పన్నెండవ అధ్యాయం
దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం
-
మీరు ఎలా దేవుని స్నేహితులు కావచ్చు?
-
సాతాను సవాలులో మీరు ఏ విధంగా ఇమిడివున్నారు?
-
ఎలాంటి ప్రవర్తన యెహోవాకు అసంతోషం కలిగిస్తుంది?
-
దేవునికి సంతోషం కలిగించే విధంగా మీరు ఎలా జీవించవచ్చు?
1, 2. యెహోవా దేవుడు మానవులను తన సన్నిహిత స్నేహితులుగా దృష్టించిన కొన్ని ఉదాహరణలు చెప్పండి.
మీరు ఎలాంటి వ్యక్తిని స్నేహితునిగా ఎంచుకుంటారు? నిశ్చయంగా, మీ దృక్కోణాలను, ఇష్టాలను, విలువలను పంచుకునే వ్యక్తి సాంగత్యాన్నే మీరు కోరుకుంటారు. నిజాయితీ, దయ వంటి చక్కని లక్షణాలున్న వ్యక్తికే మీరు సన్నిహితమవుతారు.
2 చరిత్రంతటిలో దేవుడు తన సన్నిహిత స్నేహితులుగా ఉండడానికి కొంతమంది మానవులను ఎన్నుకున్నాడు. ఉదాహరణకు, యెహోవా అబ్రాహామును తన స్నేహితుడని పిలిచాడు. (యెషయా 41:8; యాకోబు 2:23 చదవండి.) దావీదు తనకు ప్రియమైన వ్యక్తిగా ఉన్న కారణంగా యెహోవా ఆయనను “నా యిష్టానుసారుడైన మనుష్యుడు” అని అన్నాడు. (అపొస్తలుల కార్యములు 13:22) అంతేగాక యెహోవా దానియేలు ప్రవక్తను తనకు ‘బహు ప్రియునిగా’ దృష్టించాడు.—దానియేలు 9:23.
3. మానవుల్లో కొందరిని తన స్నేహితులుగా ఉండడానికి యెహోవా ఎందుకు ఎన్నుకున్నాడు?
3 యెహోవా అబ్రాహామును, దావీదును, దానియేలును తన స్నేహితులుగా ఎందుకు పరిగణించాడు? ‘నీవు నా మాట విన్నావు’ అని అబ్రాహాముతో ఆయన అన్నాడు. (ఆదికాండము 22:18) కాబట్టి, యెహోవా తాను అడిగినవి వినయంగా చేసినవారికి సన్నిహితమవుతాడు. “నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు” అని ఆయన ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (యిర్మీయా 7:23) మీరు యెహోవాకు లోబడితే, మీరు కూడా ఆయనకు స్నేహితులు కాగలరు!
యెహోవా తన స్నేహితులను బలపరుస్తాడు
4, 5. యెహోవా తన ప్రజలను ఎలా బలపరుస్తాడు?
4 దేవునితో స్నేహమంటే ఏమిటో ఆలోచించండి. యెహోవా “తనయెడల యథార్థహృదయము గలవారిని బలప[రిచే]” అవకాశాల కోసం చూస్తున్నాడని బైబిలు చెబుతోంది. (2 దినవృత్తాంతములు 16:9) యెహోవా మిమ్మల్ని ఎలా బలపరచగలడు? ఒక విధానం కీర్తన 32:8 లో కనబడుతుంది, అక్కడ మనమిలా చదువుతాం: “[యెహోవానగు నేనే] నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.”
5 యెహోవా చూపించే శ్రద్ధకు ఇదెంత చక్కని వ్యక్తీకరణో కదా! ఆయన మీకు కావలసిన నిర్దేశాన్నిస్తాడు, ఆ నిర్దేశాన్ని మీరు అన్వయించుకుంటుండగా ఆయన మీకు సంరక్షకునిగా ఉంటాడు. మీకు కలిగే పరీక్షలను, శోధనలను విజయవంతంగా సహించడానికి మీకు సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. (కీర్తన 55:22 చదవండి.) కాబట్టి మీరు పూర్ణ హృదయంతో యెహోవాను సేవించినప్పుడు, కీర్తనకర్త చూపించినటువంటి నమ్మకాన్నే మీరూ చూపించవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.” (కీర్తన 16:8; 63:8) అవును, తనకు సంతోషం కలిగించే విధంగా జీవించడానికి యెహోవా మీకు సహాయం చేయగలడు. అయితే, మీరు అలా జీవించకూడదని కోరుకునే దేవుని శత్రువు ఒకడున్నాడని మీకు తెలుసు.
