కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

బలహీనతలో కూడా బలం పొందుతున్నాను

బలహీనతలో కూడా బలం పొందుతున్నాను

కేవలం 29 కేజీల బరువు ఉండి, చక్రాల కుర్చీలో కూర్చొనివున్న నన్ను చూసిన వాళ్లెవరైనా నేను బలంగా ఉన్నానని అనుకోరు. నా శరీరం బలహీనమౌతున్నా అంతర్గత శక్తే నన్ను బలపరుస్తోంది. బలం, బలహీనత నా జీవితాన్ని ఎలా మలిచాయో ఇప్పుడు చెబుతాను.

నాలుగేళ్లప్పుడు

నా బాల్యాన్ని తలచుకోగానే, అమ్మానాన్నలతో కలిసి దక్షిణ ఫ్రాన్స్‌లోని ఓ పల్లెటూర్లో ఆనందంగా గడిపిన రోజులు గుర్తుకొస్తాయి. మేము ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్లం. మా నాన్న నా కోసం ఒక ఉయ్యాల చేశాడు. మా తోట చుట్టూ పరుగెత్తడమంటే నాకు చాలా ఇష్టం. 1966లో యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. మా నాన్నతో వాళ్లు చాలా సమయం బైబిలు గురించి చర్చించేవాళ్లు. కేవలం ఏడు నెలల్లోనే, తను యెహోవాసాక్షి అవ్వాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత అమ్మ కూడా ఆయన బాటలోనే నడిచింది. ప్రేమ, ఆప్యాయతలు నిండిన కుటుంబంలో నేను పెరిగాను.

మా అమ్మానాన్నల స్వదేశం స్పెయిన్‌. మేము అక్కడికి తిరిగి వెళ్లిన కొంతకాలానికే నా సమస్యలు మొదలయ్యాయి. నా చేతుల్లో, కాళ్ల చీలమండల్లో సూదులతో పొడుస్తున్నట్లు నొప్పి మొదలైంది. రెండేళ్ల పాటు ఎందరో వైద్యులను సంప్రదించాక చివరకు, పేరొందిన ఒక రుమటాలజిస్ట్‌ను (కీళ్లవాత శాస్త్ర నిపుణుడిని) కలిశాం. కానీ ఆయన గంభీరమైన స్వరంతో, “ఇప్పటికే చాలా ఆలస్యమైంది” అన్నాడు. ఆ మాట వినగానే అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. నేను దీర్ఘకాలిక ఆర్‌థ్రైటిస్‌ జబ్బుతో బాధపడుతున్నానని, నా సొంత రోగ నిరోధక వ్యవస్థే నా శరీరంలోని ఆరోగ్యవంతమైన కణజాలాలపై దాడిచేస్తూ కీళ్లలో నొప్పి, వాపు కలుగజేస్తోందని వైద్యుడు వివరించాడు. అప్పుడు నా వయసు పదేళ్లే కాబట్టి ఆయన చెప్పిందేమీ నాకు అర్థం కాలేదు. అయితే అది చేదువార్త అని మాత్రం అర్థమైంది.

చిన్నపిల్లల సనటోరియంలో (దీర్ఘకాల రోగులను; విశ్రాంతి, పర్యవేక్షణ అవసరమైన రోగులను ఉంచే స్థలం) చికిత్స చేయించమని వైద్యుడు సూచించాడు. కళ్లకు ఏమాత్రం ఇంపుగాలేని ఆ భవంతిని చూడగానే నాలో దిగులు మొదలైంది. అక్కడి నియమాలు చాలా కఠినంగా ఉండేవి: నన్‌లు నా జుట్టు కత్తిరించి, ఏమాత్రం ఆకర్షణీయంగా లేని యూనిఫారమ్‌ వేశారు. నేను ఏడుస్తూ, ‘ఇక్కడ ఎలా బ్రతకాలి?’ అని ఆలోచించాను.

యెహోవా శ్రద్ధను చవిచూశాను

యెహోవాను మాత్రమే ఆరాధించాలని మా అమ్మానాన్నలు నేర్పించడం వల్ల, సనటోరియంలోని క్యాథలిక్‌ ఆచారాల్లో పాల్గొనడానికి నేను ససేమిరా ఒప్పుకోలేదు. అందుకు కారణమేమిటో అక్కడి నన్‌లకు ఒక పట్టాన అర్థమయ్యేది కాదు. నన్ను విడిచిపెట్టవద్దని యెహోవాను వేడుకున్నాను. ప్రేమగల తండ్రి ఆప్యాయంగా హత్తుకున్నట్లు, యెహోవా తన రక్షణ హస్తాన్ని నా చుట్టూ వేయడం నేను చవిచూశాను.

