కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు

మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు

అధ్యాయము 16

మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు

1. అనేక మతాల్లో ఏ సారూప్యాలున్నాయి?

తూర్పు దేశాలను దర్శిస్తున్న ఒక యాత్రికురాలు ఒక బౌద్ధ దేవాలయంలో జరుగుతున్న మత సంబంధమైన ఆచారాలను చూసి ఆశ్చర్యపోయింది. అందులోని విగ్రహాలు మరియమ్మవి లేక క్రీస్తువి కాకపోయినప్పటికీ, వాటిలో అనేక ఆచారాలు ఆమె నివసించే దేశంలో చర్చినందు జరిగేలాంటివే. ఉదాహరణకు, రోసరీలను ఉపయోగించడం, ప్రార్థనలను వల్లించడం ఆమె గమనించింది. ఇతరులు కూడా అలాంటి తారతమ్యాలను గూర్చి తెల్పారు. తూర్పు దేశాల్లోనైనా, పశ్చిమ దేశాల్లోనైనా, ఆరాధికులు దేవునికి లేక తమ ఆరాధనా వస్తువులకు సన్నిహితమవ్వాలని చేసే ప్రయత్నాలు దాదాపు ఒకేలా ఉన్నాయి.

2. ప్రార్థన ఎలా వర్ణించబడింది, అనేకమంది ప్రజలు ఎందుకు ప్రార్థిస్తారు?

2 ప్రాముఖ్యంగా దేవున్ని ప్రార్థించడం ద్వారా ఆయనకు సన్నిహితమవ్వాలని అనేకులు ప్రయత్నిస్తారు. ప్రార్థన అనేది “పవిత్రమైన లేక పరిశుద్ధ దేవునితో, దేవుళ్లతో, భగవతతీత సామ్రాజ్యంతో, లేక అతీత శక్తులతో సంభాషించాలని మానవుడు చేసే ప్రయత్నంగా” వర్ణించబడింది. (ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా) అయితే, ప్రార్థనలో దేవున్ని సమీపించేటప్పుడు కొందరు తామేమి ప్రయోజనం పొందగలమనే ఆలోచిస్తారు. ఉదాహరణకు, యెహోవాసాక్షుల్లో ఒకరిని ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “మీరు నా కొరకు ప్రార్థిస్తే, నాకు నా కుటుంబంలోను ఉద్యోగ స్థలంలోను నా ఆరోగ్యం విషయంలోను ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయా?” స్పష్టంగా ఆ వ్యక్తి అలా తలంచాడు, కాని అనేకులు ప్రార్థించిన తర్వాత కూడా తమ సమస్యలు ఇంకా అలాగే ఉన్నట్లు కనుగొంటారు. కాబట్టి మనమిలా అడగవచ్చు, ‘అసలు మనమెందుకు దేవునికి సన్నిహితులమవ్వాలి?’

మనమెందుకు దేవునికి సన్నిహితులమవ్వాలి

3. మనం ప్రార్థనలు ఎవరికి చేయాలి, ఎందుకు?

3 ప్రార్థన అనేది అర్థరహితమైన ఆచారం కాదు లేక ఏదైనా పొందడానికి మార్గం మాత్రమే కాదు. దేవున్ని సమీపించడానికి ప్రముఖ కారణం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండడానికే. కాబట్టి మనం ప్రార్థనలు యెహోవా దేవునికి చేయాలి. కీర్తనల రచయితయైన దావీదు ఇలా చెప్పాడు: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి . . . యెహోవా సమీపముగా ఉన్నాడు.” (కీర్తన 145:18) తనతో సమాధానకరమైన సంబంధంలోకి ప్రవేశించుమని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. (యెషయా 1:18) ఈ ఆహ్వానానికి ప్రతిస్పందించేవారు ఇలా చెప్పిన కీర్తనల రచయితతో ఏకీభవిస్తారు: “నాకైతే దేవుని పొందు ధన్యకరము.” ఎందుకు? ఎందుకంటే యెహోవా దేవునికి సన్నిహితులయ్యేవారు నిజమైన ఆనందాన్ని, సమాధానాన్ని పొందుతారు.—కీర్తన 73:28.