సాతాను విసిరిన సవాలు
6. మానవుల విషయంలో సాతాను ఏమని సవాలు చేశాడు?
6 అపవాదియైన సాతాను దేవుని సర్వాధిపత్యాన్ని ఎలా సవాలు చేశాడో ఈ పుస్తకంలోని 11వ అధ్యాయం వివరించింది. దేవుడు అబద్ధికుడని అంటూ ఆదాము హవ్వలు మంచి చెడులను తామే నిర్ణయించుకోకుండా యెహోవా అడ్డుపడడం ద్వారా ఆయన న్యాయంగా ప్రవర్తించలేదని సాతాను ఆరోపించాడు. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారి సంతానంతో ఈ భూమి విస్తరిస్తుండగా, సాతాను మానవులందరి ఉద్దేశాన్ని ప్రశ్నించాడు. “ప్రజలు దేవుణ్ణి సేవిస్తున్నది ఆయనపై ప్రేమతో కాదు, నాకు ఒక్క అవకాశం ఇస్తే చాలు అందరినీ దేవునికి వ్యతిరేకంగా తిప్పివేస్తాను” అని సాతాను సవాలు చేశాడు. యోబు అనే పేరుగల మనుష్యుని గురించిన వృత్తాంతం సాతానుకు అలాంటి నమ్మకమే ఉందని చూపిస్తోంది. యోబు ఎవరు, సాతాను సవాలులో ఆయనెలా ఇమిడివున్నాడు?
7, 8. (ఎ) యోబును ఆయన కాలంలోని మనుష్యుల్లో ప్రత్యేకమైన వ్యక్తిగా ఏది చేసింది? (బి) యోబు ఉద్దేశాన్ని సాతాను ఎలా ప్రశ్నించాడు?
7 యోబు సుమారు 3,600 సంవత్సరాల పూర్వం జీవించాడు. ఆయన మంచివ్యక్తి, ఆయన గురించి యెహోవా ఇలా చెప్పాడు: “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.” (యోబు 1:8) యోబు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు.
8 దేవుణ్ణి సేవించడంలో యోబు ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించాడు. అపవాది యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు అతనికిని [యోబుకు] అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును.”—యోబు 1:10, 11.
9. సాతాను సవాలుకు యెహోవా ఎలా స్పందించాడు, ఎందుకు అలా స్పందించాడు?
9 ఆ విధంగా, యోబు తనకు లభిస్తున్న ప్రతిఫలం కారణంగానే దేవుణ్ణి సేవిస్తున్నాడని సాతాను వాదించాడు. యోబు ఒకవేళ పరీక్షించబడితే, ఆయన దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాడని కూడా సాతాను ఆరోపించాడు. సాతాను సవాలుకు యెహోవా ఎలా స్పందించాడు? యోబు వైఖరి వివాదాంశంగా ఉంది కాబట్టి, యోబును పరీక్షించడానికి యెహోవా సాతానును అనుమతించాడు. ఈ విధంగా, యోబుకు దేవునిపట్ల ప్రేమ ఉందా లేదా అన్నది స్పష్టమవుతుంది.
యోబు పరీక్షించబడ్డాడు
10. యోబుకు ఎలాంటి పరీక్షలు ఎదురయ్యాయి, ఆయన వాటికెలా ప్రతిస్పందించాడు?
10 సాతాను త్వరలోనే అనేక విధాలుగా యోబును పరీక్షించాడు. మొదట, యోబు పశువుల్లో కొన్ని దోచుకోబడ్డాయి, మిగతావి చంపబడ్డాయి, ఆయన సేవకుల్లో చాలామంది సంహరించబడ్డారు. ఇది ఆర్థిక ఇబ్బంది కలిగించింది. అంతేకాక, యోబు పదిమంది పిల్లలు సుడిగాలివల్ల చనిపోవడంతో అతనిచుట్టూ విషాదం అలుముకుంది. అయితే, అలాంటి భయంకరమైన దుర్ఘటనల మధ్య కూడా “యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.”—యోబు 1:22.
11. (ఎ) యోబు విషయంలో సాతాను ఏ రెండవ ఆరోపణ చేశాడు, దానికి యెహోవా ఎలా స్పందించాడు? (బి) యోబు తన బాధాకరమైన వ్యాధికి ఎలా ప్రతిస్పందించాడు?
