వారి విశ్వాసాన్ని అనుసరించండి | యోసేపు
“నేను దేవుని స్థానమందున్నానా?”
యోసేపు సాయంకాలం తన తోటలో నిల్చుని ఉన్నట్లు ఊహించుకోండి. బహుశా ఆయన ఖర్జూరపు చెట్లను, పండ్ల చెట్లను, మొక్కలతో నిండి ఉన్న నీటి మడుగులను చూస్తుండవచ్చు. ప్రహరి గోడ అవతల ఉన్న ఫరో అంతఃపురాన్ని కూడా ఒక్క క్షణం చూసి ఉంటాడు. మధ్యమధ్యలో ఇంట్లో నుండి వచ్చే శబ్దాలు ఆయన చెవులకు వినపడుతున్నాయి. యోసేపు ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడైన మనష్షే చిన్నవాడైన ఎఫ్రాయిముని ఆడిస్తూ నవ్విపిస్తుంటే, ఆ చేష్టలకు యోసేపు భార్య చిన్నగా నవ్వుతుంటుంది. లోపల ఏమి జరుగుతుందో ఊహించుకుని యోసేపు చిన్నగా నవ్వుకుంటాడు. యెహోవా ఆయనను ఆశీర్వదించాడని యోసేపుకు తెలుసు.
యోసేపు పెద్ద కొడుక్కి మనష్షే అనే పేరు పెట్టాడు. ఎందుకంటే ఆ పేరుకు మర్చిపోవుట అని అర్థం. (ఆదికాండము 41:51) కొన్ని సంవత్సరాల నుండి యోసేపును దేవుడు ఆశీర్వాదిస్తున్నాడు. వాటివల్ల ఇల్లు, అన్నదమ్ములు, తండ్రి గుర్తు వచ్చినప్పుడల్లా కలిగే బాధ కాస్త తగ్గింది. అతని అన్నలకు ఆయన మీదున్న ద్వేషం ఆయన జీవితాన్నే మార్చేసింది. వాళ్లు ఆయన్ని కొట్టారు, చంపేయాలనుకున్నారు, తర్వాత ఆయన్ని వర్తకులకు బానిసగా అమ్మేశారు. అప్పటినుండి ఆయన జీవితం ఒకదాని తర్వాత ఒకటిగా మలుపులు తిరిగింది. దాదాపు 12 సంవత్సరాలు బానిసత్వాన్ని, చెరసాల జీవితాన్ని అనుభవించాడు. కొంతకాలం చెరసాలలో ఇనుప సంకెళ్లతో కూడా ఉన్నాడు. కాని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. ఆ గొప్ప ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత యోసేపే ముఖ్య అధికారి. a
చాలా సంవత్సరాలనుండి యెహోవా చెప్పినవన్నీ జరగడాన్ని యోసేపు చూశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఏడు సంవత్సరాలు ఐగుప్తులో పంట బాగా పండింది. అప్పుడు దేశంలో ఎక్కువ పండిన ధాన్యమంతటిని నిల్వచేసే పనిని యోసేపు చూసుకున్నాడు. ఆ సమయంలో ఆయన భార్య ఆసెనతు ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. అయినా యోసేపుకు ఎక్కడో దూరంలో ఉన్న తన ఇల్లు గుర్తుకువచ్చేది. ముఖ్యంగా తమ్ముడు బెన్యామీనును, తనెంతో ప్రేమించే తండ్రి యాకోబును గుర్తుచేసుకునేవాడు. వాళ్లు క్షేమంగా ఉన్నారో లేదో అని యోసేపు ఆలోచించేవాడు. ఆయన అన్నలు వాళ్ల క్రూరమైన పనులు మానుకున్నారో లేదో, కుటుంబాన్ని తిరిగి కలుసుకుంటాడో లేదో అని కూడా బహుశా ఆలోచించి ఉంటాడు.
మీ కుటుంబంలో కూడా కుళ్ళు, మోసం, పగ వల్ల ప్రశాంతత దెబ్బతిని ఉంటే మీరు కూడా యోసేపు లాంటి పరిస్థితిలో ఉన్నట్లే. ఆ కుటుంబాన్ని చూసుకుంటున్నప్పుడు యోసేపు చూపించిన విశ్వాసం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
‘యోసేపు దగ్గరకు వెళ్లండి’
యోసేపు రోజూ పనిలో తీరిక లేకుండా ఉండేవాడు. అలా సంవత్సరాలు గడిచాయి. ఫరోకు వచ్చిన కలలో యెహోవా చెప్పినట్లుగానే ఏడు సంవత్సరాలు పంటలు పుష్కలంగా పండాక, పరిస్థితి తలకిందులైంది. పంటలు ఇంక పండలేదు. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా కరువు వచ్చేసింది. కాని ఆ సమయంలో “ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను” అని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 41:54) యోసేపు దేవుని సహాయంతో భవిష్యత్తు గురించి చెప్పిన విషయాలు, పనులన్నీ పద్ధతిగా చేయడంలో ఆయనకున్న సామర్థ్యం ఐగుప్తు ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయి.