4, 5. (ఎ) దేవునికి ప్రార్థించడం ఎందుకు ప్రాముఖ్యము? (బి) ప్రార్థన ద్వారా మనం దేవునితో ఏ విధమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు?

4 మనం ఆయనను ‘అడుగకమునుపే మనకు ఏవి అవసరమో ఆయనకు తెలుసు’ గనుక సహాయం కొరకు దేవున్నెందుకు ప్రార్థించాలి? (మత్తయి 6:8; కీర్తన 139:4) ప్రార్థన, మనకు దేవునియందు విశ్వాసముందని, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరము”నకు మూలముగా ఆయనను మనం దృష్టిస్తున్నామని చూపిస్తుంది. (యాకోబు 1:17; హెబ్రీయులు 11:6) యెహోవా మన ప్రార్థనలను బట్టి ఆనందిస్తాడు. (సామెతలు 15:8) తన చిన్న పిల్లవాడు యథార్థమైన కృతజ్ఞతా పలుకులు పలికినప్పుడు తండ్రి ఎలా ఆనందిస్తాడో అలాగే మెప్పు మరియు స్తుతితో కూడిన మన అర్థవంతమైన విన్నపములను విని ఆయన ఆనందిస్తాడు. (కీర్తన 119:108) తండ్రి కుమారుల మధ్య ఎక్కడైతే మంచి సంబంధం ఉంటుందో అక్కడ స్నేహపూర్వకమైన సంభాషణ ఉంటుంది. ప్రేమింపబడే కుమారుడు తన తండ్రితో మాట్లాడాలని కోరుకుంటాడు. దేవునితో మన సంబంధ విషయంలో కూడా అదే నిజం. యెహోవా గురించి, మన ఎడల ఆయన కనబర్చిన ప్రేమ గురించి మనమేమి నేర్చుకుంటున్నామో దాన్ని మనం నిజంగా మెచ్చుకొన్నప్పుడు, ప్రార్థనలో ఆయనకు మనల్ని మనం వ్యక్తం చేసుకోవాలనే బలమైన కోరిక మనకుంటుంది.—1 యోహాను 4:16-18.

5 సర్వోన్నతమైన దేవున్ని సమీపించేటప్పుడు, మనం ఉపయోగించే కచ్చితమైన పదాల గురించి ఎక్కువ చింతించనవసరం లేకపోయినప్పటికీ, మనం గౌరవప్రదమైనవాటిని వాడాలి. (హెబ్రీయులు 4:16) మనం ఎల్లప్పుడూ యెహోవాను సమీపించవచ్చు. ప్రార్థనయందు మనం ‘మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించవచ్చునంటే’ అదెంతటి ఆధిక్యతో కదా! (కీర్తన 62:8) విశ్వాసంగల వ్యక్తియగు అబ్రాహాము దేవుని స్నేహితునిగా ఆయనతో అనుభవించిన స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగివుండేందుకు యెహోవా ఎడల గల మెప్పు మనల్ని నడిపిస్తుంది. (యాకోబు 2:23) కాని విశ్వ సర్వోన్నత ప్రభువును ప్రార్థించేటప్పుడు, ఆయనను సమీపించేందుకు అవసరమైన అర్హతలకు తగినట్లుగా మనం ఉండాలి.

దేవునికి సన్నిహితులమయ్యేందుకు అవసరమైన అర్హతలు

6, 7. మన ప్రార్థనలను వినేందుకు దేవుడు ఏ డబ్బును కోరనప్పటికీ, మనం ప్రార్థించేటప్పుడు ఏమి కలిగి ఉండడం అవసరమని ఆయన చెబుతున్నాడు?

6 దేవున్ని సమీపించేందుకు డబ్బు అవసరమా? అనేకమంది ప్రజలు తమ కొరకు ప్రార్థించాలని మత నాయకులకు డబ్బు చెల్లిస్తారు. తాము ఇచ్చే విరాళం యొక్క మోతాదును బట్టి తమ ప్రార్థనలు వినడం జరుగుతుందని కూడా కొందరు నమ్ముతారు. అయితే, యెహోవాను ప్రార్థనలో సమీపించేందుకు ఆర్థికపరమైన అర్పణ అవసరమని దేవుని వాక్యం చెప్పడంలేదు. ఆయన ఆత్మీయ ఏర్పాట్లు, ప్రార్థనయందు ఆయనతో సంబంధాన్ని కలిగివుండే ఆశీర్వాదాలు డబ్బు చెల్లించకుండానే లభ్యమౌతాయి.—యెషయా 55:1, 2.