శనివారాల్లో అమ్మానాన్నలు నాతో కొద్ది సమయం గడపడానికి అక్కడివాళ్లు అనుమతించేవాళ్లు. నా విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి అమ్మానాన్నలు బైబిలు ప్రచురణలు తెచ్చి ఇచ్చేవాళ్లు. సాధారణంగా పిల్లల్ని సొంత పుస్తకాలు ఉంచుకోనిచ్చేవాళ్లు కాదు. అయినా, నేను రోజూ చదివే బైబిలును, ఆ ప్రచురణలను నాతో ఉంచుకోవడానికి నన్‌లు అంగీకరించారు. అందమైన తోటలా మారే భూమ్మీద ఎల్లకాలం జీవించవచ్చనే, అక్కడ ఎవ్వరూ జబ్బుపడరనే నా నమ్మకం గురించి తోటి అమ్మాయిలతో మాట్లాడేదాన్ని. (ప్రకటన 21:3, 4) కొన్నిసార్లు దిగులుగా ఉండేది, ఒంటరితనం బాధించేది. అయినా యెహోవాపై నాకున్న విశ్వాసం, నమ్మకం బలపడుతున్నందుకు సంతోషించేదాన్ని.

ఆరు నెలలు ఎంతో కష్టంగా గడిచాయి. తర్వాత, వైద్యులు నన్ను ఇంటికి పంపించేశారు. నా ఆరోగ్యం మెరుగవ్వకపోయినా, మళ్లీ అమ్మానాన్నలతో కలిసి ఉన్నందుకు చాలా సంతోషించాను. నా కీళ్లు మరింత కృశించిపోవడంతో చెప్పలేనంత నొప్పిని అనుభవించాను. 13 ఏళ్లు వచ్చేసరికి చాలా బలహీనంగా తయారయ్యాను. అయినా, నా పరలోక తండ్రిని శాయశక్తులా సేవించాలని, 14వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను. అయినప్పటికీ కొన్నిసార్లు ఆయన విషయంలో నిరాశ చెంది, “నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? దయచేసి నన్ను బాగుచెయ్యి. నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో నీకు తెలుసు కదా?” అని ప్రార్థించాను.

కౌమారదశలో చాలా బాధ అనిపించేది. ఎందుకంటే, నా ఆరోగ్యం ఇక మెరుగవ్వదనే నిజాన్ని అంగీకరించాలి. మంచి ఆరోగ్యంతో, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్న నా స్నేహితులతో పోల్చుకుని ఎంతో కృంగిపోయేదాన్ని, నలుగురితో కలవలేకపోయేదాన్ని. అయితే నా కుటుంబం, స్నేహితులు నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. వాళ్లలో ఆలీస్యా అంటే నాకు చాలా ఇష్టం. తను నాకన్నా 20 ఏళ్లు పెద్దదైనా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. అనారోగ్యం గురించి చింతిస్తూ కూర్చునే బదులు, ఇతరుల మీద శ్రద్ధ చూపించడం తను నాకు నేర్పింది.

జీవితాన్ని అర్థవంతంగా గడపడానికి మార్గాలు వెదికాను

18వ ఏట నా జబ్బు తిరగబెట్టింది. దాంతో, క్రైస్తవ కూటాలకు వెళ్లొచ్చినా ఎంతో అలసిపోయేదాన్ని. అయినా సరే, ఖాళీ దొరికినప్పుడల్లా బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేదాన్ని. యెహోవా అన్నివేళలా మనల్ని శారీరక హాని నుండి కాపాడకపోయినా, మనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని మాత్రం తప్పక అందిస్తాడని యోబు, కీర్తనల గ్రంథాల నుండి నేర్చుకున్నాను. నేను తరచూ ప్రార్థించేదాన్ని. ఆ ప్రార్థనల వల్ల “బలాధిక్యము,” “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము” పొందేదాన్ని.—2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:6, 7.

22 ఏళ్లకే నేను చక్రాల కుర్చీకి పరిమితమైపోయాను. అందరూ నన్ను నన్నుగా చూడకుండా కేవలం చక్రాల కుర్చీలో ఉన్న రోగిగా చూస్తారేమోనని ఆందోళన చెందాను. ఏదేమైనా, ఆ చక్రాల కుర్చీ వల్ల నాకు మళ్లీ కొంత స్వాతంత్ర్యం వచ్చింది. “శాపం” అనుకున్నది వరంగా మారింది. నా స్నేహితురాలు ఈసాబెల్‌, తనతోపాటు పరిచర్యలో ఒకనెల 60 గంటలు గడపాలనే లక్ష్యాన్ని పెట్టుకోమని సలహా ఇచ్చింది.

మొదట్లో అదో అర్థంపర్థంలేని సలహా అనిపించింది. కానీ నేను యెహోవా సహాయాన్ని అడిగాను. నా కుటుంబం, స్నేహితులు కూడా మద్దతివ్వడంతో ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఆ నెలంతా చాలా బిజీగా, త్వరత్వరగా గడిచిపోయింది. ఎట్టకేలకు నా భయాందోళనలను జయించాను. ఆ పనిలో ఎంత సంతోషించానంటే, 1996లో నేను క్రమ పయినీరునై, ప్రతీనెల పరిచర్యలో 90 గంటలు గడపాలని నిశ్చయించుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయాల్లో అదొక అత్యుత్తమ నిర్ణయం. అది నన్ను దేవునికి దగ్గర చేసింది, శారీరకంగా కూడా బలపర్చింది. పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడం వల్ల నా నమ్మకాల గురించి ఎంతోమందికి చెప్పగలిగాను, దేవుని స్నేహితులయ్యేలా కొందరికి సాయం చేయగలిగాను కూడా.