ఐగుప్తీయులు యోసేపుకు రుణపడి ఉన్నట్లు భావించి ఉంటారు. ఆయనకున్న సామర్థ్యాన్ని పొగిడి ఉంటారు. కాని యోసేపు ఆ గొప్పతనమంతా యెహోవాకే వెళ్లాలని కోరుకున్నాడు. మన శక్తిసామర్థ్యాలను యెహోవా సేవలో వినయంగా ఉపయోగిస్తే, ఆయన వాటన్నిటిని ఊహించనంతగా ఉపయోగపడేలా చేస్తాడు.
కొంత కాలానికి ఐగుప్తులో కూడా కరువు ప్రభావం కనిపించింది. ప్రజలు సహాయం కోసం ఫరో దగ్గర మొరపెట్టినప్పుడు ఆయన వాళ్లను “మీరు యోసేపునొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు” చేయమంటాడు. అప్పుడు యోసేపు ధాన్యం నిల్వచేసిన ధాన్యాగారాలను తెరిచి ప్రజలకు అమ్మాడు.—ఆదికాండము 41:55, 56.
కాని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. వందల మైళ్ల దూరంలో కనానులో ఉన్న యోసేపు కుటుంబం కూడా ఇబ్బందులు పడుతున్నారు. యాకోబు ఐగుప్తులో ధాన్యం ఉందని విని తన కొడుకుల్ని ఆహారం కొనడానికి వెళ్లమన్నాడు.—ఆదికాండము 42:1, 2.
యాకోబు పది మంది కొడుకుల్ని పంపించాడు కానీ చిన్నకొడుకు బెన్యామీనును పంపలేదు. ఇదివరకు ఒకసారి తనకెంతో ఇష్టమైన యోసేపును వాళ్ల అన్నల దగ్గరకు ఒంటరిగా పంపించిన విషయం ఆయనకు బాగా గుర్తుంది. ఆయన యోసేపును చూసింది అదే చివరిసారి. అప్పుడతని అన్నలు, యాకోబు తన ప్రేమకు, ఆప్యాయతకు గుర్తుగా యోసేపుకు ఇచ్చిన కొత్త అంగీని చిరిగిపోయి రక్తం మరకలతో వాళ్ల నాన్న దగ్గరికి తెచ్చారు. అడవి మృగాలు యోసేపును తినేసి ఉంటాయని పాపం ఆ ముసలి తండ్రిని నమ్మించారు.—ఆదికాండము 37:31-35.
‘యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు’
యోసేపు అన్నలు చాలాదూరం ప్రయాణించి ఐగుప్తు చేరుకున్నారు. ధాన్యం ఎక్కడ కొనాలని అక్కడి వాళ్లను అడిగిన్పపుడు, వాళ్లు జప్నత్పనేహు (ఐగుప్తులో యోసేపు పేరు) అనే ప్రభుత్వ అధికారి దగ్గరికి పంపించారు. (ఆదికాండము 41:45) వాళ్లు యోసేపును గుర్తుపట్టారా? లేదు. వాళ్లకు సహాయం చేయగల ఒక పెద్ద ఐగుప్తు అధికారిని మాత్రమే యోసేపులో చూశారు. గౌరవంతో వాళ్లు “ముఖములు నేలను మోపి అతనికి వందనము” చేశారు.—ఆదికాండము 42:5, 6.
మరి యోసేపు గుర్తు పట్టాడా? వెంటనే గుర్తు పట్టాడు. ఇంకా, వాళ్లు ఆయన ముందుకు వచ్చి నమస్కారం చేస్తుంటే ఆయన ఆలోచనలు చిన్నతనంలో జరిగిన విషయాల వైపుకు వెళ్ళాయి. దాని గురించి బైబిల్లో ‘యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొనెను’ అని ఉంది. వాళ్ల అన్నలు ఆయనకు వంగి నమస్కారం చేస్తారని యెహోవా యోసేపుకు చిన్నప్పుడే కలల్లో చెప్పాడు. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. (ఆదికాండము 37:2, 5-9; 42:7, 9) ఇది చూశాక యోసేపు ఏం చేస్తాడు? వాళ్లను దగ్గరికి తీసుకుంటాడా? పగ తీర్చుకుంటాడా?