7 అయితే మరేమి అవసరం? సరైన హృదయ దృక్పథం కలిగివుండటం ఒక ప్రాముఖ్యమైన అవసరత. (2 దినవృత్తాంతములు 6:29, 30; సామెతలు 15:11) ‘ప్రార్థన ఆలకించువాడని,’ “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” మనం మన హృదయంలో యెహోవా దేవునియందు విశ్వాసముంచాలి. (కీర్తన 65:2; హెబ్రీయులు 11:6) మనకు దీనమైన హృదయం కూడా ఉండాలి. (2 రాజులు 22:19; కీర్తన 51:17) దేవున్ని సమీపించేటప్పుడు ఒక దీనుడైన సుంకరి వినయహృదయంతో సమీపించినప్పుడు గర్విష్ఠియైన పరిసయ్యునికంటే ఎక్కువ నీతిమంతునిగా నిరూపించబడ్డాడని తన ఉపమానాలలో ఒకదానియందు యేసుక్రీస్తు చూపించాడు. (లూకా 18:10-14) మనం ప్రార్థనయందు దేవున్ని సమీపించేటప్పుడు, “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు” అని మనం జ్ఞాపకముంచుకుందాము.—సామెతలు 16:5.

8. దేవుడు మన ప్రార్థనలను వినాలని మనం కోరుకుంటే, దేనినుండి మనల్ని మనం శుభ్రపరచుకోవాలి?

8 దేవుడు మన ప్రార్థనలకు సమాధానమివ్వాలని మనం కోరుకుంటే, మనం పాపయుక్తమైన ప్రవర్తన నుండి మనల్ని మనం శుభ్రపరచుకోవాలి. దేవునికి సన్నిహితులవ్వండని శిష్యుడైన యాకోబు ఇతరులను ప్రోత్సహించినప్పుడు, ఆయనింకనూ ఇలా అన్నాడు: “పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.” (యాకోబు 4:8) తప్పిదస్థులు కూడా తమ గత జీవిత విధానాన్ని విడిచిపెట్టి, పశ్చాత్తాపపడితే యెహోవాతో సమాధానకరమైన సంబంధాన్ని కలిగివుండవచ్చు. (సామెతలు 28:13) మనల్ని మనం శుభ్రపరచుకోవడాన్ని కేవలం పేరుకు మాత్రం చేస్తే యెహోవా మన ప్రార్థనల్ని వినడు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది: “ప్రభువు [“యెహోవా,” NW] కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవిగాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది.”—1 పేతురు 3:12.

9. ఎవరి ద్వారా మనం యెహోవాను సమీపించవచ్చు, ఎందుకు?

9 బైబిలు ఇలా చెబుతుంది: “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు.” (ప్రసంగి 7:20) కాబట్టి మీరిలా అడుగవచ్చు: ‘మరైతే మనం యెహోవా దేవున్ని ఎలా సమీపించవచ్చు?’ బైబిలు దానికిలా సమాధానమిస్తుంది: “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.” (1 యోహాను 2:1) మనం పాపులమైనప్పటికీ, మన కొరకు విమోచన క్రయధనముగా మరణించిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవున్ని స్వేచ్ఛగా సమీపించవచ్చు. (మత్తయి 20:28) మనం యెహోవా దేవున్ని సమీపించగల ఏకైక మార్గం ఆయనే. (యోహాను 14:6) మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేసినప్పటికీ, యేసు యొక్క విమోచన క్రయధనబలి విలువ మనకు దానంతటదే అన్వర్తింపబడుతుందిలే అని భావించకూడదు. (హెబ్రీయులు 10:26) అయితే, చెడునుండి దూరంగా ఉండడానికి మనం మనకు చేతనైనంత వరకు శ్రేష్ఠమైనది చేస్తూ కూడా కొన్నిసార్లు తప్పుచేస్తే, మనం పశ్చాత్తాపపడి క్షమాపణ కొరకు దేవున్ని కోరవచ్చు. మనం ఆయనను దీనహృదయంతో సమీపించినప్పుడు, ఆయన మన ప్రార్థనను వింటాడు.—లూకా 11:4.