11 సాతాను అంతటితో ఊరుకోలేదు. యోబు ఆస్తిని, సేవకులను, పిల్లలను కోల్పోవడాన్ని సహించగలిగినా, అతనికి వ్యాధి సోకితే దేవుణ్ణి వ్యతిరేకిస్తాడని సాతాను భావించి ఉంటాడు. అందుకే యోబుకు అసహ్యం కలిగించే బాధాకరమైన వ్యాధి వచ్చేలా చేసేందుకు యెహోవా సాతానును అనుమతించాడు. అయితే ఇదికూడా దేవుని మీద యోబుకున్న విశ్వాసాన్ని సడలించలేకపోయింది. ఆయన “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను” అని స్థిరంగా చెప్పాడు.—యోబు 27:5.
12. అపవాది సవాలుకు యోబు ఎలాంటి జవాబిచ్చాడు?
12 తన కష్టాలకు సాతానే కారకుడు అన్న విషయం యోబుకు తెలియదు. యెహోవా సర్వాధిపత్యం గురించి అపవాది చేసిన సవాలుకు సంబంధించిన వివరాలు తెలియని యోబు తన సమస్యలకు దేవుడే మూలకారణం అని భయపడ్డాడు. (యోబు 6:4; 16:11-14) అయినాసరే ఆయన తన యథార్థతను కాపాడుకున్నాడు. యోబు నమ్మకంగా ఉండడంతో, యోబు స్వార్థపూరిత కారణాలతోనే దేవుణ్ణి సేవిస్తున్నాడనే సాతాను ఆరోపణ అబద్ధం అని తేలిపోయింది!
13. యోబు దేవునిపట్ల నమ్మకంగా ఉండడంవల్ల ఏమి జరిగింది?
13 యోబు కనబరచిన నమ్మకం, దూషణకరమైన సాతాను సవాలుకు యెహోవా శక్తిమంతమైన జవాబిచ్చే అవకాశాన్నిచ్చింది. యోబు నిజంగా యెహోవా స్నేహితుడే, దేవుడు ఆయన కనబరచిన నమ్మకాన్నిబట్టి ఆయనకు ప్రతిఫలం ఇచ్చాడు.—యోబు 42:12-17.
ఆ వివాదంలో మీరు ఎలా ఇమిడివున్నారు?
14, 15. యోబు ఇమిడివున్న సాతాను సవాలు మానవులందరికీ వర్తిస్తుందని మనం ఎందుకు చెప్పవచ్చు?
14 సాతాను లేవదీసిన యథార్థతా వివాదం కేవలం యోబును మాత్రమే ఉద్దేశించినది కాదు. ఆ వివాదంలో మీరు కూడా ఇమిడివున్నారు. సామెతలు 27:11 లో ఇది స్పష్టంగా కనబడుతోంది, అక్కడ యెహోవా వాక్యం ఇలా చెబుతోంది: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” యోబు మరణించిన వందల సంవత్సరాల తర్వాత వ్రాయబడిన ఈ మాటలు, సాతాను ఇంకా దేవుణ్ణి నిందిస్తూ, ఆయన సేవకుల మీద తప్పు మోపుతున్నాడని చూపిస్తున్నాయి. మనం యెహోవాకు సంతోషం కలిగించే విధంగా జీవించినప్పుడు, మనం నిజానికి సాతాను అబద్ధ ఆరోపణలకు జవాబివ్వడానికి సహాయపడుతూ, దేవుని హృదయాన్ని సంతోషపెడతాం. ఈ విషయం గురించి మీరెలా భావిస్తున్నారు? మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవలసి వచ్చినా, అపవాది అబద్ధ వాదనలకు జవాబివ్వడంలో మీకూ వంతు ఉండడం అద్భుతమైన విషయం కాదా?
15 సాతాను ఏమన్నాడో గమనించండి: “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.” (యోబు 2:4) “నరుడు” అని చెప్పడం ద్వారా సాతాను తన ఆరోపణను ఒక్క యోబుకు మాత్రమే కాక, మానవులందరికీ అన్వయించాడు. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. సాతాను దేవునిపట్ల మీ యథార్థతను కూడా వివాదంలోకి లాగాడు. కష్టాలు వచ్చినప్పుడు మీరు దేవునికి అవిధేయులై నీతి మార్గాన్ని విడిచిపెట్టాలని అపవాది కోరుకుంటాడు. ఇది సాధించడానికి సాతాను ఎలా ప్రయత్నించవచ్చు?