ఇప్పుడు తన మనసులో అనిపించినదాన్ని బట్టి ఏమీ చేయకూడదని యోసేపుకు తెలుసు. ఈ మలుపులన్నిటి వెనుక ఖచ్చితంగా యెహోవా ఉండి, ఆయన ఉద్దేశం ప్రకారం నడిపిస్తున్నాడు. ఆయన యాకోబు సంతానాన్ని గొప్ప దేశంగా చేస్తానని మాటిచ్చాడు. (ఆదికాండము 35:11, 12) ఒకవేళ యోసేపు అన్నలు ఇంకా క్రూరంగా, స్వార్థంగా, మూర్ఖంగా ఉన్నట్లయితే రానురాను వాళ్ల ప్రవర్తన చెడు ఫలితాలకు దారి తీసి ఉండేది. అంతేకాదు యోసేపు అప్పుడు తనకేది అనిపిస్తే అది చేసి ఉంటే అక్కడ కనానులో ఇంటి దగ్గర పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఉంది. బహుశా ఆయన నాన్న, తమ్ముడి ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. వాళ్లు బ్రతికి ఉన్నారో లేదో? వాళ్ల అన్నలు మారారో లేదో తెలుసుకోడానికి తను ఎవరన్నది తెలియనివ్వకూడదని యోసేపు నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన అన్నలతో ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో తెలుసుకోవచ్చు.
మీకు ఇలాంటి పరిస్థితులు ఉండక పోవచ్చు. కానీ ఈ రోజుల్లో కుటుంబాల్లో గొడవలు, విభేదాలు సర్వసాధారణం అయిపోయాయి. మనకు అలాంటి పరిస్థితులు వస్తే మన మనసు చెప్పినట్లు చేసి, తెలిసీతెలియని మన ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తామేమో. కానీ యోసేపులా దేవుని ఆలోచనలను తెలుసుకుని ఆయన కోరుకున్నట్లు చేయడం చాలా తెలివైన పని. (సామెతలు 14:12) ఒకటి గుర్తుపెట్టుకోవాలి: కుటుంబ సభ్యులతో సమాధానపడడం ఎంత ముఖ్యమో, యెహోవాతో ఆయన కుమారుడితో సమాధాన పడడం అంతకన్నా ప్రాముఖ్యం.—మత్తయి 10:37.
‘దీనివలన మీ నిజం తెలుస్తుంది’
అన్నల మనసు తెలుసుకోడానికి యోసేపు చాలా పరీక్షలు పెట్టాడు. హీబ్రూ భాష తెలిసినాసరే తెలీనట్లు ఒక అనువాదకున్ని ఉపయోగించి వాళ్లతో కఠినంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, వాళ్లు పరాయి దేశం నుండి వచ్చిన గూఢచారులని నింద వేస్తాడు. అప్పుడు యోసేపు అన్నలు వాళ్లెవరో నిరూపించుకోడానికి, వాళ్ల కుటుంబం గురించి, వాళ్ల చిన్నతమ్ముడు ఇంటి దగ్గర ఉన్నాడన్న విషయం గురించి చెబుతారు. యోసేపు ఆయన ఆనందాన్ని కనబడకుండా దాచుకుంటాడు. చిన్నతమ్ముడు నిజంగా ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇప్పుడు ఏమి చేయాలో యోసేపుకు అర్థమైంది. నేను మీ చిన్నతమ్మున్ని చూడాలి, అప్పుడు “మీ నిజము తెలియబడును” అని వాళ్లతో చెప్తాడు. వాళ్లలో ఒకరు తన దగ్గర బంధీగా ఉంటే మిగతా వాళ్లు వెళ్లి చిన్నవాడిని తీసుకురావచ్చని తర్వాత ఒప్పుకుంటాడు.—ఆదికాండము 42:9-20.
వాళ్లు మాట్లాడుకునేవి యోసేపుకు అర్థమౌతున్నాయి అనే విషయం యోసేపు అన్నలకు తెలీదు. 20 ఏళ్ల క్రితం పెద్ద పాపం చేసినందుకు వాళ్లను వాళ్లు నిందించుకుంటూ ఉంటారు. “నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు” మాటలాడుకుంటారు. యోసేపుకు వాళ్ల మాటలు అర్థమై కన్నీళ్లు ఆపుకోలేక పక్కకు వెళ్లాల్సి వచ్చింది. (ఆదికాండము 42:21-24) నిజమైన పశ్చాత్తాపం అంటే, చేసిన తప్పు వల్ల వచ్చే పర్యవసానాల గురించి బాధపడడం మాత్రమే కాదని ఆయనకు తెలుసు. కాబట్టి వాళ్లనింకా పరీక్షించాలనుకున్నాడు.
