పత్రిక ముఖ్యాంశం | దేవుడు ప్రేమలేని వాడని అనుకునేలా చేసిన అబద్ధాలు
దేవునికి పేరు లేదు అనే అబద్ధం
చాలామంది ఏం నమ్ముతారు?
“అసలు దేవుని పేరు అనే విషయం గురించి మనం మాట్లాడవచ్చో లేదో తేల్చుకోలేకపోతున్నాం, ఒకవేళ మాట్లాడవచ్చు అంటే, ఆ పేరు ఏమై ఉంటుంది?”—ప్రొఫెసర్ డేవిడ్ కన్నింగ్‌హామ్, థియోలాజికల్ స్టడీస్.
బైబిలు చెప్పే సత్యం దేవుడు ఇలా చెప్పాడు:
“నేను యెహోవాను. ఇదే నా పేరు.” (యెషయా 42:8) యెహోవా అనే హీబ్రూ పేరుకు అర్థం, “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు.”—ఆదికాండం 2:4, అధస్సూచి.
మనం ఆయన పేరును ఉపయోగించాలని యెహోవా కోరుకుంటున్నాడు. బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన పేరున ప్రార్థించండి, దేశదేశాల ప్రజల మధ్య ఆయన కార్యాలు తెలియజేయండి! ఆయన పేరు ఎంత ఘనమైనదో ప్రకటించండి.”—యెషయా 12:4.
యేసు దేవుని పేరును ఉపయోగించాడు. ఆయన యెహోవాకు ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: “నీ పేరును వీళ్లకు [యేసు శిష్యులకు] తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.” దేవుని పేరును యేసు తన శిష్యులకు ఎందుకు తెలియజేశాడు? “నువ్వు నామీద చూపించిన ప్రేమను వీళ్లు ఇతరుల మీద చూపించేలా, నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా” అని యేసు ఆ కారణం చెప్పాడు.—యోహాను 17:26.
అది ఎందుకు ప్రాముఖ్యం?
మత పండితుడు వాల్టర్ లౌరీ ఇలా రాశాడు: “దేవుని పేరు ఏమిటో తెలియని వ్యక్తికి ఆయన నిజంగా తెలియదు ... దేవుడంటే వ్యక్తిత్వం లేని శక్తి మాత్రమే అని అతను అనుకుంటే, అతను దేవుణ్ణి ప్రేమించలేడు.”
దేవుని పేరును దాచడం, దాని స్థానంలో వేరే పదాలు పెట్టడం అనేది ఆ పేరును బైబిల్లో నుండి కత్తిరించి తీసేయడంతో సమానం
విక్టర్ అనే అతను ప్రతీవారం చర్చీకి వెళ్లేవాడు, కానీ అతనికి దేవుడు నిజంగా తెలుసని అనిపించలేదు. అతను ఇలా అంటున్నాడు, “తర్వాత ఒకసారి దేవుని పేరు యెహోవా అని నేను తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఆయన్ని అధికారికంగా పేరుతో పరిచయం చేసినట్టు అనిపించింది ... అప్పటివరకు ఎవరి గురించైతే చాలా విషయాలు తెలుసుకున్నానో చివరికి ఆ వ్యక్తిని కలుసుకున్నట్టు అనిపించింది. అప్పటినుండి ఆయన్ని ఒక నిజమైన వ్యక్తిగా చూడడం, ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టాను.”
యెహోవా కూడా తన పేరు ఉపయోగించేవాళ్లకు దగ్గరౌతాడు. “ఆయన పేరు గురించి ధ్యానిస్తున్నవాళ్ల” గురించి దేవుడు ఇలా మాట ఇచ్చాడు: “తనకు సేవచేసే కుమారుని మీద తండ్రి కనికరం చూపించినట్టే, నేను వాళ్ల మీద కనికరం చూపిస్తాను.” (మలాకీ 3:16, 17) దేవుడు తన పేరు ఉపయోగించి ప్రార్థించేవాళ్లకు ప్రతిఫలం కూడా ఇస్తాడు. బైబిలు ఇలా చెప్తుంది: “యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు.”—రోమీయులు 10:13.