16. (ఎ) ప్రజలను దేవునినుండి పక్కకు మళ్లించడానికి సాతాను ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తాడు? (బి) అపవాది ఈ పద్ధతులను మీ మీద ఎలా ప్రయోగించవచ్చు?
16 పదవ అధ్యాయంలో చర్చించినట్లుగా, ప్రజలను దేవునినుండి దూరం చేయడానికి సాతాను వివిధ పద్ధతులు ఉపయోగిస్తాడు. ఒకవైపున అతడు “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు” దాడిచేస్తాడు. (1 పేతురు 5:8) ఆ విధంగా, బైబిలు అధ్యయనం ద్వారా నేర్చుకున్నది అన్వయించుకోవాలనే మీ ప్రయత్నాలను మీ స్నేహితులు, బంధువులు లేదా ఇతరులు వ్యతిరేకించినప్పుడు సాతాను ప్రభావాన్ని చూడవచ్చు. a (యోహాను 15:19, 20) మరోవైపున, “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (2 కొరింథీయులు 11:14) మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి, దైవభక్తిగల జీవనమార్గం నుండి మళ్లించడానికి అపవాది కుతంత్రాలను ఉపయోగించవచ్చు. మీరు దేవునికి సంతోషం కలిగించేంత మంచివారు కాదని బహుశా మీరు భావించేలా చేయడానికి అతడు నిరుత్సాహాన్ని కూడా ఉపయోగించవచ్చు. (సామెతలు 24:10) సాతాను “గర్జించు సింహమువలె” దాడిచేసినా లేక “వెలుగు దూత వేషము ధరించుకొ[ని]” నటించినా అతని సవాలు మాత్రం ఇదే: మీకు పరీక్షలు లేదా శోధనలు ఎదురైతే చాలు మీరు దేవుణ్ణి సేవించడం మానేస్తారు అని అతడంటాడు. యోబులానే దేవునిపట్ల మీ యథార్థతను కాపాడుకుంటూ అతని సవాలుకు మీరెలా జవాబివ్వగలరు?
యెహోవా ఆజ్ఞలకు లోబడడం
17. యెహోవా ఆజ్ఞలకు లోబడడానికి ముఖ్య కారణమేమిటి?
17 దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం ద్వారా మీరు సాతాను సవాలుకు జవాబివ్వవచ్చు. దీనిలో ఏమి ఇమిడివుంది? బైబిలు దానికిలా సమాధానమిస్తోంది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:5) దేవునిపట్ల మీ ప్రేమ అధికమయ్యేకొద్దీ, ఆయన మీ నుండి కోరేది చేయాలనే కోరిక మీలో అధికమవుతుంది. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. మీ పూర్ణ హృదయంతో మీరు యెహోవాను ప్రేమించినప్పుడు, “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని మీరు గ్రహిస్తారు.—1 యోహాను 5:3.
18, 19. (ఎ) యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని ఏవి? ( 122వ పేజీలోని బాక్సు చూడండి.) (బి) దేవుడు మననుండి ఎక్కువ అడగడం లేదని మనకెలా తెలుసు?
18 యెహోవా ఆజ్ఞలు ఏమిటి? వాటిలో కొన్ని మన ప్రవర్తనకు సంబంధించి మనం దూరంగా ఉండాల్సినవి. ఉదాహరణకు, 122వ పేజీలో ఉన్న “ యెహోవా ద్వేషించే వాటిని విసర్జించండి” అనే బాక్సు చూడండి. అందులో మీరు బైబిలు స్పష్టంగా ఖండిస్తున్న ప్రవర్తనకు సంబంధించిన విషయాలు చూస్తారు. మొదటిసారి చూసినప్పుడు వాటిలో కొన్ని అభ్యాసాలు అంత చెడ్డవిగా కనిపించకపోవచ్చు. కానీ ఉదాహరించబడిన లేఖనాలను ధ్యానించిన తర్వాత, యెహోవా నియమాల్లోని జ్ఞానాన్ని బహుశా మీరు గ్రహిస్తారు. మీ ప్రవర్తనలో మార్పులు చేసుకోవడం మీరు ఎదుర్కొనే అతి కష్టమైన సవాలు కావచ్చు. అయినప్పటికీ, దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం గొప్ప సంతృప్తినీ, సంతోషాన్నీ ఇస్తుంది. (యెషయా 48:17, 18) ఆ విధంగా జీవించడం మీకు సాధ్యమే. అలాగని మనకెలా తెలుసు?