వాళ్లందరినీ ఇంటికి పంపించి షిమ్యోనును మాత్రం బందీగా ఉంచేస్తాడు. వాళ్లు ఇంటికి తీసుకెళ్లే ఆహార సంచుల్లో వాళ్లకు తెలీకుండా డబ్బులు కూడా పెట్టిస్తాడు. ఇంటికి చేరుకున్నాక, బెన్యామీనును వాళ్లతో పాటు ఐగుప్తు తీసుకెళ్లడానికి వాళ్ల నాన్న యాకోబును అతి కష్టం మీద ఒప్పిస్తారు. తిరిగి ఐగుప్తుకు వచ్చాక వాళ్ల సంచుల్లోకి వచ్చిన డబ్బు గురించి చెప్పి ఆ డబ్బుని తిరిగి ఇస్తామంటారు. వాళ్ల నిజాయితీ మెచ్చుకునేలా ఉన్నా, యోసేపు వాళ్ల అసలు స్వభావం ఏంటో చూడాలనుకుంటాడు. వాళ్లకు భోజనం ఏర్పాటు చేస్తాడు. బెన్యామీనును చూడగానే అతనిలో వచ్చిన భావాలు బయటికి కనబడకుండా కష్టపడి ఆపుకుంటాడు. తర్వాత వాళ్లకు ధాన్యం ఇచ్చి ఇంటికి పంపించేస్తాడు. కానీ ఈసారి బెన్యామీను సంచిలో వెండి గిన్నెని దాచి ఉంచుతాడు.—ఆదికాండము 42:26–44:2.
తర్వాత అనుకున్న ప్రకారం వాళ్ల వెనుక మనుషులను పంపించి, వాళ్లను ఆపి వెండి గిన్నె దొంగిలించారని నింద వేస్తాడు. అది బెన్యామీను సంచిలో దొరికాక వాళ్లందరినీ వెనక్కు తెప్పిస్తాడు. ఇప్పుడు యోసేపుకు వాళ్ల అన్నలు ఎలాంటి వాళ్లో తెలుసుకునే అవకాశం వచ్చింది. యూదా వాళ్లందరి తరఫున మాట్లాడతాడు. క్షమాపణ కోసం బ్రతిమాలి కావాలంటే 11 మందిమి ఐగుప్తులో బానిసలుగా ఉండిపోతామని చెప్తాడు. బెన్యామీను మాత్రమే బానిసగా ఉండాలని మిగతా వాళ్లంతా వెళ్లిపోవాలని యోసేపు చెప్తాడు.—ఆదికాండము 44:2-17.
ఆ మాటలకు యూదా వెంటనే ముందుకొచ్చి, “వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని” చెప్తాడు. ఆ మాటలకు యోసేపు మనసు కదిలిపోయింది. ఎందుకంటే ఆయన యాకోబు ప్రియమైన భార్య రాహేలు పెద్ద కొడుకు. ఆమె బెన్యామీనుకు జన్మనిస్తూ చనిపోయింది. యోసేపు కూడా వాళ్ల తండ్రిలానే రాహేలును గుర్తుచేసుకునేవాడు. అందుకే బెన్యామీను అంటే యోసేపుకు చాలా ప్రేమ.—ఆదికాండము 35:18-20; 44:20.
బెన్యామీనును బంధించవద్దని యూదా బ్రతిమాలుతూనే ఉంటాడు. బెన్యామీనుకు బదులు బానిసగా ఉండిపోడానికి కూడా సిద్ధమౌతాడు. తర్వాత, “ఈ చిన్నవాడు నాతోకూడ ఉంటేనేగాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి” వస్తుంది అని హృదయం కదలిపోయేలా వేడుకుంటాడు. (ఆదికాండము 44:18-34) ఇక్కడ యూదాలో మారిన మనిషిని చూస్తాం. యూదా పశ్చాత్తాపం ఉన్న హృదయాన్నే కాదు, అవతలి వాళ్ల బాధను అర్థం చేసుకునే మనసుని, నిస్వార్థాన్ని, దయని చూపించాడు.