యెహోవా నన్ను విడిచిపెట్టలేదు

2001 వేసవిలో, ఓ పెద్ద కారు యాక్సిడెంట్‌లో నా రెండు కాళ్లూ విరిగిపోయాయి. భరించలేని నొప్పితో హాస్పిటల్‌ బెడ్‌ మీద పడుకొని, “యెహోవా దయచేసి నన్ను విడిచిపెట్టకు!” అని లోలోపల తీవ్రంగా ప్రార్థించాను. అప్పుడు, పక్క బెడ్‌ మీద ఉన్న స్త్రీ, “మీరు యెహోవాసాక్షా?” అని నన్ను అడిగింది. జవాబిచ్చే శక్తి లేక, అవునన్నట్లు తల ఊపాను. “యెహోవాసాక్షులు నాకు తెలుసు! నేను మీ పత్రికలు చదువుతుంటాను,” అని ఆమె అంది. అది విన్నప్పుడు నాకెంతో ఊరట కలిగింది. అంత దయనీయ స్థితిలో కూడా యెహోవా గురించి సాక్ష్యమివ్వగలగడం ఓ గొప్ప ఘనత!

నేను కాస్త కోలుకోవడంతో, ఇంకా కొందరికి సాక్ష్యమివ్వాలని అనుకున్నాను. మా అమ్మ, రెండు కాళ్లకూ సిమెంట్‌ పట్టీలు ఉన్న నన్ను చక్రాల కుర్చీలో హాస్పిటల్‌ వార్డంతా తిప్పేది. ఒక్కో రోజు కొందరు రోగుల్ని కలిసి, వాళ్లు ఎలా ఉన్నారో అడిగి, బైబిలు ప్రచురణలు ఇచ్చేవాళ్లం. ఆ పనివల్ల కాస్త అలసిపోయేదాన్ని; అయినా, యెహోవా నాకు కావాల్సిన శక్తినిచ్చాడు.

2003లో మా అమ్మానాన్నలతో

ఈ మధ్య నా నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి, దానికి తోడు నాన్న కూడా చనిపోవడంతో మరింత వేదనకు గురయ్యాను. అయినా, నా సంతోషాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎలాగో తెలుసా? వీలైనప్పుడల్లా, బంధుమిత్రులతో కలిసి ఉంటూ నా సమస్యల్ని మర్చిపోగలుగుతున్నాను. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, బైబిలును పరిశోధించడం, ఫోన్‌లో సాక్ష్యమివ్వడం వంటివి చేస్తుంటాను.

తరచూ నేను కళ్లు మూసుకుని, మనసు “కిటికీ” తెరిచి దేవుడు వాగ్దానం చేసిన కొత్తలోకాన్ని చూస్తుంటాను

చల్లని గాలి, పూల సువాసనల వంటి చిన్నచిన్న ఆనందాల్ని కూడా ఆస్వాదించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అవన్నీ నాలోని కృతజ్ఞతాభావాన్ని పెంచుతున్నాయి. మంచి హాస్య చతురత వల్ల కూడా ఎంతో లాభం ఉంటుంది. ఒకరోజు పరిచర్యలో, నా చక్రాల కుర్చీని తోస్తున్న నా స్నేహితురాలు ఏదో రాసుకుందామని చేతులు తీసింది. దారి ఏటవాలుగా ఉండడంతో నా కుర్చీ జారుకుంటూ వెళ్లి ఆగి ఉన్న ఒక కారును గుద్దేసింది. ఇద్దరం కంగారుపడిపోయాం, కానీ పెద్దగా దెబ్బలేమీ తగల్లేదని చూసుకున్నాక, జరిగింది తలచుకొని ఒకటే నవ్వుకున్నాం.

జీవితంలో నేను చేయలేనివి ఎన్నో ఉన్నాయి. వాటిని నేను, ‘తీరాల్సిన కోరికలు’ అని పిలుస్తాను. తరచూ నేను కళ్లు మూసుకుని, మనసు “కిటికీ” తెరిచి దేవుడు వాగ్దానం చేసిన కొత్తలోకాన్ని చూస్తుంటాను. (2 పేతురు 3:13) మంచి ఆరోగ్యంతో అంతా కలియతిరుగుతూ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తున్నట్లు ఊహించుకుంటాను. “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము” అని దావీదు రాజు రాసిన మాటలు నా మీద ఎంతో ప్రభావం చూపించాయి. (కీర్తన 27:14) నా శరీరం అంతకంతకూ బలహీనమౌతున్నా, యెహోవా నన్ను బలపరుస్తున్నాడు. అందువల్లే, నా బలహీనతలో కూడా బలం పొందుతున్నాను. (w14-E 03/01)