కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

12

ధైర్యం చూపించిన పౌలు మేనల్లుడు

ధైర్యం చూపించిన పౌలు మేనల్లుడు

మామయ్య ప్రాణాలు కాపాడిన ఓ యువకుడి గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. అపొస్తలుడైన పౌలే ఆ యువకుడి మామయ్య. ఆ యువకుడి పేరు బైబిల్లో లేదు కానీ అతను ఒకసారి చాలా ధైర్యం చూపించాడని మాత్రం ఉంది. ఇంతకీ అతను ఏమి చేశాడో తెలుసుకోవాలనుందా?—

పౌలు యెరూషలేములో ఒక జైల్లో ఉన్నాడు. యేసు గురించి ప్రకటిస్తున్నాడని ఆయన్ని పట్టుకుని జైల్లో పెట్టారు. కొంతమంది చెడ్డవాళ్లు పౌలు మీద ద్వేషంతో కుట్రపన్నారు. వాళ్లు ఇలా అనుకున్నారు: ‘సైనికులచేత పౌలును న్యాయస్థానానికి తీసుకురమ్మని మనం సైనికాధికారిని అడుగుదాం. అప్పుడు దారిలో మాటువేసి, వాళ్లు రాగానే పౌలును చంపేద్దాం!’

పౌలు మేనల్లుడు పౌలుకు, సైనికాధికారికి కుట్ర గురించి చెప్పాడు

ఈ కుట్ర గురించి పౌలు మేనల్లుడికి తెలిసింది. అతను ఏంచేశాడు? జైల్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్లి మొత్తం ఆయనకు చెప్పాడు. పౌలు వెంటనే ఆ కుట్ర గురించి సైనికాధికారికి చెప్పమన్నాడు. సైనికాధికారితో మాట్లాడడమంటే చిన్న విషయమా?— కాదు, ఎందుకంటే ఆయన పెద్ద అధికారి. కానీ పౌలు మేనల్లుడు ధైర్యవంతుడు, వెళ్లి ఆ అధికారితో మాట్లాడాడు.

ఇలాంటప్పుడు ఏమి చెయ్యాలో ఆ అధికారికి బాగా తెలుసు. పౌలును కాపాడడానికి ఆయన దాదాపు 500 మంది సైనికులను ఏర్పాటు చేశాడు! పౌలును ఆ రాత్రే కైసరయకు తీసుకెళ్లమని వాళ్లకు ఆజ్ఞాపించాడు. మరి పౌలుకు అపాయం తప్పిందా?— ఊఁ తప్పింది, ఆ చెడ్డవాళ్లు పౌలును ఏమీ చేయలేకపోయారు. వాళ్ల కుట్ర ఫలించలేదు.

ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?— పౌలు మేనల్లుడిలా మీరు కూడా ధైర్యం చూపించవచ్చు. మనం యెహోవా గురించి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ధైర్యంగా ఉండాలి. మరి మీరు ధైర్యంగా ఉంటూ, యెహోవా గురించి మాట్లాడుతూ ఉంటారా?— మీరలా చేస్తే, ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చు.

మీ బైబిల్లో చదవండి