దేవున్ని ప్రార్థించేందుకు అవకాశాలు

10. ప్రార్థన విషయంలో మనం యేసును ఎలా అనుకరించవచ్చు, వ్యక్తిగత ప్రార్థన కొరకున్న కొన్ని సందర్భాలు ఏవి?

10 యేసుక్రీస్తు యెహోవాతో తన సంబంధాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడు. కాబట్టి, యేసు ప్రార్థన ద్వారా దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి సమయాన్ని కేటాయించుకున్నాడు. (మార్కు 1:35; లూకా 22:40-46) యేసు మాదిరిని అనుకరించి, క్రమంగా దేవున్ని ప్రార్థించడం మంచిది. (రోమీయులు 12:12) ప్రార్థించడం ద్వారా ప్రతిదినాన్ని ప్రారంభించడం యుక్తమైనది మరియు నిద్రించడానికి ముందు ప్రార్థిస్తే, ఆ దినంలోని పనియంతటి గురించి మనం తగినట్లుగానే యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. దినంలో, “ప్రతి సమయమునందును” దేవున్ని సమీపించడానికి నిశ్చయించుకోండి. (ఎఫెసీయులు 6:18) యెహోవా వినగలడని తెలుసుకుని, మనం హృదయంలో నిశ్శబ్దంగా కూడా ప్రార్థించవచ్చు. దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడడం ఆయనతో మన సంబంధాన్ని పటిష్ఠపర్చుకొనేందుకు సహాయపడుతుంది, ప్రతిదినం యెహోవాకు ప్రార్థించడం ఆయనకు మరింత సన్నిహితమయ్యేందుకు మనకు సహాయం చేస్తుంది.

11. (ఎ) కుటుంబాలు కలిసి ఎందుకు ప్రార్థించాలి? (బి) ప్రార్థన ముగింపులో మీరు “ఆమేన్‌” అని చెప్పడం యొక్క భావమేమిటి?

11 ప్రజల తరపున చేయబడే ప్రార్థనలను కూడా యెహోవా వింటాడు. (1 రాజులు 8:22-53) కుటుంబ శిరస్సు నాయకత్వం వహిస్తుండగా, మనం ఒక కుటుంబంగా దేవునికి సన్నిహితం కావచ్చు. ఇది కుటుంబ బంధాన్ని పటిష్ఠపరుస్తుంది, తమ తలిదండ్రులు దేవునికి దీనంగా ప్రార్థించడం వింటే పిల్లలకు యెహోవా నిజమైనవాడౌతాడు. బహుశ యెహోవాసాక్షుల కూటంలో అక్కడున్న గుంపు అంతటి తరపున ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తుంటే అప్పుడేమిటి? మనం ప్రేక్షకులలో ఉన్నట్లైతే, ప్రార్థన ముగింపులో మనం “అవును గాక” అనే భావంగల “ఆమేన్‌” అని పూర్ణహృదయంతో చెప్పగలిగేలా మనం శ్రద్ధతో విందాము.—1 కొరింథీయులు 14:16.

యెహోవా ఆలకించే ప్రార్థనలు

12. (ఎ) దేవుడు కొన్ని ప్రార్థనలకు ఎందుకు సమాధానమివ్వడు? (బి) ప్రార్థించేటప్పుడు మనం పూర్తిగా వ్యక్తిగత అవసరతలపైనే ఎందుకు శ్రద్ధనిలుపకూడదు?