యోసేపు ఇక తట్టుకోలేకపోతాడు. ఇప్పటి వరకు దాచిపెట్టుకున్న భావాలను ఇక ఆపుకోలేకపోతాడు. పనివాళ్లందరినీ బయటకు పంపించి ఫరో అంతఃపురానికి వినపడేంతగా గట్టిగా ఏడ్చేస్తాడు. చివరికి తానెవరనే విషయం బయట పెడతాడు. “నేను యోసేపును,” మీ తమ్మున్ని అని చెప్తాడు. అర్థం కాకుండా ఆశ్చర్యంగా చూస్తున్న అతని అన్నలను దగ్గరికి తీసుకుని వాళ్లు చేసినవాటన్నిటిని దయతో క్షమిస్తాడు. (ఆదికాండము 45:1-15) ఇలా చేసి ఆయన పూర్తిగా క్షమించే యెహోవా మనసును చూపిస్తాడు. (కీర్తన 86:5) మనం కూడా అలా క్షమిస్తామా?
‘నువ్వు బ్రతికే ఉన్నావు’
యోసేపు ఇంట్లో జరిగిందంతా ఫరో విన్నప్పుడు, ఆయన యోసేపుని పిలిపించి వాళ్ల నాన్నను కుటుంబమంతటిని ఐగుప్తుకు తీసుకువచ్చేయమనే ఆహ్వానం ఇస్తాడు. అలా చివరికి యోసేపు వాళ్ల నాన్నను కలుసుకున్నాడు. యాకోబు ఏడ్చి “నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని” అంటాడు.—ఆదికాండము 45:16-28; 46:29, 30.
యాకోబు ఆ తర్వాత ఐగుప్తులో 17 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. పన్నెండు మంది కొడుకులను ఆశీర్వదిస్తూ ప్రవచనాలు కూడా చెప్పాడు. పెద్ద కూమారుడికి వచ్చే రెండు వంతుల్ని 11వ కుమారుడు యోసేపుకు ఇచ్చాడు. అంటే ఆయన నుండి రెండు ఇశ్రాయేలు గోత్రాలు వస్తాయి. నాలుగవ కూమారుడు యూదా తన సహోదరులందరిలో ముందుకు వచ్చి మంచి పశ్చాత్తాపం ఉన్న హృదయాన్ని చూపించినందుకు ఆయనకు కూడా గొప్ప ఆశీర్వాదం దొరికింది. మెస్సీయ లేదా క్రీస్తు యూదా కుటుంబం నుండే వచ్చాడు.—ఆదికాండము 48, 49 అధ్యాయాలు.
యాకోబు 147 ఏళ్ల వయసులో చనిపోయాడు. అప్పుడు యోసేపు తనకున్న అధికారం ఉపయోగించి వాళ్ల మీద పగ తీర్చుకుంటాడని ఆయన అన్నలు భయపడ్డారు. కానీ యోసేపు వాళ్లకు ప్రేమతో అభయమిచ్చాడు. వాళ్లందరూ ఐగుప్తు రావడం వెనుక ఉన్నది యెహోవాయే కాబట్టి చేసినవాటిని బట్టి బాధపడాల్సిన అవసరం లేదని వాళ్లకు యోసేపు ముందునుండే నచ్చచెప్పుతూ వచ్చాడు. అంతే కాకుండా “నేను దేవుని స్థానమందున్నానా?” అని కూడా వాళ్లతో అన్నాడు. (ఆదికాండము 15:13; 45:7, 8; 50:15-21) యెహోవాయే సరిగ్గా న్యాయం తీరుస్తాడని యోసేపుకు తెలుసు. అయినా, యెహోవా క్షమించిన వాళ్లను క్షమించక పోవడానికి యోసేపు ఎంతటి వాడు.—హెబ్రీయులు 10:30.
మీకు ఎవరినైనా క్షమించడం కష్టంగా ఉందా? అందులోనూ కావాలనే మనల్ని బాధపెట్టే వాళ్లను క్షమించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ నిజంగా పశ్చాత్తాపం చూపించిన వాళ్లను హృదయపూర్వకంగా క్షమించినప్పుడు మనం వాళ్ల గాయాలను మాన్పుతాం, మన సొంత గాయాలను కూడా మాన్పిన వాళ్లమౌతాం. అప్పుడు మనం యోసేపు విశ్వాసాన్ని, మన దయగల తండ్రి యెహోవా మాదిరిని అనుసరించిన వాళ్లమౌతాం. ▪ (w15-E 05/01)
a ఆగస్టు 1, 2014; నవంబరు 1, 2014; ఫిబ్రవరి 1, 2015 కావలికోట (ఇంగ్లీషు) పత్రికల్లో “వారి విశ్వాసాన్ని అనుసరించండి” ఆర్టికల్స్ చూడండి.