతోషపర్చాలని ఒక వ్యక్తి యేసును అడిగినప్పుడు ఆయనిచ్చిన జవాబును పరిశీలించండి. పొరుగువాళ్లను ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడని ఆ వ్యక్తికి తెలుసు. అయితే, ‘నా పొరుగువాడు ఎవరు?’ అని అతను యేసును అడిగాడు.

దానికి జవాబిస్తూ యేసు ఒక ప్రఖ్యాత ఉదాహరణ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు దొంగలు అతన్ని దోచుకొని ‘కొరప్రాణంతో’ వదిలేసి వెళ్లిపోయారు. ఆ దారిలో వెళ్తున్న ఒక యాజకుడు పక్కనుండి వెళ్లిపోయాడు. ఒక లేవీయుడు కూడా అలాగే చేశాడు. ‘అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోతూ, అతను పడివున్న చోటికి వచ్చి అతన్ని చూసి జాలిపడ్డాడు.’ అంతేకాదు, అతని గాయాలను తుడిచి, అతన్ని ఒక పూటకూళ్లవాని ఇంటికి తీసుకువెళ్లి, అతన్ని చూసుకోవడానికి కావాల్సిన డబ్బు కూడా ఇచ్చాడు. తనను ప్రశ్నించిన వ్యక్తిని యేసు ఇలా అడిగాడు: ‘దొంగల చేతిలో చిక్కిన వానికి ఎవడు పొరుగువాడయ్యాడు?’ దానికి ఆ వ్యక్తి, ‘అతనిమీద జాలిపడినవాడే’ అన్నాడు. అప్పుడు యేసు, ‘నువ్వూ వెళ్లి అలాగే చేయి’ అని చెప్పాడు.—లూకా 10:25-37.

యెహోవాసాక్షులుగా మారిన వాళ్లు యేసు చేసిన అలాంటి బోధలను అధ్యయనం చేస్తారు కాబట్టి, అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో తమ వైఖరి మార్చుకుంటారు. ఉదాహరణకు, ఒక లాట్వియా రచయిత్రి 1960ల మధ్యకాలంలో పాట్మ శిక్షా శిబిరంలో పనిచేస్తున్నప్పుడు తను అనారోగ్యం బారినపడిన దాని గురించి విమెన్‌ ఇన్‌ సోవియట్‌ ప్రిజన్స్‌ అనే తన పుస్తకంలో ఇలా రాసింది: “నేను అనారోగ్యంతో బాధపడినంత కాలం [సాక్షులు] శ్రద్ధగా పనిచేసే నర్సుల్లా నన్ను చూసుకున్నారు. అంతకన్నా మంచి సంరక్షణ నాకు ఇంకెక్కడా దొరికేది కాదు. జాతి, మతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేయడం తమ బాధ్యతని యెహోవాసాక్షులు అనుకుంటారు.”

ఈక్వెడార్‌లోని ఎన్‌కాన్‌ అనే నగరంలో ఆర్థిక మాంద్యం వల్ల కొంతమంది యెహోవాసాక్షులు తమ ఉద్యోగాలను, రాబడిని కోల్పోయారు. తోటి సాక్షులు వాళ్ల కోసం డబ్బు సంపాదించాలనుకున్నారు. రాత్రిళ్లు చేపలు పట్టి వచ్చే జాలర్లకు అమ్మడానికి వాళ్లు ఆహారం తయారుచేశారు (ఇక్కడున్న చిత్రం చూడండి). పిల్లలతో సహా సంఘంలో అందరూ సహకరించారు. తెల్లవారు జామున నాలుగింటికల్లా పడవలు తిరిగివస్తాయి కాబట్టి, అప్పటికల్లా ఆహారం తయారుచేయడానికి ప్రతీరోజు రాత్రి ఒంటిగంటకే వంట మొదలుపెట్టేవాళ్లు. అలా సంపాదించిన డబ్బును ఒక్కొక్కరి అవసరాలకు తగ్గట్టు పంచేవాళ్లు.

యేసు చూపించిన స్ఫూర్తి, ఆయన బోధలు అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో ప్రజల వైఖరిని నిజంగా మార్చగలవని ఇలాంటి అనుభవాలు చూసినప్పుడు అర్థమౌతుంది.

3. మానవుల స్వార్థపూరిత నైజాన్ని మార్చే విషయంలో యేసుకున్న శక్తి మనుషులు స్వతహాగా స్వార్థపరులనేది జగమెరిగిన సత్యం. ఆ స్వార్థపూరిత నైజాన్ని బైబిలు పాపం అంటోంది. అపొస్తలుడైన పౌలు కూడా ఇలా రాశాడు: “‘నేను మంచి చేయాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది’ అనే ఈ నియమం నాలో పనిచేస్తున్నట్లు గమనిస్తున్నాను.” ఆ తర్వాత ఆయనిలా అన్నాడు: ‘మరణం ఆధీనంలో ఉన్న ఈ నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’ (రోమీయులు 7:21-25, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నిజమైన ఆరాధకుల్లో వారసత్వంగా వచ్చిన పాపపు స్వభావాలను యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఎలా తీసివేస్తాడనే దాని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, వాటిలో ఒకటి పేదరికానికి మూల కారణమైన స్వార్థపూరిత నైజం. ఆయన దాన్నెలా చేస్తాడు?

యేసు బాప్తిస్మం తీసుకున్న కొన్నిరోజుల తర్వాత బాప్తిస్మమిచ్చు యోహాను యేసును ఇలా పరిచయం చేశాడు: “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.” (యోహాను 1:29) త్వరలోనే, స్వార్థపూరిత నైజంతో సహా వారసత్వంగా వచ్చిన పాపం నుండి విడుదలైన ప్రజలతో భూమి నిండిపోతుంది. (యెషయా 11:9) అప్పటికల్లా పేదరికానికి మూల కారణమైన మనలోని స్వార్థపూరిత నైజాన్ని యేసు పూర్తిగా తీసివేస్తాడు.

అందరికీ కావాల్సినవన్నీ దొరికే సమయం గురించి ఆలోచిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా! దేవుని వాక్యం ఇలా చెబుతోంది: ‘ఎవరి భయమూ లేకుండా ప్రతివాడూ తన ద్రాక్ష చెట్టు కింద, తన అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు.’ (మీకా 4:4) యెహోవాకు పూర్తి ఘనత కలిగేలా, ప్రతి ఒక్కరికీ సంతృప్తినిచ్చే పని, పూర్తి భద్రత ఉండే రోజు గురించీ పేదరికం లేని లోకంలో సంతోషంగా జీవించే అవకాశం గురించీ ఆ మాటలు కావ్య రూపంలో చక్కగా వర్ణిస్తున్నాయి. (w11-E 06/01)