12 తాము క్రీస్తు ద్వారా ప్రార్థించినప్పటికీ దేవుడు తమ ప్రార్థనలకు జవాబివ్వడని కొందరు భావిస్తారు. అయితే, అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: ‘[దేవుని] చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును.’ (1 యోహాను 5:14) కాబట్టి, మరి మనం దేవుని చిత్తానుసారముగా అడుగవలసిన అవసరం ఉంది. మన ఆత్మీయ క్షేమంలో ఆయనకు ఆసక్తి ఉంది గనుక, మన ఆత్మీయతపై ప్రభావం చూపే ఏ విషయమైనా మన ప్రార్థనకు తగిన అంశమే. మనం పూర్తిగా భౌతిక అవసరతలపైనే శ్రద్ధనుంచే శోధనను ఎదిరించాలి. ఉదాహరణకు, అంతర్దృష్టి కొరకు మరియు అనారోగ్యంతోనున్నప్పుడు శక్తి కొరకు ప్రార్థించడం సరైనదే అయినప్పటికీ, ఆరోగ్యాన్ని గూర్చిన చింతలు ఆత్మీయాసక్తులను అధిగమించేవిగా ఉండకూడదు. (కీర్తన 41:1-3) తన ఆరోగ్యం గురించి అధిక చింత కలిగివున్నట్లు గ్రహించిన ఒక క్రైస్తవ స్త్రీ తన అనారోగ్యాన్ని గూర్చి సరైన దృక్పథాన్ని కలిగివుండేందుకు సహాయం చేయమని యెహోవాను అడిగింది. తత్ఫలితంగా, ఆమె ఆరోగ్య సమస్యలు ఎంతో స్వల్ప విషయాలయ్యాయి, తనకు “బలాధిక్యము” ఇవ్వబడినట్లు ఆమె భావించింది. (2 కొరింథీయులు 4:7) ఇతరులకు ఆత్మీయ సహాయాన్ని అందివ్వాలనే ఆమె కోరిక బలపర్చబడి ఆమె పూర్తికాల రాజ్య ప్రచారకురాలయ్యింది.

13. మత్తయి 6:9-13 నందు సూచింపబడినట్లుగా, మనం మన ప్రార్థనలలో చేర్చగల కొన్ని తగిన విషయాలు ఏవి?

13 మన ప్రార్థనలు విని యెహోవా ఆనందించగలిగేలా మనం మన ప్రార్థనలలో ఏమి చేర్చవచ్చు? ఎలా ప్రార్థించాలో యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించాడు. మత్తయి 6:9-13 నందు వ్రాయబడివున్న మాదిరి ప్రార్థనలో, మనం సరైన విధంగా ప్రార్థించగల విషయాలకు సంబంధించిన మాదిరిని ఆయన అందజేశాడు. మన ప్రార్థనలలో దేనికి ప్రముఖ శ్రద్ధనివ్వవలసి ఉంటుంది? యెహోవా దేవుని నామానికి, రాజ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మన వస్తుదాయక అవసరతల కొరకు అడగడం యుక్తమే. మన పాపాలకు క్షమాపణ కొరకు, అపవాదియగు సాతాను అయిన దుష్టుని నుండి మరియు శోధనల నుండి తప్పించుమని అడగడం కూడా ప్రాముఖ్యమే. ఈ ప్రార్థనను మనం వల్లించాలని లేక దాని భావం గురించి ఆలోచించకుండా మరల మరల దాన్ని పునరుద్ఘాటించాలని యేసు కోరలేదు. (మత్తయి 6:7) తన తండ్రితో మాట్లాడే ప్రతిసారి ఒక బిడ్డ అవే పదాలను ఉపయోగించినట్లయితే, అది ఏ విధమైన సంబంధమై ఉండగలదు?

14. విజ్ఞాపనలే కాకుండా మనం ఏ ప్రార్థనలను చేయవచ్చు?

14 విన్నపాలు, హృదయపూర్వక విజ్ఞాపనలే గాక, మనం స్తుతి మరియు కృతజ్ఞతలు తెలియజేసే ప్రార్థనలను కూడా చేయవచ్చు. (కీర్తన 34:1; 92:1; 1 థెస్సలొనీకయులు 5:18) మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థించవచ్చు. అనారోగ్యంతోవున్న లేక హింసింపబడుతున్న మన ఆత్మీయ సహోదరసహోదరీల కొరకు మనం ప్రార్థించడం మనకు వారి ఎడల ఉన్న ఆసక్తిని చూపిస్తుంది, మనం అలాంటి శ్రద్ధను వ్యక్తపర్చినప్పుడు యెహోవా వినడానికి ఇష్టపడతాడు. (లూకా 22:32; యోహాను 17:20; 1 థెస్సలొనీకయులు 5:25) వాస్తవానికి, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.”—ఫిలిప్పీయులు 4:6, 7.

ప్రార్థనయందు పట్టుదల కలిగివుండుడి

15. మన ప్రార్థనలకు జవాబు లభించనట్లు అనిపిస్తే, మనం ఏమి జ్ఞాపకముంచుకోవాలి?