19 యెహోవా మనం చేయగల దానికంటే ఎక్కువ ఎన్నడూ అడగడు. (ద్వితీయోపదేశకాండము 30:11-14 చదవండి.) మన సామర్థ్యం, మన పరిమితులు మనకంటే ఆయనకే బాగా తెలుసు. (కీర్తన 103:14) అంతేకాక, వాటికి లోబడగల శక్తిని యెహోవా మనకివ్వగలడు. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును.” (1 కొరింథీయులు 10:13) మీరు సహించేలా యెహోవా మీకు “బలాధిక్యము” కూడా ఇవ్వగలడు. (2 కొరింథీయులు 4:7) అందుకే అనేక పరీక్షలు సహించిన తర్వాత పౌలు ఇలా చెప్పగలిగాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.
దైవిక లక్షణాలను వృద్ధి చేసుకోవడం
20. ఏ దైవిక లక్షణాలను మీరు వృద్ధి చేసుకోవాలి, ఇవి ఎందుకు ప్రాముఖ్యం?
20 యెహోవాకు సంతోషం కలిగించాలంటే ఆయన ద్వేషించే వాటికి దూరంగా ఉండడం మాత్రమే సరిపోదు. ఆయన ప్రేమించే వాటిని మీరు ప్రేమించాలి కూడా. (రోమీయులు 12:9) మీ దృక్కోణాలను, ఇష్టాలను, విలువలను పంచుకునే వ్యక్తులకు మీరు సన్నిహితులు కారా? యెహోవా కూడా అలాగే సన్నిహితమవుతాడు. కాబట్టి యెహోవా ప్రేమించేవాటిని ప్రేమించడం నేర్చుకోండి. వీటిలో కొన్ని 15వ కీర్తనలో వివరంగా ఉన్నాయి, దేవుడు తన స్నేహితులుగా పరిగణించేవారి గురించి మనం అక్కడ చదువుతాం. (కీర్తన 15:1-5 చదవండి.) యెహోవా స్నేహితులు “ఆత్మ ఫలము” అని బైబిలు పిలిచే లక్షణాలను కనబరుస్తారు. వాటిలో “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలు ఉన్నాయి.—గలతీయులు 5:22.
21. దైవిక లక్షణాలు వృద్ధి చేసుకోవడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?
21 ఈ దైవిక లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి క్రమంగా బైబిలు చదవడం, అధ్యయనం చేయడం సహాయం చేస్తాయి. దేవుడు కోరేవాటిని తెలుసుకోవడం మీ తలంపులను దేవుని ఆలోచనలకు అనుగుణంగా మార్చుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. (యెషయా 30:20, 21) యెహోవాపట్ల మీ ప్రేమను మీరెంత అధికం చేసుకుంటే, ఆయనకు సంతోషం కలిగించే విధంగా జీవించాలనే మీ కోరిక అంత అధికంగా ఉంటుంది.
22. దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించినప్పుడు మీరేమి సాధిస్తారు?
22 యెహోవాకు సంతోషం కలిగించే విధంగా జీవించడానికి కృషి అవసరం. మీ జీవితాన్ని మార్చుకోవడాన్ని బైబిలు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడంతో పోలుస్తోంది. (కొలొస్సయులు 3:9-10) అయితే దేవుని ఆజ్ఞల గురించి కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.” (కీర్తన 19:11) దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుందని మీరు కూడా గ్రహిస్తారు. అలా జీవించడం ద్వారా సాతాను సవాలుకు మీరు జవాబివ్వడమే కాక, యెహోవా హృదయానికి సంతోషం కలిగించే వారవుతారు కూడా.
a దీనర్థం మిమ్మల్ని వ్యతిరేకించేవారు వ్యక్తిగతంగా సాతాను ఆధీనంలో ఉన్నారని కాదు. అయితే సాతాను ఈ విధానపు దేవతగా ఉండడమే కాక, లోకమంతా అతని అధికారంలోనే ఉంది. (2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19) కాబట్టి దైవభక్తిగల జీవితం జీవించడం అందరికీ ఇష్టం కాదని, అందుకే కొందరు వ్యతిరేకించవచ్చని మనం ఎదురుచూడవచ్చు.