మీకిది తెలుసా?
పూర్వ కాలాల్లో నూరుడు బండను ఎలా ఉపయోగించేవాళ్లు?
రొట్టెలు చేయడానికి ధాన్యాన్ని పిండిచేసేందుకు నూరుడు బండ (సన్నికల్లు) వాడేవాళ్లు. ప్రతీ ఇంట్లో ఆడవాళ్లు, పనివాళ్లు అలాంటి నూరే రాళ్లను రోజూ ఉపయోగించేవాళ్లు. ఆ కాలాల్లో ఈ నూరే శబ్దం రోజూ వినబడేది.—నిర్గమకాండము 11:5; యిర్మీయా 25:10.
ఐగుప్తుకు సంబంధించిన ప్రాచీన కళాకృతుల్లో నూరడాన్ని చూడొచ్చు. వెడల్పుగా ఉండి అర్ధచంద్రాకారంలో వంచినట్లున్న రాయిపై ధాన్యాన్ని పోసేవాళ్లు. అది తిరుగటి దిమ్మ. దాన్ని కదలకుండా పెట్టి, ఎదురుగా మోకాళ్లపై కూర్చుని రెండు చేతులతో నూరే రాయిని లేదా తిరుగటి రాయిని పట్టుకుని నూరేవాళ్లు. ధాన్యాన్ని పిండిచేయడానికి నూరే రాయిని తిరుగటి దిమ్మపై ముందుకు వెనక్కి జరిపేవాళ్లు. ఆ నూరే రాయి రెండు నుండి నాలుగు కిలోల బరువు ఉండేదని ఒక నివేదిక చెప్తుంది. ఆ రాయిని ఆయుధంగా వాడితే, ప్రాణాలు తీయవచ్చు.—న్యాయాధిపతులు 9:50-54.
ధాన్యాన్ని పిండి చేయడానికి కుటుంబానికి ఇవి చాలా అవసరం. అందుకే వాటిని తాకట్టు కింద ఉంచుకోకూడదనే నియమం బైబిల్లో ఉంది. “తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టుపట్టినట్లే” అని ద్వితీయోపదేశకాండము 24:6లో ఉంది. ▪ (w15-E 07/01)
“రొమ్ముననున్న” అనే మాటకు అర్థం ఏంటి?
యేసు “తండ్రి రొమ్మున” ఉన్నాడు అని బైబిల్లో ఉంది. (యోహాను 1:18) దేవునితో యేసుకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఈ మాట చూపిస్తుంది. యూదులు ఆ కాలంలో భోజనం చేసేటప్పుడు కూర్చునే పద్ధతిని కూడా ఈ మాట తెలియచేస్తుంది.
ఆ కాలంలో యూదులు భోజనం చేసే బల్ల చుట్టూ కూర్చునేవాళ్లు. కూర్చున్నప్పుడు ముఖం బల్ల వైపు, కాళ్లు బల్లకు దూరంగా కొద్దిగా చాపి పెట్టేవాళ్లు. ఎడమ చేయి మోచేతిని ఒక దిండుపై ఆనించి, కుడి చేయిని కదపడానికి వీలుగా ఉంచుకునేవాళ్లు. అందరూ పక్కపక్కన ఎడమ వైపుకు వాలి కూర్చునేవాళ్లు. దానివల్ల, “ఒకరి తల ఇంకొకరి గుండెలకు దగ్గరగా ఉండేది” అంటే, ‘ఒకరు ఇంకొకరి రొమ్మును ఆనుకున్నారని’ కొన్ని ఆధారాలు వివరిస్తున్నాయి.
కుటుంబ పెద్ద లేదా భోజనానికి పిలిచిన యజమాని రొమ్మున ఆనుకుని కూర్చోవడం ఆ కాలంలో చాలా గొప్ప గౌరవం. యేసు చివరి పస్కా అప్పుడు “యేసు ప్రేమించిన యొకడు” అంటే అపొస్తలుడైన యోహాను “భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని” ఉన్నాడు. అందుకే యోహాను యేసును ప్రశ్న అడిగేప్పుడు ఆయన “రొమ్మున ఆనుకొని” ఉన్నాడు అని ఉంది.—యోహాను 13:23-25; 21:20.