15 మీరు దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందుతున్నప్పటికీ, మీ ప్రార్థనలకు కొన్నిసార్లు జవాబు దొరకనట్లు మీరు భావించవచ్చు. ఒక ప్రత్యేకమైన ప్రార్థనకు జవాబివ్వడానికి అది దేవునికి సమయం కాకపోవడం వల్ల ఇలా జరగవచ్చు. (ప్రసంగి 3:1-9) ఒక పరిస్థితి కొంతకాలం కొనసాగడానికి యెహోవా అనుమతించవచ్చు, కాని ఆయన తప్పకుండా ప్రార్థనలకు జవాబిస్తాడు, అలా చేయడానికి శ్రేష్ఠమైన సమయం ఏదో ఆయనకు తెలుసు.—2 కొరింథీయులు 12:7-9.

16. మనం ప్రార్థనయందు ఎందుకు పట్టుదల కలిగివుండాలి, అలా చేయడం దేవునితో మనకు గల సంబంధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలదు?

16 ప్రార్థనలో మన పట్టుదల, మనం దేవునికి చెప్పేదానిలో మనకు హృదయపూర్వక ఆసక్తి ఉందని తెలియజేస్తుంది. (లూకా 18:1-8) ఉదాహరణకు, ఒక ఫలానా బలహీనతను అధిగమించేందుకు మనకు సహాయం చేయమని మనం యెహోవాను అడగవచ్చు. ప్రార్థనయందు పట్టుదల కలిగివుండడం ద్వారా, మన విన్నపాలకు అనుగుణంగా ప్రవర్తించడం ద్వారా మనం మన యథార్థతను చూపిస్తాము. మన విజ్ఞాపనలు వివరంగా, నిజాయితీగా ఉండాలి. ప్రత్యేకంగా, మనం శోధనను ఎదుర్కొంటున్నప్పుడు తీవ్రంగా ప్రార్థించడం ప్రాముఖ్యము. (మత్తయి 6:13) మన పాపభరితమైన కోరికలను అదుపు చేసుకొనేందుకు ప్రయత్నిస్తూ ప్రార్థనలో కొనసాగుతుండగా, యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడో మనం చూస్తాము. ఇది మన విశ్వాసాన్ని దృఢపరుస్తుంది, ఆయనతో మన సంబంధాన్ని బలపరుస్తుంది.—1 కొరింథీయులు 10:13; ఫిలిప్పీయులు 4:13.

17. దేవున్ని సేవించడంలో ప్రార్థనాపూర్వక దృక్పథాన్ని కలిగివుండడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందగలము?

17 యెహోవా దేవునికి పరిశుద్ధ సేవను అర్పించడంలో ప్రార్థనాపూర్వక దృక్పథాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా ఆయనను మనం మన స్వంత బలంతో సేవించడంలేదని గుర్తిస్తాము. ఆయన సేవ చేయడానికి మనకు బలమిచ్చేది యెహోవాయే. (1 కొరింథీయులు 4:7) దీన్ని అంగీకరించడం మనం దీనంగా ఉండేందుకు సహాయం చేస్తుంది మరియు ఆయనతో మన సంబంధాన్ని పటిష్ఠపరుస్తుంది. (1 పేతురు 5:5, 6) అవును, మనం ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడానికి మనకు తగిన కారణాలున్నాయి. మన హృదయపూర్వక ప్రార్థనలు మరియు మన ప్రేమగల పరలోక తండ్రికి ఎలా సన్నిహితం కావచ్చుననే అమూల్యమైన జ్ఞానం మన జీవితాన్ని నిజంగా సంతోషభరితం చేస్తాయి.

యెహోవాతో సంభాషణ ఒకవైపు నుండి జరిగేదికాదు

18. మనం దేవుడు చెప్పేదాన్ని ఎలా వినగలము?

18 దేవుడు మన ప్రార్థనలు వినాలని మనం కోరుకుంటే, ఆయన చెప్పేది మనం వినాలి. (జెకర్యా 7:13) ఆయన ఇప్పుడిక తన వర్తమానాలను దైవ ప్రేరేపిత ప్రవక్తల ద్వారా పంపడంలేదు, కర్ణపిశాచాలను మాధ్యమాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవడం లేదు. (ద్వితీయోపదేశకాండము 18:10-12) కాని ఆయన వాక్యమైన బైబిలును చదవడం ద్వారా మనం దేవుడు చెప్పేదాన్ని వినవచ్చు. (రోమీయులు 15:4; 2 తిమోతి 3:16, 17) మనకు ఆరోగ్యకరమైన భౌతికాహారాన్ని మనం అపేక్షించడం ఎలా అవసరమో అలాగే మనం “నిర్మలమైన వాక్యమను . . . పాలను అపేక్షించ” వలెనని ఉపదేశింపబడ్డాము. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం ద్వారా ఆత్మీయాహారాన్ని అపేక్షించండి.—1 పేతురు 2:2, 3; అపొస్తలుల కార్యములు 17:11.

19. బైబిలునందు మీరు చదివేదానిపై ధ్యానించడం ఏ ప్రయోజనాన్ని చేకూర్చగలదు?

19 మీరు బైబిలునందు చదివేదానిని ధ్యానించండి. (కీర్తన 1:1-3; 77:11, 12) అంటే విషయాన్ని గూర్చి తలంచడమని భావం. దీన్ని మీరు ఆహారం జీర్ణం కావడంతో పోల్చవచ్చు. మీరు చదివేదాన్ని మీకు ముందే తెలిసిన వాటికి జోడించడం ద్వారా మీరు ఆత్మీయాహారాన్ని జీర్ణించుకోవచ్చు. ఆ సమాచారం మీ జీవితంపై ఎలాంటి ప్రభావం కల్గియుండగలదో పరిశీలించండి, లేక యెహోవా లక్షణాల గురించి వ్యవహారాల గురించి అది ఏమి తెలియజేస్తుందనే విషయంపై ధ్యానించండి. అలా వ్యక్తిగత పఠనం ద్వారా, యెహోవా అందజేసే ఆత్మీయాహారాన్ని మీరు పొందవచ్చు. ఇది మీరు దేవునికి సన్నిహితమయ్యేలా చేస్తుంది, ప్రతిదిన సమస్యలతో వ్యవహారించేందుకు మీకు సహాయం చేస్తుంది.

20. క్రైస్తవ కూటాలకు హాజరు కావడం దేవునికి సన్నిహితమయ్యేందుకు మనకెలా సహాయం చేయగలదు?

20 దేవుని ధర్మశాస్త్రం బహిరంగంగా చదువుతున్నప్పుడు వినేందుకు సమకూడినప్పుడు ఇశ్రాయేలీయులు శ్రద్ధగా విన్నట్లే, క్రైస్తవ కూటాలలో దేవుని వాక్యం చర్చించబడినప్పుడు వినడం ద్వారా కూడా మీరు ఆయనకు సన్నిహితం కావచ్చు. ఆ కాలంలోని ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని అర్థవంతంగా పఠించేవారు, తద్వారా తమ శ్రోతలు అర్థంచేసుకొని, తాము విన్నదాన్ని అన్వయించు కొనేందుకు కదలింపబడేలా వారు సహాయం చేసేవారు. ఇది గొప్ప ఆనందానికి కారణమయ్యేది. (నెహెమ్యా 8:8, 12) కాబట్టి యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడానికి మీరు అలవాటు చేసుకోండి. (హెబ్రీయులు 10:24, 25) దేవుని గూర్చిన జ్ఞానాన్ని అర్థంచేసుకొని, దాన్ని మీ జీవితంలో అన్వయించుకొనేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది, మీకు సంతోషాన్ని తెస్తుంది. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంలో భాగమై ఉండడం యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది. మనం గమనించబోవునట్లుగా, మీరు దేవుని ప్రజల మధ్యన నిజమైన భద్రతను కనుగొనగలరు.

మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి

మీరు యెహోవాకు ఎందుకు సన్నిహితులు కావాలి?

యెహోవాకు సన్నిహితమయ్యేందుకు కొన్ని అవసరమైన అర్హతలేవి?

మీరు మీ ప్రార్థనలలో ఏమి చేర్చవచ్చు?

ప్రార్థనయందు మీరెందుకు పట్టుదల కలిగివుండాలి?

నేడు మీరు యెహోవా చెప్పేది ఎలా వినగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

[157వ పేజీలో పూర్తి-పేజీ చిత్రం ఉంది]